Sunday, December 18, 2011

గ్రీన్ సిమెంట్


గ్రీన్ సిమెంట్

ట్టి మిద్దెలు, గోడలు మాయమయినయి. ప్రపంచమంతా కాంక్రీటు, సిమెంటుల అడివి అయింది. గడచిన సంవత్సరం ప్రపంచంలో 3.6 బిలియన్ టన్నుల సిమెంటు తయారయింది. 2050 నాటికి అది ఏడాదికి నాలుగున్నర బిలియన్ టన్నులవుతుందట. ప్రపంచంలో మానవులు ఇంతకంటే ఎక్కువ పరిమాణంలో వాడుతున్న పదార్థం మరొకటి ఉందంటే, అది నీరు ఒకటే.
సిమెంటును, కంకర, ఇసుక, నీళ్లు, కావాలంటే మరేవో కొన్ని పదార్థాలతో కలిపితే గట్టిబడి కాంక్రీటు అవుతుంది. కాంక్రీట్ అంటేనే గట్టిది అని అర్థం. 

సిమెంటును గురించి మనిషికి ఇంత ఆసక్తి కలగడానికి కారణం, అది చవకగా దొరుకుతుంది. రాయిగా మారుతుంది. అయితే దీనికిగల మరొక లక్షణం మాత్రం మొదటినుంచీ మనిషికి అర్థం కాలేదు. సిమెంటు అంటేనే మురికి! తయారయే ప్రాంతంలో బతికేవారికి ఈ సంగతి తెలుస్తుంది. దాంట్లో పనిచేసేవారికి అంతకన్నా బాగా తెలుస్తుంది. ఆశ్చర్యంగా, ప్రపంచం వేడెక్కడానికి కారణమయిన వాయువులకు సిమెంటు కూడా ఒక ముఖ్య కారణమని కనుగొన్నారు.

సున్నం రాతినుంచి మొదలుపెట్టి సిమెంటును తయారుచేస్తారు. సముద్ర జంతువుల గుల్లలనుంచి ఈ ముడి పదార్థం దొరుకుతుంది. రసాయనపరంగా అందులో ఉండేది కాల్షియం కార్బొనేట్. ఈ పదార్థాన్ని కాల్చాలి అంటే ఏదో ఒక రకమయిన ఇంధనం అవసరం. కాల్చినపుడు గుల్లల నుంచి కార్బన్‌డై ఆక్సైడ్ కావలసినంతగా పుడుతుంది. మనుషుల కారణంగా తయారవుతున్న కార్బన్‌డై ఆక్సైడ్‌లో ఐదు శాతం, సిమెంటు కారణంగా వస్తున్నదంటే ఆశ్చర్యం. చైనాలో, మన దేశంలో ప్రగతి పేరున జరుగుతున్న నిర్మాణ కార్యక్రమం ఈ సమస్యను మరింత పెంచుతున్నది.

రెండు వేల సంవత్సరాల క్రితమే రోమనులు, సున్నం, అగ్నిపర్వతం చిమ్మిన బూడిద, రాళ్లుకలిపి కాంక్రీటు సిద్ధం చేశారు. నాటినుంచి, మరింత మంచి సిమెంటు కొరకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. 1820లో ఇంగ్లండ్‌లో ఒక మేస్ర్తి కొత్త సిమెంటును కనుగొన్నాడు. పోర్ట్‌లాండ్ దీవిలోని రాతి వంటి పదార్థం తయారుచేయడానికి వీలు కలిగించిన ఆ సిమెంటును కూడా పోర్ట్‌లాండ్ అని పిలిచాడతను. 1824లో ఆ సిమెంటుకు పేటెంటునిస్తూ ‘కృత్రిమంగా రాతిని తయారుచేయగల’ పదార్థమని వర్ణించారు.

సున్నపురాతిని సిమెంటుగా మార్చడానికి 2,600 డిగ్రీల ఫారెన్‌హైట్‌కు వేడి చేయవలసి ఉంటుంది. అందులో కొంత మెగ్నీషియం ఆక్సయిడ్ కలిపితే, అంత వేడి అవసరముండదని ఆస్ట్రేలియన్ పరిశోధకులు గమనించారు. దీంతో ఇంధనం ఆదా అవుతుంది. రెండు రకాలుగా పుట్టే సీఓటూ కూడా తగ్గుతుంది. కానీ వ్లాసోపోలస్ అనే పరిశోధన విద్యార్థి కార్బన్‌డై ఆక్సైడ్ తగ్గడంలేదని గుర్తించాడు. మెగ్నీషియం ఆక్సైడ్ పేరున నిజానికి సీఓటూ ఉత్పత్తి పెరుగుతున్నదని అతను గమనించాడు. 2004లో ఇతను పరిశోధన మొదలుపెట్టినప్పటినుంచి, పోర్ట్‌లాండ్ సిమెంటు పరిశ్రమ వారు ఉత్పత్తి పద్ధతిని మార్చేసే యత్నాలు చేస్తూనే ఉన్నారు. ‘గ్రీన్ సిమెంట్’, అంటే పర్యావణానికి హాని కలిగించని సిమెంటును తయారుచేయాలని వారి ప్రయత్నాలు!

కానీ వ్యాసోపోలస్ మాత్రం మరో వేపు దృష్టి సారించాడు. పోర్ట్‌లాండ్ సిమెంటుతో పోరాడుతున్నంతకాలం, అనుకున్న పని జరగదు, అన్నాడతను. ‘మరేదో మార్గం, పదార్థం చూడాలని’ అతడు పట్టుబట్టాడు. సున్నం రాతికి బదులు మెగ్నీషియం ఆక్సయిడ్‌ను వాడి, సిమెంటును తయారుచేయడం అతనికి మంచి ఆలోచనగా కనబడింది. కానీ, ఆ ఒక్క పదార్థంతో పని జరగదు. దాన్ని రాతిగా మార్చేందుకు మరేదో ప్రేరకం కావాలి. అంతకన్నా ముందు, కార్బన్ వాయువులు పుట్టని పద్ధతిలో ముడిపదార్థాన్ని తయారుచేసే మార్గం కావాలి. అందుకని మెగ్నీషియం సిలికేట్స్‌ను ఎంపిక చేశాడు. ఈ పదార్థం ప్రపంచంలో పుష్కలంగా దొరుకుతుంది.

ఎంత చేసినా, సిమెంటు వెల గల పదార్థం. అంతకంటే మంచి సిమెంటుకు మరింతగా వెల ఉంటుంది. అందుకే వ్యాసోపోలస్ తన ‘గ్రీన్ సిమెంట్’ పని తీరును, తయారీ పద్ధతిని బాహాటంగా చెప్పడంలేదు. పేటెంట్లు తీసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మెగ్నీషియం ఆక్సయిడ్‌కు మరేవో రసాయనాలు, నీరు కలిపాను. ఒక రాయి తయారయింది. అందులోంచి వేడి, అంటే శక్తి పుడుతున్నదని నికోలస్ వ్యాసోపోలస్ తయారుచేస్తున్న కొత్త సిమెంటులో కూడా కార్బన్‌డై ఆక్సైడ్ ప్రమేయం ఉంది. మొత్తానికి అతను కొత్త సిమెంటు తయారీ కొరకు నోవాసెమ్ అనే కంపెనీని ప్రారంభించాడు. పరిశోధనలో దిగకముందు ఈ యువకుడు, అతని అంకుల్‌గారి సిమెంట్ కంపెనీలో పనిచేసేవాడట. ఇప్పుడా అంకుల్, ‘నా వ్యాపారం మూయించేస్తావా?’ అని సరదాగా అంటున్నాడు. లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఈ రకం పరిశ్రమలకు ప్రోత్సాహం ఉంటుంది. ఇప్పటికి అక్కడ ఉన్నవనీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ లాంటి రంగాలకు సంబంధించినవి. ఇతనొక్కడే అక్కడ సిమెంటు కంపెనీ పెట్టాడు. రోమనుల కాలం తర్వాత లండన్ నగరం మధ్యలో, గోల, దుమ్ము పుట్టించే కంపెనీ రావడం ఇదే మొదలని అంతా ఆశ్చర్యంగా చెప్పుకుంటున్నారు.

నిజానికి ఈ రకం కొత్త సిమెంటు తయారీ కొరకు మరో నాలుగయిదు చోట్ల తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రపంచమంతా కార్బన్ డై ఆక్సైడ్ గురించి చర్చిస్తున్నది. పైగా సిమెంటు ప్రపంచ వ్యాప్తంగా 170 బిలియన్ అమెరికన్ డాలర్ల పరిశ్రమ. కావేరా, కాలిక్స్, లూయిసిమవా యూనివర్సిటీ లాంటి సంస్థలన్నీ గ్రీన్ సిమెంటు తయారీ ప్రయత్నంలో ఉన్నాయి. త్వరలోనే వీటిలో ఏదో ఒకటి ఫలించి చేతికి అందుతుంది.
బ్రిటన్‌లో అన్నింటికన్నాపెద్ద ప్రైవేట్ నిర్మాణ సంస్థ లేంగ్ ఓ రూర్కీలో ధీరజ్ భరద్వాజ్ అని ఒక అధికారి నోవాసెమ్ గురించి తెలుసుకున్నాడు. ఈ సిమెంటు పోర్ట్‌లాండ్ రకంకన్నా బాగుందని తమ పరిశోధనల ద్వారా తెలుసుకున్నాడు. ఇది తెల్లనిది. కనుక ఇందులో రంగులు కలిపివాడవచ్చు. వాతావరణ పరంగానే కాకుండా, నిజంగానే గ్రీన్ సిమెంట్ తయారు చేయవచ్చునని, పరిశ్రమలో వారికి కూడా నమ్మకం కలుగుతున్నదని అర్థం. ‘కొత్త సిమెంటుతో వంతెన కడితే, దాటుతావా?’ అన్న ప్రశ్నకు ‘ఓ!’ అని భరద్వాజ్ జవాబిచ్చాడు. ఆ వంతెన ఎప్పుడు, ఎక్కడ కడతారో మరి!

No comments:

Post a Comment