Monday, December 26, 2011

కవిరాజు త్రిపురనేని రామస్వామి - పుస్తకం - సమీక్ష


‘కవిరాజు’ కలం చిందులు
-కె.బి.గోపాలం, December 18th, 2011

కవిరాజు
సాహిత్యం -2 - భగవద్గీత-
రచన: కవిరాజు త్రిపురనేని రామస్వామి,
పేజీలు :422
వెల: రూ. 200/-
విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్,
బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్.


కవిరాజుగా పేరుపొందిన త్రిపురనేని రామస్వామి ‘చౌదరి’గారు నిజమయిన స్వంత భావాలు గల తాత్వికులు. వారి రచనలు పండిత పామరులలో కూడా ఆలోచనలను ప్రేరేపించాయి. వారి రచనలను విశాలాంధ్రవారు సంపుటాలుగా వేస్తున్నారు. ఇది రెండవ సంపుటం (మొదటి సంపుటం వివరాలు ఈ సంపుటంలో లేవు). ఇందులో మాత్రం భగవద్గీత అన్న పద్యరచన, కురుక్షేత్రం, శంబుకవధ, ఖూనీ అనే పద్య నాటకాలు, కుప్పుస్వామి శతకము, ధూర్తమానవా శతకాలు, సూతాశ్రమగీతాలు, వివాహవిధి అన్న రచనలు ఉన్నాయి. ఇవన్నీ 1920 నుంచి 1941 మధ్య వచ్చిన రచనలు.


‘అహమ్ బ్రహ్మాస్మి’ గాన నాకు నేనె నమస్సులొనర్చుకొందు’ అని మొదలుపెడతాడు కవిరాజు. వారి ఆలోచనా సరళికి అక్కడే అంకురార్పణం జరుగుతుంది. అందరూ నమ్మి అనుసరిస్తున్న విషయాలను మరో పార్శ్వం నుంచి చూడగల శక్తి, దాన్ని వివరించి, నమ్మించగల పాటవమూ గల కవిరాజు రచనలకు నిజంగా తగిన ప్రాచుర్యం లభించకపోవడానికి కారణాలు వెదకవలసి ఉంది.


‘తొలి పలుకు’లో (భగవద్గీతకు) ‘ఒకదానికలవాటుపడిన లోకమాయలవాడులనుండి తప్పించుకొనుటకు చాలా కాలము పట్టును’ అంటారీ కవిరాజు. కురుక్షేత్ర యుద్ధము ధర్మసంస్థాపనకు కానే కాదు. కారెంపూడి యుద్ధం మాత్రం కేవలం ధర్మ సంస్థాపన కొరకే జరిగింది, అంటూ ఒక కొత్త భగవద్గీతను ఈ రచనలో ఆవిష్కరించారు. అసలు రచనను అర్థం చేసుకోవడానికి కొంత భాష, మరింతగా కొత్త ఆలోచనలను అంగీకరించగల, కనీసం వినగల ఓపిక అవసరం. కానీ, తొలి పలుకులను చదివిన తర్వాత ఆ ఓపికతో బాటు ఎంతో ఉత్సుకత, కుతూహలం కూడా పుట్టుకు వస్తాయి. తెలుగు భాష పరిస్థితి (అప్పటికే!), ఉత్తరదేశం వారి గొప్పదనం (?) గురించి కవిరాజు వ్యాఖ్యలు ఎవరినయినా కదిలిస్తాయి. ద్విపదకు గౌరవం లేనందుకే పల్నాటి యుద్ధం అందరి దృష్టికి రాలేదంటారీయన. విద్యావంతులలో ఉన్న అవినీతి చదవనివారిలో వుండదు కనుక భారత యుద్ధంలో నీతి కరువయింది, అన్నది సత్యం గదా! ఈ భగవద్గీత అన్న రచన గురించి నాలుగు మాటలలో చెప్పడం కష్టం!


‘కురుక్షేత్ర సంగ్రామం’ అని నాటకం. ఇక్కడ కూడా రచన గొప్పది. దానికన్నా ప్రవేశిక మరింత గొప్పది. తెలుగులో నాటకాల లేమి గురించిన చర్చ ఆలోచనకు దారితీస్తుంది. శ్రీనాథులు కేవల ముదర పోషణకయి కైత జేసిరి, అవి ఒక నిజాన్ని చెప్పిన తీరు మొహంలో పిడిగుద్దులాగుంటుంది. కౌరవపాండవుల వైరం, అయిదూళ్ల విషయం, దుర్యోధనుని తలిదండ్రుల తీరు, కర్ణుని జన్మరహస్యం చర్చ, మొత్తంమీద కురుక్షేత్ర యుద్ధం ఒక అధర్మ సంగ్రామమని తేల్చిన తీరు, గొప్పవి ఈ ఆలోచనా ధోరణి ఎందుకని అందరికీ అందలేదు? అర్థం కాదు. మనకు తెలిసి, రాయబారంలో, ఆ చర్చలో కంసునికి ఎక్కువ పాత్ర కనిపించలేదు. ఈ రచనలో కంసుని పాత్ర ఎక్కువ. ఆ ప్రశ్నలు, ఆలోచనలు భావస్ఫోరకంగా ఎదురవుతాయి. పదుగురాడు మాటలోని బలాన్ని చర్చించిన తీరు, ఇంకా అందరిలోకి చేరి చర్చ మరింత సాగాలి!
ఉత్తర దేశంలోని రాజులంతా దేవుళ్లయితే, దక్షిణాన గలవారు రాక్షసులు. మాంసాహారులయిన వారు రాక్షసులు, శాకాహారులు కోతులు. ఈ రకమైన ప్రతిపాదనలు ఎవరికయినా సులభంగా అర్థమవుతాయి. శంబుకవధ అనే చిన్న వృత్తాంతాన్ని భూమికగా, కవిరాజు నడిపించిన నాటకం చూచి, చదివి, విని ఊరకుండవలసినది కాదు. అట్లా ఉండనీయదు కూడా’. మనవారు చరిత్రను పురాణంగా చెప్పి తప్పుడు అవగాహనలకు దారితీశాడు అంటారు కవిరాజు. ఆధారాలతో సహా రామాయణ ప్రదేశాల గురించి, మరెన్నో విశేషాల గురించి ఈ శంబుకవధ నాటకానికి రాసిన తొలి పలుకులు కనువిప్పు కలిగించే తీరున నడిచింది. ఇరవయి పేజీలపైబడి సాగిన ఈ ప్రవేశిక, మళ్లీ అసలు రచనకన్నా ఆసక్తికరంగా ఉంది.


‘ఖూనీ’ అని మరో నాటకం. అపరాధ పరిశోధన అనిపిస్తుంది. నిజంగా ఇది అపరాధ పరిశోధనే. వేనరాజు గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు రచన ఉంది. అది ప్రేరణగా ఈ రచన వచ్చింది. వేనుడు బ్రాహ్మణ వ్యతిరేకి. కనుక హత్య చేయబడ్డాడు, అన్నది కవిరాజు వాదం! బ్రాహ్మణుల విలనీని ఈ రచనలో బాగా చూడవచ్చు.
తరవాతి శతకాలు, పాటలు కూడా ఆసక్తి కలిగించేవే.


మొత్తంమీద కవిరాజుగారి పద్యం ఎంతో బాగుంటుందని కొత్తగా చెప్పనవసరం లేదు. తెలుగు స్థితి తెలిసి కూడా కవి, తిరిగి అందరి మార్గంలో సంస్కృత పదాలతో రచనలు ఎందుకు చేసి ఉంటారు? వేనరాజు కథలో పాటలున్నాయి. ‘నిదురపోనీకోయి నీ చేతి కత్తి!’ అంటారాయన. ఈయన కలమే చేతికత్తి. ‘కల్లవ్రాతలు తొలగిపుచ్చుము’ అని చెప్పడమే కాకుండా చేసిచూపించారు కవిరాజు.


ఈ సంకలనానికి బాపుగారు వేసిన ముఖ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇక్కడ గీతోపదేశం చేస్తున్నది కవిరాజు. వింటున్నది కృష్ణుడు. ఆ ముఖాలలోని భావాలు అద్భుతం!
కవిరాజు త్రిపురనేని రామస్వామిగారి ఆలోచనలు తెలుగు పాఠకులకే గాక మిగతా ప్రపంచానికి అందే మార్గం ఉందా?

No comments:

Post a Comment