పురాతన సమాజం
రచన: లూయీ హెన్రీ మోర్గన్
అనువాదం: మహీధర రామమోహనరావు
విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్,
బ్యాంక్ స్ట్రీట్,
హైదరాబాద్-1
పేజీలు: 384
వెల: రూ.200/-
సమాజ పరిణామ క్రమాన్ని నిశితంగా, సవివరంగా, సశాస్ర్తియంగా పరిశీలన చేసి మోర్గన్ రాసిన పుస్తకానికి ఇది తెలుగు అనువాదం. ఈ పుస్తకం మార్క్స్, ఎంగెల్స్‌లను ఎంతో ప్రభావానికి గురిచేసింది. ఎంగెల్స్ తన ‘ఆరిజిన్ ఆఫ్ ఫ్యామిలీ, ప్రైవేట్ ప్రాపర్టీ, అండ్ ద స్టేట్’ అన్న పుస్తకాన్ని, మోర్గన్ రచన ప్రభావంతోనే చేశాడు. అమెరికన్ ప్రాచీన సమాజాలలో సాంఘిక పరిణామాలు, బంధుత్వాల గురించి మోర్గన్ రాసిన అంశాలను ఆంత్రోపాలజీ, (మానవీయ శాస్త్రం) రంగంలో గొప్ప గౌరవంతో అధ్యయనం చేయడం ఈనాటికీ కొనసాగుతున్నది.
వామపక్ష భావజాలాన్ని ఎంతో ప్రభావితం చేసిన మోర్గన్ రచన, డార్విన్, మార్క్స్, ఎంగెల్స్‌ల కృషితో కలిసి మానవజాతి ఆలోచనలను శాస్ర్తియ మార్గంలో నడిపించాయి అంటారు, విశాలాంధ్ర ప్రచురణల సంపాదకులు ఏటుకూరి ప్రసాద్. పాత విశ్వాసాలను మార్చగల ఈ పుస్తకాన్ని తెలుగులో ప్రచురించాలని విజ్ఞాన వికాస సమితి పేరున కొందరు పెద్దలు పడిన శ్రమ విషయాలను యథాతధంగా, ఈ ప్రచురణ లోనూ అందించారు. 1987లో మొదటిసారి వచ్చిన పుస్తకానికి ఇది మలి ప్రచురణ అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ప్రాచ్యప్రపంచంలో కూడా మానవ సమాజ పరిణామాన్ని, వర్ణించిన రచనలు లేకపోలేదు. కానీ, అవి శాస్ర్తియ పద్ధతిలో వచ్చిన పరిశోధన గ్రంథాలుగా లేవు. కనుకనే, తరువాతి కాలానికి చెందిన ఈ రకం పుస్తకాలకు గౌరవం ఎక్కువ. మనుషులకందరికీ, ఈ మధ్యన నేనేమిటి, నా గతం ఏమిటి అన్న ప్రశ్నలు బలంగా ఎదురవుతున్నాయి. జవాబుగా మొదటి ప్రశ్నకు ఎక్కువగా, రెండవ ప్రశ్నకు అరుదుగా రచనలు వస్తున్నాయి. అరుదయిన క్రమంలో వచ్చిన ఈ ‘పురాతన సమాజం’ అన్న రచనను అందరూ చదవాలి! వీలయినవారు, ప్రాక్పశ్చిమ ధోరణుల దృష్టితో తులనాత్మకంగా కూడా చదవాలి.
మోర్గన్ స్వతహాగా పరిశోధకుడు కాదు. ప్రభుత్వ అధికారి కావాలని ప్రయత్నించాడు కూడా 1840లో అతను ఆటవిక జాతుల వారితో స్నేహం కలిపాడు. ఇరోకో లాంటి తెగల వారితో కలిసి బతికి, వారి సమాజంలో చిత్రంగా తోచిన బంధుత్వాలు, పద్ధతులను గమనించాడు. వాటి గురించి విస్తృతంగా రాశాడు కూడా!
సమకాలికుడయిన డార్విన్ ప్రతిపాదించిన పరిణామసిద్ధాంతం ముందు, ఈ సాంఘిక పరిణామ సిద్ధాంతం కొంత వెలతెలబోయిన మాట వాస్తవం. కానీ అది, సరయిన వారిని ఆకర్షించింది. లూరుూ మోర్గన్ 1879లో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ సైనె్సస్‌కు అధ్యక్షుడయ్యాడు.
ఈ రచనలో మోర్గన్ వర్ణించిన సాంఘిక పరిణామం ఆసక్తికరంగా ఉంటుంది. ఉబుసుపోకకు చదువుకునే గ్రంథం, నవల కాదు గానీ, మానవ చరిత్రలో ఆసక్తిగలవారికి, అంతకన్నా ఆకర్షణ గలిగిన రచన. ఆటవిక దశలో మూడు, అనాగరిక దశలో మూడు అంచెలను దాటి నాగరికతకు చేరిన సమాజాల తీరును గురించి చదవడం, అందరికీ ఆసక్తికరంగానే ఉంటుంది. మనిషి ఆలోచనే పరిణామానికి దారితీసిందని మోర్గన్ అభిప్రాయం. పర్యావరణ ప్రభావంవల్ల మానవవర్గాలు వేరువేరుచోట్ల చేరి వేరుగా ఆలోచించాయన్న ఆలోచనను ఈయన పక్కనబెట్టినట్లు కనబడుతుంది. ప్రపంచం అంతటా సమాజాలు ఒకే మూసలో ముందుకు సాగలేదు. ఈ సంగతి విజ్ఞులు అంగీకరించినదే.
అధికారం, ప్రభుత్వం అన్న ఆలోచనల బీజాలను గురించి ఈ రచనలో ఎంతో సమాచారం ఉంది. అది మరింత చర్చకు దారితీసింది, తీస్తుంది కూడా. అంతకన్నా ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ వచ్చి క్రమంగా మారిన తీరు వర్ణన మరింత ఆసక్తికరంగా సాగుతుంది. ఒక వ్యక్తి మరణిస్తే, అతని ఆస్తి ఆ వర్గానికి చెందేదని స్ర్తిస్వామ్యంగా బలంగా కొనసాగేదని చదివితే, యువతరం వారికి చిత్రంగా తోచవచ్చు. ఆస్తి, వారసత్వం లాంటి విషయాలన్నీ పరిచితంగా కనిపిస్తాయి. కానీ, వాటి వెనుక ఎంతో చరిత్ర ఉంది. ఆ చరిత్ర, దానికి కారణమయిన పరిస్థితులు ఈ పుస్తకంలో వివరంగా ఉన్నాయి.
జీవ పరిణామం, సాంఘిక పరిణామం, సులభమయిన పరిస్థితి నుంచి గజిబిజి లేదా క్లిష్టపరిస్థితికి దారితీసిందని ఒక నమ్మకం. కొన్నిచోట్ల తలకిందులు వర్ణనలు ఎదురవుతాయి. పరిశోధకులకు అది పట్టించుకోవలసిన అంశంగా కనబడుతుంది.
అన్నా-తమ్ముడు, అక్కా-చెల్లెలు లాంటి మాటలు, సంబంధాలకు మారుతూ వచ్చిన అర్థాలు, పెళ్లి, కుటుంబం లోతులు తెలుసుకునేందుకు మొదలుపెట్టి ఈ పుస్తకాన్ని ‘సీరియస్’గా చదవాలి! మరెన్నో సంగతులు తెలిసి ఆశ్చర్యంలో మునుగుతాము!
No comments:
Post a Comment