పచ్చబొట్లు, గాయం మచ్చలు సమసిపోకుండా ఎలాగుంటాయి?
December 4th, 2011
నిజమే! రక్తకణాలలాగే చర్మం కణాలు కూడా పాతవిపోయి ఎప్పటికప్పుడుకొత్తవి పుడుతూ ఉంటాయి. అయినా ‘పచ్చబొట్టు చెదిరిపోదులే’ అనేపాట ఎలా వచ్చింది?
సులభంగా చెప్పాలంటే చర్మం అంతా ఒకే పొర కాదు. అందులో అన్నింటికన్నా వెలుపలిపొర ఎపిడెర్మిస్. అందులో మాత్రమే పాత కణాలుపోయి కొత్తవి పుడుతూ ఉంటాయి. మన పడక బట్టలలో, ఇంట్లో ఉండే దుమ్ములో సగం, చనిపోయిన ఈ కణాలే ఉంటాయంటే నమ్మగలరా? ఇక డెర్మిస్ అనే లోపలి పొరలో కూడా కణాలు విభజన చెందుతూంటాయి కానీ, అక్కడ పాత కణాలు పోవడం అనే పద్ధతి లేదు. అందుకే పచ్చబొట్టు పేరున లోపలికి చేరిన రంగుగా, లోతయిన గాయం గానీ అట్లాగే ఉండిపోతాయి.
చర్మమంతా, కొలాజెన్ అనే ప్రొటీన్ పదార్థంతో తయారై ఉంటుంది. ఈ కొలాజెన్, ఫైబ్రోబ్లాస్ట్స్ అనే కణాలలో పుడుతుంది. గాయం తగిలి, మానుతుంటే కొత్త కొలాజెన్, ఆ గాయంలోనే ఫైబ్రోబ్లాస్ట్‌లు ఉండి, వాటిలో నుంచి పుడుతుంది. అది మామూలు కొలాజెన్‌లాగుండదు. అందుకే గాయం మానిన చోట చర్మం, మిగతా చర్మంలా కాక బాగా నునుపుగా ఉంటుంది. చర్మంలో మిగతా కణాలు, లోపలి పొరలలోవి కూడా పెరుగుతున్నా ఈ గాయం కొలాజెన్ మాత్రం అట్లాగే ఉండిపోతుంది.
శిశువుకు, గర్భంలో ఉన్నపుడు గాయాలు తగిలితే మాత్రం మామూలు చర్మం వచ్చేస్తుంది. అంటే అక్కడ గాయం కణాలు, అందులో కొలాజెన్ తయారీ లాంటివి ఉండవు.
పచ్చబొట్టు విషయాని వస్తే, మరో ఆసక్తికరమయిన విషయం ఉంది. శరరంలో ప్రవేశించిన ఇతర రసాయనాలను సాధారణంగా తెల్ల రక్త కణాలు మింగేస్తూ ఉంటాయి కానీ పచ్చబొట్టు పేరున శరరంలోకి పంపబడుతున్న, రంగు రసాయనాల కణాలు పెద్దవిగా ఉంటాయి. తెల్లరక్తకణాలు వాటిని మింగజాలవు. అందుకే పచ్చబొట్టు చెరగకుండా, చెదరకుండా ఉండిపోతుంది. ఎవరన్నా పచ్చబొట్టును నిజంగా తుడిపి వేయాలనుకుంటే అందుకు పద్ధతులున్నాయి. లేజర్ కిరణాలతో ఈ రంగు రసాయనాన్ని పొడిగా చేయవచ్చు. అప్పుడు తెల్ల రక్తకణాలు ఈ పొడిని మింగేస్తాయి. పచ్చబొట్టు మాసిపోతుంది.
No comments:
Post a Comment