Friday, August 3, 2012

మన తీరు ఎలాగుంది?


నిషన్న తరువాత ఒక స్వభావం ఉండనే ఉంటుంది. ఎవరి స్వభావం వారికి బాగానే ఉందనిపిస్తుంది. మన తీరు ఎదుటివారికి నచ్చకపోవచ్చునన్న ఆలోచన మామూలుగా రాదు. మనం బాగానే పనిచేస్తుంటాము. మన పై అధికారులు కూడా మనుషులే. వారికీ స్వంత స్వభావాలు ఉంటాయి. అందరి స్వభావాలు ఒకేలాగ ఉండవన్నది జగమెరిగిన సత్యం. కనుకనే, మనం బాగా పనిచేస్తున్నా సరే, ఒక్కోసారి ఎదుటివారికి కోపం వస్తుంది. మనం వారిలాగా ఆలోచించలేము గనుక వారికి కోపం ఎందుకు వచ్చిందన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. ఇలా కొనసాగితే, కొంత కాలానికి బాసుకు మనమీద ఒక ‘అభిప్రాయం’ ఏర్పడే ప్రమాదం వుంది. అది కనుక జరిగిందంటే, మనం ‘ఎక్కడ వేసిన గొంగడి’ అన్న మాటకు ఉదాహరణ అవుతాము! తమకు తెలియకుండానే, బాసులకు కోపం తెప్పించే వారి గురించి కూడా పరిశోధన జరిగిందంటే నమ్మగలరా? ఆ పరిశోధనలో అయిదు రకాల మనుషులను గుర్తించారు. ఆ అయిదుగురిలో మనమూ ఉన్నామేమో తెలుసుకుంటే బాగుంటుంది కదూ? మనం చేస్తున్నది తప్పు కాకపోవచ్చు. కానీ, ఎదుటివారికి నచ్చడం లేదన్న సంగతి అర్థమయితే, కొంత వరకు సర్దుకోవచ్చునేమో! ఈ అయిదు రకాల మనుషుల్లో మనమూ ఉన్నామేమో చూద్దాం మరి!

అన్నింటికీ అవుననే వారు:
ఎవరేం పని అప్పగించినా ‘ఓ ఎస్!’ అనేవారు ఈ రకంలోకి వస్తారు. తెలియకుండానే, అలవిమాలిన బరువును వీరు తలకెత్తుకుంటారు. ఇలాంటివారికి మాకు అన్ని పనులు చేతనవునన్న ధీమా ఉంటుంది. పనులు చేతనయి ఉండవచ్చు కూడా. కానీ అన్ని పనులూ తామే చేయడానికి తగిన సమయం, వెసులుబాటు కూడా ఉండాలి కదా? ఈ సంగతిని ఒక్క క్షణం మరిచిపోయి, ఎక్కువ పనిని ఎత్తుకుంటే, బాగా చేతనయిన పనులు కూడా చేయలేని స్థితి వస్తుంది. బాగా చేయడం పక్కన పెట్టి, అసలు ఒక మనిషి చేయగలిగే పనులకు ఒక పరిమితి ఉంది. ఎక్కువ పనులను తలకు ఎత్తుకుంటే, కొన్ని మిగిలిపోతాయి. చేసినవి అరకొరగా వస్తాయి. అసలు కొన్నింటిని మరిచిపోయినా ఆశ్చర్యం లేదు. ఇక్కడే ఆసర్టివ్‌నెస్ అనే లక్షణం కూడా కావాలి. బాసు చెప్పినందుకూ, మనకు చేతనయినందుకూ కాక, వీలు కూడా గమనించి పనికి ఒప్పుకోవాలి. కుదరకపోతే, ఆ సంగతి వినయంగా చెప్పిచూడాలి.

గోడమీది పిల్లి: చేయాలా, మానాలా? తేల్చుకోలేని పరిస్థితిలో ఎంతకాలమయినా ఉండిపోతే, మనకూ, ఎదుటివారికి కూడా తికమక. పని చేస్తామన్న నమ్మకం ఎదుటివారికి ఇచ్చేశాము. చేతనయ్యేది, బాగా చేసేది తరువాత! అసలు చేయాలా, వద్దా అన్న అనుమానంలో, ఇంకా ఇంకా సమాచారం సేకరిస్తూ కాలం గడుపుతారు కొందరు. ఇదొక్కటీ తేలితే చేయవచ్చునేమో అన్న భావం ఒకటి మనసులో ఒక మూలనుంచి తొంగిచూస్తూ ఉంటుంది. సరయిన నిర్ణయం ఒక నాటికి వీలుకాదు. చేశావా? అని ఎవరైనా అడిగితే, ‘ఇదుగో! మొదలు పెడుతున్నాను. అసలు మొదలయిందంటే ఎంతసేపు? చిటికెలో చేస్తాను’ అని జవాబు. కానీ ఆ స్టార్టింగ్ ట్రబుల్‌కు అంతం ఎక్కడ. గోడమీద పిల్లి అటో యిటో దూకేదెప్పుడు? ఈ సంగతి తేలేలోగా కొంప మునిగే పరిస్థితీ, పైవారికి కోపం రావడం ఖాయం. మరి ఈ సందిగ్ధం అవసరం లేకుండా, ముందే నిర్ణయించి, చటుక్కున మొదలుపెట్టి, ఇచ్చిన పనిని, చేతనయినంత బాగా చేసి పడేస్తే పోతుంది గదా?

ఊగిసలాట: ఒకరు అన్నీ చేస్తామంటారు, చేస్తారు. లేక చేయలేకపోతారు. మరొకరు అసలు ఏది ముందు? అసలు చేయాలా? అన్న సందిగ్ధంలో ఇరుక్కుని సమయం జారిపోతుంటే చూస్తూ ఉంటారు. ఇక మూడవ రకం వారు, మా పద్ధతి వేరు అంటారు. నేను పట్టుకున్నానంటే, పని ముగిసినట్లే అంటూ, మరీ నమ్మకంతో, ఒకటికన్నా ఎక్కువ పనులను ఒకేసమయంలో చేయాలనుకుంటారు. ఒకపొయ్యి మీద కూర ఉంటుంది. మరో పొయ్యిమీద పాలుంటాయి. ఒకదాన్ని పట్టించుకునే లోపల మరొకటి పాడవుతుంది. ఈలోపల మూడవపని తగిలితే, ఈ రెంటినీ వదిలేసి అటు వెళ్లిపోతారు. మొదటి రకంలాగా, అన్ని పనులూ తలకెత్తుకోరు గానీ, ఎత్తుకున్న పనులమీద సరైన శ్రద్ధ, ధ్యాస లేనందుకు వీళ్లు బాధపడతారు. పెడతారు!

ఇదుగో- ఇది అయింతరువాత: పని చేయక తప్పదు. కానీ, ఇప్పుడే చేయకపోతే కొంప మునగదు. చేతిలో పని పూర్తి కానిదే, మరో పని మొదలు పెట్టడం ఎందుకు, అనుకుంటే, నిజానికి అది మంచి పద్ధతి. కానీ, ఈ వాయిదా వారలకు చేతిలో పని ఒక మానాన తెమలదు. ఎందుకంటే ఆ తర్వాతి పని చేయడం, ఇష్టం లేదు గనుక. పని నచ్చకున్నా, కష్టమయినదయినా, దాన్ని పక్కన పెట్టడం, దాటవేయడం కొందరికి అలవాటు. దీంతో అందరికీ చిక్కే. ‘ఇది చాలా ముఖ్యమయిన విషయం!’ అని దాన్ని సొరుగులో దాచే అలవాటు చాలామందికి ఉంటుంది. ముఖ్యమయిన విషయాన్ని వీలయినంత త్వరగా తేల్చాలి. దాచితే అది మురుగుతుంది! ఆలస్యమయిన కొద్దీ, ముఖ్యం పోయి, అది సమస్యగా మారుతుంది. ఆ తరువాత ఒత్తిడిలో సరయిన నిర్ణయాలు కుదరవు. ఏది ముఖ్యం, ఏది ముందు తేల్చుకుని పని చేయగలిగితే సమస్య ఉండదు.

గజిబిజి: బాగా పనిచేసేవారి ముందు, పనికి సంబంధించిన కాగితాలు గానీ, మరో రకం వస్తువులు గానీ, చిందర వందరగా, కుప్పలుగా పడి ఉంటాయి. అందులోంచి ఏం కావాలన్నా వాళ్లకు సులభంగా దొరికినంత వరకు సమస్య లేదు.

అన్నీ జరుగుతున్నట్లే ఉంటాయి. ఏ ఒక్క సంగతి గురించి అడిగినా ఇక వెతుకులాట మొదలవుతుంది కొందరికి. ఇప్పటివరకు ముచ్చటించుకున్న నాలుగు రకాలలో మొదటి యిద్దరూ, ఈ అయిదవరకంలోకి జారుకునే ప్రమాదం ఉంది. అప్పుడిక ఏ పనీ ముందుకు సాగదు. తయారయిన గజిబిజి, మిగతా వారిని కూడా చికాకు పెడుతుంది.

ఇలాంటివారు, ఒకటి, అరా పని బాగా చేసినా, చేసినట్లు భావించినా ఎవరికీ సంతృప్తి ఉండదు. అందుకే పనుల వీలును గుర్తించడం, సమయం, వరుస నిర్ణయించడం, అవసరాన్ని గుర్తించి ఒక పద్ధతిగా పని చేయడం అలవాటు చేసుకోవాలి.
ఇదేదో వినడానికి బాగుంది, చేయడానికి ఏమీ మిగలని ఉపన్యాసం లాంటి వ్యవహారం కాదు. అందరమూ, ఇంట్లో, పనిలో అనుసరించడానికి వీలయ్యే వ్యవహారమే మరి!
....................................................
క్రమశిక్షణ
* అన్నీ సరిగ్గా ఉన్నాయా అని అఢపాదడపా చూడడం తప్పేమీ కాదు. అసలు మీకు అట్లా చూడాలని అనిపించడమే మంచి లక్షణం. అదొక్కటే పనయితేబాగుండదు. కానీ, ఒక పద్ధతిలో జరుగుతుంటే, అందరూ మీ మీద ఆధారపడే రోజు వస్తుంది. అనుమానం, అవసరం వచ్చిన వారంతా మిమ్మల్నే అడుగుతారు ‘ఏమిటి పరిస్థితి?’ అని!
* తప్పు చేసినట్లు అర్థమయితే, నిజంగానే బాధకలుగుతుంది. కొంతకాలం వరకు అదే మెదడులో తిరుగుతూ ఉంటుంది. నిక్కచ్చిగా, లెక్కగా ఉండటం అలవాటయితే చాలామంచిదే. కానీ, తప్పు చేసిన భావంలోనుంచి బయటపడి, సర్దుకుని ముందుకు నడవడం కూడా నేర్చుకోవాలి.
పనుల్లో ఒక చక్కని వరుస క్రమాన్ని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. వాటిని తు.చ తప్పక పాటించడం అలవాటవుతుంది. మనం, ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తామన్నది మనకే కాదు, చుట్టూవున్న వారందరికీ తెలిసిపోతుంది. అప్పుడు మన పనీ, వారి పని కూడా సులభమవుతుంది!
...........................................
అసలు మాట

గతంలో మనుషుల మధ్య వెట్టిచాకిరీ చేసే బానిసలుండేవారు. రానున్న కాలంలో మరి మర మనుషులు ఉంటాయి. తేడా లేదు!
-ఎరిక్ ఫ్రామ్
మనం మాత్రం బానిసలు కావద్దు. మర మనుషులమూ కావద్దు. మన బతుకు మన అవసరాల ప్రకారం సాగితే సుఖం!

మంచీ - చెడూ!

ముల్లా నస్రుద్దీన్‌కు కొంతకాలం బోలెడంత మంది శిష్యులుండేవారు. అస్తమానం ఏదో ఒకటి అడుగుతూనే ఉండేవారు. వాళ్లకు జవాబులు చెప్పడం ముల్లాకు అలవాటయింది.
‘అందరూ మిమ్మల్ని మంచివాళ్లంటున్నారు. అలాగని మీరు మంచి వాళ్లేనా?’ అడిగాడొక శిష్యుడు.
‘అలాగేమీ కానవసరం లేదు!’ అన్నాడు ముల్లా.
‘అందరూ మిమ్మల్ని చెడ్డవాడంటే, మరి మీరు చెడ్డవారి కిందకు లెక్కవుతారా?’ అడిగాడు అదే శిష్యుడు
‘అలాగేమీ కానవసరం లేదు!’ అన్నాడు ముల్లా.
శిష్యునికి యింతకూ మంచి చెడుల తీరు తెలియలేదు. గురువుగారిని వివరించమని వేడుకున్నాడు.
‘మంచివాళ్లందరూ నన్ను మంచి వాడంటే, నేను మంచివాడిని. చెడ్డవాళ్ళందరూ నన్ను చెడ్డవాడు అన్నారనుకో! అప్పుడు కూడా నేను మంచి వాడినే అవుతాను’ అన్నాడు ముల్లా.
శిష్యుడు తికమకగా గురువు వేపు చూచాడు. నస్రుద్దీన్‌కు కూడా కొంచెం తికమకగానే అనిపించింది. అతనొక నిమిషం ఆలోచించాడు. ఆలోచన రాక గడ్డాన్ని గోక్కున్నాడు కూడా.
‘అసలు సమస్య మరొకటి ఉందోయ్! ఇంతకూ ఈ అనే వాళ్లు ఉన్నారు గదా! వాళ్ళలో ఎవరు మంచివాళ్లు, ఎవరు చెడ్డవాళ్లు తేల్చి చెప్పడం మాత్రం పెద్ద చిక్కు!’ అన్నాడు ముల్లా.

-ముల్లా నస్రుద్దీన్ కథలు నుంచి

No comments:

Post a Comment