Monday, April 30, 2012

ఆలోచించగలరా?

తను ఇంట్లోకి వచ్చాడు. ఎవరికీ అభ్యంతరం లేదు. చెప్పులను మాత్రం దారిలో అడ్డంగా వదలి వచ్చాడు. వాటిని కొంచెం పక్కకు వదిలితే మరింత గౌరవంగా ఉంటుందని ఆలోచన అతనికి రాలేదు. ఆ ఆలోచన మనకూ రాకపోవచ్చు. జీవితంలో ఆలోచన ఎంతో అవసరం. అది లేకుండానే చాలామంది బతుకు గడుపుతుంటారు. ఆలోచన మారితే, ఆచరణ మారుతుంది. అసలు ఆలోచన ఉంటే, ఏదైనా మారవలసిన అవసరం ఉంటే, తెలుస్తుంది. చాలా విషయాలు మారితే బాగుంటుందని మనకు తోచనే తోచదు. వాటిని గురించి ఆలోచించకుండా కాలం గడపటమే అందుకు కారణం.


నిజానికి, మనుషులందరూ, ప్రతిక్షణం ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచనలు మామూలుగా వాటి దారిన అవి వస్తూ పోతూ ఉంటాయి. అందుకే కొందరు, ఏ ఆలోచనా లేని పరిస్థితి కావాలని ధ్యానం, మెడిటేషన్ చేస్తుంటారు. అది చాలావరకు అందరికీ చేతగాదు. ఎందుకంటే, అప్రయత్నంగా ఆలోచిస్తూ ఉండటం మన మెదడుకు అలవాటు. ఉదయం నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా ఆలోచనలే. వాటి కారణంగా నిద్రలో కలలు వెంటాడుతాయి. ఆలోచన లేకుండా గడపటం కుదరదు. మీరు ప్రస్తుతం, ఈ నాలుగు అక్షరాలనూ ముందుకు చదవాలా? చదివితే పట్టించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఆ సంగతి మీరు తెలిసి చేయడం లేదేమో! కానీ అది జరుగుతూనే ఉంటుంది.

ఆలోచనలతో భావాలకు రూపాలు వస్తాయి. కోరికలకు ఆకారాలు వస్తాయి. ఆ క్రమంలోనే ఆచరణలు మొదలవుతాయి. చదువు గురించి మీరు ఆలోచించినదంతా చదువుగా సాగుతుంది. డబ్బు గురించిన ఆలోచనలు మరోరకం పనులకు ఆధారాలవుతాయి. పని గురించిన ఆలోచనల ఆధారంగానే మన పని ముందుకు నడుస్తుంది. అయితే, అన్నింటికీ ఆధారంగా ఆలోచనలుంటాయని చాలామందికి అర్థం కాదు. ఆలోచనలను మన యిష్టప్రకారం నడపకపోతే పనులు కూడా అదే దారిలో కొనసాగుతాయి. చెప్పులు దారిలో వదిలినా, అందులో తప్పు తోచదు. జీవితంలో వచ్చే కష్టాలు చాలా మటుకు, ఈ ఆలోచనలలో నుంచి పుడతాయంటే ఆశ్చర్యం కాదు. స్పర్థలకు, యుద్ధాలకు, బాధలకు, గాధలకు కారణం, ఆధారం -ఆలోచనలే!


చాలామంది ‘నేను బాగానే ఆలోచిస్తాను’ అనుకుంటారు. ఆలోచనలకు క్రమం ఉంటుంది, ఉండాలి అన్న ఆలోచన మామూలుగా మనకు అలవాటు లేదు. సమస్యల వెనకవున్న కారణాలను వెదకడం, వాటిని గురించి ఆలోచించడం అలవాటు లేదు. ఆలోచన అనే ఆలోచన లేకుండానే చాలామంది ప్రవాహంలో కొట్టుకుపోతూ బతుకుతుంటారు. ఆలోచనల్లో మునుగుతూనే, ఆలోచించడానికి సమయం లేదని అనుకుంటారు.


బతుకు బాగా మన అదుపులో ఉంటూ సాగాలంటే, మనమందరమూ, ఆలోచనల బడిలో విద్యార్థులుగా చేరిపోవాలి. ఆలోచనగలవారినీ, ఆలోచనలు పంచుకునే వారినీ, వారి ఆలోచనలను జాగ్రత్తగా గమనించాలి. ఆలోచనలను పరీక్షించాలి. వాటి ప్రభావాలను జాగ్రత్తగా అనుభవించి విలువ తెలుసుకోవాలి. ఆలోచన మొదలయితే, ఆలోచనల బలం గురించి తెలుస్తుంది. ఆ బలంతో, తెలివిగా ఆలోచనలను క్రమశిక్షణతో ముందుకు నడిపించాలి. తెలివిని అనునిత్యం వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆలోచనలను, ఆచరణలను, ఫలితాలను ఎప్పటికప్పుడు విశే్లషించాలి. విలువను గుర్తించాలి. తప్పుగా తోచిన ఆలోచనలను, వాటి నుంచి పుట్టే ఆచరణలను పక్కన పెట్టాలి. అంటే విమర్శనాత్మకంగా, సతర్కంగా ఆలోచించడం నేర్వాలి. అప్పుడు మన బ్రతుకు మనదవుతుంది. మనం చెప్పిన, నమ్మిన దారిలో నడుస్తుంది. మన బ్రతుకు బాధ్యతలు నూరుశాతం మనవే అవుతాయి.


ఎవరో ఏదో చెపుతారు. చెప్పినందుకు చేయడం ఒక పద్ధతి. ఆ విషయం గురించి ఆలోచించి, విలువ గ్రహించి, మన ఆలోచనగా ఆచరించడం ఇంకొక పద్ధతి! ఆలోచనలు, ఆచరణలు, వాటికి మన భావావేశాలకు గల సంబంధం లాంటివన్నీ అంత సులభంగా అర్థం కావు! అయితే, ఆలోచించడం మాత్రం అన్నింటికన్నా సులభమయిన పని. ఏ పనీ చేయనప్పుడు మనకు మిగిలేది ఆలోచన ఒకటే. ఆ ఆలోచనలను మన అదుపులో ముందుకు సాగించడం అసలు తత్వం!


ఆలోచనలలో ఎక్కడో లోపం ఉందని, అవి వాటి మార్గాన అవి పరుగెత్తుతున్నాయని గుర్తించగలగడం, ఆలోచన బడిలో చేరడానికి ఎంట్రెన్స్ పరీక్షలాంటిది. వాటంతటవి దౌడు తీసే ఆలోచనలు, మనలను గుంటలో పడవేస్తాయి. మనకు ప్రతి విషయం గురించి, తెలియకుండానే, బలమయిన అభిప్రాయాలుంటాయి. కారణం లేకుండానే, కొన్ని సంగతులు, వస్తువులు, పనులు, వ్యక్తుల మీద మంచి అభిప్రాయం ఉండదు. నిష్కారణంగానే కొన్ని ఇష్టాలూ ఉంటాయి. తప్పు చేసి కూడా సర్ది చెప్పుకోవటం మనకు బాగా అలవాటు. ఎదురుగా సమస్య ఉందని గుర్తించి కూడా దాని గురించి ఆలోచించకపోవడం మన సహజ లక్షణం. మనమూ, మన వారు తప్పు చేసినా అది గొప్పగానే కనబడుతుంది. కూరిమి విరసంబయినను నేరములే తోచుచుండు, అంటాడు కవి. నచ్చని వారు ఏం చేసినా అందులో లొసుగులు కనబడతాయి. ‘నేను అలాగనుకోలేదు. ఊరికే అన్నాను’ అన్న డయలాగు అందరికీ తెలిసిందే. ఏ పనయినా ఆలోచించి చేస్తే, దాని బాధ్యత పూర్తిగా మనదే అవుతుంది. మనలను మనం ‘సరి’ అనడం, మోసపుచ్చుకోవడం, ప్రవర్తించడం లాంటివన్నీ సరైన ఆలోచన లేకనే!


తెలియకుండా, ఆచేతనంగా జరుగుతున్న ఆలోచనలను, మనకు తెలిసే చేతనలోకి తేవడం ఈ ప్రయత్నానికి మొదటి మెట్టు. మీరు ఆలోచన గలవారు! ఆలోచనలను మీ మార్గంలో నడిపించండి!

Saturday, April 28, 2012

పురాతన సమాజం - పుస్తక సమీక్ష


పురాతన సమాజం
రచన: లూయీ హెన్రీ మోర్గన్
అనువాదం: మహీధర రామమోహనరావు
విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్,
బ్యాంక్ స్ట్రీట్,
హైదరాబాద్-1


పేజీలు: 384
వెల: రూ.200/-


సమాజ పరిణామ క్రమాన్ని నిశితంగా, సవివరంగా, సశాస్ర్తియంగా పరిశీలన చేసి మోర్గన్ రాసిన పుస్తకానికి ఇది తెలుగు అనువాదం. ఈ పుస్తకం మార్క్స్, ఎంగెల్స్‌లను ఎంతో ప్రభావానికి గురిచేసింది. ఎంగెల్స్ తన ‘ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ, అండ్ ద స్టేట్’ అన్న పుస్తకాన్ని, మోర్గన్ రచన ప్రభావంతోనే చేశాడు. అమెరికన్ ప్రాచీన సమాజాలలో సాంఘిక పరిణామాలు, బంధుత్వాల గురించి మోర్గన్ రాసిన అంశాలను ఆంత్రోపాలజీ, (మానవీయ శాస్త్రం) రంగంలో గొప్ప గౌరవంతో అధ్యయనం చేయడం ఈనాటికీ కొనసాగుతున్నది.

వామపక్ష భావజాలాన్ని ఎంతో ప్రభావితం చేసిన మోర్గన్ రచన, డార్విన్, మార్క్స్, ఎంగెల్స్‌ల కృషితో కలిసి మానవజాతి ఆలోచనలను శాస్ర్తియ మార్గంలో నడిపించాయి అంటారు, విశాలాంధ్ర ప్రచురణల సంపాదకులు ఏటుకూరి ప్రసాద్. పాత విశ్వాసాలను మార్చగల ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించాలని విజ్ఞాన వికాస సమితి పేరున కొందరు పెద్దలు పడిన శ్రమ విషయాలను యథాతధంగా, ఈ ప్రచురణ లోనూ అందించారు. 1987లో మొదటిసారి వచ్చిన పుస్తకానికి ఇది మలి ప్రచురణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ప్రాచ్యప్రపంచంలో కూడా మానవ సమాజ పరిణామాన్ని, వర్ణించిన రచనలు లేకపోలేదు. కానీ, అవి శాస్ర్తియ పద్ధతిలో వచ్చిన పరిశోధన గ్రంథాలుగా లేవు. కనుకనే, తరువాతి కాలానికి చెందిన ఈ రకం పుస్తకాలకు గౌరవం ఎక్కువ. మనుషులకందరికీ, ఈ మధ్యన నేనేమిటి, నా గతం ఏమిటి అన్న ప్రశ్నలు బలంగా ఎదురవుతున్నాయి. జవాబుగా మొదటి ప్రశ్నకు ఎక్కువగా, రెండవ ప్రశ్నకు అరుదుగా రచనలు వస్తున్నాయి. అరుదయిన క్రమంలో వచ్చిన ఈ ‘పురాతన సమాజం’ అన్న రచనను అందరూ చదవాలి! వీలయినవారు, ప్రాక్పశ్చిమ ధోరణుల దృష్టితో తులనాత్మకంగా కూడా చదవాలి.

మోర్గన్ స్వతహాగా పరిశోధకుడు కాదు. ప్రభుత్వ అధికారి కావాలని ప్రయత్నించాడు కూడా 1840లో అతను ఆటవిక జాతుల వారితో స్నేహం కలిపాడు. ఇరోకో లాంటి తెగల వారితో కలిసి బతికి, వారి సమాజంలో చిత్రంగా తోచిన బంధుత్వాలు, పద్ధతులను గమనించాడు. వాటి గురించి విస్తృతంగా రాశాడు కూడా!

సమకాలికుడయిన డార్విన్ ప్రతిపాదించిన పరిణామసిద్ధాంతం ముందు, ఈ సాంఘిక పరిణామ సిద్ధాంతం కొంత వెలతెలబోయిన మాట వాస్తవం. కానీ అది, సరయిన వారిని ఆకర్షించింది. లూరుూ మోర్గన్ 1879లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైనె్సస్‌కు అధ్యక్షుడయ్యాడు.

ఈ రచనలో మోర్గన్ వర్ణించిన సాంఘిక పరిణామం ఆసక్తికరంగా ఉంటుంది. ఉబుసుపోకకు చదువుకునే గ్రంథం, నవల కాదు గానీ, మానవ చరిత్రలో ఆసక్తిగలవారికి, అంతకన్నా ఆకర్షణ గలిగిన రచన. ఆటవిక దశలో మూడు, అనాగరిక దశలో మూడు అంచెలను దాటి నాగరికతకు చేరిన సమాజాల తీరును గురించి చదవడం, అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. మనిషి ఆలోచనే పరిణామానికి దారితీసిందని మోర్గన్ అభిప్రాయం. పర్యావరణ ప్రభావంవల్ల మానవవర్గాలు వేరువేరుచోట్ల చేరి వేరుగా ఆలోచించాయన్న ఆలోచనను ఈయన పక్కనబెట్టినట్లు కనబడుతుంది. ప్రపంచం అంతటా సమాజాలు ఒకే మూసలో ముందుకు సాగలేదు. ఈ సంగతి విజ్ఞులు అంగీకరించినదే.

అధికారం, ప్రభుత్వం అన్న ఆలోచనల బీజాలను గురించి ఈ రచనలో ఎంతో సమాచారం ఉంది. అది మరింత చర్చకు దారితీసింది, తీస్తుంది కూడా. అంతకన్నా ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ వచ్చి క్రమంగా మారిన తీరు వర్ణన మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఒక వ్యక్తి మరణిస్తే, అతని ఆస్తి ఆ వర్గానికి చెందేదని స్ర్తిస్వామ్యంగా బలంగా కొనసాగేదని చదివితే, యువతరం వారికి చిత్రంగా తోచవచ్చు. ఆస్తి, వారసత్వం లాంటి విషయాలన్నీ పరిచితంగా కనిపిస్తాయి. కానీ, వాటి వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర, దానికి కారణమయిన పరిస్థితులు ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి.
జీవ పరిణామం, సాంఘిక పరిణామం, సులభమయిన పరిస్థితి నుంచి గజిబిజి లేదా క్లిష్టపరిస్థితికి దారితీసిందని ఒక నమ్మకం. కొన్నిచోట్ల తలకిందులు వర్ణనలు ఎదురవుతాయి. పరిశోధకులకు అది పట్టించుకోవలసిన అంశంగా కనబడుతుంది.

అన్నా-తమ్ముడు, అక్కా-చెల్లెలు లాంటి మాటలు, సంబంధాలకు మారుతూ వచ్చిన అర్థాలు, పెళ్లి, కుటుంబం లోతులు తెలుసుకునేందుకు మొదలుపెట్టి ఈ పుస్తకాన్ని ‘సీరియస్’గా చదవాలి! మరెన్నో సంగతులు తెలిసి ఆశ్చర్యంలో మునుగుతాము!

Monday, April 23, 2012

సూర్యుని తోబుట్టువులు

మన సూర్యుడిని ఒంటరి నక్షత్రం అంటుంటారు. సూర్యుడి కాంతి దగ్గరలోని మరో నక్షత్రానికి చేరడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. అలాగని సూర్యుడు మొదటి నుంచీ ఒంటరి నక్షత్రమేనా? సుమారు నాలుగున్నర బిలియన్ సంవత్సరాల నాడు ఈ సూర్యుడు దుమ్ము, వాయువులు కలిగిన ఒక మేఘం నుంచి పుట్టిన సంగతి తెలుసు. అదే సమయంలో ఆ పదార్థం నుంచి మరిన్ని నక్షత్రాలు కూడా పుట్టాయి. అవి సూర్యుడి తోబుట్టువులు. వీటన్నిటికీ పదార్థం అందించిన ఆ ధూళి మేఘం సమసిపోయింది. కానీ, అందులోనుంచి పుట్టిన నక్షత్రాలన్నీ పోలేదు. ఈ ఆలోచనకు ఆధారాలున్నాయి. సౌర మండలం పుట్టినప్పుడు కొంత పదార్థం అక్కడక్కడ చెదిరి మిగిలిపోయింది. వాటిలోని రసాయనాలను పరిశీలించిన తర్వాత, కొన్ని సంగతులను పరిశోధకులు చెప్పగలిగారు. సూర్యుడికి ఒక కాంతి సంవత్సరం కన్నా తక్కువ దూరంలోనే మరో నక్షత్రం పుట్టిందనీ, అది మరీ పెద్దది గనుక పేలిపోయిందనీ లెక్క తేలింది.


సూర్యుడి లాంటి కొలతలు, లక్షణాలున్న నక్షత్రాలన్నీ గుంపులుగానే ఉన్నాయని ఖగోళ పరిశోధకులు గమనించారు. వందల వేల సంఖ్యలో ఈ నక్షత్రాలు చెల్లా చెదురయినట్లు కూడా గమనించారు. అంగారక శిలలు, అంతరిక్ష శిలలలోని రసాయనాలను గమనించినప్పుడు మన సూర్యనక్షత్రం కూడా ఇలాంటి గుంపులో ఉండేదన్న సూచనలు కనబడుతున్నాయి. సూర్యుడు పుట్టిన ఆ గుంపులో కనీసం వెయ్యి నక్షత్రాలు ఉండి తీరాలని పరిశోధకుల అభిప్రాయం.

పాలపుంతలో కోటానుకోట్ల నక్షత్రాలున్నాయి. వాటిలో ఈ వెయ్యి నక్షత్రాలను వెదకడం సులభమయిన పని కాదు. అందునా నక్షత్రాల చరిత్ర మనుషుల చరిత్రలాగే విచిత్రంగా ఉంటుంది. నక్షత్రాల గుంపులు పుట్టి గెలాక్సీగా విస్తరిస్తాయి. అందులోని బలాల కారణంగా నక్షత్రాలు నాశనమయ్యేవీలుంది. నక్షత్రాలు పుట్టడానికి ఆధారమయిన దుమ్ము వాయువుల మేఘమే వాటికి మొదటి శత్రువు. ఈ మేఘాలు నక్షత్రాలకన్నా కోట్ల రెట్లు ఎక్కువ పదార్థం గలవి. వాటికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కొత్త నక్షత్రాలు మరీ దూరాలకు విసిరివేయబడతాయి. ఈలోగా రకరకాల ప్రభావాలకు గురై కొన్ని నక్షత్రాలు వెంటనే పేలిపోతాయి కూడా. పుట్టిన కొత్త నక్షత్రాలు ఒక గుంపుగా ఉండటానికి వాటి మధ్య గల గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఆధారం. పేలిన నక్షత్రంలోని పదార్థం చుట్టూ చిమ్మినపుడు ఈ శక్తికి తెరలాగ అడ్డువస్తుంది. అంటే నక్షత్రాలు గుంపుగా ఉండక చెదిరిపోతాయి. ఇక వాటి మీద గెలాక్సీలోని శక్తులు పనిచేస్తాయి. మిగతా నక్షత్రాల ఆకర్షణ పనిచేస్తుంది. మొత్తానికి గుంపులోని నక్షత్రాలు చెదిరిపోతాయి. రకరకాల కారణంగా కుటుంబంలోని వారంతా చెదిరిపోయిన ‘సినిమా’ జీవితకథలాంటి పరిస్థితి ఇది!

సినిమాలో కుటుంబం ఏదో ఒక రకంగా, తిరిగి కలిసినట్లు చూపిస్తారు. సూర్యుడి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తిరిగి దగ్గరకు రాకపోవచ్చు. కానీ, అవన్నీ దగ్గరలోనే ఎక్కడో ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో పరిశోధకులు సూర్యుడి చుట్టాల గురించి లెక్కలు వేశారు. సుమారు 330 కాంతి సంవత్సరాల దూరంలో, అలనాడు సూర్యుడితోబాటు పుట్టిన నక్షత్రాలు ఉండి తీరాలని వారు లెక్క చెపుతున్నారు. సూర్యుడంత నక్షత్రం అంతదూరంలో ఉంటే, బైనాక్యులర్స్‌లో నుంచి చూడవచ్చు. కానీ ఈ లెక్కను అందరూ ఒప్పుకోవడం లేదు. నక్షత్రాలు చెదిరి ఒకదాని నుంచి మరొకటి దూరం పోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని, ఈ 330 కాంతి సంవత్సరాలు లెక్క, ఆ బలాల ముందు నిలబడదనీ అంటారు మరికొందరు పరిశోధకులు. ఉంటే, ఏవో కొన్ని నక్షత్రాలు మాత్రమే ఆ దూరంలో ఉండవచ్చునని వారి లెక్కలు చెపుతున్నాయట.

ఎన్ని నక్షత్రాలు, ఎంత దగ్గరలో ఉన్నాయన్న లెక్కలు సాగుతుండగానే, మరికొందరు వాటి కొరకు వెదకులాట మొదలుపెట్టారు. అందుకోసం హెర్మెస్ అనే ప్రత్యేక పరికరాన్ని కూడా తయారుచేయించారు. న్యూసౌత్‌వేల్స్‌లో కువాబరాబ్రాన్ అనే చోట, ఇంగ్లీషువారు, ఆస్ట్రేలియనులు కలిసి స్థాపించిన సైడింగ్ స్ప్రింగ్ నక్షత్ర పరిశోధనశాలలో ఆ పరికరాన్ని టెలిస్కోప్‌కు సాయంగా కలిపారు. ఇరవయివేల కాంతి నక్షత్రాల దూరం లోపలగల నక్షత్రాలను టెలిస్కోపులు ఊరికే చూస్తుంటాయి. హెర్మెస్ మాత్రం వాటిలోని రసాయనాల తీరుతెన్నులను కూడా గమనిస్తుంది. మన చుట్టాలను మరో దేశంలో వెతకాలంటే భాష, సంస్కృతి ఆధారంగా వెదికినట్లు ఉంటుంది ఈ అన్వేషణ.

కనిపించిన ప్రతి నక్షత్రంలోనూ ఇరవయి అయిదు రకాల రసాయనాల తీరును గురించి ఈ పరికరం వివరాలను గమనిస్తుంది. వాటి ఆధారంగా నక్షత్రం పుట్టుక రహస్యాలు అర్థమవుతాయి. ఇదే దారిలో సూర్యుడిని పోలిన రసాయనాలున్న నక్షత్రాలు కనబడితే, అవి తప్పకుండా సూర్యుడి తోబుట్టువులుగా గుర్తింపబడతాయి. పది సంవత్సరాలపాటు కష్టపడితే, మనం వెతుకుతున్న రకం చుక్కల హద్దులు తెలిసే వీలు ఉండవచ్చునంటారు పరిశోధకులు. అక్కడితో కథ ముగిస్తే బాగానే ఉంటుంది. నక్షత్రాలు ఎంతగా విసిరివేయబడినా, వాటి కదలికలో కూడా సూర్యుడికి పోలికలు ఉంటాయి. నక్షత్రాల దారులను గమనించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీవారు వచ్చే సంవత్సరం గైయా అనే అంతరిక్ష నౌకను పంపుతున్నారు. అది తీసిన కదలికల కొలతలకు, హెర్మెస్ రసాయనాలు కొలతలకు పొంతన కుదరాలి. రెండు పరీక్షలలో నిలిచినవి, గెలిచినవీ మాత్రమే సూర్యుడితో సహా పుట్టిన నక్షత్రాలు అనిపించుకుంటాయి.

ఈలోగా సూర్యుని చుట్టాల కొరకు మాత్రమే కాక, మొత్తంమీద లక్ష నక్షత్రాలను గమనించి, రసాయన సమాచారాన్ని కూడా సేకరించే మరో పరిశోధన న్యూమెక్సికోలో మొదలుకానుంది. అందులో అనుకోకుండా ‘మన’ సూర్యుడు లాంటి, ‘మన’ నక్షత్రాలు తగలవచ్చు. ఈ పరీక్షలో నక్షత్రాల వయసులను కూడా అంచనా వేయనున్నారు. సూర్యుడిలాంటి రసాయనాలు, కదలికలతోబాటు, అదే వయసున్న నక్షత్రాలు కనబడితే అవి తప్పకుండా ‘మన’ నక్షత్రాలే అనక తప్పదు. వాటిని కనుగొన్నందుకు ఏం దక్కుతుందని ఎవరికయినా అనుమానం రావచ్చు. ముందు సూర్యుడు, సౌరమండలం ఏర్పడిన తీరు మరింత అర్థమవుతుంది. ఆయా నక్షత్రాల గ్రహాల మీద, జీవం ఉండే వీలు కూడా ఎక్కువగా ఉంటుంది.

మొత్తానికి ఇదంతా మనలాంటి వారి గురించి వెదుకులాటలో భాగమా?

Tuesday, April 17, 2012

వికాసం - ఎప్రిల్ 11

ఏదయినా సాధించవచ్చా?


పెద్దవాళ్లు మంచి మాటలు చెపుతారు. పుస్తకాలలో చాలా మంచి మాటలు ఉంటాయి. మనుసులో ఏం భావించి వాళ్లు ఆ మాటలు చెప్పి ఉంటారన్నది గుర్తించకుండా, గుడ్డిగా ఆ మాటలను అనుసరించడం అంత తెలివయినపని కాదు. ఆ మార్గంలో ముందుకు సాగడానికి మనలోగల శక్తిని కూడా అంచనా వేసుకోవాలి. కలలు కనండి, అన్నారొక పెద్దాయన. ఆయన కలలుగని వాటిని నిజం చేసుకున్నారు. ఆయనలో ఆ శక్తి ఉంది. మనం కలలు కనడం మొదలుపెడితే, ఆ కలలతోనే సరిపుచ్చుకుంటామేమో!

‘తలచుకుంటే ఏవయినా సాధించవచ్చు. కావలసిందల్లా గట్టి కృషి’ అని ఒక సూక్తి. ఈ మాటను బలంగా నమ్మి ముందుకు సాగిన వారిని మనం గమనించి ఉంటాము. ఒక అబ్బాయికి క్రికెట్‌మీద బలమైన నమ్మకం. తప్పకుండా తాను గొప్ప క్రికెటర్ కావాలనుకుంటాడు. టీవీలో క్రికెట్ రాని కాలంలోనే కుర్రవాళ్లు, వారి తలిదండ్రులు క్రికెటర్లను ఆదర్శంగా చూడడం మొదలయింది. ఈ ఒక అబ్బాయి ‘అందరిలో ఒకడు’ కాకుండా, సిన్సియర్‌గా క్రికెట్ ప్రాక్టీసు చేశాడు. ఆటలను విద్యార్థి భావంతో పరిశీలనగా చూచాడు. క్రికెట్ గురించిన పుస్తకాలన్నీ చదివాడు. వీలయినప్పుడంతా కోచింగ్ క్యాంపుకు కూడా వెళ్ళాడు. గొప్ప క్రికెటర్ కావడానికి చేయవలసిన కృషినంతా చిత్తశుద్ధితో చేశాడు. కానీ, అతను యూనివర్సిటీ టీమ్‌కు కూడా ఎంపిక కాలేదు. సంవత్సరాలపాటు సాగిన కృషి ఆ ఆనందంతోనే ఆగిపోయింది. నిరాశావాదంగా తోచినా, ఇది నిజం. అనుకున్న వాళ్లందరూ ‘గొప్ప’ గాయకులయ్యారా? ‘గొప్ప’వారంటే ఎవరు? మన ఊళ్ళో ‘గొప్ప’ అనిపించుకున్న గొప్పవారే కదా?


కృషి ఉంటే మనుషులు ఏదో అవుతారన్నది నిజమే. జీవితంలో, ఉద్యోగంలో ఈ మాట ఆధారంగా కలలుగనేవారు బోలెడంత మంది. ఒకదారిని ఎంచుకునే ముందు, ఫాన్సీగా కాక వాస్తవంగా ఆలోచించి, మనకు మరింత మంచి దారి మరొకటి ఉందేమో గమనించగలగాలి. క్రికెట్ అబ్బాయికి, చదరంగం, చదువు కూడా బాగా వచ్చును. కానీ క్రికెట్ పేరు మీద అతను వాటిని పక్కకు పెట్టాడు.


ఒక సంస్థలో ఒకరు బాగా పనిచేస్తూ, మరింత పెద్ద స్థాయిలోకి ఎదగాలని అనుకోవడం మామూలే. మార్కెటింగ్‌లో బాగా పనిచేస్తూ, మేనేజర్ కావాలనుకుంటూంది ఒక అమ్మాయి. మంచి మానేజర్లను బాగా గమనిస్తుంది. వారితో మాట్లాడి ఎంతో నేర్చుకుంటుంది. తమ వ్యాపారం గురించి, ప్రొడక్ట్స్ గురించి ఎంతో చదువుతుంది. తిండి, ఆరోగ్యం, కుటుంబాలను కూడా పక్కన బెట్టి, మరీ కష్టపడి పనిచేస్తుంది. అలా చాలాకాలమే గడుస్తుంది మేనేజర్ కావాడానికి, ఇది చాలదని, మరేదో ఉండాలని, అప్పుడు ఆమెకు అర్థమవుతుంది. పడిన కష్టం వృధా కాదుగానీ, తన పనిమీద మరింత ధ్యాస పెట్టి ఉంటే మరో రకంగా మంచి జరిగి ఉండేదేమో? మేనేజర్ కాలేకపోవడానికి కారణాలు, అర్థమయినా లాభం లేదుగదా ఇప్పుడు? బాగా సాగుతున్న, తన పని, అందులో వచ్చిన మంచి పేరు, ఈ లోపల మరుగున పడిపోయినట్లు అర్థమవుతుంది.


ఆఫీసుగానీ, కంపెనీగానీ ఆదాయం, హోదా, బాధ్యతలు పెరగాలంటే, అంతవరకు అలవాటులేని పనులు చేయవలసి రావడం, అందరమూ గమనిస్తూనే ఉన్నాము. రాయడానికని పనిలో చేరిన వ్యక్తిని, ఆఫీసర్‌గా, అధికారిగా చేస్తే, సృజన తగ్గుతుంది. తలనొప్పి పెరుగుతుంది. రాత కొనసాగదు. కొనసాగితే నిజంగా మంచి ప్రగతి సాధిచే వీలుండేదన్న భావం మిగిలిపోతుంది.
మనిషికి కొన్ని పనులు చేతనవుతాయి. కొన్ని అంత బాగా చేతగావు. ప్రపంచంలోని మనుషులంతా ఈ చేతగాని పనులమీద కేంద్రీకరించి కష్టపడుతుంటారు. తలిదండ్రులకు తమ పిల్లల చదువు విషయంలో ఈ భావం మరీ ఎక్కువ. లెక్కలలో తక్కువ మార్కులు వచ్చిన వారికి లెక్కల ట్యూషన్ పెట్టించడం బాగానే ఉంది. కానీ ఆ పిల్లలకు బాగా వచ్చిన అంశాల గురించి మరింత శ్రద్ధ తీసుకుంటే, మెరుగులు పెడితే, అద్భుతాలు వీలవుతాయేమో? పిల్లలలో గానీ, యువకులలోగానీ, ఎక్స్‌లెన్స్ కనిపిస్తే, దాన్ని పట్టించుకునే తీరిక, ఓపిక ఎవరికీ లేదు. వచ్చిన పని ఎలాగూ వచ్చింది. కనుక దాన్ని వదిలేయడం మన పద్ధతి! మేనేజర్ కావడానికి కావలసిన లక్షణాలు కొన్ని నాలో లేవు. లేదా, నాకు లెక్కలు రావు. ఈ లేని, రాని లక్షణాలను గురించి జీవితమంతా శ్రమ పడుతుంటే, కొంత మెరుగవుతానే తప్ప ఎక్స్‌లెన్స్ కుదరదు. ఒక టెండూల్కర్, ఒక ధోనీ మంచి క్రికెటర్లుకాగలిగారు. మంచి టెన్నిస్ ప్లేయర్, మంచి సింగర్ కాలేదని గుర్తురాదెందుకు?


ఈ మాటలు ‘నీళ్లుగార్చేవిగా’, ‘నిరుత్సాహపరిచేవిగా’ ఉంటాయని తెలుసు. ఏదైనా సాధించవచ్చని మనమంతా గట్టిగా నమ్ముతాము మరి. ‘ఇసుకలో తైలము తీయవచ్చు’ అన్నారంటే, ఆ పనయినా వీలవుతుందేమోగానీ, మూర్ఖుని మనసు రంజింపచేయడం వీలుగాదని చెప్పడానికి మాత్రమే. ఏడారిలో నూనె బావులు తవ్వి, చమురు తీస్తున్నారని సర్ది చెప్పుకుంటే అదొక మార్గం!


ప్రతి వ్యక్తిలోనూ, కొన్ని విషయాలలో విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తిమ్మిని బమ్మి చేయాలనుకుంటే అదొక పద్ధతి. ఈ తిమ్మిలోనే మరింత తిమ్మిగా మారాలనుకుంటే మరొక పద్ధతి. మనకు మూగ బతుకులు అలవాటయ్యాయి. టాలెంట్‌ను పెంచి గొప్పపనులు చేయడంకన్నా అందరూ నడుస్తున్న తోవలోనే మరిన్ని కాసులు రాల్చుకుంటే మేలు, అన్న భావం బలిసింది. కాసుల ఆనందం, కొంత కాలానికి పలచనవుతుంది. అప్పుడు, ‘అయ్యో అదేదో వదిలేసి వచ్చాము!’ అన్న భావం కలుగుతుంది.


‘ఏదైనా సాధించడం వీలుగాదు. కృషి చేసి, ఉన్న టాలెంట్‌ను ఎంతో పెంచవచ్చు!’




అసలుమాట
‘నాకు వక్తలను పరిచయం చేయడం, అంత గొప్పగా చేతకాదు. కానీ మా ముఖ్య అతిథికి మంచి ఉపన్యాసం చేయడం చేతగాదు కనుక ఫరవాలేదు!’
-అజ్ఞాత విజ్ఞుడు
అలాంటి ముఖ్య అతిథి ఎందుకు? వారికొక పరిచయం ఎందుకు?
====

ఉన్నదీ, లేనిదీనూ!

‘‘భార్య అంటే జీవితమంతా చూస్తూ ఉండవలసిన వ్యక్తి. అందుకని, ఆమె అందంగా లేకుంటేనే బాగుంటుందనుకుంటాను’’ అన్నాడు జియోన్ వాసి జింటా. అతను నిజంగానే అన్నాడో, మధ్యలో మరెవరయినా కల్పించారో తెలియదు గానీ ఈ మాటను అంత సులభంగా పక్కనబెట్టడానికి లేదు. అందమయిన స్ర్తిలయినా, అందమయిన ఆలోచనలయినా ఒకటే పద్ధతి. వారి, వాటి గురించే పట్టించుకుని మనసు పారేసుకుంటే, త్వరలోనే ఆ మనిషిమీదా, ఆ ఆలోచనమీదా, అభిప్రాయాలు మారిపోతాయి. విసుగు మొదలవుతుంది. ఈ సంగతి నా స్వంత అనుభవంతో చెప్పగలను.

ఒక వేసవిలో నేను మాత్సుషిమా వెళ్లాను. మొదట అక్కడి అందాలను, ప్రకృతినీ చూచి ముగ్దుడనయ్యాను. ఆనందంతో చప్పట్లు చరిచాను. ‘మంచి కవిని వెంటతెచ్చి ఉంటే, పాటలు రాసేవాడు గదా’ అనుకున్నాను. కానీ, ఉదయం నుంచి సాయంత్రం దాకా అక్కడే గడిచిన తర్వాత, నాకు ఆ దీవిలో కంపు ఉందని తెలిసింది. అంటే తోచిందని అర్థం. దీవిలో అది నాచువల్ల వచ్చిన వాసన. నాకు వెళ్లదగిన మిగతా ప్రాంతాలు గుర్తుకురాసాగాయి. మాత్సుయామాకు వెళ్లి ఉండవలసింది అనిపించింది. పడుకుని మరుసటి ఉదయం లేచిన తర్వాత మవుంట్ కింకాలో సూర్యోదయం మరింత బాగా ఉంటుందనిపించింది. షిమోగామాలో పళ్లవాసన మనసులో మెదిలింది. సాయంత్రం చంద్రుడు ఒషిమాలోనయితే మరింత బాగుంటాడనిపించింది.

ఇక్కడ నాకు మిగిలిందల్లా బీచీలో ఏరినరాళ్లు, వాటితో పిల్లలాటలు ఆడడం!

-ఇహారా షికాకూ రాసిన పుస్తకం నుంచి

పున్నమతో పెరిగే వెర్రి

మీకు అంతకుముందు వెర్రి లేకున్నా ‘కొలవెరి’ పాట విన్న తరువాత కొంతయినా పుట్టి ఉండాలి. కొల అంటే హత్య. వెర్రి అంటే వెర్రి, పిచ్చి, తిక్క, వగైరా.. వగైరా! ఈ వెర్రి, పిచ్చి, తిక్కలను ఇంగ్లీషులో లూనసీ అంటారని తెలిసే ఉండవచ్చు. అంటే చంద్రుడికీ తిక్క ముదరడానికీ ఏదో సంబంధం ఉందని ఈమాట ద్వారా ధ్వనిస్తుంది. లూనసీ అనే మాటకు, ‘చంద్రుని కళలను బట్టి మారుతుందని నమ్మకం గల పిచ్చి’ అని నిర్వచనం రాశారు... ప్లైనీ ద ఎల్డర్ అనే పాతకాలపు రోమన్ శాస్తవ్రేత్త. పిచ్చికి, చంద్రునికి సంబధం ఉందని ఆ కాలంలోనే రాశాడు. పున్నమ రోజుల్లో, రాత్రిపూట తేమ బాగా పెరుగుతుంది, కనుక మెదడులో కూడా ఏదో రకంగా తేమ ఎక్కువవుతుంది. కనుక ఆ సమయంలో మూర్ఛ, తిక్క ముదురుతాయన్నాడు ప్లైనీ. కానీ అదంతా అతని ఊహ, నిజం కానేకాదు. అయినా నేడు ప్రపంచంలో చాలా మంది వైద్యులతో సహా పిచ్చికి, చంద్రునికీ సంబంధం ఉందని నమ్ముతున్నారు. పిచ్చాసుపత్రి డాక్టర్లకు ఈ నమ్మకం మరీ ఎక్కువగా ఉందని యుఎస్ పరిశీలనలో బయపడిందట.
పరిశోధనల్లో మాత్రం ఈ సంబంధం గురించిన సూచనలు ఎక్కడా కనిపించలేదు.


పున్నమ, అర్ధచంద్రుడు, అమావాస్య, మరో అర్ధచంద్రుడు, తిరిగి పున్నమ రావడానికి నెలకన్నా తక్కువకాలమే పడుతుంది. కానీ, మిగతా నెలలో లేనంతగా, మనుషుల కారణంగా అపాయాలు, మాదక ద్రవ్యాల వాడకం, కిడ్నాపింగ్‌లు, హత్యలు, ప్రకృతి వైపరీత్యాలు, పిచ్చాసుపత్రిలో అడ్మిషన్లు, ఆత్మహత్యలు మొదలయినవి ఈ పూర్ణిమ సమయంలో ఎక్కువగా జరుగుతాయని నమ్మకం. పౌర్ణమిరోజుల్లో జనం మామూ లు కంటే ఎక్కువ తిండి తింటారని ఒక నమ్మకం ఉంది! గడిచిన యాభయి సంవత్సరాలుగా ఈవిషయాల గురించి ఎంతో పరిశోధన జరిగింది. అక్కడో, ఇక్కడో చందమామకు, మనిషి మెదడుకు సంబంధం ఉందన్న సూచనలు కనిపించాయి కూడా. అలా కనిపించినచోట్ల కూడా మరింత విశదంగా, లోతుగా పరిశోధిస్తే అంతా అబద్ధమని తేలిపోయింది. కానీ, ఈ సంగతులు పరిశోధన పత్రికలకు పరిమితంగా మిగిలాయి. మనకు తెలిసిన పత్రికలకూ, టీవీలకు ఈ రకం సంగతులను చర్చించేంత ఓపిక, తీరిక లేవు!

పట్టించుకునే వారికి, ఈ విషయమై చిత్రమయిన సంగతులు మెదడులో మెదిలే వీలుంది. ఇప్పుడు ఊరూరా కరెంటు దీపాలు వచ్చాయి. పున్నమకీ, చీకటి రాత్రులకు తేడా తెలియదు. పట్టణాలలో నిత్యం పున్నమలాగే ఉంటుంది. కానీ, ఇంతగా లైట్లు లేని కాలంలో ప్రజలు పున్నమిరాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండి ఉంటారు. అమావాస్యనాడు కూడా ఇంతో, అంతో కనిపిస్తుంది. కానీ ఆనాటి వెలుగుకన్నా పున్నమ నాడు వెలుగు 250 రెట్లుఎక్కువ. అందుకే గతంలోనయినా, ఇప్పుడు కూడా అంతగా కరెంటు దీపాలులేని చోట్లనయినా, పున్నమిరాత్రి అంటే ప్రత్యేకం. ఒక పార్టీ, కథాకాలక్షేపం, సరదాలకు అనువయిన దినమదే. చీకటి దినాలలో ముడుచుకుని పడుకునేవారు పండు వెనె్నల వచ్చిందంటే, బయట చలాకీగా తిరుగుతారు, తింటారు, ఆడతారు. కొంచెం పిచ్చిగా ఉంటారు! ఆ సమయంలో, కొందరు ధైర్యంగా అడవిలోకి బయలుదేరవచ్చు. మరోరకంగా దూసుకుపోయే ప్రయత్నాలు చేయవచ్చు. ఎక్కువమంది, ఎక్కువగా బయట తిరుగుతున్నారంటే, ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. తినడం, తాగడం, ఆ వెన్నెలలో ఎక్కువగా సాగినా వింత లేదు. ఆ తర్వాత కొంత అరాచకపు సంఘటనలు జరుగుతాయన్నా అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువమంది మనుషులు, ఎక్కువ సేపు బయట తిరిగితే, ప్రమాదాలు, ప్రయోగాలు అన్నీ ఎక్కువే కదా! కానీ, మన ఈ ప్రస్తుతపు సాంకేతిక ప్రపంచంలో పగలు, రాత్రీ ఒకేరకంగా వెలిగిపోయే నగరాలలో కూడా పూర్ణచంద్రుడు, మనుషులకు తిక్క, పిచ్చి, వెర్రి ముదిరేలా ప్రభావం చూతున్నాడా? ఆసుపత్రుల్లో ఆ రోజున ఎక్కువమంది చేరుతున్నారా? ప్రపంచంలో అంతటా చంద్రుని ప్రభావం ఒకేలాగా కనపడుతున్నదా? పరిశోధకులు ఈ రకం అంశాలను పట్టించుకోకుండా వదలలేదు. ప్రపంచమంతటా పట్టుదలగా పరిశోధనలు చేశారు. పిచ్చికీ, చంద్రునికీ సంబధం లేదని తేల్చి చెపుతున్నారు.

చంద్రుని కళలకు, భూగోళానికి, దాని మీదనున్న సముద్రాలకు సంబంధం ఉందని మాత్రం అందరికీ తెలుసు. సముద్ర ప్రాంతాలలో ఉండేవారికి, ఆటుపోట్ల సంగతి బాగా తెలిసి ఉంటుంది. సూర్యచంద్రుల గురత్వాకర్షణ శక్తి కారణంగా సముద్రంలో నీరు, ఒకప్పుడు పొంగి తీరానికి వస్తుంది. మరొకప్పుడు అలలు వెనక్కు వెళుతుంటాయి. అంటే, భూమి కదలికల మీద, నీటి కదలికల మీద సూర్యచంద్రుల ప్రభావం ఉంటుంది. మన శరీరంలో కూడా ఎక్కువగా ఉండేది నీరే. కనుక ఈ నీటి మీద చంద్రుని ప్రభావం ఉండి తీరాలంటారు కొందరు.

సముద్రాలు చాలా పెద్దవి. వాటిలో చాలా నీరుంది. అక్కడ నీటికి బదులు ద్రవ రూపంలో పాదరసం, హైడ్రొజన్ లాంటి మరే పదార్థం ఉన్నా, అలలలో క్రమంగా మార్పు రానే వస్తుంది. ప్రభావానికీ, నీటికీ ప్రత్యేకమయిన సంబంధం లేదు. ఆటుపోట్లు సముద్రంలో మాత్రమే కనబడతాయి. చెరువులు, గుంటల్లో కనబడవు. అంతకన్నా మరీ తక్కువ నీరుండే మనిషి శరీరంలో చంద్రుని ప్రభావం అంతగా ఉండే వీలు లేదని పరిశోధకుల అభిప్రాయం. సముద్రంలో అలలు ఎప్పుడూ ఉంటాయి. గురుత్వాకర్షణ ప్రభావంకూడా ఎప్పుడూ ఉంటుంది. భూమి కదలిక, తిరగడం లాంటి ఎన్నో అంశాల కారణంగా అలల తీరులో మార్పులు వస్తాయి.

మనుషులమయిన మనం చీకటిలోనయినా, వెనె్నలలోనయినా పిచ్చిపనులు చేస్తూనే ఉంటాము. పున్నమనాడు మాత్రం, కిటికీలోనుంచి చూస్తే చంద్రబింబం కనబడుతుంది. ఆనాడు జరిగిన అన్ని సంగతులకూ చంద్రుడే కారణమని అనాలని అనిపిస్తుంది. చేసే ప్రతి పనికీ, జరిగే ప్రతి సంఘటనకూ సంబంధం లేని కారణాలు వెదతకడం మనిషికి చిరకాలంగా అలవాటయిపోతుంది. అది సంస్కృతిలో భాగమయింది. వెలుతురు లేని రోజుల్లో వెన్నెలను చూచి, ఆనాడు మరింతకాలం గంతులు వేసి ఉంటాము. అలవాటుకొద్దీ ఇప్పుడూ అదే పని చేసేవారెవరైనా ఉన్నారేమో? కొత్త బతుకులలో మనకు పగలే వెన్నెలలో జగమే ఊయల! ఇదే మన పిచ్చి, వెర్రి, తిక్క! అదీ చంపేయాలన్నంత!

Monday, April 16, 2012

నేను తిరిగిన దారులు - సమీక్ష


రచన: వాడ్రేవు చినవీరభద్రుడు
ప్రతులకు:
విజయశ్రీ, 96, నవోదయ కాలనీ,
మెహదీపట్నం,
హైదరాబాద్ -28.
పేజీలు: 208,
వెల : రూ.100/-

తెలుగులో యాత్రా ఛరిత్రలు కొత్త కాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రాచరిత్ర నుండి ఇటీవలి దాకా చాలాకాదు గానీ, కొన్ని రచనలు ఈ పంథాలో వచ్చాయి. వస్తున్నాయి. ఇతర దేశాలు తిరిగి చూచిన వారు ఈ రకం రచనలు ఎక్కువగా చేస్తున్నారనవచ్చు.

‘నీవు స్వగృహాన్ని వదిలిన ప్రతిసారీ యాత్రీకుడివయినట్టే!... పోయి రాగానే నీలో ఎంత కొత్త రక్తం ప్రవహిస్తుందని!... మళ్లా గృహోన్ముఖుడివయినప్పుడు ఒట్టి మనిషిగాకాక మహా మానవుడిగా తిరిగి వస్తావు’ అంటారు ఈ పుస్తకం రచయిత ఒక వ్యాసంలో. ఇంతటి భావుకుడు, కవి, రచయిత, ప్రపంచం గురించి బాగా చదివిన మనిషి, బయలుదేరితే, ఆలోచనలు అలలుగా వస్తాయి. వచ్చాయి. వాటికి అక్షర రూపమే ఈ వ్యాసాలు. కలిసి ఈ ‘నేను తిరిగి దారులు’. ఇంగ్లండ్‌లో, దిల్లీలో, మన రాష్ట్రంలోని క్షేత్రాలు, ప్రదేశాలలో తిరిగి తర్వాత రచయిత తమ భావాలను, యాత్రావర్ణనలుగా పాఠకులకు అందించారు. యాత్రాచరిత్రలు వ్యక్తి స్వీయ అనుభవాలు. మరి ఒకటిరెండుచోట్ల రచయిత, కథ పద్ధతిలో మరెవరి నోటనో తమ అనుభవాలను పలికించారు. అది ఒకందుకు బాగుందేమో గానీ, మొత్తం రచన, భావాలలో కథకున్న కాల్పనికత అనే లక్షణం మారుతుందేమో? సాధారణంగా రచయితలెవరూ కథను పూర్తి వాస్తవమని చెప్పరు. చదివే వారికి మాత్రమే వాస్తవంగా కనిపిస్తుందది! ఇక్కడ రచనలోని బలమే బాగా ముందుకు వచ్చింది! అంతా వాస్తవమని తెలుస్తూనే ఉంది. అన్ని వ్యాసాలూ కథల లాగ నడవలేదనేది మరో అంశం.

ఈ పుస్తకంలో యాత్రాకథనాలు మూడు. నిజంగా కథనాలవి. వాటిని చదివిన తర్వాత ఆ ప్రదేశాలకు బయలుదేరాలన్న కోరిక పాఠకులలో బలంగా కలుగుతుంది. అరకు, శ్రీశైలం, పాపికొండల గురించి ఎనె్నన్ని విశేషాలు. ప్రదేశం భౌగోళిక విశేషాలకన్నా, మనుషుల గురించి చేసిన పరిశీలన, వ్యాఖ్యలు రచయిత వ్యక్తిత్వాన్ని మనముందు ఉంచుతాయి. ఆయన సాహిత్యప్రేమ, అభినివేశాలు అక్కడ అదనపు బలంగా, మరింత ఆసక్తి కలగడానికి కారణాలవుతాయి. పాతాకొత్తా మేలుకలయిక, అజేయమయిన మానవ జీవితేచ్ఛ అంటూ భారతీయ అనుభవాన్ని వర్ణించారు రచయిత!

తరువాతి ఆరు రచనలు ‘యాత్రానుభవాలు’అనే శీర్షిక కింద వస్తాయి. వీటిలో కథనం కొంత సూటిగా సాగినా, నాటకీయతకు లోటు రాలేదు. గోదావరి ఎక్కడ అని వెతికి, నిరాశకు గురయినా, అమ్మవారి గుళ్లో దర్శనం సరిగ్గా జరగకున్నా, మధురలో మానవత గురించి మనసులో మెదిలినా రచనలు పట్టుగా చదివించేవిగా సాగాయి. ఇక ఇంగ్లాండ్ గురించిన రచన కవితాత్మకంగా మొదలవుతుంది. కానీ, సంస్కృతి, సాహిత్యం, కళలు మొదలయిన అంశాలతో, అదొక సమాచార పూరిత పరిశోధన వ్యాసంలాగ సాగుతుంది. నిడివి కూడా మిగతా వాటికన్నా ఎక్కువ. బిగుసుకుపోతారనుకున్న ఇంగ్లీషువారిలోనూ ఈ రచయితకు చాలా మంచితనం ఎదురయింది. ఆసక్తిగల వారికి ఈ వ్యాసంలోనూ ఎన్నెన్నో విశేషాలు!

దిల్లీ లేదా ఢిల్లీ, మధుర, తుల్జాపూర్, త్రయంబకం లాంటి చోట్ల తిరుగుతుంటే హిందీ తెలియకపోవడం గుర్తుకువచ్చిందీ రచయితకు. నిజం కదూ! అదొక సమస్యే మరి!

టూరిజంలో ఒక చిక్కు, ట్రిక్కు ఉన్నాయి. ప్రదేశాలను గురించి పుస్తకాలలో చదివి, బొమ్మలు చూచి, ఏవేవో ఊహించుకుని అక్కడికి వెళితే, చాలాసార్లు నిరాశ కలుగుతుంది. కొన్నిచోట్ల అనుకున్నదానికి మించి ఏదో ఎదురవుతుంది. ఈ విషయాలు ఈ రచనల్లో చెప్పకుండానే మనముందుకు వస్తాయి. అరుణగిరి దర్శనంలో స్థలంకన్నా ‘చలం’ (గుడిపాటి వెంకటచలం) ఎక్కువగా కనిపించడం, రచయిత గురించి మనకెంతో చెపుతుంది.
వీరభద్రుడుగారు చేయితిరిగిన రచయిత. యాత్రీకులు, అలమికుంటుండగా, మర్మరధ్వని, వెయ్యికాళ్ల కొండచిలువ, ఓస్మానాబాద్, అమరుశతకం, దివాన్ అయ్యాడు లాంటి మాటలు ఎందుకు వాడుకున్నారో అర్థంకాలేదు.

నదీనదాలు, అడవులు, కొండలు అని ఉపశీర్షికగా అచ్చువేశారు. కానీ వాటికన్నా బలంగా ఈ పుస్తకంలో మనుషులు ఎదురయి పలకరిస్తారు. మీరూ వారిని పలకరించండి!

- గోపాలం కె.బి.

Friday, April 13, 2012

ఏముంది - కవిత


ఏముంది


చెప్పవలసింది చాలనే ఉంది
ఆ ఊరిగురించి చెప్పాలె
నా పేరు గురించి చెప్పాలె
అశలు ఆశయాల గురించి చెప్పాలె
అందని అంచుల గురించీ చెప్పాలె
ఉన్నది ఉన్నట్టు చెప్పాలె
తెట్టెను కదిలిస్తే తేనెటీగలు
మిమ్ములను కూడా కుట్టిపెడతయి
బాలసంతువానికిచ్చి
దో ఆనాకు కొన్నరంటే అర్థమవుతుందా
బడికి వెల్లి కూచుంటే
బలవంతంగా ఇంటికి తెచ్చారంటే అర్థమవుతుందా
అక్కడనే మొదలయింది వైరుధ్యం
ఇంటిపేరు ఎందుకు వచ్చిందో తెలువదు.
తాతగారు ఏం చేసేవారో తెలువదు
తెలిసింది చెప్పుదామంటే
ఎక్కడ మొదలుపెట్టాలె
నా చాటభారతం నాకే నచ్చనట్టుంది
అనుకుంటే అంతా ఆనందమే
కాదనుకుంటే ఇంతవరకు ఎట్లా వచ్చాను
అనుభవాలకు సొంత రంగులు ఉండవు
నేనూ సంతోషంగా బతికినట్టే గుర్తు
నేటికీ పెదవులతో పాదులు తవ్వి
కన్నీటితో తడిపి
చిరునవ్వులు నాటుతున్నాను
బాగానే పూస్తున్నయి
కనుకనే చెప్పేందుకు
ఏదో ఉంది

Wednesday, April 11, 2012

Tuesday, April 10, 2012

అంతా చెత్త!

మూర్తి తల వంచుకుని దిగులుగా కూచుని వున్నాడు. అతను నిజానికి చలాకీ కుర్రాడు. కష్టపడి పనిచేస్తాడు. సుభాషిణి అక్కడికి వచ్చింది. ఆమెను ఆఫీసులో అందరూ చిన్నబాసు, చిన్నభాషిణి అంటారు. అందరితోనూ కలుపుగోలుగా ఉంటుంది మరి! తాను సీనియర్‌నన్న సంగతి ఆమె పట్టించుకోదు.

సుభాషిణి: ఏం వాయ్ మైడియర్! ముఖం వేల వేశావు? నిన్నటి మీటింగు ఎలా నడిచింది?
మూర్తి: గుడ్ మార్నింగ్! మీటింగా? ఆఁ ఏదో! నడిచింది. అంతే!
సుభాషిణి: చూస్తేనే అర్థమయింది. పరుగెత్తలేదని, ఏమయింది?
మూర్తి: ఏముందీ, మామూలే, ఆయన ఎలాగూ ఉగ్రమూర్తి. పెద్ద బాసు ఎవర్ని నములుదామా అని ఎదురుచూస్తుంటాడు. పోనియ్యండి. ఎందుకిప్పుడు?
సుభాషిణి: చాలా కష్టపడి ప్లాన్ తయారు చేసినట్టున్నావు? ఏమన్నాడు దాని గురించి?
మూర్తి: ఏముందండీ, ఆయనను ఎవరు మెప్పించగలుగుతారు? నేను కష్టపడి, తెలివిగానే పనిచేశాను. ఆ మాట నేను అనుకుంటే చాలా? ఆయన అనుకోవద్దూ?
సుభాషిణి: ఏమన్నాడాయన ఇంతకూ?
మూర్తి: ‘మొత్తం చెత్త’ అన్నాడు.
సుభాషిణి: నీవు రాసిన ప్లాన్‌లు నేను చూసాను ఇంతకుముందు. ఈ సారి కుదరలేదుగానీ. బాగా రాస్తావు. ఎందుకని ఆయనకు అంత చెత్త అనిపించిందో. ఇంతకూ ఏమన్నారాయన?
మూర్తి: ఏముందీ! పనికివచ్చే ఆలోచనలు కావు. అమలు చేయడం కష్టం.. అలాంటివేవో!
సుభాషిణి: నిజంగానా!
మూర్తి: ఆయన తీరు చూస్తే, నచ్చనిది నా పనా? లేక నేనా? అర్థం కాలేదు. చచ్చీ చెడీ పనిచేస్తే, ‘అంతా చెత్త’ అంటే, నాకు మాత్రం చచ్చే కోపం వచ్చింది. నా కష్టమంతా కాలువలో పోయింది!
సుభాషిణి: కోపం వస్తుంది, ఎవరికయినా? మరేమయింది తర్వాత?
మూర్తి: ఏమీ లేదండీ. ఆయనకు నా మీద ఏదో ఉంది!
సుభాషిణి: అంటే ఆయనకు నీ మీద తప్ప, నీ పనిమీద కోపం కాదనేనా, నీవనేది?
మూర్తి: బాగా చెప్పారు. నాకు ఈ మాట ఇప్పుడు అర్థమయింది!
సుభాషిణి: నేను అర్థం చేసుకోగలను. ఆయన మరీ తీవ్రంగా మాట్లాడితే, మనసు గాయపడి తికమకపడిపోయి ఉంటావు.
మూర్తి: ఏం పడ్డానో నాకే గుర్తు లేదు. నాకేమీ అర్థం కాలేదంటే నమ్మండి!
సుభాషిణి: ఒక్క క్షణం. ప్లాన్ పనికిరాదంటే ఏమిటి అర్థం? ఆ మాటకు ఏమని జవాబు చెపుతాము? అదొక జనరల్ కామెంట్ లోపం ఏమిటో ఎందుకు చెత్తో ఒక్క ముక్క చెప్పారా ఆయన? నీవయినా ఆ సంగతి అడిగావా? బాగాలేదంటే, ఏం బాగాలేదో అడిగే పనిలేదా?
మూర్తి: నిజమేనండీ! బాగా చెప్పారు చిన్నబాసూ! నాకు బుర్ర ఖాళీ అయింది. కళ్లు తిరిగాయి. ఇలా అడగవచ్చునని తోచనే లేదు! నమ్మండి!
సుభాషిణి: నిజమేనయ్యా! అలాగే ఉంటుంది. కష్టపడి, చెప్పిన పని చేసుకుని వెళ్లావు. శభాష్ అంటారనుకుంటే, తిక్క కుదిరింది. అట్లాగని తల వంచుకుని తిరిగి రావడమే?
మూర్తి: బాగా తెలుసుకున్నారండీ. ఆయన ముందునుంచి బయటకు వస్తే చాలనిపించింది. లేకుంటే ఏమని తల మీదకు తెచ్చుకుంటానో తెలియలేదు.
సుభాషిణి: చూడూ! అందరూ ఆయనకు ఉగ్రమూర్తి అని పేరు పెట్టనే పెట్టారు. ఆయనకు నీ మీద ప్రత్యేకంగా కోపమని నీకు తోచింది. నీ పని బాగుందని నమ్మకం లోపల ఉంది. ఆ సంగతి అడిగే ధైర్యం మాత్రం కుదరలేదు. అంతేనా?
మూర్తి: నా మెదడును పుస్తకంలాగా చదివేశారు మీరు. వివరం అడగాలని లోపల ఉంది. కానీ అవాక్కయ్యారా? లెవెల్లో బొమ్మయి నిలుచున్నాను. ఇప్పుడనుకుని ఏం లాభం. గత జల సేతు బంధనం!
సుభాషిణి: పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వైరాగ్యం లెవెల్లో! ఆయనేదో అన్నాడు. నీవేమీ అనలేదు. మీ నాటకం తెరదిగలేదని నాకు అనిపిస్తున్నది. ఆయన మరెందుకో చికాకుగా ఉన్నారేమో? లేక విషయం అర్థం కాలేదేమో? ఇప్పుడయినా, చెత్త అనే మాట వాడకుండా గౌరవంగా, ఏం మార్పులు చేయమంటారు లాంటి డయలాగుతో నాటకం కొనసాగించవచ్చేమో?
మూర్తి: ఇంకానా? లాభం ఉంటుందంటారా? కానీ మీరంటే నాకూ అర్థమయినట్లుంది. ఇంకొంచెం సంగతులు బయటకు వస్తే రావచ్చు. ప్లాను మారాలా? లేక నేను మారాలా తేలిపోవచ్చు. ఆయన మనసు గురించి అనుకున్నాను తప్ప, నిజం తెలియదు మరి. ఊరికే ఏదో అనుకుని మనసు పాడుచేసుకున్నానంటారా?
సుభాషిణి: వదిలెయ్! గౌరవంగా మరోసారి ఆయన ముందు నిలబడు! ఆయన మూర్ఖుడు మాత్రం కాదు!
మూర్తి: సరే బాసూ! ముందు ఈ తలలో బరువు దిగనీయండి! నాలుగు రోజులు ఆగి తిరిగి వెళతాను. సమస్యేమిటో తెలిసిపోతుంది. పాతసినిమా చివర్లోలాగా ‘నా కళ్లు తెరిపించారు’ లాంటి డయలాగు చెప్పాలనిపిస్తోంది! థ్యాంక్స్! చిన్నబాసూ!
***
ఇక మీ కోసం: ఈ సంభాషణలోని ఒక్కొక్క డయలాగునూ వివరంగా చర్చించండి! బతుకులో ఏ విషయం గురించయినా, కార్యకారణాలతో సహా ఇలాంటి చర్చ అవసరమేమో మీరే గమనించండి.

Sunday, April 8, 2012

రంగుల కథ !

సైన్సు.. పుస్తకాలలో ఉంటుందని, అది అందరికీ సులభంగా అర్థం కాదనీ, పరిశోధకులు మొదలు, పిల్లలదాకా, అందరూ అనుకుంటారు. సైన్సును సైన్సుగా గుర్తించకముందు కూడా బతుకు, తెలివి ఉన్నాయి. కనుక పరిశీలన కూడా ఉంది. అవగాహన సరిగా లేదు గనుక, అదంతా అంధకార యుగమనీ, ఆల్కెమీ యుగమని కూడా అందరూ అనుకుంటారు. అదేమీ కాదనే వారు కూడా కొంతమంది ఉన్నారు. ప్రాచీన కాలంలో సరైన ఆలోచనలు, అవగాహనలు ఉన్నాయనడానికీ వీరు ఆధారాలను సేకరిస్తున్నారు.
================
పదమూడవ శతాబ్దిలో ఇంగ్లాండ్‌లో రాబర్ట్ గ్రోస్‌టెస్ట్ అనే పండితుడు ఉండేవాడు. ఆ కాలంలో పండితులంతా మతాన్ని ఆశ్రయించే పద్ధతి గనుక ఈయన కూడా చర్చ్‌లో ఉండేవాడు. అతను లింకన్‌లో బిషప్ పదవికి కూడా ఎంపికయ్యాడు. ప్రజలలో తెలివి, పరిశీలనకు ప్రేరణ కలిగించిన పునరుజ్జీవానికన్నా ముందు రోజులవి. అయినా గ్రోస్‌టెస్ట్ ఎన్నో సంగతులను గురించి పరిశీలించి విషయం రాసుకున్నాడు. ధ్వని, తోకచుక్కలు, నక్షత్రాల మొదలు అతను ఎన్నో విషయాలను గురించి రాశాడు. 1225లో అతను రంగుల గురించి రాసిన వ్యాసం మాత్రం ప్రస్తుత కాలపు పరిశోధకులను ఎంతో ఆకర్షించింది. ఈ వ్యాసంలో గ్రోస్‌టెస్ట్ రంగుల గురించి రాసిన సమాచారం, ఇప్పటి అవగాహనలకు చేరువగా ఉందని వీరి అభిప్రాయం. అంటే, అంధకార యుగమని పేరు పడిన ఆ పాత రోజులలోనే మంచి శాస్ర్తియ పరిశీలనలు జరిగినట్లు అర్థమవుతుంది.
ప్రపంచమంతా మనకు రకరకాల రంగులలో కనబడుతుంటే, చూచి ఆనందించడమే గాని, రంగులు ఎట్లా కనబడతాయని ఆలోచించడం తక్కువ. పరిశోధకులకు కూడా రంగుల సంగతి అంత సులభంగా అంతుపట్టలేదు. ఏ రంగూ లేని నలుపు నుంచి, అన్నిరంగులూ కలిపిన తెలుపు మధ్యన ఎనె్నన్నో రంగులు, చాయలున్నాయి. రంగులంటే, వస్తువులనుంచి విరజిమ్మబడే వెలుగులు అన్నాడు అరిస్టాటిల్. నలుపు, తెలుపు మధ్యన వరసగా ఏడురంగులున్నాయని, ఈ ఏడు రంగుల కలయికలతో మిగతా రంగులు పుడతాయని అన్నాడు కూడా. ఒక పదార్థం, వెలుగులోని కొన్ని భాగాలను పీల్చుకుని, మిగతా వాటిని వదిలినందుకు, అది ఒక రంగుతో కనబడుతుందని ప్రస్తుతం మనకు తెలుసు. రంగులు వరుసగా ఉండవు. కంటిలో రంగులను గ్రహించడానికి మూడురకాల కోన్ సెల్స్ ఉన్నాయి గనుక, మొత్తం రంగులూ, పొడవు, వెడల్పులతో బాటు లోతు కూడా కల త్రిమితీయ పద్ధతిలో ఉంటాయని కూడా తెలుసు. (ఈ మాట అందరికీ అంత సులభంగా అర్థం కాదు! అదే రంగుల విస్తరణలోని విచిత్రం!) మొత్తానికి ఎరుపు, ఆకుపచ్చ, నీలం అనేవి మూల వర్ణాలు. వీటి కలయికలతో టీవీలో, కంప్యూటర్‌లో ఇతరత్రాగానూ మనకు కోటి అరవై ఏడు లక్షల చాయలు కనబడే వీలు ఉంది! ఆయా రంగుల పాళ్లను బట్టి అన్ని చాయలు వీలవుతాయి. అదొక పెద్ద లెక్క! లైట్‌నెస్, హ్యూ, శానురేషన్‌లను కలిపి రకరకాల రంగులను తయారుచేసే పద్ధతి కూడా వాడుకలో ఉంది. మొత్తానికి రంగులు కనిపించడానికి మూడు లక్షణాలుండాలని మాత్రం అందరికీ తెలుసు. ఈ సంగతులన్నీ ఆ కాలంలోనే బిషప్ గ్రోస్‌టెస్ట్ అర్థం చేసుకున్నట్లు అతని వ్యాసంవల్ల తెలుస్తుంది. 1175లో పుట్టిన ఈ పండితుడు 1225 నాటికి ఆక్స్‌ఫర్డ్‌లో మతం అనే శాస్త్రాన్ని బోధిస్తున్నాడు. 1225లో రంగుల గురించి అతను రాసిన వ్యాసంలో 400 ల్యాటిన్ మాటలున్నాయి. బొమ్మలు, రేఖా చిత్రాల వంటివి లేవు. రెక్కలు అంతకన్నా లేవు. రంగులు వాటంతటవి ఉండవు, అనడంతో అతని వివరణ మొదలవుతుంది. వెలుగు, వస్తువుల మధ్య పరస్పర చర్యకు రంగులకు ఆధారమని గ్రోస్‌టెస్ట్ వివరించాడు. రంగులు మారడానికి మూడు తలాలలో మార్పులు ఉంటాయి. కార్లా నుంచి అబ్‌స్క్యూరా, ముల్టా నుంచి పాకా, ప్యూరం నుంచి ఇంప్యూరం అనేవి ఈ మూడు కొలతలని అతను వర్ణించాడు. ఈ మూడు జతలోని మొదటి మూడు లక్షణాలు కలిస్తే, తెలుపు ఏర్పడుతుందని కూడా గమనించాడతను. ఈ రకంగా రంగుల గురించి అతనికి గల అవగాహన, అధునాతన అవగాహనకు సమంగా ఉందని తేలుతుంది.


గ్రోస్‌టెస్ట్ వాడిన లాటిన్ మాటలకు ప్రస్తుతం మనకు తెలిసిన అర్థాలను గమనిస్తే కొంచెం తికమక పుట్టవచ్చు. కానీ, అతను ఆ మాటలను నిర్వచించి రాయలేదు. అతను వాడినది, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఆర్‌జీబీ, లేక ఎల్‌ఎచ్‌ఎస్ పద్ధతులలో ఏది అన్న ప్రశ్నకు సూటిగా జవాబు అందలేదు. గ్రోస్‌టెస్ట్ వ్యాసంలో రెండు మూడు చిన్నపొరపాట్లున్నాయి. అవి అతనివల్ల జరిగాయా లేక ప్రచురణకర్తల ప్రతాపమా తెలియదు. పరిశోధకులందరూ గ్రోస్‌టెస్ట్ రచనలకు చెందిన ఇటీవలి నమూనాలను వాడుతున్నారు. నిజంగా పాత ప్రతులలో లేని తప్పులు వీటిలో చోటుచేసుకున్నాయని తర్వాత తెలిసింది. ప్రతులలో అన్నింటికన్నా పాతది మాడ్రిడ్‌లోని స్పెయిన్ జాతీయ గ్రంథాలయంలో ఉంది. దాన్ని కూడా గమనించిన పరిశోధకులకు ఆశ్చర్యం ఎదురయింది. అతని లెక్కలు, రాతలు ఏ మాత్రం లోపం లేకుండా ఉన్నాయని అర్థమయింది.

ప్రస్తుతం ప్రపంచంలో కొత్త సంగతి ఏదివచ్చినా, దాన్ని అందరి ముందుకు తేవడానికి సైంటిఫిక్ పద్ధతులున్నాయి. ఈ పద్ధతులు గ్రోస్‌టెస్ట్‌కు తెలియవు. అందుకే అతని వ్యాసాలు ఇంతకాలం పరిశోధకుల దృష్టికి ఆనలేదు, అంటారు నిపుణులు కొందరు. అతని ఇతర రచనల గురించి కూడా ప్రస్తుతం పరిశీలనలను జరుగుతున్నాయి. వాటిలోనుంచి బయటపడే అంశాలు కొరకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఆనాటి పండితులలో శాస్ర్తియ దృక్పథం, విశే్లషణ లాంటి శక్తులు ఉండేవన్న నమ్మకం మాత్రం అందరికీ కలిగింది. ఈ దృష్టితో గతం సైన్సును తిరిగి పరిశీలించవలసిన అవసరం కనబడుతున్నది. మనకు తెలిసిన తీరు సైన్సు కూడా, మనమనుకున్న కాలం కన్నా ముందునుంచే ఉంది. మనిషికి తొలినాటినుంచీ, పరిశీలన, అన్నది సహజ లక్షణం. మంటను కనుగొన్నా, చక్రం తయారుచేసినా, ఈ పరిశీలన, ప్రయోగాల ద్వారానే వీలయింది. మనిషి బతుకులో సైన్సు ఉంది. దాన్ని చూసి అర్థం చేసుకోవడం ఒక్కటే తక్కువ. ఈ పనిని చేయగలిగినవారు, చేయలేనివారు, నాడు ఉన్నారు, నేడు కూడా ఉన్నారు!
====

Sunday, April 1, 2012

వికాసం


పనికాని పని!




ఉద్యోగం, చదువు, నిరుద్యోగం ఒక మార్గంలో సాగుతుంటాయి. వాటిలో సమస్యలు ఉండగా, కొన్నిసార్లు సంబంధం లేని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఈ సమస్యలు బతుకుతో సంబంధం గలవి. నాకు చేతినిండా పని ఉంది, అనుకుంటున్న సమయంలో ఇవి వచ్చి ఉప్పెనలా ముంచెత్తుతాయి. చేస్తున్న పనిని పక్కనబెట్టి వీటిని పట్టించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది.

ఉదాహరణకు నిజంగానే ఉప్పెన వచ్చిందనుకుందాము. అప్పుడు మన పని వెనకకు తగ్గి ‘ఉప్పెన’ పని ముందుగా ఎదురవుతుంది. ఆఫీసులో వారికి, లేదా తెలిసిన వారికి ఎవరికో ఉన్నట్లుండి ఆరోగ్యం పాడవుతుంది. ఆఫీసంతా స్తంభించి పోతుంది. ఇంట్లో పక్కింట్లో వారికి అలాంటి ఆపద వచ్చినా అదే పరిస్థితి. మీటింగులో కుప్పకూలిన సహోద్యోగినిని ఆసుపత్రికి తరలించడం, తగిన ఏర్పాట్లు చేయడం, తగిన వారికి సమాచారం ఇవ్వడం ఎంత గోల? కాని ఎంత అవసరం?
ఈ క్రమంలో మరణాలు కూడా వచ్చి చేరతాయి. ఒక కొలీగ్ ఇంట్లో ఎవరో పోతారు. ఆఫీసు, పక్కిల్లు తేడా లేకుండా అందరూ కదలవలసిన అవసరం వస్తుంది. ప్రమాదాల విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. మన ఆఫీసులోనూ, ఎరుకలోనూ ఎంత ఎక్కువమంది ఉంటే, ఈ ఉప్పెన పరిస్థితులు అంత ఎక్కువగా వచ్చి చుట్టుకుంటాయి. భయాలు, భావాలను పక్కనబెట్టి అందరూ భుజం అందించవలసిన అవసరం ఏర్పడుతుంది.


జరిగిన సంఘటనకు మనతో ప్రత్యక్షంగా సంబంధం ఉండదు. అయినా చెయ్యవలసిందేదో చెయ్యకపోతే, అందరూ మనల్ని అదోరకంగా చూస్తారు. ఏనాడో ఒకనాడు మనవల్ల మరొకరికి అలాంటి పరిస్థితి రావచ్చు. కనుక నోరు జారి ఒక్క మాట ఏదో అన్నా సరే, అందరిలో ఒక పేరు వచ్చేస్తుంది. మన దృష్టి మరోవాడ ఉండవచ్చు. వారి ప్రైవెసీలోకి చొరబడకూడదనుకుంటాము. వారికి తగినంత సమయం ఇస్తున్నామనుకుంటాము. ఇంకా తగిన సమయం రాలేదనుకుంటాము. కానీ, ప్రపంచానికది, మనమేదో దూరం జరుగుతున్న భావాన్నిస్తుంది. ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు. అయినా ఏదో చేయకతప్పదు. లేదంటే ఏమీ పట్టించుకోలేదన్న మాట మిగులుతుంది. అధికారంలో ఉన్న వారికయితే ఇది మరీ కష్టం కలిగించే పరిస్థితి. అవసరం వచ్చినప్పుడు ఆదుకున్న భావం ఏర్పడితే, ఆ తరువాత అందరూ మనల్ని అభిమానించడం మొదలవుతుంది.
ఆపదలోనే కాదు. ఆనందంలోనూ ఈ రకం పరిస్థితులు ఎదురవుతాయి. పెళ్ళికి వెళ్ళి మొక్కుబడి పద్ధతిలో తిరిగి రావచ్చు. చొరవగా బాధ్యత నెత్తుకుని, అందరినీ పలకరించి, ఏర్పాట్లు చూసి, సాయం చేయవచ్చు. సందర్భాన్నిబట్టి ఎవరు ఎంత చొరవ చూపాలన్నది ఇక్కడ నిర్ణయించవలసిన విషయం.


సందర్భాన్నీ సరిగా గుర్తించాలి: పెళ్లి, విందు మొదలు ప్రమాదం, ప్రకృతి బీభత్సం లాంటివి వద్దన్నా అందరికీ తగులుతాయి. ఆఫీసులో వాళ్లంతా పెళ్లికి వెళ్లక తప్పదు. అప్పుడే మీరు మీటింగు పెడతామంటే బాగుండదు. నిజానికి మీరూ ఆ పెళ్లికి వెళ్లవలసిన వారే. వానలు, వరదలు, గణేశ ఉత్సవాలు, మరోటి వచ్చి ఊరు ఊరంతా కదులుతూ ఉంటుంది. అప్పుడు, ఆఫీసుగానీ, వీధివారుగానీ, అంతా కలిపి, సరైన విధాన నిర్ణయం చేయడం మంచిది. ఇలాంటి సందర్భాలలో ఆర్థికపరంగా, లాజిస్టిక్స్ పరంగా కొన్ని నిర్ణయాలు అవసరమవుతాయి. వాటికి రూల్స్‌బుక్స్‌లో రెఫరెన్స్‌లు ఉండవు.
సందర్భం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినదయితే, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విషయం తెలుసుకుని సరైన నిర్ణయాలు చేయవచ్చు. అడిగితే సరైన జవాబురాదు: ఒక ఉద్యోగి, పొరుగు మనిషి సమస్య, సందర్భం వచ్చి తల మునకలవుతుంటారు. ‘మేమేమయినా చేయగలమా?’ అని అడిగితే ‘లేదండీ, అంతా సవ్యంగా నడుస్తోంది!’ అంటారు. మీకు వాళ్లు పని చెప్పలేరు. కానీ అక్కడ చేయవలసింది చాలా ఉంటుంది. సాయపడుతున్న వారిని గమనిస్తే, మనకూ ఒక పని దొరుకుతుంది. కొన్ని పనులు చేసినట్లు ప్రచారం లేకుండా జరిగితే బాగుంటుంది. అక్కడ చేరిన వారికి, టీ, తిండి, మంచినీరు ఏర్పాటు చేస్తే మేలు, అనిపిస్తే, చేయడమే! చర్చ, ప్రచారం అనవసరం.


కొన్ని సందర్భాల్లో నేరుగా చేయడానికి ఏమీ ఉండదు. కానీ, అవసరానికి మేము ఉన్నామన్నా భరోసా కొండంత బలాన్నిస్తుంది.
ఆ సంగతి మాత్రం అందరికీ తెలిసి ఉండాలి: మనం తోడుపడడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం మనసులో పెట్టుకుంటే చాలదు! మీరు ఎదుటివారి మనసులోని భావాలను తెలుసుకోలేరు. వారు కూడా అంతేనని మాత్రం గుర్తుంచుకోవాలి! ఒకరికి సాయంగా నిలిచినట్లు తెలిస్తే, మిగతావారు కూడా, అవసరం వచ్చినప్పుడు మనల్ని అడగడానికి సందేహించరు. ఏం తెలుసు? తరువాత అటువంటి అవసరం, పరిస్థితి మనకూ రావచ్చు. మనం ఎవరికయినా సాయపడితే, వారే కాకున్నా, మరెవరో మనకు సాయంగా వస్తారు.


ఒక టీంలో, సులభంగా కొందరికి ఈ రకమయిన పేరు ఉంటుంది. ఉండాలి కూడా. అది మనమే ఎందుకు కాకూడదు! పనితో సంబంధం లేని సమస్యలు అందరికీ వస్తాయి. అది కూడా మన పనే అనుకుంటే, సమస్యకు సమాధానం సులభంగా దొరుకుతుంది. 




అర్థం తెలిస్తే!



సహకారం అంటే, ఎలాగూ చేయవలసిన పనిని చిరునవ్వుతూ సంతోషంగా చేయడం!
ఏడ్చి ఏం లాభం? జరగవలసింది ఎలాగూ జరిగింది. జరిగింది గనుక నవ్వడం మేలు!
సంతోషంగా ఉన్న వాళ్ల దగ్గర కావలసినవన్నీ ఉన్నాయనుకుంటే తప్పే. వాళ్లు చేతికి అందిన అవకాశాలను బాగా వాడుకున్నారు అంతే!
నచ్చని విషయం ఏదయినా ఉంటే, దాన్ని వదిలేయండి. వదలలేమనుకుంటే దానిపట్ల మీకున్న అభిప్రాయాలను వదలండి. మంచి అభిప్రాయం పెంచుకోండి.
ఏదయినా సరే, మనకు లేకుండా పోయిందాకా, అది మన దగ్గర ఉందని మనకు తెలియదు. ఇదొక నిజం! మరో నిజం కూడా ఉంది. వచ్చేదేదో వచ్చేదాకా, అది లేకుండానే బతుకుతున్నామని కూడా మనకు తెలియదు.
మళ్లీ వెనకకు వెళ్లి మరోసారి కొత్త ప్రారంభం చేయడం ఎలాగూ కుదరదు. కానీ ఇప్పుడు మొదలుపెట్టి ముందుకు సాగితే, కొత్త అంతం మాత్రం తప్పక వీలవుతుంది.
ఎదురయిన ప్రతి విషయాన్నీ మార్చడం కుదరదు. ఎదురుపడకుండా దేన్నీ మార్చడం కూడా కుదరదు.
గతం గుర్తుండాలి. భవిష్యత్తు మీద ఆశలుండాలి. బతుకుమాత్రం ప్రస్తుతంలో సాగాలి.
ఏదయినా ‘కావలసినంతగా’ సమకూరాలంటే రెండు మార్గాలున్నాయి. అందులో ఒకటి, దాన్ని మరింత, ఇంకా కొంత సంపాదిస్తూ పోవడం. రెండవ మార్గం, ఉన్నదే ‘కావలసినంత’ అనుకోవడం!
మబ్బులు మెరుపులు రానిదే ఇంద్రధనుస్సు కూడా రాదు!




ఎర్రమట్టి



ఒక చెట్టు మనిషితో అన్నది గదా, ‘చూచావా? నా వేళ్లు ఈ ఎర్రమట్టిలో లోతువరకు చేరుకుని ఉన్నాయి. అందుకే, నేను నీకు కమ్మని పళ్లు ఇవ్వగలుగుతున్నాను!’
ఇక మనిషి చెట్టుతో అన్నాడు గదా, ’మనమిద్దరం, ఎంతగా ఒకే రకంగా ఉన్నామో! నా వేళ్లు కూడా ఎర్రమట్టిలో చాలా లోతువరకు చేరి ఉన్నాయి. ఎర్రమట్టి కారణంగా నేవేమో నాకు పళ్లు ఇవ్వగలుగుతున్నావు. అదే మట్టి నాకు మాత్రం, నీవిచ్చే పళ్లను అందుకుని, ధన్యవాదాలు చెప్పమని, పాఠాలు చెపుతున్నది!! అని.
(ఖలిల్ జిబ్రాన్ నుంచి)

==============

అసలు మాట
మీరు, మరొకరి గురించిన సినిమాలో వెనక నిలబడే పాత్ర మాత్రమే కాదు. మీ సినిమా మీకు ఉంది!
-డేవిడ్ నివేన్
మన సినిమాలో తోడుగా ఎవరెవరుంటారో ఆలోచించారా?

=============

కోపం...
కోపం వచ్చిందా? అవును వస్తుంది. కానీ కోపం తాకిడికి వివేకం కొట్టుకుపోతుంది. మన మీద మనకు పట్టు నిలవదు. ఈ సమాజంలో బతికి బయటపడడానికి గల అవసరాలతో సాధారణంగా కోపం మాత్రం ఉండదు. అనుకూలం కాని పరిస్థితులో ఆలోచనలు బాగా సాగాలి. సందర్భానికి తగిన నిర్ణయాలు రావాలి. వాటి బదులు కోపం వస్తుంది! ఎంత అన్యాయం?