Thursday, December 29, 2011

2011లో సైన్సు - కొన్ని ముఖ్యాంశాలు


ఒక్కసారి వెనక్కి తిరిగి.....

వీడ్కోలు ‍ 2011

మరో మలుపు వచ్చింది. అనుభవాలు, పరిచయాల ఆధారంగా గతాన్ని గుర్తు చేసుకోవడానికి ఇది సమయం. సంవత్సరాలు వస్తాయి, పోతాయి. కొన్ని సంవత్సరాలు మనలను ఒక కుదుపు కుదిపి మరీ పోతాయి. సైన్సుకు సంబంధించి ఈ సంవత్సరం, ప్రతీ సంవత్సరం లాగే ఎన్నో కొత్త సంగతులను మనముందు ఉంచింది. అందులో కొన్ని నిజంగా కుదుపులు! మనిషి ఆలోచనలు, అనుభవాలను మార్చే విషయాలివి...


కాంతికన్నా వేగంగా...

‘న్యూట్రినోలు మనిషికి తెలిసిన వేగం పరిధులను దాటాయి. భౌతికశాస్త్రం మారే కాలం వచ్చిందా?’
ఐన్‌స్టైన్, ఆయన సాపేక్ష సిద్ధాంతం, 20వ శతాబ్దంలోని భౌతిక శాస్త్ర అవగాహన అంతా తలకిందులయే పరిస్థితి వచ్చినట్టుంది. సైన్సులో శాశ్వత సత్యాలు ఉండవు అనడానికి ఇదొక నిదర్శనం. 174 మంది భౌతిక శాస్తవ్రేత్తలు న్యూట్రినోలనే అణుకణాలతోప్రయోగాలు చేశారు. ఆ కణాలు వేగంగా విశ్వమంతా వ్యాపిస్తున్నాయని తెలుసు. ఆ వేగాన్ని కనుగొనాలని వాటిని స్విట్జర్లాండ్‌లోని జెనీవానుంచి ఇటలీలోని గ్రాన్ సాటోలో ఉండే ఒక డిటెక్టర్ వరకు పంపించారు. ఒకసారి కాదు, మూడు సంవత్సరాల పాటు పంపి వేగాన్ని విశే్లషణలు చేశారు. 2011 సెప్టెంబర్‌లో ఫలితాలను ప్రకటించారు. ఆశ్చర్యంగా కణాలు సెకండులో ఒక కోటి డెబ్బయి లక్షల వంతు ముందే గమ్యం చేరుతున్నాయట. ఈ మాట సులభంగా అర్థం కాదని తెలుసు. ఒకటి మాత్రం నిజం. న్యూట్రినోలు కాంతికన్నా వేగంగా కదులుతున్నాయి. అంటే వేగం గురించి ఇప్పటివరకున్న అవగాహనలు తప్పు, అని అర్థం! అంటే ఐన్‌స్టైన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం బోర్లాపడిందని అర్థం! కాలం ముందుకు మాత్రమే సాగుతుందని కదా అనుకుంటున్నాం! అది వెనక్కు కూడా వెళ్లగలదు! సమాచారాన్ని న్యూట్రినోల మీద పంపగలిగితే, అది పంపకముందే గమ్యానికి అందుతుంది. ఇంకా సులభంగా చెప్పాలంటే కారణం కన్నా ముందు పని జరుగుతుంది! విశ్వం గురించిన అవగాహనలిక మారనున్నాయి! సిద్ధంగా ఉందాం మరి!
‘‘కాంతికన్నా ముందే వేగంగా కదిలే వర్తమానం పంపించవచ్చు. కానీ పంపకముందే గమ్యం చేరే వర్తమానాన్ని ‘పంపడం’ ఎలా కుదురుతుంది’’? ఈ ప్రశ్న నిజంగా సమంజసం! ఈ కాంతికన్నా వేగాన్ని చాలామంది అబద్ధం అంటున్నారు. కానీ, ఈ ప్రయోగంలో కణాలను పంపడం, అవతలవాటిని పట్టడం, వేగం కొలవడం అద్భుతాలు. ఫలితం అబద్ధమని రుజువయితే కూడా, ఈ అద్భుతాలు మాత్రం నిలబడతాయి. ఇక, స్థలం, కాలాల గురించిన మన అవగాహనలు మరోసారి పరీక్షించాలన్న సూచన అంతకన్నా అద్భుతం. విశ్వం తీరులో అర్థంకాని రహస్యాలు మిగిలే ఉన్నాయని మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఈ న్యూట్రినో ప్రయోగం ఆ మార్గంలో మనిషిని నడిపిస్తుందన్నది సత్యం!

ఎయిడ్స్‌ను ఆపవచ్చు....

‘‘స్టెమ్ సెల్స్ సాయంతో రోగ నిరోధక శక్తిని మార్చి హెచ్‌ఐవీని తట్టుకునే రకంగా మార్చవచ్చు. అంటే ఎయిడ్స్‌కు చికిత్స ఉందని అర్థం!’’

 జింక్ ఫింగర్ న్యూక్లియెసెస్ అనే ప్రొటోన్లను పరిశోధన కాలంలో తయారుచేశారు. ఇవి కణాల్లో ప్రవేశించి జన్యువులను కత్తిరిస్తాయి. 2011లో వీటిని వాడి, ఇరవయి సంవత్సరాలుగా చికిత్స పొందుతున్న ఎయిడ్స్ రోగుల, సమస్యను అంతం చేశారు. ఇనే్నళ్లుగా ఎన్ని రకాలు మందులు యిచ్చినా, వారిలో వైరసు మాత్రం ఉంటూనే వచ్చింది. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో ఈ పద్ధతిలో జరిగిన మరో పరిశోధన కూడా మంచి ఫలితాలను ఇచ్చింది. అక్కడ కూడా ఆరుగురు పేషంట్లకు, మామూలు చికిత్స ఆపి, జింక్ ఫింగర్ న్యూక్లియెస్‌తో మార్చిన కణాలను ఎక్కించారు. మందులు ఆపినందుకు హెచ్‌ఐవీ వైరసు ముందు ఎక్కువయింది. కానీ, త్వరలోనే వాటి సంఖ్య బాగా తగ్గిపోయింది. ఒక వ్యక్తిలో, పనె్నండు వారాల తర్వాత అసలు వైరసు కనబడనే లేదు. సిడి నాలుగు అనే రోగ నిరోధక కణాలమీద సిసిఆర్ ఐదు అనే స్థావరం ఉంటుంది. వైరసు జీవకణంలోకి ప్రవేశించి హాని కలిగించడానికి ఈ స్థావరం అవసరం. ఈ కణాలలోని రిసెప్టర్ స్థావరాన్ని తొలగిస్తే, వైరసు పని ఆగిపోతుంది. మునుముందు, ఈ రకంగా మార్చిన కణాలను ఎక్కువగా యిచ్చి పరీక్షలు చేస్తారు. అసలు సిసిఆర్ ఐదు లేని స్టెమ్ సెల్స్‌ను తయారుచేసే ప్రయత్నం కూడా ఫలించింది. త్వరలోనే వాటితో మనుషులలో ప్రయోగాలు జరగనున్నాయి.
‘‘ప్రపంచాన్నంతా కొంతకాలం గడగడలాడించిన ఎయిడ్స్ వ్యాధిని త్వరలోనే అదుపు చేయగలుగుతారు’’.

అయినా, మనిషే గొప్ప!...

‘‘ఐబిఎమ్ వారి కంప్యూటర్, వ్యాప్సన్ ఒక క్విజ్ పోటీలో ఛాంపియన్ల మీద గెలిచింది. అయినా, అది మనుషుల తెలివితో పోటీపడజాలదంటున్నారు’’.

 జియొపార్డీ అనే క్విజ్ షోలో కెన్ జెన్నింగ్స్, బ్రాడ్ రుడర్ ఛాంపియన్‌లు. వాళ్లతో వ్యాప్సన్ అనే కంప్యూటర్ మూడు రోజులపాటు పోటీపడింది గెలిచింది కూడా. అయితే ఇంతకూ ఈ వ్యాప్సన్ శక్తి ఏమిటి? కేవలం ఒక యంత్రమా, లేక తన మార్గం తాను వెతకగలిగే మరమనిషా? ఇంతకూ ఆర్ట్ఫిషియల్ ఇంటలిజెన్స్ అంటే ఏమిటి? దానికి ఉండగలిగిన ప్రయోజనాలేమిటి? అన్న ప్రశ్నలు మిగిలే ఉన్నాయి.
జియొపార్టీ క్విజ్ విచిత్రంగా ఉంటుంది. అందులో ప్రశ్న ఉండదు. క్విజ్ మాస్టర్ ఒక క్లూ లాంటి వాక్యం చదువుతారు. ముందు బజర్ నొక్కిన వ్యక్తి, అందుకు సంబధించిన జవాబు కాక, ఆ జవాబు రాదగిన ప్రశ్న అడగాలి!
సెర్చ్ ఇంజన్లో సమాచారం వెతకాలంటే కొన్ని కీలకమైన పదాలు ఆధారం. ‘భారతీయ భాషలన్నీ సంస్కృతం నుంచి పదాలను అరువుతెచ్చుకున్నాయి. కానీ ఇది మాత్రం పర్షియన్ నుంచి తెచ్చింది’ అని క్విజ్ మాస్టర్ అడిగారనుకుందాం. పోటీలో ఉన్నవారు ‘ఉరుదూ అంటే ఏమిటి?’ అన్న ప్రశ్నను జవాబుగా అడగాలి. భారతీయ భాషలు అని సెర్చ్ చేస్తే ఏ గూగుల్‌లోనో వందల పేజీలు వచ్చేస్తాయి. ఇక్కడ అది కాదు కావలసింది. వ్యాప్సన్ ఇక్కడ సరైన సమాధానాన్ని వెదకగలుగుతుంది. జవాబు ఎక్కడ అని కాక, ఏమిటి అని వెదకగలగడం దాని ప్రత్యేకత. రకరకాల పద్ధతులను వాడి వ్యాప్సన్ సుమారు ఏడు కోట్ల పేజీలలో జవాబు కొరకు వెదుకుతుంది. నమ్మకం కుదిరితేనే జవాబు చెతుంది. అందుకు పట్టే సమయం కేవలం మూడు సెకండ్లు.
ఇంతకూ వ్యాట్సన్  అన్నింటికన్నా, మనిషికన్నా తెలివయిన యంత్రం అనగలమా? అది సృజనాత్మకంగా మనిషిలాగా ఆలోచించగలుగుతుందా? అన్న ప్రశ్నలకు కాదు, లేదు అని జవాబిస్తున్నారు నిపుణులు. కంప్యూటర్‌కు హాస్యం అంటే ఏమిటో తెలియవచ్చు, కానీ జోక్ మాత్రం అర్థం కాదు, అంటారు వారు.
‘‘వ్యాట్నన్ ను తయారుచేసిన డేవిడ్ ఫెరుచి కూడా ఇది కంప్యూటర్ మాత్రమే అంటున్నారు’’.

కొత్త గ్రహాల వేట.. డబ్బు దండగా?..

‘‘కెప్లర్ ఉపగ్రహం భూమిలాంటి ఎన్నో గ్రహాలను కనుగొంటున్నది. వాటిల్లో జీవం గురించి కూడా తెలిసే అవకాశం ఉంది’’. 

స్టార్‌వార్స్ సినిమా తీసినపుడు జార్జ్ లూకాస్ అనుకోకుండా రాసిన కొన్ని సన్నివేశాలు నిజమయ్యాయి. కెప్లర్ అబ్జర్వేటరీ కనుగొన్న 16 బి అనే గ్రహం ఆ సినిమాలో కనిపించిన గ్రహంలాగే ఉంది. అది శనిగ్రహమంత పరిమాణం గలది. ఈ పరిశోధన నౌక భూమిలాంటి గ్రహాల కొరకు చేస్తున్న అనే్వషణ అనుకోని విజయాలను సాధించింది. ఇప్పటికే అది చాలా గ్రహాలను గుర్తించగలిగింది. ఒక స్పేస్ షటిల్‌కయేకన్నా కొంచెం ఎక్కువ ఖర్చుతో కెప్లర్ నౌక సాధించిన విజయాలు అందరినీ ఆశ్చర్యంలో ముంచాయి. అది కనుగొన్న గ్రహాలలో 10బి, 11, 16బి, హెచ్‌డి855128, ఎల్‌కెసిఏ 15బి మొదలయినవి ముఖ్యమైనవి. అయితే విచిత్రంగా నాసావారు, ఖర్చుల కొరత పేరుతో, కెప్లర్ కార్యక్రమాన్ని ఆపివేయడం ఇంకా ఆశ్చర్యకరమయిన విషయం. కెప్లర్‌కు సహాయంగా ఉండడానికి ప్రయోగించదలచిన రెండు కృత్రిమ ఉపగ్రహాలను ఇప్పటికే ఆపివేశారు. ఇక కెప్లర్ మనుగడ కూడా అనుమానంలో పడింది.
గ్రహాలను అన్వేషించడానికి జరుగుతున్న పరిశోధనను, బుద్ధిజీవులు లేదా మరోగ్రహాలనే జీవుల పరిశోధనలో భాగంగా చెప్పవచ్చు. ఇంత ముఖ్యమైన కార్యక్రమానికి తగిన ప్రాధాన్యం లేకపోవడం గురించి అందరూ ఆందోళన పడుతున్నారు. నాసావారు, తమ సంస్థల్లోని వారు కాక, వెలుపలున్న నిపుణులతో ఒక సంఘాన్ని ఏర్పాటుచేసింది. వారు కెప్లర్ పని గురించి, పోటీగా ఇతరత్రా జరుగుతున్న కృషి గురించి ఒక నివేదికను త్వరలో ఇవ్వనున్నారు. ఆ తర్వాత కెప్లర్ కొనసాగేదీలేనిదీ తెలుస్తుంది.
‘ఈ కార్యక్రమం ఎంతో ముఖ్యమయినది. దీన్ని ఆపిన తర్వాత, జీవం కొరకు అనే్వషణకు అర్థం ఉండదు’ అంటారు కెప్లర్‌తో పనిచేయిస్తున్నవారు, మిగతా పరిశోధకులు కూడా. కెప్లర్ ఇప్పటికే కనుగొన్న గ్రహాలన్నీ మనకు దగ్గరలోనివే. అసలు అనే్వషణ ఆ రకంగా సాగాలని ముందే నిర్ణమయింది. ఆ గ్రహాలను మరింతగా పరిశీలిస్తే, జీవం కనబడి తీరుతుంది, అంటారు మరికొందరు.

‘‘ఇతర గ్రహాల మీద జీవం ఆచూకీని చెప్పగల కెప్లర్ కార్యక్రమం కొనసాగుతుందా’’ అన్నది ప్రశ్న.

వ్యక్తులు... అమహమద్ జెవేల్

ఈజిప్టు దేశంలో పుట్టిన ఈ రసాయన శాస్తవ్రేత్త నోబెల్ బహుమతి గెలిచాడు. ఆ దేశంలో నోబెల్ గెలిచిన వారు మరెవరూ లేరు! అహమద్ అమెరికాలోని ప్రసిద్ధ సంస్థ కాల్‌టెక్‌లో పనిచేస్తున్నారు. తమ దేశంలో జరుగుతన్న ప్రజా పోరాటం గురించి తెలిసి ఆయన అక్కడికి వెళ్ళారు కూడా. అక్కడ అందరికీ ఆయన ఒక హీరోమరి! నా వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. నేను అక్కడే చదువుకున్నాను’ అన్నారు అహమద్
రసాయనాల మధ్య జరిగే చర్యలను పరిశీలించడానికి, లేజర్లనువాడే పద్ధతి కొనుగొన్నందుకు అహమద్ జెవేల్ 1999లో నోబెల్ బహుమతిపొందారు. తన దేశంలో సైంటిస్టులకు తగిన గౌరవం, ఆదాయం లేదని తెలుసు. యూనివర్సిటీలు కూడా అధ్వాన్న పరిస్థితుల్లో ఉన్నాయని తెలుసు. ఒకక్లాసులో వెయ్యిమంది విద్యార్థులు ఉన్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
శాస్తవ్రేత్తలు రాజకీయాలను పట్టించుకోరన్నది జగమెరిగిన సత్యం! కానీ అహమద్ తమ దేశం వెళ్లి తిరుగుబాటుదారులు, ప్రభుత్వానికి మధ్యవర్తిగా వైస్ ప్రెసిడెంట్ ఒమర్ సులేమాన్‌తో చర్చలు జరిపారు. తహ్‌రీర్ మైదానంలో చేరిన యువకుల నాయకులతోకూడా మంతనాలు జరిపారు.
‘అలెగ్జాండ్రియా లైర్రీలో నేను సైన్సు, ప్రజా సమస్యల గురించి ఉపన్యసించాను. ఆరువేలమంది యువకులు వినడానికి వచ్చారు. కైరోలో ఈజిప్టులోని సైన్సు, టెక్నాలజీలను గురించి నేను చేసిన జాతీయ ప్రసంగాన్ని, మూడు కోట్లమంది టెలివిజన్‌లోచూచారు. మీరు నమ్మరుగానీ, సైన్సులో ఘనత సాధించినవారికి, ఫుట్‌బాల్ ప్లేయర్లకన్నా మంచి గుర్తింపువుంది. ప్రజలు జ్ఞానపిపాస కలిగి ఉన్నారని తెలుస్తూనే ఉంది గదా!’’ అంటారాయన. ఈ పరిస్థితి మన దగ్గర కూడా ఉంటే ఎంత బాగుండును!

మరెన్నో సంగతులు...

సంవత్సరం చివరన కనీసం సైన్సు పత్రికలు, ఆ సంవత్సరంలో గొప్ప సైన్సు వార్తాంశాలను ఒకచోట చేర్చి ప్రచురిస్తారు. అందులో ఆసక్తి ఉండే కొంతమంది వాటిని చదువుతారు. చాలామంది, ఆ పత్రికలను ఆ వార్తలను పట్టించుకోరు. అందుకు కారణాలు లేకపోలేదు. సైన్సు సాధారణంగా, సామాన్యులకు అర్థంకాని పద్ధతిలో ముందుకు సాగుతూ ఉంటుంది. శరీరంలో సైన్సు నిత్యం బతుకులో సైన్సు గురించి పట్టనివారికి హిగ్స్ బోసాన్ గురించి చెప్పడానికి ప్రయత్నిస్తే వారెందుకు వింటారు? ఎందుకు వినాలి?
ఆటం అన్నమాట విని ఉంటారు. అయినా ఆటంబాబులు అంటే దీపావళిని గురించి ఆలోచించేవారే ఎక్కువ! అణువులో ఎలెక్ట్రానులు, న్యూట్రానులు, ప్రోటానులుంటాయని కొంతమందికి తెలిసి ఉంటుంది కానీ ప్రొటానులంటే ప్రొటీనులాంటివి అనుకునే వారే ఎక్కువ! ఇక న్యూట్రీనోల గురించి హిగ్స్ బోసాన్‌ల గురించి ఎవరికి చెప్పాలి? ఈమధ్యన ఒక తెలుగు దినపత్రికలో బోసాన్‌ల గురించి రాస్తూ ‘దైవకణాలు’ అనే మాట వాడారు. నిజంగానే, బోసాన్‌లు అనే ఈ కణాలు ఉన్నాయా లేవా అని అనుమానం. ఫ్రాన్సు, ఇటలీ మధ్య నేలలో 17 మైళ్ళ నిడివి సొరంగం గల లార్జ్ హాడ్రాన్ కొలైడర్‌లోని ప్రయోగాలతో బోసాన్ల ఉనికి 2011లో తెలుస్తుందన్నారు. అక్కడ చాలా సంగతులు తెలిశాయి. కాలం వెనక్కు నడవగలదన్న సూచనలు కూడా వచ్చాయి కానీ బోసాన్‌లుమాత్రం కనిపించలేదు. కనుక ‘దేవుడింకా కనిపించలేదు’ అని మనం చెప్పుకోవచ్చు.
మనిషి వెంట్రుక మందంలో అరవయివేల వంతు మాత్రమే ఉండే మోటారు ఈసారి తయారయింది. గినెస్‌బుక్‌వారు కూడా దాన్ని గుర్తించారు. అడవులు తిరిగి పెరుగుతున్నాయన్నారు. లేకుండా పోయిన జంతుజాతులను, మళ్లీ పుట్టించవచ్చునన్నారు. మొట్టమొదటిసారిగా, నోబెల్ బహుమతిని మరణానంతరం కాన్సర్ పరిశోధకుడు రాల్ఫ్ స్ట్రైన్‌మన్‌కు ఇచ్చారు.
‘ఎన్నో విశేషాలు, ఎన్నెన్నో విషయాలు. ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. పట్టించుకోవడం మన వంతు!’

No comments:

Post a Comment