Monday, April 23, 2012

సూర్యుని తోబుట్టువులు

మన సూర్యుడిని ఒంటరి నక్షత్రం అంటుంటారు. సూర్యుడి కాంతి దగ్గరలోని మరో నక్షత్రానికి చేరడానికి నాలుగు సంవత్సరాలు పడుతుంది. అలాగని సూర్యుడు మొదటి నుంచీ ఒంటరి నక్షత్రమేనా? సుమారు నాలుగున్నర బిలియన్ సంవత్సరాల నాడు ఈ సూర్యుడు దుమ్ము, వాయువులు కలిగిన ఒక మేఘం నుంచి పుట్టిన సంగతి తెలుసు. అదే సమయంలో ఆ పదార్థం నుంచి మరిన్ని నక్షత్రాలు కూడా పుట్టాయి. అవి సూర్యుడి తోబుట్టువులు. వీటన్నిటికీ పదార్థం అందించిన ఆ ధూళి మేఘం సమసిపోయింది. కానీ, అందులోనుంచి పుట్టిన నక్షత్రాలన్నీ పోలేదు. ఈ ఆలోచనకు ఆధారాలున్నాయి. సౌర మండలం పుట్టినప్పుడు కొంత పదార్థం అక్కడక్కడ చెదిరి మిగిలిపోయింది. వాటిలోని రసాయనాలను పరిశీలించిన తర్వాత, కొన్ని సంగతులను పరిశోధకులు చెప్పగలిగారు. సూర్యుడికి ఒక కాంతి సంవత్సరం కన్నా తక్కువ దూరంలోనే మరో నక్షత్రం పుట్టిందనీ, అది మరీ పెద్దది గనుక పేలిపోయిందనీ లెక్క తేలింది.


సూర్యుడి లాంటి కొలతలు, లక్షణాలున్న నక్షత్రాలన్నీ గుంపులుగానే ఉన్నాయని ఖగోళ పరిశోధకులు గమనించారు. వందల వేల సంఖ్యలో ఈ నక్షత్రాలు చెల్లా చెదురయినట్లు కూడా గమనించారు. అంగారక శిలలు, అంతరిక్ష శిలలలోని రసాయనాలను గమనించినప్పుడు మన సూర్యనక్షత్రం కూడా ఇలాంటి గుంపులో ఉండేదన్న సూచనలు కనబడుతున్నాయి. సూర్యుడు పుట్టిన ఆ గుంపులో కనీసం వెయ్యి నక్షత్రాలు ఉండి తీరాలని పరిశోధకుల అభిప్రాయం.

పాలపుంతలో కోటానుకోట్ల నక్షత్రాలున్నాయి. వాటిలో ఈ వెయ్యి నక్షత్రాలను వెదకడం సులభమయిన పని కాదు. అందునా నక్షత్రాల చరిత్ర మనుషుల చరిత్రలాగే విచిత్రంగా ఉంటుంది. నక్షత్రాల గుంపులు పుట్టి గెలాక్సీగా విస్తరిస్తాయి. అందులోని బలాల కారణంగా నక్షత్రాలు నాశనమయ్యేవీలుంది. నక్షత్రాలు పుట్టడానికి ఆధారమయిన దుమ్ము వాయువుల మేఘమే వాటికి మొదటి శత్రువు. ఈ మేఘాలు నక్షత్రాలకన్నా కోట్ల రెట్లు ఎక్కువ పదార్థం గలవి. వాటికి గురుత్వాకర్షణ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా కొత్త నక్షత్రాలు మరీ దూరాలకు విసిరివేయబడతాయి. ఈలోగా రకరకాల ప్రభావాలకు గురై కొన్ని నక్షత్రాలు వెంటనే పేలిపోతాయి కూడా. పుట్టిన కొత్త నక్షత్రాలు ఒక గుంపుగా ఉండటానికి వాటి మధ్య గల గురుత్వాకర్షణ శక్తి మాత్రమే ఆధారం. పేలిన నక్షత్రంలోని పదార్థం చుట్టూ చిమ్మినపుడు ఈ శక్తికి తెరలాగ అడ్డువస్తుంది. అంటే నక్షత్రాలు గుంపుగా ఉండక చెదిరిపోతాయి. ఇక వాటి మీద గెలాక్సీలోని శక్తులు పనిచేస్తాయి. మిగతా నక్షత్రాల ఆకర్షణ పనిచేస్తుంది. మొత్తానికి గుంపులోని నక్షత్రాలు చెదిరిపోతాయి. రకరకాల కారణంగా కుటుంబంలోని వారంతా చెదిరిపోయిన ‘సినిమా’ జీవితకథలాంటి పరిస్థితి ఇది!

సినిమాలో కుటుంబం ఏదో ఒక రకంగా, తిరిగి కలిసినట్లు చూపిస్తారు. సూర్యుడి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు తిరిగి దగ్గరకు రాకపోవచ్చు. కానీ, అవన్నీ దగ్గరలోనే ఎక్కడో ఉన్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. నెదర్లాండ్స్‌లో పరిశోధకులు సూర్యుడి చుట్టాల గురించి లెక్కలు వేశారు. సుమారు 330 కాంతి సంవత్సరాల దూరంలో, అలనాడు సూర్యుడితోబాటు పుట్టిన నక్షత్రాలు ఉండి తీరాలని వారు లెక్క చెపుతున్నారు. సూర్యుడంత నక్షత్రం అంతదూరంలో ఉంటే, బైనాక్యులర్స్‌లో నుంచి చూడవచ్చు. కానీ ఈ లెక్కను అందరూ ఒప్పుకోవడం లేదు. నక్షత్రాలు చెదిరి ఒకదాని నుంచి మరొకటి దూరం పోవడానికి ఎక్కువ అవకాశాలున్నాయని, ఈ 330 కాంతి సంవత్సరాలు లెక్క, ఆ బలాల ముందు నిలబడదనీ అంటారు మరికొందరు పరిశోధకులు. ఉంటే, ఏవో కొన్ని నక్షత్రాలు మాత్రమే ఆ దూరంలో ఉండవచ్చునని వారి లెక్కలు చెపుతున్నాయట.

ఎన్ని నక్షత్రాలు, ఎంత దగ్గరలో ఉన్నాయన్న లెక్కలు సాగుతుండగానే, మరికొందరు వాటి కొరకు వెదకులాట మొదలుపెట్టారు. అందుకోసం హెర్మెస్ అనే ప్రత్యేక పరికరాన్ని కూడా తయారుచేయించారు. న్యూసౌత్‌వేల్స్‌లో కువాబరాబ్రాన్ అనే చోట, ఇంగ్లీషువారు, ఆస్ట్రేలియనులు కలిసి స్థాపించిన సైడింగ్ స్ప్రింగ్ నక్షత్ర పరిశోధనశాలలో ఆ పరికరాన్ని టెలిస్కోప్‌కు సాయంగా కలిపారు. ఇరవయివేల కాంతి నక్షత్రాల దూరం లోపలగల నక్షత్రాలను టెలిస్కోపులు ఊరికే చూస్తుంటాయి. హెర్మెస్ మాత్రం వాటిలోని రసాయనాల తీరుతెన్నులను కూడా గమనిస్తుంది. మన చుట్టాలను మరో దేశంలో వెతకాలంటే భాష, సంస్కృతి ఆధారంగా వెదికినట్లు ఉంటుంది ఈ అన్వేషణ.

కనిపించిన ప్రతి నక్షత్రంలోనూ ఇరవయి అయిదు రకాల రసాయనాల తీరును గురించి ఈ పరికరం వివరాలను గమనిస్తుంది. వాటి ఆధారంగా నక్షత్రం పుట్టుక రహస్యాలు అర్థమవుతాయి. ఇదే దారిలో సూర్యుడిని పోలిన రసాయనాలున్న నక్షత్రాలు కనబడితే, అవి తప్పకుండా సూర్యుడి తోబుట్టువులుగా గుర్తింపబడతాయి. పది సంవత్సరాలపాటు కష్టపడితే, మనం వెతుకుతున్న రకం చుక్కల హద్దులు తెలిసే వీలు ఉండవచ్చునంటారు పరిశోధకులు. అక్కడితో కథ ముగిస్తే బాగానే ఉంటుంది. నక్షత్రాలు ఎంతగా విసిరివేయబడినా, వాటి కదలికలో కూడా సూర్యుడికి పోలికలు ఉంటాయి. నక్షత్రాల దారులను గమనించేందుకు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీవారు వచ్చే సంవత్సరం గైయా అనే అంతరిక్ష నౌకను పంపుతున్నారు. అది తీసిన కదలికల కొలతలకు, హెర్మెస్ రసాయనాలు కొలతలకు పొంతన కుదరాలి. రెండు పరీక్షలలో నిలిచినవి, గెలిచినవీ మాత్రమే సూర్యుడితో సహా పుట్టిన నక్షత్రాలు అనిపించుకుంటాయి.

ఈలోగా సూర్యుని చుట్టాల కొరకు మాత్రమే కాక, మొత్తంమీద లక్ష నక్షత్రాలను గమనించి, రసాయన సమాచారాన్ని కూడా సేకరించే మరో పరిశోధన న్యూమెక్సికోలో మొదలుకానుంది. అందులో అనుకోకుండా ‘మన’ సూర్యుడు లాంటి, ‘మన’ నక్షత్రాలు తగలవచ్చు. ఈ పరీక్షలో నక్షత్రాల వయసులను కూడా అంచనా వేయనున్నారు. సూర్యుడిలాంటి రసాయనాలు, కదలికలతోబాటు, అదే వయసున్న నక్షత్రాలు కనబడితే అవి తప్పకుండా ‘మన’ నక్షత్రాలే అనక తప్పదు. వాటిని కనుగొన్నందుకు ఏం దక్కుతుందని ఎవరికయినా అనుమానం రావచ్చు. ముందు సూర్యుడు, సౌరమండలం ఏర్పడిన తీరు మరింత అర్థమవుతుంది. ఆయా నక్షత్రాల గ్రహాల మీద, జీవం ఉండే వీలు కూడా ఎక్కువగా ఉంటుంది.

మొత్తానికి ఇదంతా మనలాంటి వారి గురించి వెదుకులాటలో భాగమా?

1 comment: