Wednesday, May 2, 2012

చీమ మనుషులు

ఈ ఫ్రపంచంలో ఉండే జీవరాశులన్నింటినీ తెచ్చి ఒక చోట కుప్ప పోస్తే, అందులో పావు వంతు మనుషులు ఉంటారు. ఆశ్చర్యంగా మరోపావు వంతు చీమలుంటాయి. చీమలంత విజయవంతంగా బతికే జీవి మరొకటి లేదంటారు ప్రకృతి పరిశీలకులు. ఈ ప్రపంచంలో ఒక్క అంటార్కిటికాలో తప్ప మిగతా అన్ని చోట్లా చీమలున్నాయి. మనకు అప్పుడప్పుడు చీమలతో చికాకు కలుగుతుంది. కానీ, చీమలు లేని ప్రపంచం కూడా చిత్రంగా ఉంటుందేమో! ఎడ్వర్డ్ విల్సన్ అనే హార్వర్డ్ పరిశోధకుడు చీమల తీరు గురించి చాలా పరిశోధించాడు. వాటి విజయం వెనక దాగే లక్షణాల గురించి చెపుతూ విల్సన్ మనుషుల గురించి కూడా వ్యాఖ్యానించాడు. గతంలో పులిట్జర్ బహుమతి కూడా గెలిచిన ఈ పరిశోధకుడు ‘ద సోషల్ కాంక్వెస్ట్ ఆఫ్ ద ఎర్త్’ (భూమి మీద సాంఘిక విజయం) అనే శీర్షికతో తన 27వ పుస్తకాన్ని ఈ మధ్యనే వెలువరించాడు. చీమలయినా, మనుషులయినా కలిసి బతకడమనే పద్ధతి కారణంగానే ఇంత విజయం సాధించినట్లు విల్సన్ ఆ పుస్తకంలో వివరించాడు.

చీమలు తమ స్థావరాలను కాపాడుకునేందుకు, కలసికట్టుగా, ప్రాణాలకయినా తెగించి పోరాడతాయి. స్థావరం ఎంత పెద్దది, విస్తారమయినదీ అయితే వాటి రక్షణ వ్యవస్థ కూడా అంతే గట్టిగానూ ఉంటుందని పరిశోధనలో తెలిసింది. ఆఫ్రికా, ఆసియాలలోని భూమధ్య రేఖా ప్రాంతం అడవులలో వీవర్స్ (నేతగాళ్లు) అనే రకం చీమలుంటాయి. అవి తామున్న చోట చుట్టూ పట్టుతో ఆకులను కుట్టి గూళ్లు తయారుచేసుకుంటాయి. మరో ప్రాణి వచ్చిందంటే వాసనతోనే పసిగట్టి, ఫార్మిన్ ఆసిడ్‌ను వాటిమీదకు ఆయుధంగా చిమ్ముతాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సాలమన్ దీవులలో సైనికులు శత్రు సైనికులకన్నా ఈ చీమలకు ఎక్కువ భయపడేవాడని విల్సన్ రాశాడు. ఈ రకంగా చీమలలో సంఘీభావం, రక్షణ పద్ధతి ఎంతో గట్టిదని చెపుతూ, మానవులది కూడా ఇదే తీరంటాడు ఈ పరిశోధక రచయిత.



 చీమలది చిన్న ప్రపంచం. మిగతా పురుగులు వాటికి శత్రువులు. మనుషులది పెద్ద ప్రపంచం. దానిమీద పూర్తిగా అధికారం సంపాదించి నియంత్రించేదాకా మానవులు రాగలిగారు. అటు చీమలకు, ఇటు మనుషులకు తమ ప్రపంచాలమీద ఇంతగా అధికారం రావటానికి సహకార గుణం, సంఘీభావం, స్వార్థాన్ని కొంతవరకైనా పక్కన పెట్టడం, నేను అన్న భావానికి దూరంగా అందరితో కలిసి అవకాశాలను అందిపుచ్చుకోవడం, మనమంతా ఒక్కటే అన్న భావం లాంటి లక్షణాలు స్తంభాలుగా నిలిచాయని విల్సన్ వర్ణించాడు.

ఈ ప్రపంచంలో గుంపులుగా బతికే జంతువులు చాలా ఉన్నాయి. వాటిలోనూ మంచి ‘గుంపు’ భావన ఉంది. కానీ, అంతకుమించిన సంఘీభావం మరొకటి ఉంది. అది కలిగిన గుంపులో తరతరాల జీవులు కలిసి ఉంటాయి. పనులను పంచుకుంటాయి. ఆత్మత్యాగానికి వెనకాడవు. గుంపు అవసరాల ముందు స్వంత అవసరాలు తక్కువగా కనిపిస్తాయి. ఈ రకం అతి సామాజికత అంత సులభం కాదు. మామూలుగా గమనిస్తే మనుషులకు కూడా ఎవరి యావ వారిదేనన్నట్టు ఉంటుంది. అయినా కలిసి బతకడం కారణంగా ఎన్నో లాభాలు కనబడుతున్నాయి. జీవపరిణామక్రమంలో ఈ అతి సామాజికత అన్నది చాలా ముఖ్యమయిన లక్షణం అంటాడు విల్సన్. నీటిలో నుంచి ప్రాణులు భూమి మీదకు రావటం, రెక్కల సాయంతో ఎగరడం, పువ్వులు, వాటివల్లజాతి కొనసాగటం లాంటి లక్షణాలతోబాటు ఈ సహజీవనాన్నికూడా లెక్కించవలసిన అవసరముందని ఆయన అభిప్రాయం. ‘జీవులెన్ని ఉన్నా, ఈ సామాజికత గలవి వాటి మధ్యలో సూపర్ జీవులయ్యాయి’ అంటాడాయన. ఈ సూపర్ జీవులలోని సంక్లిష్టత మిగతా రకాలకు వీలుకాలేదు. తమది అంటూ ఒక స్థావరం, ఎంత తిరిగినా తిరిగి అక్కడికే చేరాలన్న బలమయిన ఆకర్షణ ఈ సామాజికతకు కేంద్ర బిందువు. ఈ కేంద్ర బిందువునే తమ గూడుగా మలుచుకుని జీవులు దాన్ని అన్నిరకాలా రక్షించుకునే ప్రయత్నం చేశాయి. మానవుడు కూడా అదే మార్గాన నడిచాడు. ఒక పుట్ట, లేదా తేనె తెట్టె, అలాగే ఒక పల్లె, ఒక గుహ! అక్కడికి చెందనివారు ఎవరైనా వచ్చారంటే తరిమి కొట్టవలసిందే!


కోతి జాతులలో ఈ లక్షణం మొదలయింది మానవులతో మాత్రమే. సామాజికతను మానవులు మరింత ఎత్తులకు చేర్చారు. మిగతా కోతి రకాలకు ఇళ్లు, గూళ్లు లేవు. నియాండర్‌తాల్ మానవులు కూడా ఇల్లుకట్టుకునే ప్రయత్నం అంతగా చేయలేదు. ఇల్లు కట్టుకుని, ఊళ్లుగా వెలసిన ఆధునిక మానవుల ముందు.. అందుకే వారు నిలువలేకపోయారు. చీమల ముందు మిగతా పురుగులలాగే తల వంచి తప్పుకున్నారు. అయినా, మనిషి- చీమలు మిగతా సామాజిక జీవుల మాదిరి నడవలేదంటాడు విల్సన్.


మనిషి శరీరం తీరు, తెలివి, భావాలు, ఈ మార్గాన్ని మరో పక్కలు మలిపాయి. మనిషి భూమికి పరిమితమయ్యాడు. అవసరం కొద్దీ నిప్పును తయారుచేసి వాడుకున్నాడు. పాత పనిముట్లనుంచి కొత్తదానికి మళ్లాడు. భూమి మీద జంతువులు చాలామటుకు చిన్న శరీరం గలవి. మనిషి శరీరం వాటికంటే పెద్దది. అన్నిటికీ మించి మనిషి చేతులను గొప్పగా వాడుకున్నాడు. ఏ గిట్టలు, గోళ్లు చేయలేని పరిశీలన చేతుల కారణంగా వీలయింది. వేళ్లు ముడుచుకునే రకంగా ఉన్నాయి. బొటనవేలు వాటికి ఎదురుగా రాగలుగుతుంది. దేన్నయినాపట్టి, ఎత్తి, కంటిముందుకు తెచ్చి పరిశీలించడం వీలయింది. చేతులతో మరెన్నో చిత్ర విచిత్రమయిన పనులు వీలయ్యాయి.


మనిషిలో నాటి నుంచి నేటివరకు ఒక అవసరం కోసం అందరూ కలిసి పనిచేసే లక్షణం ఉంది. అయినా చిన్న కారణంతో యుద్ధాలు చేసే లక్షణం కూడా ఉంది. ఇక్కడ నిర్ణయం రకరకాల స్థాయల్లో జరుగుతుంది. మనవారికోసం ప్రాణాలకు తెగించడమూ ఉంది. చిన్న భావన పేరుతో ప్రాణం తీయడం కూడా ఉంది. సామాజికత గురించి, అడుగడుగునా గుర్తుచేయవలసిన అవసరం ఉంటున్నది. మనుషుల సామాజికతలో అన్నిటికన్నా మంచి లక్షణంతో పాటే, అధమ లక్షణం కూడా కనబడుతున్నది. మరి ఇది చీమలోని సామాజికతతో సమమయిన లక్షణం కానే కాదు. అందుకు కారణం ‘మన భావజాలం పాత రాతియుగం నాటిది, సాంకేతిక శక్తి మాత్రమే ఈ నాటిది కావడం’ అంటాడు విల్సన్. మనిషికి శత్రువు.. ఈ రకంగా మనిషే! ఇక్కడ సామాజికతకు అర్థం మారుతుంది!


మనం చీమలం కాము. చీమ మనుషులమైనా కాగలుగుతామా..?

1 comment: