Sunday, April 1, 2012

వికాసం


పనికాని పని!




ఉద్యోగం, చదువు, నిరుద్యోగం ఒక మార్గంలో సాగుతుంటాయి. వాటిలో సమస్యలు ఉండగా, కొన్నిసార్లు సంబంధం లేని సమస్యలు వచ్చి పడుతుంటాయి. ఈ సమస్యలు బతుకుతో సంబంధం గలవి. నాకు చేతినిండా పని ఉంది, అనుకుంటున్న సమయంలో ఇవి వచ్చి ఉప్పెనలా ముంచెత్తుతాయి. చేస్తున్న పనిని పక్కనబెట్టి వీటిని పట్టించుకోవలసిన అవసరం ఏర్పడుతుంది.

ఉదాహరణకు నిజంగానే ఉప్పెన వచ్చిందనుకుందాము. అప్పుడు మన పని వెనకకు తగ్గి ‘ఉప్పెన’ పని ముందుగా ఎదురవుతుంది. ఆఫీసులో వారికి, లేదా తెలిసిన వారికి ఎవరికో ఉన్నట్లుండి ఆరోగ్యం పాడవుతుంది. ఆఫీసంతా స్తంభించి పోతుంది. ఇంట్లో పక్కింట్లో వారికి అలాంటి ఆపద వచ్చినా అదే పరిస్థితి. మీటింగులో కుప్పకూలిన సహోద్యోగినిని ఆసుపత్రికి తరలించడం, తగిన ఏర్పాట్లు చేయడం, తగిన వారికి సమాచారం ఇవ్వడం ఎంత గోల? కాని ఎంత అవసరం?
ఈ క్రమంలో మరణాలు కూడా వచ్చి చేరతాయి. ఒక కొలీగ్ ఇంట్లో ఎవరో పోతారు. ఆఫీసు, పక్కిల్లు తేడా లేకుండా అందరూ కదలవలసిన అవసరం వస్తుంది. ప్రమాదాల విషయంలోనూ ఇలాగే జరుగుతుంది. మన ఆఫీసులోనూ, ఎరుకలోనూ ఎంత ఎక్కువమంది ఉంటే, ఈ ఉప్పెన పరిస్థితులు అంత ఎక్కువగా వచ్చి చుట్టుకుంటాయి. భయాలు, భావాలను పక్కనబెట్టి అందరూ భుజం అందించవలసిన అవసరం ఏర్పడుతుంది.


జరిగిన సంఘటనకు మనతో ప్రత్యక్షంగా సంబంధం ఉండదు. అయినా చెయ్యవలసిందేదో చెయ్యకపోతే, అందరూ మనల్ని అదోరకంగా చూస్తారు. ఏనాడో ఒకనాడు మనవల్ల మరొకరికి అలాంటి పరిస్థితి రావచ్చు. కనుక నోరు జారి ఒక్క మాట ఏదో అన్నా సరే, అందరిలో ఒక పేరు వచ్చేస్తుంది. మన దృష్టి మరోవాడ ఉండవచ్చు. వారి ప్రైవెసీలోకి చొరబడకూడదనుకుంటాము. వారికి తగినంత సమయం ఇస్తున్నామనుకుంటాము. ఇంకా తగిన సమయం రాలేదనుకుంటాము. కానీ, ప్రపంచానికది, మనమేదో దూరం జరుగుతున్న భావాన్నిస్తుంది. ఏం చేస్తే ఏమవుతుందో తెలియదు. అయినా ఏదో చేయకతప్పదు. లేదంటే ఏమీ పట్టించుకోలేదన్న మాట మిగులుతుంది. అధికారంలో ఉన్న వారికయితే ఇది మరీ కష్టం కలిగించే పరిస్థితి. అవసరం వచ్చినప్పుడు ఆదుకున్న భావం ఏర్పడితే, ఆ తరువాత అందరూ మనల్ని అభిమానించడం మొదలవుతుంది.
ఆపదలోనే కాదు. ఆనందంలోనూ ఈ రకం పరిస్థితులు ఎదురవుతాయి. పెళ్ళికి వెళ్ళి మొక్కుబడి పద్ధతిలో తిరిగి రావచ్చు. చొరవగా బాధ్యత నెత్తుకుని, అందరినీ పలకరించి, ఏర్పాట్లు చూసి, సాయం చేయవచ్చు. సందర్భాన్నిబట్టి ఎవరు ఎంత చొరవ చూపాలన్నది ఇక్కడ నిర్ణయించవలసిన విషయం.


సందర్భాన్నీ సరిగా గుర్తించాలి: పెళ్లి, విందు మొదలు ప్రమాదం, ప్రకృతి బీభత్సం లాంటివి వద్దన్నా అందరికీ తగులుతాయి. ఆఫీసులో వాళ్లంతా పెళ్లికి వెళ్లక తప్పదు. అప్పుడే మీరు మీటింగు పెడతామంటే బాగుండదు. నిజానికి మీరూ ఆ పెళ్లికి వెళ్లవలసిన వారే. వానలు, వరదలు, గణేశ ఉత్సవాలు, మరోటి వచ్చి ఊరు ఊరంతా కదులుతూ ఉంటుంది. అప్పుడు, ఆఫీసుగానీ, వీధివారుగానీ, అంతా కలిపి, సరైన విధాన నిర్ణయం చేయడం మంచిది. ఇలాంటి సందర్భాలలో ఆర్థికపరంగా, లాజిస్టిక్స్ పరంగా కొన్ని నిర్ణయాలు అవసరమవుతాయి. వాటికి రూల్స్‌బుక్స్‌లో రెఫరెన్స్‌లు ఉండవు.
సందర్భం కేవలం ఒక వ్యక్తికి సంబంధించినదయితే, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విషయం తెలుసుకుని సరైన నిర్ణయాలు చేయవచ్చు. అడిగితే సరైన జవాబురాదు: ఒక ఉద్యోగి, పొరుగు మనిషి సమస్య, సందర్భం వచ్చి తల మునకలవుతుంటారు. ‘మేమేమయినా చేయగలమా?’ అని అడిగితే ‘లేదండీ, అంతా సవ్యంగా నడుస్తోంది!’ అంటారు. మీకు వాళ్లు పని చెప్పలేరు. కానీ అక్కడ చేయవలసింది చాలా ఉంటుంది. సాయపడుతున్న వారిని గమనిస్తే, మనకూ ఒక పని దొరుకుతుంది. కొన్ని పనులు చేసినట్లు ప్రచారం లేకుండా జరిగితే బాగుంటుంది. అక్కడ చేరిన వారికి, టీ, తిండి, మంచినీరు ఏర్పాటు చేస్తే మేలు, అనిపిస్తే, చేయడమే! చర్చ, ప్రచారం అనవసరం.


కొన్ని సందర్భాల్లో నేరుగా చేయడానికి ఏమీ ఉండదు. కానీ, అవసరానికి మేము ఉన్నామన్నా భరోసా కొండంత బలాన్నిస్తుంది.
ఆ సంగతి మాత్రం అందరికీ తెలిసి ఉండాలి: మనం తోడుపడడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయం మనసులో పెట్టుకుంటే చాలదు! మీరు ఎదుటివారి మనసులోని భావాలను తెలుసుకోలేరు. వారు కూడా అంతేనని మాత్రం గుర్తుంచుకోవాలి! ఒకరికి సాయంగా నిలిచినట్లు తెలిస్తే, మిగతావారు కూడా, అవసరం వచ్చినప్పుడు మనల్ని అడగడానికి సందేహించరు. ఏం తెలుసు? తరువాత అటువంటి అవసరం, పరిస్థితి మనకూ రావచ్చు. మనం ఎవరికయినా సాయపడితే, వారే కాకున్నా, మరెవరో మనకు సాయంగా వస్తారు.


ఒక టీంలో, సులభంగా కొందరికి ఈ రకమయిన పేరు ఉంటుంది. ఉండాలి కూడా. అది మనమే ఎందుకు కాకూడదు! పనితో సంబంధం లేని సమస్యలు అందరికీ వస్తాయి. అది కూడా మన పనే అనుకుంటే, సమస్యకు సమాధానం సులభంగా దొరుకుతుంది. 




అర్థం తెలిస్తే!



సహకారం అంటే, ఎలాగూ చేయవలసిన పనిని చిరునవ్వుతూ సంతోషంగా చేయడం!
ఏడ్చి ఏం లాభం? జరగవలసింది ఎలాగూ జరిగింది. జరిగింది గనుక నవ్వడం మేలు!
సంతోషంగా ఉన్న వాళ్ల దగ్గర కావలసినవన్నీ ఉన్నాయనుకుంటే తప్పే. వాళ్లు చేతికి అందిన అవకాశాలను బాగా వాడుకున్నారు అంతే!
నచ్చని విషయం ఏదయినా ఉంటే, దాన్ని వదిలేయండి. వదలలేమనుకుంటే దానిపట్ల మీకున్న అభిప్రాయాలను వదలండి. మంచి అభిప్రాయం పెంచుకోండి.
ఏదయినా సరే, మనకు లేకుండా పోయిందాకా, అది మన దగ్గర ఉందని మనకు తెలియదు. ఇదొక నిజం! మరో నిజం కూడా ఉంది. వచ్చేదేదో వచ్చేదాకా, అది లేకుండానే బతుకుతున్నామని కూడా మనకు తెలియదు.
మళ్లీ వెనకకు వెళ్లి మరోసారి కొత్త ప్రారంభం చేయడం ఎలాగూ కుదరదు. కానీ ఇప్పుడు మొదలుపెట్టి ముందుకు సాగితే, కొత్త అంతం మాత్రం తప్పక వీలవుతుంది.
ఎదురయిన ప్రతి విషయాన్నీ మార్చడం కుదరదు. ఎదురుపడకుండా దేన్నీ మార్చడం కూడా కుదరదు.
గతం గుర్తుండాలి. భవిష్యత్తు మీద ఆశలుండాలి. బతుకుమాత్రం ప్రస్తుతంలో సాగాలి.
ఏదయినా ‘కావలసినంతగా’ సమకూరాలంటే రెండు మార్గాలున్నాయి. అందులో ఒకటి, దాన్ని మరింత, ఇంకా కొంత సంపాదిస్తూ పోవడం. రెండవ మార్గం, ఉన్నదే ‘కావలసినంత’ అనుకోవడం!
మబ్బులు మెరుపులు రానిదే ఇంద్రధనుస్సు కూడా రాదు!




ఎర్రమట్టి



ఒక చెట్టు మనిషితో అన్నది గదా, ‘చూచావా? నా వేళ్లు ఈ ఎర్రమట్టిలో లోతువరకు చేరుకుని ఉన్నాయి. అందుకే, నేను నీకు కమ్మని పళ్లు ఇవ్వగలుగుతున్నాను!’
ఇక మనిషి చెట్టుతో అన్నాడు గదా, ’మనమిద్దరం, ఎంతగా ఒకే రకంగా ఉన్నామో! నా వేళ్లు కూడా ఎర్రమట్టిలో చాలా లోతువరకు చేరి ఉన్నాయి. ఎర్రమట్టి కారణంగా నేవేమో నాకు పళ్లు ఇవ్వగలుగుతున్నావు. అదే మట్టి నాకు మాత్రం, నీవిచ్చే పళ్లను అందుకుని, ధన్యవాదాలు చెప్పమని, పాఠాలు చెపుతున్నది!! అని.
(ఖలిల్ జిబ్రాన్ నుంచి)

==============

అసలు మాట
మీరు, మరొకరి గురించిన సినిమాలో వెనక నిలబడే పాత్ర మాత్రమే కాదు. మీ సినిమా మీకు ఉంది!
-డేవిడ్ నివేన్
మన సినిమాలో తోడుగా ఎవరెవరుంటారో ఆలోచించారా?

=============

కోపం...
కోపం వచ్చిందా? అవును వస్తుంది. కానీ కోపం తాకిడికి వివేకం కొట్టుకుపోతుంది. మన మీద మనకు పట్టు నిలవదు. ఈ సమాజంలో బతికి బయటపడడానికి గల అవసరాలతో సాధారణంగా కోపం మాత్రం ఉండదు. అనుకూలం కాని పరిస్థితులో ఆలోచనలు బాగా సాగాలి. సందర్భానికి తగిన నిర్ణయాలు రావాలి. వాటి బదులు కోపం వస్తుంది! ఎంత అన్యాయం?

2 comments:

  1. "పనితో సంబంధం లేని సమస్యలు అందరికీ వస్తాయి. అది కూడా మన పనే అనుకుంటే, సమస్యకు సమాధానం సులభంగా దొరుకుతుంది." నిజమే!

    "ఏదయినా ‘కావలసినంతగా’ సమకూరాలంటే రెండు మార్గాలున్నాయి. అందులో ఒకటి, దాన్ని మరింత, ఇంకా కొంత సంపాదిస్తూ పోవడం. రెండవ మార్గం, ఉన్నదే ‘కావలసినంత’ అనుకోవడం! మబ్బులు మెరుపులు రానిదే ఇంద్రధనుస్సు కూడా రాదు!" చాలా బాగా చెప్పారు!

    ReplyDelete
  2. మీ అభిప్రాయాలు చాలా బాగున్నాయి.

    జీతం కోసం చేసేదే పని అనుకుంటాం కాని, పొరుగువాడికి చేసే సాయం కూడా మన పని అని అనుకోము. అసలు సమస్య అదే.

    ReplyDelete