Sunday, April 8, 2012

రంగుల కథ !

సైన్సు.. పుస్తకాలలో ఉంటుందని, అది అందరికీ సులభంగా అర్థం కాదనీ, పరిశోధకులు మొదలు, పిల్లలదాకా, అందరూ అనుకుంటారు. సైన్సును సైన్సుగా గుర్తించకముందు కూడా బతుకు, తెలివి ఉన్నాయి. కనుక పరిశీలన కూడా ఉంది. అవగాహన సరిగా లేదు గనుక, అదంతా అంధకార యుగమనీ, ఆల్కెమీ యుగమని కూడా అందరూ అనుకుంటారు. అదేమీ కాదనే వారు కూడా కొంతమంది ఉన్నారు. ప్రాచీన కాలంలో సరైన ఆలోచనలు, అవగాహనలు ఉన్నాయనడానికీ వీరు ఆధారాలను సేకరిస్తున్నారు.
================
పదమూడవ శతాబ్దిలో ఇంగ్లాండ్‌లో రాబర్ట్ గ్రోస్‌టెస్ట్ అనే పండితుడు ఉండేవాడు. ఆ కాలంలో పండితులంతా మతాన్ని ఆశ్రయించే పద్ధతి గనుక ఈయన కూడా చర్చ్‌లో ఉండేవాడు. అతను లింకన్‌లో బిషప్ పదవికి కూడా ఎంపికయ్యాడు. ప్రజలలో తెలివి, పరిశీలనకు ప్రేరణ కలిగించిన పునరుజ్జీవానికన్నా ముందు రోజులవి. అయినా గ్రోస్‌టెస్ట్ ఎన్నో సంగతులను గురించి పరిశీలించి విషయం రాసుకున్నాడు. ధ్వని, తోకచుక్కలు, నక్షత్రాల మొదలు అతను ఎన్నో విషయాలను గురించి రాశాడు. 1225లో అతను రంగుల గురించి రాసిన వ్యాసం మాత్రం ప్రస్తుత కాలపు పరిశోధకులను ఎంతో ఆకర్షించింది. ఈ వ్యాసంలో గ్రోస్‌టెస్ట్ రంగుల గురించి రాసిన సమాచారం, ఇప్పటి అవగాహనలకు చేరువగా ఉందని వీరి అభిప్రాయం. అంటే, అంధకార యుగమని పేరు పడిన ఆ పాత రోజులలోనే మంచి శాస్ర్తియ పరిశీలనలు జరిగినట్లు అర్థమవుతుంది.
ప్రపంచమంతా మనకు రకరకాల రంగులలో కనబడుతుంటే, చూచి ఆనందించడమే గాని, రంగులు ఎట్లా కనబడతాయని ఆలోచించడం తక్కువ. పరిశోధకులకు కూడా రంగుల సంగతి అంత సులభంగా అంతుపట్టలేదు. ఏ రంగూ లేని నలుపు నుంచి, అన్నిరంగులూ కలిపిన తెలుపు మధ్యన ఎనె్నన్నో రంగులు, చాయలున్నాయి. రంగులంటే, వస్తువులనుంచి విరజిమ్మబడే వెలుగులు అన్నాడు అరిస్టాటిల్. నలుపు, తెలుపు మధ్యన వరసగా ఏడురంగులున్నాయని, ఈ ఏడు రంగుల కలయికలతో మిగతా రంగులు పుడతాయని అన్నాడు కూడా. ఒక పదార్థం, వెలుగులోని కొన్ని భాగాలను పీల్చుకుని, మిగతా వాటిని వదిలినందుకు, అది ఒక రంగుతో కనబడుతుందని ప్రస్తుతం మనకు తెలుసు. రంగులు వరుసగా ఉండవు. కంటిలో రంగులను గ్రహించడానికి మూడురకాల కోన్ సెల్స్ ఉన్నాయి గనుక, మొత్తం రంగులూ, పొడవు, వెడల్పులతో బాటు లోతు కూడా కల త్రిమితీయ పద్ధతిలో ఉంటాయని కూడా తెలుసు. (ఈ మాట అందరికీ అంత సులభంగా అర్థం కాదు! అదే రంగుల విస్తరణలోని విచిత్రం!) మొత్తానికి ఎరుపు, ఆకుపచ్చ, నీలం అనేవి మూల వర్ణాలు. వీటి కలయికలతో టీవీలో, కంప్యూటర్‌లో ఇతరత్రాగానూ మనకు కోటి అరవై ఏడు లక్షల చాయలు కనబడే వీలు ఉంది! ఆయా రంగుల పాళ్లను బట్టి అన్ని చాయలు వీలవుతాయి. అదొక పెద్ద లెక్క! లైట్‌నెస్, హ్యూ, శానురేషన్‌లను కలిపి రకరకాల రంగులను తయారుచేసే పద్ధతి కూడా వాడుకలో ఉంది. మొత్తానికి రంగులు కనిపించడానికి మూడు లక్షణాలుండాలని మాత్రం అందరికీ తెలుసు. ఈ సంగతులన్నీ ఆ కాలంలోనే బిషప్ గ్రోస్‌టెస్ట్ అర్థం చేసుకున్నట్లు అతని వ్యాసంవల్ల తెలుస్తుంది. 1175లో పుట్టిన ఈ పండితుడు 1225 నాటికి ఆక్స్‌ఫర్డ్‌లో మతం అనే శాస్త్రాన్ని బోధిస్తున్నాడు. 1225లో రంగుల గురించి అతను రాసిన వ్యాసంలో 400 ల్యాటిన్ మాటలున్నాయి. బొమ్మలు, రేఖా చిత్రాల వంటివి లేవు. రెక్కలు అంతకన్నా లేవు. రంగులు వాటంతటవి ఉండవు, అనడంతో అతని వివరణ మొదలవుతుంది. వెలుగు, వస్తువుల మధ్య పరస్పర చర్యకు రంగులకు ఆధారమని గ్రోస్‌టెస్ట్ వివరించాడు. రంగులు మారడానికి మూడు తలాలలో మార్పులు ఉంటాయి. కార్లా నుంచి అబ్‌స్క్యూరా, ముల్టా నుంచి పాకా, ప్యూరం నుంచి ఇంప్యూరం అనేవి ఈ మూడు కొలతలని అతను వర్ణించాడు. ఈ మూడు జతలోని మొదటి మూడు లక్షణాలు కలిస్తే, తెలుపు ఏర్పడుతుందని కూడా గమనించాడతను. ఈ రకంగా రంగుల గురించి అతనికి గల అవగాహన, అధునాతన అవగాహనకు సమంగా ఉందని తేలుతుంది.


గ్రోస్‌టెస్ట్ వాడిన లాటిన్ మాటలకు ప్రస్తుతం మనకు తెలిసిన అర్థాలను గమనిస్తే కొంచెం తికమక పుట్టవచ్చు. కానీ, అతను ఆ మాటలను నిర్వచించి రాయలేదు. అతను వాడినది, ప్రస్తుతం వాడుకలో ఉన్న ఆర్‌జీబీ, లేక ఎల్‌ఎచ్‌ఎస్ పద్ధతులలో ఏది అన్న ప్రశ్నకు సూటిగా జవాబు అందలేదు. గ్రోస్‌టెస్ట్ వ్యాసంలో రెండు మూడు చిన్నపొరపాట్లున్నాయి. అవి అతనివల్ల జరిగాయా లేక ప్రచురణకర్తల ప్రతాపమా తెలియదు. పరిశోధకులందరూ గ్రోస్‌టెస్ట్ రచనలకు చెందిన ఇటీవలి నమూనాలను వాడుతున్నారు. నిజంగా పాత ప్రతులలో లేని తప్పులు వీటిలో చోటుచేసుకున్నాయని తర్వాత తెలిసింది. ప్రతులలో అన్నింటికన్నా పాతది మాడ్రిడ్‌లోని స్పెయిన్ జాతీయ గ్రంథాలయంలో ఉంది. దాన్ని కూడా గమనించిన పరిశోధకులకు ఆశ్చర్యం ఎదురయింది. అతని లెక్కలు, రాతలు ఏ మాత్రం లోపం లేకుండా ఉన్నాయని అర్థమయింది.

ప్రస్తుతం ప్రపంచంలో కొత్త సంగతి ఏదివచ్చినా, దాన్ని అందరి ముందుకు తేవడానికి సైంటిఫిక్ పద్ధతులున్నాయి. ఈ పద్ధతులు గ్రోస్‌టెస్ట్‌కు తెలియవు. అందుకే అతని వ్యాసాలు ఇంతకాలం పరిశోధకుల దృష్టికి ఆనలేదు, అంటారు నిపుణులు కొందరు. అతని ఇతర రచనల గురించి కూడా ప్రస్తుతం పరిశీలనలను జరుగుతున్నాయి. వాటిలోనుంచి బయటపడే అంశాలు కొరకు అందరూ ఎదురుచూస్తున్నారు. ఆనాటి పండితులలో శాస్ర్తియ దృక్పథం, విశే్లషణ లాంటి శక్తులు ఉండేవన్న నమ్మకం మాత్రం అందరికీ కలిగింది. ఈ దృష్టితో గతం సైన్సును తిరిగి పరిశీలించవలసిన అవసరం కనబడుతున్నది. మనకు తెలిసిన తీరు సైన్సు కూడా, మనమనుకున్న కాలం కన్నా ముందునుంచే ఉంది. మనిషికి తొలినాటినుంచీ, పరిశీలన, అన్నది సహజ లక్షణం. మంటను కనుగొన్నా, చక్రం తయారుచేసినా, ఈ పరిశీలన, ప్రయోగాల ద్వారానే వీలయింది. మనిషి బతుకులో సైన్సు ఉంది. దాన్ని చూసి అర్థం చేసుకోవడం ఒక్కటే తక్కువ. ఈ పనిని చేయగలిగినవారు, చేయలేనివారు, నాడు ఉన్నారు, నేడు కూడా ఉన్నారు!
====

3 comments:

 1. అభ్యర్ధన :

  నమస్తే!
  ' సేవ' సంస్థ ఆధ్వర్యంలో 'సకల' అంతర్జాల సకుటుంబం (వెబ్సైటు)ను ప్రారంభిస్తున్నామని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం. సాహిత్య రంగం, మహిళా రంగం, రాజకీయ రంగం, క్రీడా రంగం, ఆధ్యాత్మిక రంగం, సినిమారంగం, విద్య-ఉపాధి, ఆర్ధిక రంగం, కళారంగం, వైద్యం, హాస్యం, బాల్యం, వంటలు ఇత్యాది రంగాలకు సంబంధించి బ్లాగులు , వెబ్ పత్రికలు, వార్తాపత్రికలు ఉన్నాయా?..
  అయితే.. ఇంకేం ఆలస్యం.. మీ మీ బ్లాగులు, వెబ్ పత్రికలు, వార్తాపత్రికల పేర్లు, URL లు, నిర్వాహకుల పేర్లు, ఇ -మెయిల్ అడ్రెస్, ఫోన్ నెంబర్లతో వెంటనే... sevalive.com@gmail.com మెయిల్ చేయండి. ఇట్టే అంతర్జాల సకుటుంబం లో అనుబంధం (లింక్) చేస్తాం.
  మా ఈ ప్రయత్నానికి సహకరించాలని కోరుతున్నాం.

  వ్యాఖ్యానంలో మా అభ్యర్ధనను విన్నపిస్తున్నందులకు అన్యదా భావించ వద్దని కోరుకొంటూ.. మా విజ్ఞప్తిని పదిమందికి తెలిసేలా సహకరించమని అభ్యర్ధిస్తూ...

  సదా సేవలో,
  -కంచర్ల సుబ్బానాయుడు,
  సంపాదకులు, సేవ
  http://sevalive.com/

  ReplyDelete
 2. నమస్తే! మీరు మహా శ్వేతాదేవి "రుడాలి" నవలని అనువదించారని విన్నాను. ఆ పుస్తక వివరాలు తెలుప గలరా? ప్రచురణ కర్త ..ఎవరు,ఎక్కడ దొరుకుతుంది..చెప్పండి ప్లీజ్!!!

  ReplyDelete