Thursday, December 15, 2011

మన గురించి మనం - 3


ప్రయాణం

ఎక్కడికి ప్రయాణం?
ఎన్ని రకాల ప్రయాణాలు?

మనం కదిలితేప్రయాణం, మనసు కదిలితే ప్రయాణం, ఉందోలేదో తెలియని చోటికి ప్రయాణం – అంతు లేని ప్రయాణం. బతుకే ఒక ప్రయాణం. యాత్రా చరిత్రలున్నాయి. మనసు నడచిన మార్గాల కథలున్నాయి. కారులో షికారు కథలున్నాయి.

ప్రయాణం అంటే నిజానికి ఆ తతంగమే. బయలుదేరడమూ, గమ్యం చేరడమూ ఉంటాయి గానీ, నిజానికి ప్రయాణమనే తతంగం మధ్యలో జరుగుతుంది. ఈ తతంగం లేని ప్రయాణం ఎందుకు? అసలు దాన్ని ప్రయాణం అనవచ్చా? గమ్యంకన్నా అటువేపు కదలిక ముఖ్యం. అది అనుకున్నట్టు జరుగుతుంటే, గమ్యం వచ్చినా గుర్తించలేనంత బాగుంటుంది. గుర్తించక అదే పనిగా ముందుకు నడిచిన బాటసారులెందరో ఉన్నారు. ఇంటికని బయలుదేరి, ఇల్లు దాటి, పల్లె దాటి ముందుకు పోయిన ప్రయాణం నిజంగా బాగున్నట్టు లెక్కగదా!

మనకు ప్రయాణం భావన అలవాటయింది. ఆలోచించకుండా, ఆ పనేదో మరెవరో చేసి పెడుతుంటే బతుకు వెళ్లమార్చడం అలవాటయింది. ఇంతకూ ప్రయాణం అంటే ఏమిటి చెప్పండి చూద్దాం! ఇందాకటినుంచీ చదువుతూనే ఉన్నారు గదా! ఏం చదువుతున్నరు? కాలం కదిలిందా? ఇంతసేపూ మీరు కదిలారా? మనసు కదిలిందా? ఏ రకం ప్రయాణం జరిగింది? ఏది బాగుంది? ఆలోచించారా? లేదు కదూ!!

అంతా బుద్ధిమంతులయిన బాలలు! ప్రయాణం ముఖ్యం కాదు, తతంగం ముఖ్యమంటే అవునంటారు. మరి గమ్యం సంగతేమిటి? అది అవసరమా కాదా? చదువుకోవాలి! సంపాయించాలి! పిల్లలను కనాలి! వాళ్లను ప్రయోజకులుగా తీర్చి దిద్దాలి! మరో లెవెల్లో ఆలోచిస్తే, వంట చేసుకోవాలి. అన్నం తినాలి. నిద్ర పోవాలి మళ్లా లేవాలి

ఇవన్నీ ప్రయాణాలా? గమ్యాలా? లేక ప్రయాణమన్న దాని తతంగమా? బతుకు ప్రయాణమయితే అందులో గమ్యమేది? తతంగమేమిటి?

తతంగం లేకుండా బతుకు గడిచేట్టుంటే బాగుండునని ఎప్పుడయినా అనిపించిందా? తెల్లవారేకల్లా పిల్లలు పెద్దవాళ్లయి ఎదురయితే ఎంత బాగుంటుంది? బాగుంటుందా? లేక వారిని తీర్చి దిద్దలేదన్న లోటు తోస్తుందా? మీకు ప్రయాణం, గమ్యం రెండూ కావాలా? లేక గమ్యం ఒకటీ అందితే చాలా?

నిజానికి అనుకున్నది ఒక్కటయితే అయ్యింది ఒక్కటన్న బతుకులే ఎక్కువ. ఎక్కడికని బయలుదేరిందీ గుర్తుండదు. ఎక్కడికి చేరిందీ అర్థం కాదు. మన చేతుల్లో ఏ నిర్ణయమూ ఉండదు. గమ్యం చేరిన వారి సంగతి మరొక రకంగా ఉంటుంది. అక్కడికి చేరిన తరువాత అర్థమవుతుంది, చేరదలుచుకున్నది ఆ గమ్యం కాదని. కానీ ప్రయాణం పేరున జరిగిన తతంగం మాత్రం భలే అనుభవంగా నిలిచిపోతుంది. పోనీ, మళ్లా బయలుదేరి కొత్త దారి పడితే పోయిందిగదా అన్న ఆలోచన కలిగితే అంతకన్నా కావలసింది మరొకటి ఉందా?
తతంగం సాగుతుంటే మనకు చేతనయిన సంగతులూ, చేతగానివీ అర్థమవుతాయి. కొత్త అనుభవాలు కొత్త గమ్యాల గురించి చెపుతాయి. చివరికి గమ్యం కాదు ప్రయాణమే ముఖ్యమనే చోటికి చేరుకుంటాం. అదీ ఒక గమ్యమేనా?

ఆలోచించండి! ఏం కావాలి? ప్రయాణమా? గమ్యమా? తతంగమా? తికమక అవసరం లేదు.
అలోచిస్తే అంతా తెలుస్తుంది.

No comments:

Post a Comment