Tuesday, April 17, 2012

పున్నమతో పెరిగే వెర్రి

మీకు అంతకుముందు వెర్రి లేకున్నా ‘కొలవెరి’ పాట విన్న తరువాత కొంతయినా పుట్టి ఉండాలి. కొల అంటే హత్య. వెర్రి అంటే వెర్రి, పిచ్చి, తిక్క, వగైరా.. వగైరా! ఈ వెర్రి, పిచ్చి, తిక్కలను ఇంగ్లీషులో లూనసీ అంటారని తెలిసే ఉండవచ్చు. అంటే చంద్రుడికీ తిక్క ముదరడానికీ ఏదో సంబంధం ఉందని ఈమాట ద్వారా ధ్వనిస్తుంది. లూనసీ అనే మాటకు, ‘చంద్రుని కళలను బట్టి మారుతుందని నమ్మకం గల పిచ్చి’ అని నిర్వచనం రాశారు... ప్లైనీ ద ఎల్డర్ అనే పాతకాలపు రోమన్ శాస్తవ్రేత్త. పిచ్చికి, చంద్రునికి సంబధం ఉందని ఆ కాలంలోనే రాశాడు. పున్నమ రోజుల్లో, రాత్రిపూట తేమ బాగా పెరుగుతుంది, కనుక మెదడులో కూడా ఏదో రకంగా తేమ ఎక్కువవుతుంది. కనుక ఆ సమయంలో మూర్ఛ, తిక్క ముదురుతాయన్నాడు ప్లైనీ. కానీ అదంతా అతని ఊహ, నిజం కానేకాదు. అయినా నేడు ప్రపంచంలో చాలా మంది వైద్యులతో సహా పిచ్చికి, చంద్రునికీ సంబంధం ఉందని నమ్ముతున్నారు. పిచ్చాసుపత్రి డాక్టర్లకు ఈ నమ్మకం మరీ ఎక్కువగా ఉందని యుఎస్ పరిశీలనలో బయపడిందట.
పరిశోధనల్లో మాత్రం ఈ సంబంధం గురించిన సూచనలు ఎక్కడా కనిపించలేదు.


పున్నమ, అర్ధచంద్రుడు, అమావాస్య, మరో అర్ధచంద్రుడు, తిరిగి పున్నమ రావడానికి నెలకన్నా తక్కువకాలమే పడుతుంది. కానీ, మిగతా నెలలో లేనంతగా, మనుషుల కారణంగా అపాయాలు, మాదక ద్రవ్యాల వాడకం, కిడ్నాపింగ్‌లు, హత్యలు, ప్రకృతి వైపరీత్యాలు, పిచ్చాసుపత్రిలో అడ్మిషన్లు, ఆత్మహత్యలు మొదలయినవి ఈ పూర్ణిమ సమయంలో ఎక్కువగా జరుగుతాయని నమ్మకం. పౌర్ణమిరోజుల్లో జనం మామూ లు కంటే ఎక్కువ తిండి తింటారని ఒక నమ్మకం ఉంది! గడిచిన యాభయి సంవత్సరాలుగా ఈవిషయాల గురించి ఎంతో పరిశోధన జరిగింది. అక్కడో, ఇక్కడో చందమామకు, మనిషి మెదడుకు సంబంధం ఉందన్న సూచనలు కనిపించాయి కూడా. అలా కనిపించినచోట్ల కూడా మరింత విశదంగా, లోతుగా పరిశోధిస్తే అంతా అబద్ధమని తేలిపోయింది. కానీ, ఈ సంగతులు పరిశోధన పత్రికలకు పరిమితంగా మిగిలాయి. మనకు తెలిసిన పత్రికలకూ, టీవీలకు ఈ రకం సంగతులను చర్చించేంత ఓపిక, తీరిక లేవు!

పట్టించుకునే వారికి, ఈ విషయమై చిత్రమయిన సంగతులు మెదడులో మెదిలే వీలుంది. ఇప్పుడు ఊరూరా కరెంటు దీపాలు వచ్చాయి. పున్నమకీ, చీకటి రాత్రులకు తేడా తెలియదు. పట్టణాలలో నిత్యం పున్నమలాగే ఉంటుంది. కానీ, ఇంతగా లైట్లు లేని కాలంలో ప్రజలు పున్నమిరాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండి ఉంటారు. అమావాస్యనాడు కూడా ఇంతో, అంతో కనిపిస్తుంది. కానీ ఆనాటి వెలుగుకన్నా పున్నమ నాడు వెలుగు 250 రెట్లుఎక్కువ. అందుకే గతంలోనయినా, ఇప్పుడు కూడా అంతగా కరెంటు దీపాలులేని చోట్లనయినా, పున్నమిరాత్రి అంటే ప్రత్యేకం. ఒక పార్టీ, కథాకాలక్షేపం, సరదాలకు అనువయిన దినమదే. చీకటి దినాలలో ముడుచుకుని పడుకునేవారు పండు వెనె్నల వచ్చిందంటే, బయట చలాకీగా తిరుగుతారు, తింటారు, ఆడతారు. కొంచెం పిచ్చిగా ఉంటారు! ఆ సమయంలో, కొందరు ధైర్యంగా అడవిలోకి బయలుదేరవచ్చు. మరోరకంగా దూసుకుపోయే ప్రయత్నాలు చేయవచ్చు. ఎక్కువమంది, ఎక్కువగా బయట తిరుగుతున్నారంటే, ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతాయి. తినడం, తాగడం, ఆ వెన్నెలలో ఎక్కువగా సాగినా వింత లేదు. ఆ తర్వాత కొంత అరాచకపు సంఘటనలు జరుగుతాయన్నా అర్థం చేసుకోవచ్చు.

ఎక్కువమంది మనుషులు, ఎక్కువ సేపు బయట తిరిగితే, ప్రమాదాలు, ప్రయోగాలు అన్నీ ఎక్కువే కదా! కానీ, మన ఈ ప్రస్తుతపు సాంకేతిక ప్రపంచంలో పగలు, రాత్రీ ఒకేరకంగా వెలిగిపోయే నగరాలలో కూడా పూర్ణచంద్రుడు, మనుషులకు తిక్క, పిచ్చి, వెర్రి ముదిరేలా ప్రభావం చూతున్నాడా? ఆసుపత్రుల్లో ఆ రోజున ఎక్కువమంది చేరుతున్నారా? ప్రపంచంలో అంతటా చంద్రుని ప్రభావం ఒకేలాగా కనపడుతున్నదా? పరిశోధకులు ఈ రకం అంశాలను పట్టించుకోకుండా వదలలేదు. ప్రపంచమంతటా పట్టుదలగా పరిశోధనలు చేశారు. పిచ్చికీ, చంద్రునికీ సంబధం లేదని తేల్చి చెపుతున్నారు.

చంద్రుని కళలకు, భూగోళానికి, దాని మీదనున్న సముద్రాలకు సంబంధం ఉందని మాత్రం అందరికీ తెలుసు. సముద్ర ప్రాంతాలలో ఉండేవారికి, ఆటుపోట్ల సంగతి బాగా తెలిసి ఉంటుంది. సూర్యచంద్రుల గురత్వాకర్షణ శక్తి కారణంగా సముద్రంలో నీరు, ఒకప్పుడు పొంగి తీరానికి వస్తుంది. మరొకప్పుడు అలలు వెనక్కు వెళుతుంటాయి. అంటే, భూమి కదలికల మీద, నీటి కదలికల మీద సూర్యచంద్రుల ప్రభావం ఉంటుంది. మన శరీరంలో కూడా ఎక్కువగా ఉండేది నీరే. కనుక ఈ నీటి మీద చంద్రుని ప్రభావం ఉండి తీరాలంటారు కొందరు.

సముద్రాలు చాలా పెద్దవి. వాటిలో చాలా నీరుంది. అక్కడ నీటికి బదులు ద్రవ రూపంలో పాదరసం, హైడ్రొజన్ లాంటి మరే పదార్థం ఉన్నా, అలలలో క్రమంగా మార్పు రానే వస్తుంది. ప్రభావానికీ, నీటికీ ప్రత్యేకమయిన సంబంధం లేదు. ఆటుపోట్లు సముద్రంలో మాత్రమే కనబడతాయి. చెరువులు, గుంటల్లో కనబడవు. అంతకన్నా మరీ తక్కువ నీరుండే మనిషి శరీరంలో చంద్రుని ప్రభావం అంతగా ఉండే వీలు లేదని పరిశోధకుల అభిప్రాయం. సముద్రంలో అలలు ఎప్పుడూ ఉంటాయి. గురుత్వాకర్షణ ప్రభావంకూడా ఎప్పుడూ ఉంటుంది. భూమి కదలిక, తిరగడం లాంటి ఎన్నో అంశాల కారణంగా అలల తీరులో మార్పులు వస్తాయి.

మనుషులమయిన మనం చీకటిలోనయినా, వెనె్నలలోనయినా పిచ్చిపనులు చేస్తూనే ఉంటాము. పున్నమనాడు మాత్రం, కిటికీలోనుంచి చూస్తే చంద్రబింబం కనబడుతుంది. ఆనాడు జరిగిన అన్ని సంగతులకూ చంద్రుడే కారణమని అనాలని అనిపిస్తుంది. చేసే ప్రతి పనికీ, జరిగే ప్రతి సంఘటనకూ సంబంధం లేని కారణాలు వెదతకడం మనిషికి చిరకాలంగా అలవాటయిపోతుంది. అది సంస్కృతిలో భాగమయింది. వెలుతురు లేని రోజుల్లో వెన్నెలను చూచి, ఆనాడు మరింతకాలం గంతులు వేసి ఉంటాము. అలవాటుకొద్దీ ఇప్పుడూ అదే పని చేసేవారెవరైనా ఉన్నారేమో? కొత్త బతుకులలో మనకు పగలే వెన్నెలలో జగమే ఊయల! ఇదే మన పిచ్చి, వెర్రి, తిక్క! అదీ చంపేయాలన్నంత!

1 comment:

  1. మీరు మంచి మంచి విషయాల మీద చక్కని వ్యాసాలు వ్రాస్తున్నారు. బాగుంది! దీనికి సంబంధించి మాయన్ల నమ్మకం ఒకటుంది. అదేమిటంటే... వాళ్ళు సూర్యుడిని పురుషునితో, చంద్రుడిని స్త్రీతో పోలుస్తారు. స్త్రీకి రుతుక్రమం ఉన్నట్టే చంద్రుడికి కూడా అది ఉండటం వలననే నెలకి ఒకసారి అమావాస్య వస్తుందని వారి నమ్మిక. అయితే పున్నమి రోజున సూర్యుడు చంద్రునితో కలవటం వలన సృష్టి జరుగుతుందని కూడా నమ్ముతారు. ఏ భావనతో అయితే పురుషుడు స్త్రీతో కలవడానికి ఎంత ఉర్రూతలూగుతాడో (దీనినే పిచ్చి అని అనటం జరిగింది) అదే విధమయిన పిచ్చి మనుషులకి పున్నమి నాడు ఉంటుంది వారి అభిప్రాయం.

    ReplyDelete