Saturday, December 3, 2011

సినారె కవితా సంకలనం - నా సమీక్ష


జ్ఞాపకాల నిధులు
నా చూపు రేపటి వైపు (కవితా సంకలనం) రచన: డా. సి. నారాయణ రెడ్డి వెల: రూ. 150/-, ప్రచురణ: వరేణ్య క్రియేషన్స్, హైదరాబాద్ ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ
-గోపాలం కె.బి., October 30th, 2011

పద్మభూషణులు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణరెడ్డి కవితా కృషీవలులు. ఆయన జీవితమే కవిత. ఒక విశ్వంభర, కర్పూర వసంతరాయలు లాంటి కావ్యాన్ని వెలయించినంత తీవ్రతతోనే ఆయన సినీగేయాన్ని కూడా రాస్తారు. ఆయన ఆలోచనే కవితగా సాగుతుంది. అందుకే ప్రతి జన్మదినానికి ఒక కొత్త కవితా సంపుటి కూడా పుడుతుంది. ఎనభయి వసంతాలు గడిచిన పండుగనాడు ఈ సంకలనం వచ్చింది. ఇందులో కవితలు 80 మాత్రమే. వీటన్నింటిలోనూ ఒక తలపండిన తాత్వికుడుగా సినారె మనలను పలకరిస్తారు.


కవికి మనసు మాత్రమే ఉంటుంది. వయసు ఉండదు. తలపండినదన్న భావం తలపులలో రాదు. అందుకే ‘ఎదుట నిలిచే సుదూర గమ్యం’ అన్న కవితలో ఆయన ‘గిరి శిఖరాలపై నుంచి దూకే జలపాతాలు, మోకాళ్ళు విరిగి పోతాయేమోనని శంకించవు’ అంటారు. అంతటి ఉత్సాహంతో మస్తకంలోని ఆలోచనలను పుస్తకంగా మనముందు పరిచారాయన.


శీర్షిక - నా చూపు రేపటి వైపు - అని ఇందులో వయసు వాసన ఏమయినా కనబడుతుందా?
‘గతం నిష్క్రమించింది. అమూల్య జ్ఞాపకాల విధులను నాకు మిగిలించి, అది నిశ్శబ్దంగా వెళ్ళిపోయింది’’. - అంటారు మొదట్లో. కానీ వెంటనే ‘‘వర్తమానం నాతో చేయి కలిసి నడుస్తున్నది’’ అంటారు. అక్కడ నుంచి కవి ముళ్ళబాటలో నడిచి, భవిష్యత్తును చేరుకుంటే అది ఆయన పాదాల ముందు వాలుతుంది!


ఈ శీర్షిక కవితను 85వ పేజీలో వేశారు. అక్కడ దాని భావం బాగా పండుతుందని కావచ్చు. జ్ఞాపకాల నిధులు సాధారణంగా ఎవరినయినా నాస్కార్జియాలోకి లాక్కుపోతాయి. కానీ ఆలోచనా శీలులయిన ఈ కవి మొదటి కవితలోనే ‘ఆలోచనలకు పదును పెడుతూ కూచున్నాను’ అని ప్రకటించారు. సినారెలోని కవి తత్వం ఆ ఒక్కమాటతో ఆవిష్కరింపబడుతుంది. మొదటి కవితలోనే (సృజనయాగం). ఈ మాట రావడం యాదృచ్ఛికమా? పథకం ప్రకారం వచ్చిందా? శీర్షికకు అనుగుణంగా, రేపటివైపు చూపులు సంకలనం అంతటా కనిపిస్తాయి. బలమయిన ఆశాభావం అడుగడుగునా ఎదురవుతుంది.


చాలా కవితల్లో కాలగమనం గురించిన ప్రసక్తి ఉంది. ‘ఇలా ఎంతకాలం అవిశ్రాంతంగా సాగిపోతావు’ అని కవి గడియారాన్ని అడిగారొక చోట (కాల సూచిక). ‘ఎగిరిపోయిన జ్ఞాపకం’ అన్న కవితలో ముందుకు సాగిపోతున్న జలధార, వెనకవైపు తిరిగి చూస్తుందా? అంటారు. ‘నీ ప్రయాణం ఎంతకాలమని? అంటూ జీవితానే్న ప్రశ్నిస్తారొక చోట. వయసు వాలిపోతున్నా, మనిషి నిటారుగా నిల్చోవాలి అంటారు మరోచోట.


సంకలనంలోని కవితల్లో ముఖ్యంగా కనిపించే మరో అంశం స్మృతులు. అయినా ఎక్కడో వాటిని గురించిన బాధ కనిపించదు. స్మృతులలో నుంచి బలమయిన సమస్యలు బయటపడతాయి. తలుపులు మూసుకుని ‘కలగన్న గది’ కలలోని సన్నివేశాలను నెమరు వేసుకుంటూ, తలుపులు తెరుస్తుంది.


ఇన్ని కవితల్లోనూ మనుషులు కనిపించరు. పక్షులు, చెట్లు, కొండలు, కళ్ళు, చెవులు, ముక్కు లాంటివి ఎక్కువగా భావాలకు ఆలంబనలయి ముందుకు నడిపిస్తాయి. ఆలోచనలకు పదును పెడుతూ కూర్చున్న కవికి ఒంటరితనంలోనూ, చూపులు రేపటిపైనే. కానీ గమనించవలసిన మరో అంశం. అక్కడక్కడ మరణం. శూన్యం లాంటి బలమయిన భావాలు! శూన్యాన్ని వెళ్ళి కలిసినప్పుడు అది ‘నాలో కలిసిపో!’ అని పిలిచిందట. కవి మాత్రం ‘మానవాళికి దూరమయి, అస్తిత్వాన్ని కోల్పోవడం, కుదరదంటారు. చదువుతూ ముందు సాగితే చివరకు ఏకాంతం గురించి కవిత రానే వచ్చింది.


‘కాలం గీసిన రేఖ’, ‘ఈ పూట’, ‘నడుస్తూ నడిపించే కాలం’, ‘కాలజ్ఞత’, ‘తిరిగి చూసుకుంటే’, ఇవన్ని చివరి భాగంలో ఇంచుమించు వరుసగా వచ్చిన కవితలు. అలా సాగుతూనే ఒకచోట ‘సూర్యోదయం సరియైన సమయానికే జరిగిందని సంతృప్తీ కనబడుతుంది.


‘సత్తా ఉన్నంత మాత్రాన విత్తనాలన్నీ మొలకెత్తవు’ అంటూ సాగే కవిత ప్రశ్నల ఆంతర్యం’ కవిగారు తమను తాము అడుగుతున్న ప్రశ్నలకు నికషోపలం!


జాగ్రత్త! ప్రాసలు కనబడవు. మాటకారి తనం కనబడదు. కాలం గడిచింది గదా! పాత సినారె కనబడరు! ఈయన మరెవరో. తలపండిన తాత్వికుడు!


కవితే తన చిరునామా అన్న ఈ కవిగారి మరో సంకలనం కొరకు ఎదురు చూద్దాం.

-గోపాలం కె.బి.

1 comment: