Wednesday, August 29, 2012

మనుషులంతా ఒక్కటే(నా?)


చుట్టూ చూడండి. మీవంటి స్వభావం గలవారు ఎక్కడోగాని ఉండరు. మీవంటి రూపం గలవారు అసలే కనపడరు. ఇక నూటికి నూరుశాతం మీ వంటివారు ఉండరుగాక ఉండరు. ఇంతమంది మనుషులు కనబడుతుంటారు. అయినా అందరూ అన్నిరకాలుగానూ ఉంటారు. ముఖాలు, శరీరాలు, నడవడి, తీరు అన్నీ ఎవరి తీరు వారిదిగానే ఉంటాయి. ప్రపంచంలోని మనుషులందరినీ ఒకచోట చేర్చినా లెక్క అంతే! ఈ భూ ప్రపంచంలో ఈ క్షణాన మనుషుల సంఖ్య 705 కోట్లపైన ఎక్కడో ఉందని అంచనా. గడిచిన 50 వేల సంవత్సరాలలో పదివేల కోట్లమంది పుట్టి గతించారని లెక్క చెపుతున్నారు. మరి అంతమందికీ ఎవరి ప్రత్యేకత వారికి ఉండేది. ఇకమీద పుట్టే వారందరూ కూడా అదే రకంగా ఉంటారు. ప్రతి తల్లీ- పుట్టిన ప్రతి సంతునూ ‘చుక్కల్లో చంద్రుడ’నే అంటుంది మరి!

ఆశ్చర్యంగా అందరూ మనుషులే. కానీ అందరూ ప్రత్యేకత గలవారే. జీవ వైవిధ్యం చాలా గొప్పది అనుకుంటే, శతకోటి జీవాలలో ఒకటయిన మానవజాతిలోని వైవిధ్యం అంతకన్నా ఎంతో గొప్పదని అర్థం. ఇందరిలోనూ ఎవరి గుర్తింపు వారిదిగా ఉండడానికి, ఆధారాలను వెదుకుతూ లోతులకు పోవచ్చు. అక్కడ మనకు డిఎన్‌ఏ, వేలి ముద్రలు, కంట్లో గీతలు మొదలయినవి ముందు కనబడతాయి. ఇంకొంచెం లోతుకు పోతే మరెన్నో సంగతులు ఆశ్చర్యం కలిగిస్తాయి.


జన్యు పదార్థం- డిఎన్‌ఏ
వైవిధ్యం మొత్తానికి మూలకారణమంతా ఇందులోనే ఇమిడి ఉంది. ఇదొక గట్టి నిజం. మనం మనంగా, మీరు మీరుగా ఉండడానికి ఆధారం ఈ జన్యు పదార్థమే. ఇక్కడ కూడా కొన్ని లెక్కలున్నాయి. 2001లో మానవుల డిఎన్‌ఏ మొత్తాన్ని మ్యాపింగ్ చేశారు. మనుషులందరిలోనూ 99.9 శాతం డిఎన్‌ఏ ఒకేరకంగా ఉంటుంది, అన్నారు. అంటే, ఇప్పటివరకూ మనం లెక్కించిన వైవిధ్యానికి కారణం 0.1 శాతం మాత్రమేనని అర్థం. గడిచిన పదేళ్ళలో లెక్కలు వేసి తేడాను 0.5 శాతంగా పెంచారు. వైవిధ్యం దృష్టితో చూస్తే అది కూడా తక్కువే మరి! లెక్కను మరింత ముందుకు నడిపితేగాని సంగతి అర్థం కాదు. మనిషి డిఎన్‌ఏ- అనే పుస్తకంలో 320 కోట్ల అక్షరాలుంటాయి. అందులో 0.5 శాతం అంటే సుమారు కోటి అరవయి లక్షలు. వాటిలో మళ్లీ రకరకాల కలయికలు. ఒకటి, రెండు అన్న రెండు అంకెలుంటేనే, 1, 2, 12, 21, 122, 111, 121.. ఇలా కొన్ని అంకెలు వీలవుతాయి. ఇక కోటి అరవయి లక్షల అక్షరాలుంటే ఎన్నో రకాల కలయికలు వీలవుతాయని ఊహించడం కూడా కష్టం. ఇప్పటివరకు పుట్టి, చనిపోయిన వారి సంఖ్య ఆ వీలయ్యే రకాలలో ఎంతమాత్రమూ కాదని తేలిపోతుంది. అంతమందిలో కూడా ఒకే రకం జన్యు అక్షర క్రమం ఉండే వీలు ఇంచుమించు సున్నా మాత్రమే. కవలలో కూడా ఆ వీలు లేదు. అందుకే కవలలను గుర్తించడం వీలవుతుంది. మొదట్లోవారు ఒకే రకం జన్యు పదార్థంతో మొదలవుతారు. పెరిగిన కొద్దీ తేడా పెరుగుతుంది. జన్యు పదార్థం కాపీ జరిగితేనే కణాలు పెరుగుతాయి. శరీరం పెరుగుతుంది. ఈ కాపీ జరిగే సమయంలో మ్యుటేషన్స్ అనే చిన్న మార్పులు జరుగుతాయి. కవలల మధ్య తేడా రావడానికి ఈ మార్పులు చాలు. ఇక జన్యువులు పనిచేసే తీరును అదుపు చేసే మార్కర్ జన్యువులలో మార్పు వస్తుంది. కవలలుగానీ మిగతావారు గానీ, ఎవరిదారిన వారు పెరగడానికి ఈ మార్పులు కారణాలవుతాయి. జరిగే మార్పులన్నింటికీ ప్రభావం బయటకు కనిపించదు. కానీ, చిన్న మార్పుల ప్రభావం పెద్ద ఎత్తున కనబడుతుంది. మీరు మీలాగే ఉన్నారంటే, అందుకు మీ జన్యువులే ఆధారం. జన్యువులు మాత్రమే ఆధారం కావు. వాతావరణం, అమ్మ కడుపులో వాతావరణం లాంటివి కూడా ఈ ఆధారాలలో కొన్ని.

అసలయిన గుర్తింపు- వేలి ముద్రలు
వేలిముద్రలు ఎవరివి వారివేనని అందరికీ తెలుసు. వీటి వెనక జన్యువులు కారణంగా ఉంటాయని తెలియకపోవచ్చు. కనీసం వాటి సైజు, ఆకారాలు జన్యువుల మీద ఆధారపడతాయి. కానీ, అమ్మ కడుపులో ఉండగా- శిశువు మీద ఉమ్మ సంచి ఒత్తిడి పెడుతుంది. అందులోని నీరు కదులుతూ కుదుపుతుంది. వీటి ప్రభావంతో వేలి ముద్రలు మారతాయంటే నమ్మగలరా? నమ్మక తప్పదు. ఒకే రకంగా ఉండే కవలల్లో కూడా వేలిముద్రలలో కొంతవరకు తేడాలుంటాయి. లోపలి వాతావణం వారిమీద, అంత సమానంగా ఉండకపోవడం అందుకు కారణం. ఒక గీత రెండుగా విచ్చుకునే చోటులో తేడా, శంఖం, చక్రాలలో గీతల మధ్య బాగా వేరుగా ఉంటాయి. కాలి గీతల్లో కూడా ఈ తేడాలు కనబడతాయి.
నేర పరిశోధనలో వాడుకుంటారుగానీ, నిజానికి మనకు వేలిముద్రలవల్ల ప్రయోజనం ఉందా? ఉంటే ఏమిటి? అన్నసంగతి ఇప్పటికీ అర్థం కాలేదు. అందరూ సులభంగా ‘ఆ గీతల వల్ల పట్టు దొరుకుతుంది!’ అంటారు. కానీ వాటివల్ల పట్టు సడలుతుందని పరిశోధకులు గుర్తించారు. చర్మం విస్తారం పెరుగుతుందనీ, చర్మానికి సాగే శక్తి వస్తుందని, స్పర్శ బాగా తెలుస్తుందనీ ఎన్నో చెప్పుకున్నారు. వీటిలో ఏది ఎంత నిజమని తేలలేదు. మొత్తానికి వేలిముద్రలు లేకుండా కూడా మనం బతకగలుగుతామని తెలిసిపోయింది. జన్యువులలో అనుకోని మార్పుల కారణంగా అయిదు కుటుంబాలలో కొందరు వేలిముద్రలు లేకుండా పుట్టారు. వాళ్లందరూ బాగానే బతుకుతున్నారట.

ముఖం చూడు..
ఎవరి ముఖం వారికి గుర్తింపు. శరీరంలోని భాగాలన్నింటినీ చూడడం ఒక ఎత్తు. మనిషిని గుర్తించడానికి ముఖం చూడడం మరో ఎత్తు. అయినా ముఖాలలో నిజానికి అంతగా తేడా ఉండదట. మీ లాంటి ముఖం పోకడలు, పోలికలు గలవారు అక్కడో ఇక్కడో ఉండనే ఉంటారు. మనమనుకుని మరెవరినో పలకరించిన వారు, కనీసం అనుకున్నవారు మనకు ఆ సంగతి చెప్పి ఉంటారు కూడా. కంప్యూటర్‌లో ముఖాన్ని గుర్తించే సాఫ్ట్‌వేర్ వచ్చింది. ప్రపంచంలోని మనుషులలో 92శాతం మందికి ఒకరయినా ఈ సాఫ్ట్‌వేర్‌ను కూడా తికమక పెట్టేంత పోలికలున్నవారు ఉంటారని పరిశోధనలో తెలిసింది.
ఒకేవ్యక్తి రెండు ఫొటోలను చూపిస్తే, ఈ సాఫ్ట్‌వేర్, మనుషులు తికమకపడిన సందర్భాలను పరిశోధకులు గమనించారు. ఆ ఫొటో తెలిసిన వారిదయితే గుర్తించడం కొంచెం సులభమవుతుంది. తెలియని వారిలో వయసుతో, కోణంతో వచ్చే తేడాలు తికమకపెడతాయి. అంటే, మనం ముఖం మనకు గుర్తింపు అన్న విషయంలో అనుమానం ఉందని అర్థమేమో?

నడక తీరులో తేడా
మనిషి కూడా మొదట్లో నాలుగు కాళ్లమీద నడిచేవాడు. పదిహేను లక్షల సంవత్సరాల క్రితం నిటారుగా నడవడం నేర్చుకున్నాడు. నాటినుంచి నేటివరకు అందరూ ఒకే తీరుగా నడుస్తున్నారు. ఒక కాలు ఎత్తి, మరో కాలు కన్నా ముందుకు వేయడం, తుటి నుంచి మడమ, కాలివేళ్ల వరకు ఒక రకమయిన కదలికలు కలకాలంగా సాగుతున్నాయి. కానీ, ఆ కదలికల్లో ఎక్కడో ‘కొంత’ తేడా ఉంటుంది. ఎవరి నడక తీరు పూర్తిగా వారికే ప్రత్యేకమని చెప్పడానికి లేదు. కానీ, కేవలం నడక ఆధారంగానే మనుషులను గుర్తించడానికి 90 శాతం వరకు వీలుందని 70 దశకంలోనే నిరూపించారు.
పిల్ల వయసులో నడక తీరు మారుతూ పోతుంది. శరీరం పెరుగుదల ఆగేసరికి నడక తీరు స్థిరమవుతుంది. కాళ్ల పొడుగు, తుంటి వెడల్పు, శరీరం బరువు, కండరాల తీరు లాంటి లక్షణాలు ఆధారంగా నడకకు ఒక ప్రత్యేకత వస్తుంది. ఆ నడక తీరును అందరూ గుర్తిస్తారు. వర్ణించడం మాత్రం సులభంగా కుదరదు. ఇది నడక గురించి పరిశోధకులు అంటున్న మాట. కాళ్లు, చేతులు కదిలే మార్గాన్ని గీతలలో గుర్తించి, పిరుదులు, మోకాళ్లు, పాదాలు కదలికలను లెక్కించి, ఒక దాంతో మరొక దానికి గల సంబంధాలను లెక్కించి కంప్యూటర్లు నడకను గుర్తించగలిగాయి. కాలిగుర్తుల తీరు, వాటిలో పడిన ఒత్తిడి ఆధారంగా కూడా నడక తీరును గుర్తించారు. జపాన్‌లో ఈ రకమయిన పద్ధతిలో మనుషులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
స్మార్ట్స్ ఫోన్స్‌లో కదలికలను గుర్తించే సెన్సర్స్ మామూలయినాయి. వాటి ఆధారంగా నడక తీరును గుర్తించే ప్రయత్నాలు కూడా ఈ మధ్యనే మొదలయినయి. సెన్సర్స్‌ను కాలికి కడితే వేగం, కదలిక లాంటివన్నీ తెలుస్తాయి. అది తెలిసిన ఫోన్- మరెవరో వాడితే పలకదు!

చెవులను గమనించారా?
మనుషులను గుర్తించడానికి వేలిముద్రలు, కంటిపాపలను వాడినట్టే చెవి తీరును వాడవచ్చు! పైగా, కాళ్లలాగే, కుడి, ఎడమ చెవులు రెండూ ఒకే రకంగా ఉండవు! ఏ ఇద్దరి చెవులూ ఒకే రకంగా ఉండవు. అమ్మ కడుపులో ఒక వ్యక్తి ఉనికి మొదలయిన తర్వాత అయిదు వారాల వరకు చెవులుండవు. అప్పుడు తలకు ఇరువేపులా ఆరేసి బుడిపెలు పుడతాయి. అవి పెరుగుతూ కలిసి చెవులవుతాయి. వాటి ఆకారానికి జన్యువులలో సమాచారం ఉంటుంది. అయినా వేలిముద్రలలాగా చెవులు కూడా అక్కడి ఒత్తిడి, ఒరిగిన దిక్కులాంటి సంగతులను బట్టి పెరుగుతాయి. మనుషుల శరీరంతోపాటు, చెవులు కూడా పెరుగుతాయి కానీ, వాటి ఆకారం మాత్రం మారదు!
చెవి గుర్తుల ఆధారంగా నేరస్తులను పట్టుకున్న సందర్భాలు అమెరికా, నెదర్లాండ్స్ దేశాలలో నమోదయి ఉన్నాయి. అయితే, ముద్రలు పడిన తీరు ఒత్తిడి కారణంగా మారుతుంది గనుక, దీన్ని పూర్తిగా నమ్మదగిన పద్ధతిగా అందరూ అంగీకరించలేదు. ముఖాన్ని చూచి తికమకపడినట్లే, చెవి విషయంలోనూ కొంత తికమక ఉంది. ఈ మాటను అడ్డుగా పెట్టుకుని యుఎస్‌లో ఒక నేరగాడు శిక్షను తప్పించుకున్నాడు కూడా!

కళ్ళలో తేడా ఉంటుంది
యుకె, యుఎస్, కెనడా లాంటి దేశాలలో మనుషులను గుర్తించడానికి కంటి పాపలను కంప్యూటర్ సాయంతో స్కాన్ చేస్తున్నారు. ‘అచ్చం అమ్మ కళ్లే’ అనడం మనం వింటూనే ఉంటాము. మరి కళ్లసాయంతో మనుషులను గుర్తించడం ఎట్లా కుదురుతుంది? కంటి పాపలో రకరకాల కండరాలు చిక్కులు పడినట్టు ఉంటాయి. వాటి మధ్యన లిగమెంట్స్, రక్తనాళాలు, రంగు కణాలు కూడా ఉంటాయి. వీటన్నింటి కారణంగా కళ్లలో రంగు, లోతు, ఎత్తులు, చుక్కలు మొదలయిన తేడాలు ఏర్పడి ఉంటాయి.
మామూలుగా కంటిపాప రంగు జన్యుపరంగా వస్తుంది. అందుకే అమ్మ కళ్లు, నాన్న కళ్లు అంటారు. కుడి, ఎడమ కనుపాపల రంగు ఒకే రకంగా ఉంటుంది. అందుకే కంప్యూటర్ సాయంతో కళ్లను స్కాన్ చేసే చోట రంగు లాంటి అంశాలను పట్టించుకోరు. ఎత్తులు, పల్లాలు, గీతలను మాత్రమే చూస్తారు. కంటిలోని ఐరిస్- వ్యక్తి పుట్టకముందే తయారవుతుంది. దాని నిర్మాణానికి జన్యువులకు సంబంధం లేదు. కనుక వాటిలోని కండరాలు, లింగమెంట్స్, రంగు కణాలు రకరకాలుగా పరచుకుంటాయి. అంటే ఏ ఇద్దరి కళ్లూ ఒకే రకంగా (పాప విషయంలో) ఉండవు.

గొంతు అంటే ధ్వని
గొంతులోనుంచి మాట బయటకు రావాలంటే ఎంతో ఫిజిక్సు జరగాలి. స్వరపేటికలోనుంచి గాలి వస్తూ ధ్వనికి కారణమవుతుంది. అది నోరు, ముక్కులలో చాలా రకాలుగా కొట్టుకుంటుంది. అంగిలి, నాలుక, పెదవులు, దవడల కారణంగా ‘మాట’వుతుంది. స్వరపేటిక, నోరు, ముక్కు, దంతాలు, కండరాలు, అన్నీ ఏ ఇద్దరిలోనూ ఒకే రకంగా ఉండవు మరి! అందుకే ఎవరి మాట ధ్వని వారిదిగానే ఉంటుంది.
వేలిముద్రలను, కంటిపాపలను మార్చ డం కదురదు. కానీ, కండరాల సాయంతో స్వరపేటికను, మిగతా భాగాలను వేరుగా కదిలించి గొంతుకను మాత్రం మార్చవచ్చు. మిమిక్రీ కళాకారుల విజయ రహస్యం అదే! కొందరి గొంతు అనుకోకుండానే మారుతుంది. మనకు తెలియకుంటే మనం గొంతును మార్చి మాట్లాడుతుంటాము.
మిమిక్రీ ఎలా వీలవుతుందని పరిశోధించారు, పరిశోధిస్తున్నారు. అందరికీ ఆ విద్య వీలుగాదు. అంటే మొత్తానికి, గొంతు, ధ్వనుల ఆధారంగా వ్యక్తులను గుర్తించడం వీలుగాదని అర్థం. గొంతును గుర్తించే పద్ధతితోబాటు మరేదో గుర్తించి కూడా ఉండాలి. మిమిక్రీ ఫెయిల్ కావచ్చు!

వాసనలు వేరుగా ఉంటాయా?
వాసనల ఆధారంగా నేరగాళ్లను పట్టడానికి కుక్కలు అవసరం. ఎవరి కంపు (కంపు అన్న మాటకు అసలు అర్థం వాసన అని మాత్రమేనని గమనించాలి!) వారిదే. అయితే ఏడు వందల కోట్ల వాసనలున్నాయా? ఉన్నాయి అని అంటున్నారు పెన్సిల్వేనియా పరిశోధకులు. డిఎన్‌ఏలో ఉండే మూల అక్షరాలు నాలుగు. మనిషి బాహుమూలంలో 20కిపైగా వాసన రసాయనాలున్నాయి. ఇంకా ఎక్కువగా కూడా ఉన్నాయి. వాటిని రకరకాల కలయికలు, మోతాదులుగా చూస్తే ఎన్ని రకాల వాసనలయినా ఉండవచ్చు.
మనిషి శరీరంలో వేరు వేరు భాగాలలో వేరు వేరు స్రావాలు పుడుతుంటాయి. అక్కడ రకరకాల సూక్ష్మజీవులుంటాయి. వాసనలేని స్రావాలకు కూడా వాటివల్ల వాసన పుడుతుంది. ఒక వ్యక్తి శరీరంలో మొత్తం ఐదు వేల రకాల రసాయనాలు వాసనలకు ఆధారాలు. ఆమ్లాలు, ఆల్కహాల్స్, కీటోన్‌లు, ఆల్డీహైడ్‌లు ఈ రసాయనాలలో రకాలు. వాటిలో కనీసం 44 మాత్రం వేరువేరుగా ఉంటూ, వేలిముద్రలలాగే రకరకాల వాసనలకు కారణమవుతాయి. ఈ రసాయనాలకు వాసన కలిగించడం తప్ప మరో పని లేదని కూడా గుర్తించారు. ఈ వాసనల ఆధారంగా మనుషులను గుర్తించడం ఒక సహజమయిన పద్ధతి అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
శరీరం మొత్తంమీది వాసనలను సేకరించి, వ్యక్తిని గుర్తించే పద్ధతి ఇంకా రాలేదు. ఆ ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయి

లబ్-డబ్ లేదా హృదయలయ
కవులు, గాయకులు గుండె చప్పుడు గురించి ఊహించారు. నిజంగా కూడా ఏ రెండు గుండెలు ఒకే రకంగా కొట్టుకోవు. వింటే తేడా తెలియదు కానీ, విద్యుత్తు తరంగాలుగా చూస్తే మాత్రం తెలుస్తుంది. ఇసీజీలో గుండెలోని మూడు రకాల కదలికలు తెలుస్తాయి. ప్రతి గుండె పరిమాణం, ఎత్తు, పొడుగు, ఆకారం వేరువేరుగా ఉంటాయి. వేగం మారినా గుండెలయ మాత్రం మారదు. దీన్ని మన ఇష్టప్రకారం మార్చడం కుదరదు. గుండె ఆధారంగా మనుషులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మెదడు నుంచి పుట్టే తరంగాలు
ఆలోచనలు ఎవరివి వారికి వేరంటే కొత్తేమీ లేదు. వాటినుంచి వచ్చే తరంగాలను గుర్తించి తేడా చూపవచ్చునని మాత్రం ఈ మధ్యే తెలిసింది. మెదడులో లెక్కలేనన్ని కణాలు మారి మారి, చివరికి ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది. ఇఇజీ అనే యంత్రం మెదడు తరంగాలను చూపగలుగుతుంది. రామన్ పరాంజపే అనే పరిశోధకుడు కెనడాలో పరిశోధనలు జరిపి ఆలోచనా తరంగాల మధ్య తేడాను బయటకు చూపించాడు. అందరూ ఒకే పనిచేస్తున్నా, మెదడు పనిలో తేడా ఉందని నిరూపించాడు. అయితే, ఈ బ్రెయిన్ వేన్స్ ఎన్ని రోజులయినా, ఏ పరిస్థితిలోనయినా ఒకే రకంగా ఉంటాయా? ఈ ప్రశ్నకు జవాబు యింకా రాలేదు. ఆలోచనలు, వేలిముద్రల వంటివి కావని మాత్రం తెలుసు!

మనం కాని మనం
మనిషిని గుర్తించడానికి అన్నింటికన్నా ఆశ్చర్యకరమయిన ఆధారం- ఆ వ్యక్తిలోని సూక్ష్మజీవుల తీరు, కలయికలు. ఒక వ్యక్తి శరీరం బయట లోపల కలిసి వంద ట్రిలియనుల (అంటే ఎన్ని?) సూక్ష్మజీవులుంటాయి. శరీరం కణం ఒక్కింటికి 10 సూక్ష్మజీవి కణాలుంటాయి. (మనం అంటే మనం కాదని, మన సూక్ష్మజీవులని అనాలేమో?) మన జన్యువులు 23,000 మాత్రమే. మనలోని సూక్ష్మజీవుల జన్యువులు 33 లక్షలు. మనం 0.7 శాతం మాత్రమే మనం అంటారు పరిశోధకులు. ఈ సూక్ష్మజీవులను బట్టి మనుషులను గుర్తించడం చాలా సులభం అనాలి!

ఇప్పుడు చుట్టూ చూడండి, మీలాటివారు మరెవరయినా ఉన్నారేమో వెదకండి! మనుషులంతా నిజానికి ఒక్కటే. అందరిలోనూ అదే రక్తం పారుతున్నది. కానీ...!

No comments:

Post a Comment