Saturday, December 10, 2011

గుర్రాలు - నాడాలు


గుర్రాలు-నాడాలు

వ్యవసాయం కన్నా బహుశా ముందే మనిషి జంతువులను మచ్చిక చేసి పెంచడం మొదలుపెట్టాడు. వ్యవసాయంతోబాటు, కొన్ని జంతువులు పశువులయి మనిషికి సాయంగా నిలిచాయి. బండి, పశువుల కాళ్ళకు నాడాలు వేయడంతో ఒకరకం సాంకేతికత మొదలయింది. ప్రస్తుతం పశువులు, పాడికేగానీ, పంటకు కాదనే ధోరణి వచ్చింది. వ్యవసాయంలో మాత్రమే వాడుకునే ఎద్దులకు నాడాలు ఎందుకు అవసరమయ్యాయన్నది ప్రశ్న. రోడ్డుమీద నడవవలసి రావడంతో ‘నాడా’లు వచ్చి ఉండాలి.

నాడాల చరిత్రను గమనిస్తే చాలా విచిత్రమయిన విషయాలు బయటపడ్డాయి. అమెరికాలోని ‘కౌబాయ్స్’ (పశువుల కాపరులు), తమ గుర్రాలకు నాడాలు వేశారు. కానీ స్థానిక అమెరికనులు తమ గుర్రాలకు మాత్రం నాడాలు వేయలేదు (ఈ సందర్భంగా ఒక విశేషం! ఎద్దులు, ఎనుముల కాలి గిట్టలు రెండు భాగాలుగా ఉంటాయి. గుర్రం గిట్ట మాత్రం ఒకే భాగంగా ఉంటుంది!).

ఏ గుర్రాలకు నాడాలు అవసరమయ్యాయి? ఏ రకానికి వాటి అవసరం లేదు? అన్న ప్రశ్నలకు జవాబు వెతికితే, పరిణామక్రమం అనే డొంకంతా కదులుతుంది. ఇది జీవ పరిణామం మాత్రమే కాదు సాంకేతిక, సాంఘిక పరిణామాలకుకూడా ఇందులో పాత్ర ఉంది. గుర్రాలు, పశువులు పెరిగిన ప్రాంతాలకూ ప్రమేయం ఉంది.

గుర్రాలు మధ్య ఆసియాలోని గడ్డి మైదానాలులో పుట్టినాయనవచ్చు. అడవిగాడిదల జాతి మొదలయింది అక్కడే. చారల గుర్రం అనే జీబ్రా, అంతరించిపోయిన క్వాగా లాంటి జాతులు ఆఫ్రికాలోని గడ్డి మైదానాల్లో పుట్టాయి. ఇక్వస్ గుర్రాలు ఉత్తర అమెరికాలో పుట్టాయి. కానీ ఈ అమెరికా గుర్రాలు, వాతావరణ కారణాలవల్లా, మనుషుల వేట మూలంగా 7600 సంవత్సరాల క్రితమే అంతరించిపోయాయి. మళ్లీ గుర్రాలు అమెరికాలోకి స్పెయిన్ వారి వెంట మాత్రమే వచ్చాయి. 1540 ప్రాంతంలో, కొన్ని గుర్రాలు తప్పించుకుని ఉత్తర అమెరికా మైదానాలకు చేరుకున్నాయి. మిసిసిపీ ప్రాంతంలో వ్యవసాయం జరుగుతున్న రోజులవి. గుర్రాల మీదస్వారీ చేయవచ్చునని అక్కడి రైతులకు నిజానికి తెలియదు. అయినా వారు 1680 నాటికి గుర్రం స్వారీ, గుర్రాల మీద రవాణా నేర్చుకున్నారు. వంద సంవత్సరాల కాలంలో గుర్రం కారణంగా నార్త్ అమెరికనుల బతుకు తీరుమారింది. అక్కడి ప్రజలకు, ముఖ్యంగా మైదానాలలో వారికి, వేట, తిండి వెతకడం తప్ప సాంకేతిక విషయాలమీద పట్టు లేదు. లోహాలు కావాలంటే, యూరోపియనుల మీద ఆధారపడేవారు. కనుక గుర్రానికి నాడాలు వేయడం అందుబాటులో లేని పని. ఖర్చుతో కూడుకున్నపని! వారి గుర్రాలకు నాడాల అవసరం రాలేదుకూడా. గడ్డి మైదానాలలో తిరిగే గుర్రాల గిట్టలు అరిగే అవకాశమే లేదు.

గుర్రం నాడాలు వాడడం మొదలయింది యూరపులోని వాయవ్య భాగాలలోనే అనవచ్చు. అయిదవ శతాబ్ది నాటికే గౌల్స్, ఫ్రాంక్స్ జాతివారు తమ పెంపుడు గుర్రాలకు నాడాలు వేసినట్టు ఆర్కియాలజికల్ ఆధారాలు చెపుతున్నాయి. అక్కడి శీతోష్ణ పరిస్థితులు, భూమి లక్షణాలుకలిసి నాడాల అవసరానికి దారి తీశాయి. అక్కడ వాతావరణం తేమగా ఉంటుంది. మట్టి మెత్తగా ఉంటుంది. కనుక గుర్రం గిట్టలుకూడా మెత్తబడతాయి. అంతకన్నా ముఖ్యంగా అక్కడి వారు గుర్రాలను ప్రయాణాలకు, రవాణాకు, యుద్ధాలకు మాత్రమే వాడుకున్నారు. పెద్ద బరువులు మోస్తూ గుర్రాలు చాలా వేగంగా పరుగ్తెవలసివచ్చేది. నాడా లేకుంటే గిట్టలు అరిగి, గుర్రాలు కుంటివవుతాయి.

గడ్డి మైదానాలలోని ‘ఇండియన్స్’ వాడిన గుర్రాల వాడకం, ఇంచుమించు అడివి గుర్రాల బతుకుకు దగ్గరగా ఉండేది. అడవిగుంపులుగా, నెమ్మదిగా, గడ్డిమీద తిరుగుతూ ఉండేవి. అంతా పొడి ప్రాంతమది. ఎగుడు, దిగుళ్లుకూడా ఎక్కువగా ఉండవు. గిట్టలు అరిగినా ఒకే రకంగా, తిరుగుతాయి. అంతకన్నా విచిత్రంగా, అక్కడ అందరికీ ఒకటికన్నా ఎక్కువ గుర్రాలుండేవి. రెండు వేల మంది సైనికులున్న ఒక బృందానికి 15 వేల గుర్రాలు అందుబాటులో ఉండేవి.

యూరోపియనులకు ఈ పరిస్థితి లేదు. పైగా పశుపోషణ, నిర్వహణకు వారికి తగిన తీరిక లేదు. నైపుణ్యం అంతకన్నా లేదు. యుద్ధాలలో మునిగి తేలే సైనికులకు తమ క్షేమం ఎక్కువ ముఖ్యం. గుర్రం సంగతి అంతగా పట్టేదికాదు.

మైదానంలో వీరుడు కూడా యుద్ధం చేశాడు. కానీ, తన గుర్రాలను ఒక గౌరవం, ఒక ఆస్తిగా గమనించి గర్వంగా వాటిని ప్రదర్శించేవాడు. అప్పట్లో గుర్రాన్ని దొంగిలించడం అన్నది అతి హీనమయిన నేరం! అది హత్యకు సమానమనుకునే వారు అప్పట్లో! అందుకే అక్కడి వారు తమ గుర్రాలను జాగ్రత్తగా చూచి, నాడాల అవసరాన్ని గుర్తించారు. కౌబాయ్‌లు వాడిన గుర్రాలు చాలా వేగంగా పరుగెత్తేవి. కానీ, అవి ఎక్కువ దూరం వెళ్ళవలసిన అవసరం ఉండేది కాదు! కావలసినచోటికి క్షణాల్లో చేరగలుగుతారు. వారి అవసరం అంతవరకే. అక్కడినుంచి ముందుకువెళ్ళనవసరం లేదు. అయినా, ఆ నేల తీరు కారణంగా నాడాలు అవసరమయ్యాయి.

భారతదేశంలోనూ సాంతం ఎక్కువగా పొడి నేలలే. ఇక్కడా గుర్రాలను రవాణా, యుద్ధాలకే వాడారు. ఇక్కడా నాడాలు వాడుకున్నారు. వ్యవసాయంలో వాడే పశువులకు నాడాలు అవసరం లేదు అనే ఎద్దులు బండ్లను లాగుతూ గట్టి దారుల మీద చాలా దూరం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు వాటికీ నాడాలు వచ్చాయి. ఈ నాడా ఎద్దులు బురద సేద్యానికి దిగితే కష్టం. ప్రస్తుతం ఎద్దులూ తరిగిపోతున్నాయి, నాడాలూ తరిగిపోతున్నాయి మరి. *

No comments:

Post a Comment