Monday, April 30, 2012

ఆలోచించగలరా?

తను ఇంట్లోకి వచ్చాడు. ఎవరికీ అభ్యంతరం లేదు. చెప్పులను మాత్రం దారిలో అడ్డంగా వదలి వచ్చాడు. వాటిని కొంచెం పక్కకు వదిలితే మరింత గౌరవంగా ఉంటుందని ఆలోచన అతనికి రాలేదు. ఆ ఆలోచన మనకూ రాకపోవచ్చు. జీవితంలో ఆలోచన ఎంతో అవసరం. అది లేకుండానే చాలామంది బతుకు గడుపుతుంటారు. ఆలోచన మారితే, ఆచరణ మారుతుంది. అసలు ఆలోచన ఉంటే, ఏదైనా మారవలసిన అవసరం ఉంటే, తెలుస్తుంది. చాలా విషయాలు మారితే బాగుంటుందని మనకు తోచనే తోచదు. వాటిని గురించి ఆలోచించకుండా కాలం గడపటమే అందుకు కారణం.


నిజానికి, మనుషులందరూ, ప్రతిక్షణం ఏదో ఆలోచిస్తూనే ఉంటారు. ఆలోచనలు మామూలుగా వాటి దారిన అవి వస్తూ పోతూ ఉంటాయి. అందుకే కొందరు, ఏ ఆలోచనా లేని పరిస్థితి కావాలని ధ్యానం, మెడిటేషన్ చేస్తుంటారు. అది చాలావరకు అందరికీ చేతగాదు. ఎందుకంటే, అప్రయత్నంగా ఆలోచిస్తూ ఉండటం మన మెదడుకు అలవాటు. ఉదయం నిద్ర లేచింది మొదలు పడుకునేదాకా ఆలోచనలే. వాటి కారణంగా నిద్రలో కలలు వెంటాడుతాయి. ఆలోచన లేకుండా గడపటం కుదరదు. మీరు ప్రస్తుతం, ఈ నాలుగు అక్షరాలనూ ముందుకు చదవాలా? చదివితే పట్టించుకోవాలా అని ఆలోచిస్తున్నారు. ఆ సంగతి మీరు తెలిసి చేయడం లేదేమో! కానీ అది జరుగుతూనే ఉంటుంది.

ఆలోచనలతో భావాలకు రూపాలు వస్తాయి. కోరికలకు ఆకారాలు వస్తాయి. ఆ క్రమంలోనే ఆచరణలు మొదలవుతాయి. చదువు గురించి మీరు ఆలోచించినదంతా చదువుగా సాగుతుంది. డబ్బు గురించిన ఆలోచనలు మరోరకం పనులకు ఆధారాలవుతాయి. పని గురించిన ఆలోచనల ఆధారంగానే మన పని ముందుకు నడుస్తుంది. అయితే, అన్నింటికీ ఆధారంగా ఆలోచనలుంటాయని చాలామందికి అర్థం కాదు. ఆలోచనలను మన యిష్టప్రకారం నడపకపోతే పనులు కూడా అదే దారిలో కొనసాగుతాయి. చెప్పులు దారిలో వదిలినా, అందులో తప్పు తోచదు. జీవితంలో వచ్చే కష్టాలు చాలా మటుకు, ఈ ఆలోచనలలో నుంచి పుడతాయంటే ఆశ్చర్యం కాదు. స్పర్థలకు, యుద్ధాలకు, బాధలకు, గాధలకు కారణం, ఆధారం -ఆలోచనలే!


చాలామంది ‘నేను బాగానే ఆలోచిస్తాను’ అనుకుంటారు. ఆలోచనలకు క్రమం ఉంటుంది, ఉండాలి అన్న ఆలోచన మామూలుగా మనకు అలవాటు లేదు. సమస్యల వెనకవున్న కారణాలను వెదకడం, వాటిని గురించి ఆలోచించడం అలవాటు లేదు. ఆలోచన అనే ఆలోచన లేకుండానే చాలామంది ప్రవాహంలో కొట్టుకుపోతూ బతుకుతుంటారు. ఆలోచనల్లో మునుగుతూనే, ఆలోచించడానికి సమయం లేదని అనుకుంటారు.


బతుకు బాగా మన అదుపులో ఉంటూ సాగాలంటే, మనమందరమూ, ఆలోచనల బడిలో విద్యార్థులుగా చేరిపోవాలి. ఆలోచనగలవారినీ, ఆలోచనలు పంచుకునే వారినీ, వారి ఆలోచనలను జాగ్రత్తగా గమనించాలి. ఆలోచనలను పరీక్షించాలి. వాటి ప్రభావాలను జాగ్రత్తగా అనుభవించి విలువ తెలుసుకోవాలి. ఆలోచన మొదలయితే, ఆలోచనల బలం గురించి తెలుస్తుంది. ఆ బలంతో, తెలివిగా ఆలోచనలను క్రమశిక్షణతో ముందుకు నడిపించాలి. తెలివిని అనునిత్యం వాడుకోవడం అలవాటు చేసుకోవాలి. ఆలోచనలను, ఆచరణలను, ఫలితాలను ఎప్పటికప్పుడు విశే్లషించాలి. విలువను గుర్తించాలి. తప్పుగా తోచిన ఆలోచనలను, వాటి నుంచి పుట్టే ఆచరణలను పక్కన పెట్టాలి. అంటే విమర్శనాత్మకంగా, సతర్కంగా ఆలోచించడం నేర్వాలి. అప్పుడు మన బ్రతుకు మనదవుతుంది. మనం చెప్పిన, నమ్మిన దారిలో నడుస్తుంది. మన బ్రతుకు బాధ్యతలు నూరుశాతం మనవే అవుతాయి.


ఎవరో ఏదో చెపుతారు. చెప్పినందుకు చేయడం ఒక పద్ధతి. ఆ విషయం గురించి ఆలోచించి, విలువ గ్రహించి, మన ఆలోచనగా ఆచరించడం ఇంకొక పద్ధతి! ఆలోచనలు, ఆచరణలు, వాటికి మన భావావేశాలకు గల సంబంధం లాంటివన్నీ అంత సులభంగా అర్థం కావు! అయితే, ఆలోచించడం మాత్రం అన్నింటికన్నా సులభమయిన పని. ఏ పనీ చేయనప్పుడు మనకు మిగిలేది ఆలోచన ఒకటే. ఆ ఆలోచనలను మన అదుపులో ముందుకు సాగించడం అసలు తత్వం!


ఆలోచనలలో ఎక్కడో లోపం ఉందని, అవి వాటి మార్గాన అవి పరుగెత్తుతున్నాయని గుర్తించగలగడం, ఆలోచన బడిలో చేరడానికి ఎంట్రెన్స్ పరీక్షలాంటిది. వాటంతటవి దౌడు తీసే ఆలోచనలు, మనలను గుంటలో పడవేస్తాయి. మనకు ప్రతి విషయం గురించి, తెలియకుండానే, బలమయిన అభిప్రాయాలుంటాయి. కారణం లేకుండానే, కొన్ని సంగతులు, వస్తువులు, పనులు, వ్యక్తుల మీద మంచి అభిప్రాయం ఉండదు. నిష్కారణంగానే కొన్ని ఇష్టాలూ ఉంటాయి. తప్పు చేసి కూడా సర్ది చెప్పుకోవటం మనకు బాగా అలవాటు. ఎదురుగా సమస్య ఉందని గుర్తించి కూడా దాని గురించి ఆలోచించకపోవడం మన సహజ లక్షణం. మనమూ, మన వారు తప్పు చేసినా అది గొప్పగానే కనబడుతుంది. కూరిమి విరసంబయినను నేరములే తోచుచుండు, అంటాడు కవి. నచ్చని వారు ఏం చేసినా అందులో లొసుగులు కనబడతాయి. ‘నేను అలాగనుకోలేదు. ఊరికే అన్నాను’ అన్న డయలాగు అందరికీ తెలిసిందే. ఏ పనయినా ఆలోచించి చేస్తే, దాని బాధ్యత పూర్తిగా మనదే అవుతుంది. మనలను మనం ‘సరి’ అనడం, మోసపుచ్చుకోవడం, ప్రవర్తించడం లాంటివన్నీ సరైన ఆలోచన లేకనే!


తెలియకుండా, ఆచేతనంగా జరుగుతున్న ఆలోచనలను, మనకు తెలిసే చేతనలోకి తేవడం ఈ ప్రయత్నానికి మొదటి మెట్టు. మీరు ఆలోచన గలవారు! ఆలోచనలను మీ మార్గంలో నడిపించండి!

No comments:

Post a Comment