Monday, April 16, 2012

నేను తిరిగిన దారులు - సమీక్ష


రచన: వాడ్రేవు చినవీరభద్రుడు
ప్రతులకు:
విజయశ్రీ, 96, నవోదయ కాలనీ,
మెహదీపట్నం,
హైదరాబాద్ -28.
పేజీలు: 208,
వెల : రూ.100/-

తెలుగులో యాత్రా ఛరిత్రలు కొత్త కాదు. ఏనుగుల వీరాస్వామయ్య కాశీ యాత్రాచరిత్ర నుండి ఇటీవలి దాకా చాలాకాదు గానీ, కొన్ని రచనలు ఈ పంథాలో వచ్చాయి. వస్తున్నాయి. ఇతర దేశాలు తిరిగి చూచిన వారు ఈ రకం రచనలు ఎక్కువగా చేస్తున్నారనవచ్చు.

‘నీవు స్వగృహాన్ని వదిలిన ప్రతిసారీ యాత్రీకుడివయినట్టే!... పోయి రాగానే నీలో ఎంత కొత్త రక్తం ప్రవహిస్తుందని!... మళ్లా గృహోన్ముఖుడివయినప్పుడు ఒట్టి మనిషిగాకాక మహా మానవుడిగా తిరిగి వస్తావు’ అంటారు ఈ పుస్తకం రచయిత ఒక వ్యాసంలో. ఇంతటి భావుకుడు, కవి, రచయిత, ప్రపంచం గురించి బాగా చదివిన మనిషి, బయలుదేరితే, ఆలోచనలు అలలుగా వస్తాయి. వచ్చాయి. వాటికి అక్షర రూపమే ఈ వ్యాసాలు. కలిసి ఈ ‘నేను తిరిగి దారులు’. ఇంగ్లండ్‌లో, దిల్లీలో, మన రాష్ట్రంలోని క్షేత్రాలు, ప్రదేశాలలో తిరిగి తర్వాత రచయిత తమ భావాలను, యాత్రావర్ణనలుగా పాఠకులకు అందించారు. యాత్రాచరిత్రలు వ్యక్తి స్వీయ అనుభవాలు. మరి ఒకటిరెండుచోట్ల రచయిత, కథ పద్ధతిలో మరెవరి నోటనో తమ అనుభవాలను పలికించారు. అది ఒకందుకు బాగుందేమో గానీ, మొత్తం రచన, భావాలలో కథకున్న కాల్పనికత అనే లక్షణం మారుతుందేమో? సాధారణంగా రచయితలెవరూ కథను పూర్తి వాస్తవమని చెప్పరు. చదివే వారికి మాత్రమే వాస్తవంగా కనిపిస్తుందది! ఇక్కడ రచనలోని బలమే బాగా ముందుకు వచ్చింది! అంతా వాస్తవమని తెలుస్తూనే ఉంది. అన్ని వ్యాసాలూ కథల లాగ నడవలేదనేది మరో అంశం.

ఈ పుస్తకంలో యాత్రాకథనాలు మూడు. నిజంగా కథనాలవి. వాటిని చదివిన తర్వాత ఆ ప్రదేశాలకు బయలుదేరాలన్న కోరిక పాఠకులలో బలంగా కలుగుతుంది. అరకు, శ్రీశైలం, పాపికొండల గురించి ఎనె్నన్ని విశేషాలు. ప్రదేశం భౌగోళిక విశేషాలకన్నా, మనుషుల గురించి చేసిన పరిశీలన, వ్యాఖ్యలు రచయిత వ్యక్తిత్వాన్ని మనముందు ఉంచుతాయి. ఆయన సాహిత్యప్రేమ, అభినివేశాలు అక్కడ అదనపు బలంగా, మరింత ఆసక్తి కలగడానికి కారణాలవుతాయి. పాతాకొత్తా మేలుకలయిక, అజేయమయిన మానవ జీవితేచ్ఛ అంటూ భారతీయ అనుభవాన్ని వర్ణించారు రచయిత!

తరువాతి ఆరు రచనలు ‘యాత్రానుభవాలు’అనే శీర్షిక కింద వస్తాయి. వీటిలో కథనం కొంత సూటిగా సాగినా, నాటకీయతకు లోటు రాలేదు. గోదావరి ఎక్కడ అని వెతికి, నిరాశకు గురయినా, అమ్మవారి గుళ్లో దర్శనం సరిగ్గా జరగకున్నా, మధురలో మానవత గురించి మనసులో మెదిలినా రచనలు పట్టుగా చదివించేవిగా సాగాయి. ఇక ఇంగ్లాండ్ గురించిన రచన కవితాత్మకంగా మొదలవుతుంది. కానీ, సంస్కృతి, సాహిత్యం, కళలు మొదలయిన అంశాలతో, అదొక సమాచార పూరిత పరిశోధన వ్యాసంలాగ సాగుతుంది. నిడివి కూడా మిగతా వాటికన్నా ఎక్కువ. బిగుసుకుపోతారనుకున్న ఇంగ్లీషువారిలోనూ ఈ రచయితకు చాలా మంచితనం ఎదురయింది. ఆసక్తిగల వారికి ఈ వ్యాసంలోనూ ఎన్నెన్నో విశేషాలు!

దిల్లీ లేదా ఢిల్లీ, మధుర, తుల్జాపూర్, త్రయంబకం లాంటి చోట్ల తిరుగుతుంటే హిందీ తెలియకపోవడం గుర్తుకువచ్చిందీ రచయితకు. నిజం కదూ! అదొక సమస్యే మరి!

టూరిజంలో ఒక చిక్కు, ట్రిక్కు ఉన్నాయి. ప్రదేశాలను గురించి పుస్తకాలలో చదివి, బొమ్మలు చూచి, ఏవేవో ఊహించుకుని అక్కడికి వెళితే, చాలాసార్లు నిరాశ కలుగుతుంది. కొన్నిచోట్ల అనుకున్నదానికి మించి ఏదో ఎదురవుతుంది. ఈ విషయాలు ఈ రచనల్లో చెప్పకుండానే మనముందుకు వస్తాయి. అరుణగిరి దర్శనంలో స్థలంకన్నా ‘చలం’ (గుడిపాటి వెంకటచలం) ఎక్కువగా కనిపించడం, రచయిత గురించి మనకెంతో చెపుతుంది.
వీరభద్రుడుగారు చేయితిరిగిన రచయిత. యాత్రీకులు, అలమికుంటుండగా, మర్మరధ్వని, వెయ్యికాళ్ల కొండచిలువ, ఓస్మానాబాద్, అమరుశతకం, దివాన్ అయ్యాడు లాంటి మాటలు ఎందుకు వాడుకున్నారో అర్థంకాలేదు.

నదీనదాలు, అడవులు, కొండలు అని ఉపశీర్షికగా అచ్చువేశారు. కానీ వాటికన్నా బలంగా ఈ పుస్తకంలో మనుషులు ఎదురయి పలకరిస్తారు. మీరూ వారిని పలకరించండి!

- గోపాలం కె.బి.

No comments:

Post a Comment