Tuesday, May 29, 2012

కుక్క - మానవుడు


మనిషి... ఆరడుగుల ఎ త్తున్న మరో మనిషిని నమ్మడు. అంగుళం తాళాన్ని మాత్రం నమ్ముతాడు. అంతకన్నా ఎక్కువగా తన కుక్కను నమ్ముతాడు. మనిషి జాతికి మరో జంతువు గురించి పట్టనప్పటినుంచి కుక్క తోడుగా ఉంది. పదిహేను వేల సంవత్సరాల క్రితం అంటే వ్యవసాయం కూడా అంతగా రాని నాటినుంచే కుక్కలు సాయంగా వచ్చాయి. అయినా, మానవ నాగరికతలో కుక్క పాత్ర గురించి తెలిసింది తక్కువ. అటు వేటలో, తరువాత పశుపోషణలో కుక్కలు ఎంతో సాయం చేశాయన్నది నిజం. కుక్కలను గురించి పరిశోధకులు చాలామంది పట్టించుకున్నారు. డార్విన్ కుక్కల నడవడిని పరిశీలించాడు. తన నాచురల్ సెలెక్షన్ సిద్ధాంతానికి వాటిని ఉదాహరణలుగా వాడుకున్నాడు. 20వ శతాబ్దంలో నోబెల్ గ్రహీత కాన్రాడ్ లోరెంజ్ కుక్కలగురించి విస్తృతంగా పరిశీలనలు సాగించారు. స్కాట్, ఫుల్లర్ అనే జన్యు శాస్తవ్రేత్తలు కుక్కల నడవడిని విశే్లషించారు. ఇటీవలికాలంలో మాత్రం కుక్కల గురించి పరిశోధనలు అంతగా జరగలేదనాలి. 21వ శతాబ్దం వచ్చిన తర్వాత మాత్రం వాటి మీదకు మరోసారి చూపు మరలింది. తోడేళ్లనుంచి కుక్కలుగా మార్పులో జరిగిన అంశాలు, వాటి తెలివి, భావావేశాల గురించి ఎంతో పరిశోధన జరిగింది, జరుగుతున్నది కూడా. కనుక కుక్కల గురించి ఎన్నో కొత్త అంశాలు తెలియవస్తున్నాయి.

పెంపుడు జంతువుగా...

నిజానికి మానవుడు కుక్కలను ప్రయత్నించి మచ్చిక చేయలేదు. వేట పద్ధతినుంచి జీవనవిధానం మారుతున్న రోజులలో కుక్కలు వాటంతటవే మనిషి పంచన చేరాయి. తోడేళ్లు క్రమంగా కుక్కలుగా మారాయని, డిఎన్‌ఏవిశే్లషణలో బయటపడింది. ఇప్పటి తోడేళ్లను గమనిస్తే, రాతియుగం మానవుడు వాటిని చేరదీసి మచ్చిక చేసిన వీలు కనిపించదు. అంటే, వెనుకటి కాలంలో తోడేళ్లు మరింత మెత్తని స్వభావం కలిగిండేవని అర్థం చెప్పవచ్చు. ఆ జాతి గతించింది. వాటి వారసులుగా కుక్కలు మిగిలి ఉన్నాయి. అప్పటి తోడేళ్ళు మనుషుల ప్రాంతాలలో తిండికోసం తిరిగాయి. వాటి పిల్లలను మనుషులు చేరదీశారు. అప్పటి మానవులకు జంతువుల కూనలను తెచ్చి పెంచుకోవడం అలవాటు! అట్లా మనుషుల మధ్యల పెరిగిన జంతువులను మచ్చిక చేసి పనులు నేర్పడం సులభం. ఆ దారిలో మనిషికి కుక్కలసాయం మొదలయింది. కాపలా, వేటలాంటి లక్షణాలుకూడా నేర్చిన తర్వాత వాటి సాయం పెరిగింది. అంటే కుక్కలను మచ్చిక చేయడం అనుకోకుండా జరిగిన పని! కానీ, దానివల్ల అటు తోడేళ్ళకు, ఇటు మనుషులకు మంచి జరిగింది. సహవాసం సాగింది.

మచ్చిక - క్రమం

ఉత్తర ఇజ్రాయెల్‌లో ఒక సమాధిలో ఒక వ్యక్తి కుక్కమీద చెయ్యి వేసి ఉండడం కనిపించింది. ఆ కుక్క పిల్లకు, అప్పటి తోడేలు పిల్లలకూ ఎంతో తేడా ఉంది. ముఖ్యంగా, దాని దంతాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అంటే, ఆ కాలానికి తోడేళ్లు కొన్ని కుక్కలుగా మారినట్లు లెక్క. కుక్కపిల్లను మనిషితో బాటు ఖననం చేశారంటే పరస్పర సంబంధం, ప్రేమ అర్థమవుతాయి. 12 వేల సంవత్సరాల నాటి ఈ సమాధి కుక్కల చరిత్రలో ఒక గొప్పసూచనగా నిలిచింది. కానీ, అంతకుముందు ఎక్కడ, ఏ రకంగా కుక్కలు మచ్చికయిందీ చెప్పగల ఆధారాలు నేటివరకూ అందలేదు. గత ఏడాది సైబీరియాలో జరిపిన తవ్వకాలలో ఒక చోట కుక్క పుర్రె దొరికింది. అది 33 వేల సంవత్సరాలునాటిదని లెక్క తేలింది. పుర్రె నిర్మాణం కుక్క పుర్రెలాగున్నా, పళ్లు మాత్రం తోడేలు పద్ధతిలో ఉన్నాయి. గతంలో బెల్జియంలో దొరికిన ఒక పుర్రెకూడా 31 వేల ఏళ్ల నాటిదని ఈ మధ్యన నిర్ణయించారు. ఇది బహుశా, ఈనాటి కుక్కల పూర్వీకుల జాతికి చెందినవని అభిప్రాయం, అనుమానం వచ్చాయి. కానీ, ఈనాటి కుక్కలు ఈ క్రమంలోనివి కావని ఆధారాలు కూడా అందాయి. 24,000 నుంచి 13,000 సంవత్సరాలు మధ్యన, భూమి మీద మంచు యుగం వచ్చింది. అప్పుడు మానవులు దక్షిణ ప్రాంతాలకు తరలి వచ్చారు. మునపటి కుక్కలు వారితో రాలేదు. మచ్చిక కార్యక్రమం మరోసారి మొదలయింది.

మచ్చిక ఎక్కడ?

పురాతత్వ పరిశోధనలో అందిన ఆధారాల ప్రకారం, కుక్కల మచ్చిక మునుముందు పడమటి ఆసియా ప్రాంతంలో మొదలయింది. ఆ ప్రాంతాలను ఇప్పుడు మిడిల్-ఈస్ట్ (మధ్యప్రాచ్యం) అంటున్నారు. 2005లో కుక్కల డిఎన్‌ఏ నిర్మాణ క్రమాన్ని (జీనోమ్) పూర్తిగా గుర్తించారు. అంతకుముందు దొరికిన కుక్కలు, వాటి పూర్వీకులనుకున్న తోడేళ్ల జన్యు పదార్థాలను కూడా తరచి చూస్తే, పరిణామం, మచ్చికల గురించి మరెంతో తెలుస్తుంది. ఇలాంటి పరీక్షలు జరిగాయి. కుక్కలన్నింటిలోనూ మిడిల్ ఈస్ట్ పద్ధతి జన్యు నిర్మాణమే కనిపించింది. కనుక పురాతత్వ పరిశోధన వెల్లడించిన చరిత్ర సరయినదేనని గట్టిగా తెలిసింది. స్వీడన్ పరిశోధకులు పీటర్ సవొలైనెన్ మాత్రం కుక్కల పుట్టుక స్థానం ఆగ్నేయ ఆసియా అంటున్నాడు. జీవ జాతులు వేరు వేరు చోట్లకు చేరిన కొద్దీ వాటి జన్యువులలో వైవిధ్యం తగ్గి, మొదటి రూపం వస్తుంది. మాంగ్జే నది ప్రాంతపు కుక్కలలో మాత్రం ఆ లక్షణం కనిపించలేదు. యూరోపియన్ కుక్కలలో కూడా మధ్యప్రాచ్యం డిఎన్‌ఏ లక్షణాలు అంతగా కనిపించలేదట. కనుక పరిణామచరిత్రలో ఇంకా ప్రశ్నలు మిగిలాయి.
=================

అనుకోని నిజాలు

కుక్కల మధ్య బంధం
మచ్చికయిన తర్వాత కుక్కల కుటుంబం పద్ధతి పూర్తిగా మారిపోయింది. తోడేళ్లకు ప్రపంచమంటే కుటుంబం ఒకటే. తల్లి, తండ్రి, వాటి పిల్లలు కలిసి గుంపుగా తిరగడం వాటికి బాగా అలవాటు. పెరిగిన పిల్లలు కూడా తల్లిదండ్రులతోనే ఉండిపోతాయి. తమ తరువాత పుట్టిన పిల్లలను పెంచడంలో అవి సాయపడతాయి. తోడేళ్లనుంచి వచ్చిన కుక్కలకు మాత్రం ఈ కుటుంబం పద్ధతి ఏ మాత్రం చేతగాదు. కుక్కల మధ్యన ప్రేమ కలిగి ఉండడం లాంటివి కనిపించవు. అడవులలో పెరిగే కుక్కలు కూడా కుటుంబాలుగా ఉండవు. ఆడ తోడును ఎంచుకోవడంలో వాటికి ఒక పద్ధతి లేదు. ఇక పెంపుడు కుక్కలకు యజమాని, ఆ కుటుంబం మాత్రమే స్వంత కుటుంబంగా కనబడుతుంది. మిగతా కుక్కల సంగతి పట్టనే పట్టదు. నిజానికి కుక్కలకు.. కుక్క- మనిషి అనే తేడా తెలియదంటారు. మనిషితో కలిసి, మనిషినే జట్టు నాయకులుగా గుర్తించి బతుకుతాయవి!
ఎవరు ఎక్కువ?

కుక్కలలో పైచెయ్యి (డామినెన్స్) పద్ధతి లేదు. ఒక జంతువుల జత ఏదైనా విషయంలో పోటీపడితే అందులో ఎవరిది పైచేయి అన్నదే ఈ డామినెన్స్. కుక్కలలో నిజానికి మనిషితోబాటు ప్రైమేట్స్‌లో తప్ప, మరే జంతువులోనూ ఈ లక్షణం కనిపించదని పరిశోధకులు అంటారు. కుక్కలకు మనిషితోబాటు, మరే జంతువుతోనయినా పోటీ పడవలసి ఉంటే, అది అక్కడితోనే ముగుస్తుంది. రుచికరమయిన తిండి దొరకడం గానీ, ప్రేమతో నిమరడం గానీ జరిగితే కథ అంతటితో ముగుస్తుంది. పోటీపడుతున్న జంతువు గురించి కొంత తెలుసు గనుక, ఆ సంగతిని వాడుకుంటే, ఫలితం అందుతుందని మాత్రం తెలుసు. తమదే పైచెయ్యి కావాలన్న పట్టు మాత్రం లేదు.

దోషభావం లేదు
ఇంటికి వచ్చి చూచేసరికి కుక్క, ఏదో వస్తువును పాడుచేసిందనుకుందాము. కుక్కవేపు చూస్తే, దాని ముఖం, శరీరంలో దోషభావం కనిపిస్తే కనిపించవచ్చు. కానీ, అది తప్పు చేసినట్లు దానికి అర్థమయిందనడానికి సూచన మాత్రం కానే కాదు. ఈ విషయంగా పరిశోధనలు జరిగాయి. యజమానికి, కుక్క తప్పు చేసిందని, ఫిర్యాదు చేస్తే చాలు. దాని ముఖంలో ‘తప్పుభావం’ కనబడుతుందని గమనించారు. నిజానికి, కుక్క ఏ తప్పు చేయకున్నా, ఆ భావం కనబడుతుందట. యజమాని తనను శిక్షించబోతున్నారని అర్థమయితేచాలు, కుక్కలు బిక్కమొహం వేస్తాయన్నమాట. ఎందుకు శిక్షించబోతున్నారన్న సంగతి మాత్రం వాటికి తెలియదు!
==============

శక్తియుక్తులెన్నో..

* మనుషులకు సాయం చేయడంలో మరొక జంతువేదీ కుక్కలకు సాటిరాదు. చింపాంజీలకు కూడా మనుషుల శరీరం కదలిక సూచనలు అంత బాగా అర్థం కావు. వేలు చూసినా అర్థం చేసుకోవడం ఒక్క కుక్కలకే చేతనయింది. కుక్కలకు ‘నేర్చుకునే శక్తి- కోరికలు’ చాలా ఎక్కువ. మనుషుల నడవడిని అవి మరీ మరీ పరిశీలించి అర్థాలు తెలుసుకుంటాయి. కుక్కలకు మనుషుల ముఖ కవళికలు ఎంతో నచ్చుతాయి. కోపం, మెచ్చికోలు సులభంగా అర్థమవుతాయి. అసలు, ఆ ముఖం ఎటువేపు ఎందుకు చూచేదీ వాటికి అర్థమవుతుంది. కళ్ళు లేని వారికి కుక్కలు తోడుగా ఉంటున్నాయని తెలుసు. ఆ రకం కుక్కలను గురించి ఫ్లోరెన్స్ గానెట్ వంటి జంతు శాస్తజ్ఞ్రులు లోతుగా పరిశోధించారు. కళ్లు లేనివారు వారి ‘చూపును’ కూడా కుక్కలు చురుకుగా అర్థం చేసుకోగలుగుతాయని ఆమె అంటున్నారు.

* కుక్కలకు తమ పరిసరాలను గురించి అంతగా తెలియదని ఒక్కోసారి అనిపిస్తుంది. బ్రిటా ఓస్ట్‌హౌస్ అనే పరిశోధకురాలు ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగంలో రెండు హాండిల్స్ ఉంటాయి. వాటిలో ఒకదాని నుంచి కట్టిన దారం అటు చివరన మాంసం ముక్క ఉంటుంది. అయినా కుక్కలు ఆ దారం సంగతి పట్టించుకోకుండా, తిండికి దగ్గరగా ఉన్న హ్యాండిల్‌ను లాగాయి. కుక్కలకు కాలంలో వెనక, ముందుల గురించి కూడా అంతగా తెలియదని అర్థమయింది. గతం అనుభవాలను అవి గుర్తుంచుకోవు. రానున్న కాలానికి జాగ్రత్తలు వాటికి తోచవు. అందుకే ఒంటరిగా వదిలిన కుక్కలు మరీ సమస్యలకు గురవుతాయి. సమస్యలకు కారణమూ అవుతాయి. వదిలి వెళ్లిన యజమాని ఏదో ఒకనాటికి తిరిగివచ్చే సంగతి వాటికి తోచదు.

* కుక్కల ముక్కు, వాసన శక్తి ఎంతో ప్రత్యేకమన్న సంగతి తెలిసిందే. మనుషుల వాసన శక్తి కుక్కలతో పోలిస్తే, చాలా తక్కువ. మనుషులకు సూచనగా కూడా తెలియని వాసనలను కుక్కలు పసిగడతాయి. మనిషి రక్తంలో డయాబెటిస్ కారణంగా చక్కెరలు ప్రమాద స్థాయికి చేరుకుంటే కుక్కలు గుర్తించి హెచ్చరిక చేయగలుగుతున్నాయి. అవసరమైతే అర్థరాత్రి కూడా మనిషిని నిద్రలేపి, హెచ్చరించేలా కుక్కలకు శిక్షణ ఇవ్వగలిగారు. కుక్కలలో వాసనకు సంబంధించిన వోమెరో నేసల్ ఆర్గాన్ అనే రెండవ (అదనపు) వ్యవస్థ ఉంటుంది. పైవరుస కోరపళ్లమీద నుంచి ఒక డక్ట్ ఉండి ముక్కులోకి తెరచుకుంటుంది. ఈ దారి వెంట కూడా వాసనలు తెలుస్తుంటాయి. ఈ వ్యవస్థ గురించి మరింత పరిశోధన జరగవలసి ఉంది. మిగతా కుక్కల వాసన గుర్తించటం దీని పని అని పరిశోధకులు భావిస్తున్నారు.

Friday, May 25, 2012

మన పనితనం

మనం ఒక ఉద్యోగం కొరకు అభ్యర్థన పంపాలంటే, మనకున్న ఆ కోరిక ఒకటి చెపితే చాలదు. మన గురించి, చదువు గురించి, ఇంతకుముందు చేసిన ఉద్యోగాల గురించి వివరాలు కూడా పంపాలి. ఈ సంగతులనంతా ఒక క్రమంలో రాసి పంపాలి. బయోడేటా, కరికులమ్ విటే, రెజూమె లాంటివి ఇందుకు పద్ధతులు. ఈ మధ్యన రెజుమె (ఈ మాటను సరిగా పలకడం చాలామందికిచేతకాదు. తెలుగులో దాన్ని రాసి చూపించడం అంతకన్నా వీలు కాదు) పద్ధతిని అందరూ ఆదరిస్తున్నారు. ఇంటర్‌నెట్లో చాలా సైట్లు మొదలు ట్రెయినింగ్ సంస్థల దాకా అందరూ మీ రెజుమె మేము బాగా రాసి యిస్తామంటారు. అంతేగాని, ‘బాగు’ లేక ‘మంచి’ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మన గురించి రాసే ఈ వివరాల పట్టిక ఎంత పొడుగుండాలి? దానికి సరయిన పద్ధతి అంటూ ఏదైనా ఉందా? వర్డ్ డాక్యుమెంట్ పంపాలా? లేక పీడిఫ్ పంపాలా? లాంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం దొరకదు. ప్రింటు వేసి పంపే సందర్భంలో కూడా కాగితం సైజు, అక్షరం సైజు, ఎన్వలప్ సైజు లాంటివన్నీ అనుమానాలే.


అప్లికేషన్‌ను ఇతర దేశాలకు పంపాలంటే మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. గ్రీసు దేశం వారికి మన వివరాలు ఎంత నిడివి ఉంటే అంత నచ్చుతాయట. నార్వేలో మాత్రం రెజుమె రెండు పేజీలు మించితే విసుక్కుంటారు. ఇటలీ, న్యూజీలాండ్ లాంటి దేశాలలో సీనియర్‌లయితే నిడివి అయిదు పేజీల దాకా ఉన్నా ఫర్వాలేదు. మన దేశంలో మరి ఏమిటి పరిస్థితి? ఎవరికయినా తెలుసా? దక్షిణాఫ్రికాలో అప్లికేషన్‌తో బాటు మన ఐడి నంబరు, ఏ దేశం వారులాంటి వివరాలు తప్పక ఇవ్వవలసి ఉంటుంది. జపానులో రెజుమె అంటే మన బయోడేటాలాగా పేరు, వయసు, స్ర్తి/పు వివరాలతోనే మొదలవుతుంది. యూరపులో కొన్నిచోట్ల అభ్యర్థులు తమ పేరు తప్ప మిగతా వివరాలు అన్నీ పంపడం కూడా ఉంది. మన దేశంలో కొన్ని రోజులకు ఆధార్‌నంబరు, అలాంటిదే మరో నంబరు అడుగుతారనవచ్చు. ఇంతకూ మనం ఏ రకమయిన వివరాలను ఏ పద్ధతిలో పంపాలన్నది ప్రశ్న!

అప్లికేషనుతో బాటు మన వివరాలు పంపవలసిన అవసరం ఏమిటి? అక్కడ ఒక వ్యక్తి కావాలి. ఆ పని చేయడానికి ఆ వ్యక్తికి కొన్ని సామర్థ్యాలు ఉండాలి. మనం ఆ పనికి పనికివస్తామని రుజువు చేయడానికి మనం, మన సామర్థ్యల వివరాలు పంపించాలి. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఈ పరిస్థితిమాత్రం మారదు. ఫెరారీ అనే కార్ల కంపెనీ వారు కొత్త మోడల్ కారు వచ్చినపుడు ఒకకొత్త కరపత్రం అచ్చువేయిస్తారు. వాళ్లు తమ కార్లను ప్రపంచమంతటా అమ్ముతారు. అన్ని దేశాలలోనూ పత్రంలోని భాష మారుతుంది గానీ, స్వరూపం మాత్రం ఒకేరకంగా ఉంటుందట. మన దరఖాస్తు, అర్జీ, అభ్యర్థన, అప్లికేషన్ విషయంలో కూడా ఇదే పద్ధతి పాటిస్తే తప్పులేదు. అందులో కథలు, కాకరకాయలు కాకుండా సూటిగా సమాచారం ఉండాలి.

రైల్వేవారు క్రీడాకారులకు ఉద్యగాలు యిస్తుంటారు. ఒక ఫుట్‌బాల్ ఆటగాడు తన అప్లికేషన్ పంపాడు. అందులో అతను ఇచ్చిన వివరాలు గమనించండి. వృత్తి: ఫుట్‌బాల్ ఆడడం, బాధ్యతలు: బంతిని తన్నడం, దాంతో పరుగెత్తడం, వీలయితే గోల్‌లోకి తన్నడం.. అలా సాగాయి వివరాలు. సాధారణంగా వృత్తి అంటే మనకు మరోలా తోస్తుంది. ఆకుపేషన్ అన్న ఇంగ్లీషు మాటకు ‘కులవృత్తి’ జవాబుగా తోచనవసరం లేదు. లెక్కలు రాయడం వృత్తి అయితే, అందులో భాగంగా ఏయే రకం పనులు చేశామన్నది చెప్పాలి. మదర్‌టంగ్ అన్న కాలంలో ఒకతను -అందరు అమ్మల నాలుకలలాగే అని రాశాడు! అప్లికేషనులో కనిపించవలసింది మన విలువ, సాధించిన పనులు మాత్రమే.

ఈమధ్యనే చేసిన ఉద్యోగంలో వెలగబెట్టిన నిర్వాకమంతా ఏకరువు పెడతారు కొందరు. అక్కడ ఇంతకూ మనం సాధించినదేమిటి, అంతకుముందు, అలాంటి శక్తి పాటవాలు ప్రదర్శించామా? లాంటి వివరాలు అవతలివారికి అందవు. నిజానికి చాలామంది ‘నేనేమి సాధించలేదు’ అంటారు. లేదా మామూలు సంగతుల గురించి గొప్పగా రాస్తారు. వాస్తవాలను రాయడం అంత కష్టం మాత్రం కాదు. మామూలు పనిలో కూడా మనం ప్రత్యేకంగా ఏమైనా చేయగలిగామా? అని ఆలోచించగలిగితే చాలు.
సేల్స్‌లో పనిచేసి ఉంటే, సూచించిన టార్గెట్‌లను అందుకున్నామా? అధిగమించామా? ఆ కంపెనీలో ముఖ్యులయిన క్లయింట్ల అకౌంట్లు మీ చేతిలో ఉండేవా? మంచిపని చేసినందుకు కంపెనీవారు గానీ, మరెవరైనాగానీ, మీకు అవార్డులు, అభినందనలు అందించారా? లాంటి వివరాలు మన విలువను పెంచుతాయి.

ఎంత పెద్ద బడ్జెట్‌లను మనం నిర్వహించాము లాంటి వివరాలు మరింత బలం అందిస్తాయి. లక్షలు, కోట్లలో ఉండే లావాదేవీలు మన చేతిమీద నడిచినట్లయితే గొప్ప. చివరకు అలాంటి ప్రాజెక్టులో ఏ మూలనయినా బాధ్యత గల పొజిషన్‌ను నిర్వహించి ఉంటే, మన విలువ బయట పడుతుంది. వేల మంది పనిచేసే ఒక ఆఫీసు కాంప్లెక్స్‌లో పరిశుభ్రతను ‘నేనే నిర్వహించాన’ని గౌరవంగా, గర్వంగా చెప్పవచ్చు. పాత కంపెనీలో మన తాహతుకుమించిన బాధ్యతలు మనమేదయినా నిర్వహించామా? అనుభవంలేని వారు కూడా వెతికితే, చదువుకునే సమయంలో చేపట్టిన బాధ్యతలు, సంధించిన లక్ష్యాలు ఉండే ఉంటాయి. రాత, మాట అవసరమయే ఉద్యోగాలు చాలా ఉంటాయి. ప్రజలతో సంపర్కం ఉండే బ్యాంకు ఉద్యోగాల లాంటివి కొన్ని ఉంటాయి. అక్కడ మన తీరు, మన మాట తీరులకు ప్రాముఖ్యం ఉంటుంది. రచనలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలాంటి వాటికి అక్కడ ప్రాముఖ్యం! అసలు కస్టమర్లను సంతృప్తిపరచడం, వారి చేత అవుననిపించుకోవడం గొప్ప సామర్థ్యం! అలాంటి అనుభవాలు మనకు ఉన్నాయా?

అసలు బాధ్యతలతో బాటు అదనపు బాధ్యతలు నిర్వహించిన వారికి గౌరవం ఎక్కువ. ఇలాంటి వివరాలన్ని రెజుమెలో ఉండాలి. దానితోబాటు, అంతే గౌరవంగా రాసిన కవరింగ్ లెటర్ ఉండాలి. ఆ ఉత్తరాన్ని చూడగానే, చదవగానే మన తీరు బయట పడుతుంది. కాగితాలను మడిచి చిన్న కవర్లో పెట్టడంలోనూ, సరైన సైజు ఎన్వలప్‌లో, లేదా మరీ పెద్ద కవర్‌లో పెట్టంలోనూ తేడా ఉంది! వారి సమస్యకు ‘మనం సమాధానం’ అన్న భావం కలిగించగలిగితే గ్రేట్! కదూ!



రెండవ అవకాశం





అనగనగా ఒక రైతు. ఆయన పొలం అడవికి పక్కనే ఉంది. కష్టపడి పనిచేస్తాడుగానీ, ఏదో ఒకనాడు అదృష్టం వచ్చి తన ముందు కుప్పగా పడుతుందని అతనికి ఒక నమ్మకం. అతను మామూలుగానే తోటలో తన పని తాను చేసుకుంటున్నాడు. అంతలో బాగా బలిసిన కుందేలు ఒకటి వేగంగా పరిగెత్తుతూ వచ్చింది. మరీ వేగంగా వచ్చిందేమో, అక్కడ ఒక చెట్టుకు తగిలింది. చటుక్కున దాని మెడ విరిగింది. కుందేలు పాపం చచ్చిపడింది.
రైతుకు మాత్రం అది అదృష్టంలాగా కనిపించింది!
అతను వెళ్లి కుందేలును ఎత్తి తెచ్చుకున్నాడు. ‘ఇట్లా నిత్యం ఒక కుందేలు దొరికితే ఇంకేం కావాలి? ఈ కష్టం, ఈపని ఏవీ అవసరమే ఉండవు అనుకున్నాడు.
మరునాటినుంచి అతను పార, పలుగు పక్కన బెట్టి ఆ చెట్టు దగ్గరే మరో కుందేలు కోసం ఎదురు చూడసాగాడు. రోజులు గడుస్తున్నాయి, కుందేలు మాత్రం మరొకటి రాలేదు.
రైతు ఆశ మాత్రం చావలేదు. అందరూ అతడిని గేలి చేయసాగారు.

(అదృష్టాలు, అవకాశాలు అనుకోకుండా వస్తాయి. వాటి గురించి ఎదురుచూచి లాభం లేదు. వస్తే ఆనందించాలి గానీ అవకాశాల కొరకు ఆశించకూడదు. కష్టపడడంలో ఉన్న సుఖం మరోచోట లేదు. చేయదల్చుకున్న మంచి పనయినా మొదటి అవకాశంలోనే చేయాలి. మరోసారి చూద్దాం అనుకుంటే, ఆ మరోసారి రానే రాదు!)

====================
అసలు మాట!
మనమేమయినా అయిపోవచ్చు. అందుకే ఇక్కడ అన్యాయమన్నది అసంభవం. పుట్టుక ప్రమాదవశాత్తు జరుగుతుందేమో? చావులో మాత్రం ప్రమాదం లేదు. మనం ఎలాగున్నామో, అలాగే ఉండిపోవాలని ప్రపంచంలో ఏ శక్తీ ఒత్తిడి చేయదు
-జాన్ బెర్జర్

మిగతా జీవులకు అంతగా లేని వెసులుబాటు మనుషులయిన మనకు ఉంది. మనం తార్కికంగా ఆలోచించగలుగుతాము. కార్యకారణాలను గుర్తించగలుగుతాము. సహేతుకంగా, తెలివిగా మనకు కావలసినవాటిని ఎంపిక చేసుకోగలుగుతాము. నిర్ణయించి కొత్త దిశలో కదలగలుగుతాము.

కోపం ప్రదర్శించడం కుదరలేదనుకుందాం. మన భావాన్ని మరో రకంగా పదుగురికీ తెలియజేసే మార్గం వెతకగలుగుతాము. మనవారి పొత్తు పొసగకపోతే, ప్రయత్నించి సమస్యకు సమాధానం వెతకగలుగుతాము.
ఏ విషయంలోనైనా ఒకటి కంటే ఎక్కువ మార్గాలుంటాయి. చాలామంది పని ఒత్తిడి పేరున ఈ సంగతి గుర్తిచలేకపోతారు. అప్పుడు అక్కడ ఇరుక్కుపోయిన భావం కలుగుతుంది. మార్గాలు ఉన్నా కనిపించవు. అంతా గందరగోళమవుతుంది.
నిలకడగా ఆలోచించడం మంచిది!

Thursday, May 24, 2012

ముగ్గు -వపా చిత్రం


ఇది వడ్డాది పాపయ్య గారు వేసిందని వేరే చెప్పాలా?

Monday, May 21, 2012

గతంగా మనం

ఆది మానవుడు, రాతియుగాలు, పాత బతుకుల గురించి మనకు తెలిసింది చాలా తక్కువ. తెలుసుకోవాలన్న ప్రయత్నం మాత్రం సాగుతూనే ఉంది. మానవ జాతి మరింత కాలం కొనసాగుతుంది. రానున్న కాలానికి మనం ‘గతం’లో ఉంటాము. మన ప్రస్తుతపు బతుకుల గురించి, ఆ తరాలకు తెలియగలిగిన సమాచారం గురించి ఆలోచనలు మొదలయినయి. మన గతంలో వారికి సమాచారాన్ని కేవలం సమాచారంగా దాచవచ్చునన్న ఆలోచన లేదు. అది కలిగిన తర్వాతి సమాచారం కూడా మన వరకూ మిగల్లేదు. నలందా, తక్షశిల గ్రంథాలయాలు మనకు అందలేదు. ఒక అగ్నిప్రమాదంలో అలెగ్జాండ్రియా జ్ఞాన భాండాగారం మసిగా మారింది.


లక్ష సంవత్సరాల తర్వాత పురాతత్వవేత్తలు మన గురించి తెలుసుకునే ప్రయత్నంలో పడితే ఏం దొరుకుతుంది? మనకు దొరికినట్లే కుండ పెంకులు, బూడిదల ఆధారాలేనా? కాలం ఒరిపిడికి నలగకుండా, నలుదిక్కులా చెల్లాచెదరు కాకుండా, కరిగి, మురిగిపోకుండా ఏ రకం సాక్ష్యం మిగులుతుంది? వ్యక్తిగా ఏ ఒక్కరూ తమ ఆనవాలుగా, ఆనాటి వారి కొరకు ఏమీ మిగల్చలేరు. మన తాతగారి తాతగారి వస్తువు, మన ఇంట్లో ఒక్కటి కూడా లేదు. మరో లక్ష సంవత్సరాలవరకూ మనగలిగిన వస్తువు మన దగ్గర లేదు. మానవజాతి చరిత్ర లక్ష సంవత్సరాల క్రితం మొదలయింది. అదీ ఆధునిక మానవుని చరిత్ర. అది ఆఫ్రికాలో మొదలయింది లాంటి విషయాన్నీ ఊహలు మాత్రమే. రాతి పనిముట్లు అక్కడక్కడ రాళ్లుగా మారి మిగిలిన అవశేషాలు ఈ ఊహలకు ఆధారాలు.

మనం భూమి మీద బతుకుతున్నాము. మన ఎముకలు రాయిగా మారి (శిలాజాలయి) మిగిలిపోయే వీలు చాలా తక్కువ. కానీ, ఏడు వందల కోట్ల మంది ఉన్నాము గనుక, ఏ కొందరి అవశేషాలయినా మిగిలితే మిగలవచ్చు. అటువంటి అరుదైన అవకాశం రావాలంటే మనుషులూ, మరిన్ని జంతువులూ కాల్షియం బాగా ఉండే మడుగులు, చిత్తడి నేలలు, గుహలలో చనిపోవాలి. ఆ శరీరాలు ‘తక్షణం శిలాజాలు’గా మారతాయి. శరీరం, ఎముకలు కుళ్లిపోయేలోగా వాటిలో ఖనిజాలు చేరుకుంటాయి. కనుక గట్టిబడి మిగిలిపోతాయి. దక్షిణ కీన్యాలో ఒక వన్యమృగం ఇలాగే చనిపోయింది. రెండు సంవత్సరాలు కూడా గడవకముందే దాని శరీరంలో కాల్షియం కార్బొనేట్ నిండిపోయింది. శరీరం రాతివిగ్రహంగా మారింది.

శ్మశానాల్లో పాతిపెట్టిన శరీరాలు కనీసం కొన్ని శతాబ్దాలలో ఎముకలతో సహా మట్టిగా, నుసిగా మారిపోతాయి. కనుక రానున్న యుగాల మానవులు మన కోసం శ్మశానాలలో వెతికి లాభం ఉండదు. కానీ ప్రమాదాలు జరిగి, సామూహికంగా జనం అంతరించినచోట కొన్ని అవశేషాలు మిగిలే వీలు ఉంది. ఈ మధ్య వచ్చిన సునామీలో కొందరు అలా మట్టిలో మిగిలిపోయారు. అగ్నిపర్వతాల బూడిదలో కప్పుకుపోయిన వారు కూడా అలాగే మిగిలిపోతారు. పీట్ గుంటలలో, ఎడారులలో కూరుకుపోయిన శరీరాలు కూడా మమీలుగా మారతాయి. కానీ, లక్ష సంవత్సరాల కాలంలో వచ్చే మార్పులను తట్టుకుని అవి మిగిలి ఉండే వీలు మాత్రం తక్కువ. మన గురించి మిగిలి ఉండగలిగిన మరికొన్ని ఆధారాలు కూడా ఈ మార్పుల కారణంగా నాశనమయిపోతాయి. సముద్ర మట్టాలు పెరిగితే, తీరాలలోని నగరాలు మునిగిపోతాయంటున్నారు. అలల కారణంగా అక్కడి భవనాలు సమసిపోతాయి. భూమిలోపలి మాళిగలు, పునాదులు మిగిలిపోతాయి. కొంతకాలానికి కాంక్రీటు కూడా కరిగిపోతుంది. అయినా వాటి ఆకారాలు మాత్రం మట్టిలో అచ్చులుగా మిగిలి ఉంటాయి. ఈ రకం ఆకారాలు ప్రకృతిలో మరెక్కడా ఉండవు గనుక, అప్పటివారికి అవి మనిషి ఆనవాళ్లుగా దర్శనమిస్తాయి.

మనుషులు మరీ పెద్ద నిర్మాణాలను నిలబెడుతున్నారు. ఆనకట్టలు వాటిలో కొన్ని. అదేరకంగా, గనుల పేరున తవ్విన గుంటలలో సెడిమెంట్ నిండుతుంది. నిర్మాణం గురించి తెలుస్తుంది. మనం ప్రస్తుతం భూమి వాడుకుంటన్న తీరు బహుశః అర్థ్ధమవుతుంది. యుఎస్‌లోని హూవర్ డ్యాం, చైనాలోని త్రీ గార్జెస్ లాంటివి మరీ పెద్దవి. వాటి ఆనవాళ్లు లక్ష సంవత్సరాల వరకు తప్పక మిగులుతాయంటారు పరిశోధకులు. ఫిన్‌లాండ్‌లో అణు వ్యర్థాలను దాచడానికి ఒక రిపాజిటరీని ఏర్పాటు చేస్తున్నారు. అది లక్ష సంవత్సరాలయినా నిలిచి ఉండే రకంగా కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి నిర్మాణాలు కూడా కొన్ని మిగిలిపోతాయి.

రానున్న కాలానికి మనం వదులుతున్న ‘చెత్త’ మాత్రం తప్పకుండా అందుతుంది. నగరాల వ్యర్థాలను లాండ్‌ఫిల్స్ పేరున మేట వేస్తున్నారు. నిండిన ఈ గుంటల మీద మట్టి పొరలు కప్పుతున్నారు. కనుక లోపలికి ఆక్సిజన్ చొరకుండా ఉంటుంది. ఏ పదార్థమయినా పాడవడానికి, మారడానికి ముందు ఆక్సిజన్ అవసరం. గాలి, ఆక్సిజన్ తగలకుంటే ఈ చెత్త గుంటలలో పూడుకుపోయిన గుడ్డలు, కర్రలు కూడా ఎంతకాలమయినా మిగిలి ఉండే వీలు ఉంది. ఈ పదార్థాలన్నీ కాలక్రమంలో మారతాయి. అయినా ఆ కొత్త రూపం వాటి పాత స్థితిని పట్టి ఇవ్వగలుగుతుంది.

కొన్ని పదార్థాలు మాత్రం ఎట్లున్నవి అట్లా ఉండిపోతాయి. నిజానికి మనం పాత్రల కొరకు, మరే ఉపయోగానికీ రాతిని వాడడం మానుకున్నాము. రాతి విగ్రహాలు మాత్రం తయారవుతున్నాయి. అవి కొంతకాలం మిగిలి ఉంటాయి. పింగాణీ కప్పులు, ప్లేట్లు, మగ్గులు కూడా ఎనే్నళ్లయినా మిగిలి ఉంటాయి. అంటే, కొత్త మనుషులకు మనం ‘రాతియుగం’గా మిగిలిపోతాము. ఇనుము లాంటి లోహాలు త్వరగా మారిపోతాయి. టైటేనియం, స్టెయిన్‌లెస్ స్టీల్, బంగారం లాంటివి కొన్ని ఎంతకాలమయినా ఉంటాయి. అయిదు వేల ఏండ్ల నాటి బంగారం ఇప్పటికీ కొత్తదిగా తళతళలాడుతూ ఈజిప్టులో దొరికింది. లక్ష సంవత్సరాలయినా అది అట్లాగే ఉంటుందని అంటారు సైంటిస్టులు. లాప్‌టాప్ కేసులను టైటేనియంతో తయారుచేస్తున్నారు. లోపలి భాగాలన్నీ పోయి ఈ కేసులు మాత్రం మన గుర్తులుగా మిగులుతాయి. వాటి ఆకారాలు, వాటిమీది కంపెనీ గుర్తులు, అప్పటివారికి పెద్ద చిక్కు ప్రశ్నలుగా ఎదురవుతాయేమో?

మన గురించి తెలియజేయడానికి ఏదో మిగిల్చిపోవాలని ప్రయత్నం జరుగుతుంది. కానున్న వారికి మన నాగరికతలోని ఏ అంశం ఎంత ఆకర్షణీయంగా కనబడుతుందన్న ప్రశ్నకు జవాబు లేదు. ప్రస్తుతం ప్రాచీన మానవుల గురించిన పరిశోధన మొత్తం డార్విన్ సిద్ధాంతాల ఆధారంగా సాగుతున్నది. వంద సంవత్సరాల క్రితం ఈ సిద్ధాంతం లేదు. ప్రస్తుతం మనం సేకరించి, నిక్షేపాలుగా దాచుకుంటున్న ఆనవాళ్లు రానున్న యుగాలవారికి ఏ రకంగా కనబడేదీ, వాటికి వారు ఏమని అర్థాలు చెప్పుకునేదీ మనం ఊహించలేము. అప్పటివారికి రాగలిగే ఆలోచనలు ప్రస్తుతం మనకు తోచే ఆస్కారం లేదు.

Saturday, May 19, 2012

Friday, May 18, 2012

పలుకుబడి- వ్యాస సంకలనం


పలుకుబడి- వ్యాస సంకలనం,
రచన- తెలిదేవర భానుమూర్తి,
లిఖిత ప్రెస్, బాగ్‌లింగంపల్లి,
హైదరాబాద్- 44,
పేజీలు: 169, వెల: రూ.100/-

మాండలికం యాసలో కవితలు, కథలు రావడమే కరువయింది. దానికి రాజకీయ, సాంఘిక కారణాలు ఉన్నాయని అనిపిస్తుంది. భాషాపరంగా కూడా కారణాలున్నాయి. మాండలికంలో రచనలు ఆ ప్రాంతం వారికి తప్ప మిగతా వారికి మింగుడు పడవు. మాండలికం మనుషుల నోళ్లలో ఉంటుంది. దాన్ని కాయితం మీద పెట్టడమే ఒక ప్రయత్నం. నిజంగా పలికే తీరుకు అక్షర రూపం యిస్తే, ఆ అక్షరాలు, ఆ మాండలికం వారే కూడబలుక్కుని చదవవలసి వస్తుంది. ఇగ సమఝకు అచ్చుడు సంగతే ఏర్పాటుగుంటది! అది ఏ యాసయినా ఇదే పరిస్థితి.

తెలంగాణ మాండలికమని ఒక భాష లేదు. తెలంగాణంలో ఒకే జిల్లాలో బోలెడన్ని యాసలుంటయి. మారిన మాటలకు అర్థాలు తోచనుకూడ తోచవు. అటువంటి వాతావరణంలో తెలిదేవర భానుమూర్తిగారు పత్రికలో పనిచేశారు గనుక, ఏకంగా కాలం రాశారు. అది పొలిటికల్ సెటైర్! ఈ సంకలనంలోని వ్యాసాలు ‘చంద్రబాబునాయుడు రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన ప్రహసనంపై భానుమూర్తీయమయిన పరిహాసమ’ని ప్రచురణకర్తలే ప్రకటించారు.

పుస్తకం నిండా చంద్రబాబునాయుడే! అజరుద్దీనూ, వాజ్‌పేయి సర్కార్, చంద్రశేఖరూ, దేవేంద్రగౌడూ అక్కడక్కడ తొంగి చూస్తారు. ఇదంతా గతం కథ! అయినా తెలంగాణ మాండలికం చదవాలనుకున్న వారికిది బాగానే ఉంటుంది! ఏ మాండలికమయినా హుషారుగా ఉంటుంది. రాజకీయం మీద చెణుకులు మరింత బాగుంటాయి. అయినా, మందులకన్నా శ్రేష్టం (!) ఉత్తమం, రోగాలు మటుమాయమవుతాయి లాంటి మాటలు మాత్రం, అసలు రచనను పోలి అన్నవేమోననిపిస్తుంది.

మురికి కాల్వలు మంచివి. కమస్కం గండ్లనన్న నీల్లుండయి! (కమ్‌సే కమ్, కనీసం! మన్సుకొచ్చిందా?) ఆత్మ నీల్లల్ల నానదు, నిప్పులల్ల గాలదు, ఆత్మహత్య ఎట్ల జెయ్యొస్తది లాంటి మాటలు నిజంగా కితకితలు పెడతాయి. అప్పులు దెచ్చే కళ, పిలగాడు పరీక్ష ఫేలయినందుకు దావతు, దేవుళ్లమీద విసుర్లు కూడా ఆలోచింపజేస్తాయి. ‘బైరూపులోండ్లు’ రకరకాల అంశాల మీద ఆటలాడి అందించే వ్యాఖ్యానాలు చదివిస్తాయి.

ఇంతకూ చంద్రబాబునాయుడు ఈ వ్యాసాలు చదివి ఉంటారా? నవ్వుకుని ఉంటారా? తప్పక చదివే ఉంటారు. మీరుకూడా చదవండి. అర్ధమయినా కాకున్నా నవ్వు మాత్రం వస్తుంది. గింతకు, తెలంగాణముల గింతగానము ‘గ’కారం వాడుతరా? గట్లనే వాడుతరేమొ? గెవనికెరుక?

Wednesday, May 16, 2012

చేతులు కలిసిన చప్పట్లు


జీతం బాగానే ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ మాత్రం లేదన్నారు. అందరికీ ఇవ్వగూడదని ఒక పాలసీ! అందుకని ఇవ్వలేదు! అని చెప్పారు కూడా. అయినా అతను అక్కడే సంతోషంగా పని చేస్తున్నాడు. అతనికి అక్కడ ఆనందంగా ఉందని మాత్రం కాదు. ఆనందం కొంత ఉంది. కొంత లేదు. ఉద్యోగం వదిలితే మరోచోట దొరుకుతుంది. ఎక్కువ జీతం వచ్చే వీలు కూడా ఉంది. కానీ, ఎక్కడో ఏదో మెలిక ఉంది. ఏది బాగుంది. మేనేజర్లు తప్ప మిగతా వారంతా బాగుంటారు. బహుశ పనిలో ఎక్కడో కొంత సంతృప్తి కూడా దొరుకుతున్నట్లుంది.

బోలెడు జీతాలు, బోనసులు ఇవ్వడం గొప్పకాదు. జీతాలు బాగా ఇస్తే ఎవరూ కెఫెటీరియాలో తిండి తినరు. బైక్ వేసుకుని మరెక్కడికో వెళ్లిపోతారు. అక్కడ కూడా మేనేజర్ (వెర్రి) గురించి మాట్లాడుకుంటారు. వాళ్లకు మరి జీతం కన్నా, కావలసింది మరేదో ఉందిమరి! చేసే పనికి అర్థం ఉండాలి. వాళ్ల శక్తి బయటపెట్టి చూపించడానికి తగిన అవకాశం ఉండాలి. అంతేగానీ, ఫలితం బాగున్నా, పద్ధతి తమది కాదని, అదేపని మళ్లీ చేయమంటే, వాళ్లకు ఒక అసంతృప్తి మిగులుతుంది. అప్పుడు జీతం గుర్తురాదు. మీరు మేనేజరయినా, కాకున్నా ఈ సంగతి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగాలలోనూ, ప్రైవేటు కంపెనీలలోనూ ఎవరికెంత జీతం ఇవ్వాలన్న విషయం మధ్య మేనేజర్ల చేతుల్లో ఉండదు. ఆ అధికారం ఉంటే బాగుండునన్న కోరిక మాత్రం మేనేజర్లకు బాగా బలంగా ఉంటుంది. జట్టులో వారిని ఉత్సాహపరిచి, పని మీద అభిమానం పెరిగేలా చేయవలసిన బాధ్యత మాత్రం పూర్తిగా మధ్య మేనేజర్లదే. తమ ఈ బాధ్యతను, బరువుగా భావించి, చాలా మంది మేనేజర్లు తప్పు పద్ధతులను అనుసరిస్తుంటారు. స్ట్ఫాను నలుపుకు తినడం గొప్ప అనుకుంటారు.

కంపెనీ ముఖ్యమయనది. అందులో మన టీంలో, నాయకులతోబాటు, మిగతా వారంతా కూడా మనకు అసలయిన కంపెనీ. ముందు ఈ కంపెనీ బాగుండాలి. అప్పుడు మొత్తం కంపెనీకి, బజార్లో మంచి పేరు వస్తుంది. ఎవరికీ ఈ ప్రపంచాన్ని మరమ్మతు చేసే కోరిక, ఓపికా ఉండవు. తన చుట్టున్న ప్రపంచం బాగుంటే, మొత్తం ప్రపంచం బాగానే ఉంటుంది. కనీసం, ఆ భావమయినా కలిగి పని చేయడానికి ఉత్సాహం ఉంటుంది. ఇది వాస్తవంగానూ, సూక్ష్మంగానూ అందరికీ మనసులో ఉండే కోరిక. ఉదయం పనిలోకి వచ్చాము. సాయంత్రం బయటపడే సమయానికి, ఎప్పుడు బయట పడతామా? అనే, ఉసూరుమనే భావం కాకుండా ఉంటే మేలు. కొంతయినా చేశామన్న సంతృప్తితో ఇంటికి వెళితే నిద్ర బాగా పడుతుంది. మేనేజర్లకు కూడా ఇదే కోరిక ఉంటుంది. కానీ బాధ్యత కారణంగా, వారి ప్రవర్తన కొంచెం మొరటుగా ఉండే వీలుంది. తమ సంగతి అర్థం చేసుకుని వారు మరింత స్నేహభావం చూపగలిగితే పరిస్థితి మారుతుంది. వారికి మనసులో స్నేహభావం చూపాలన్న ఆలోచన కలిగించే బాధ్యత జట్టులోని వారికందరికీ ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి మరి!

ప్రపంచాన్ని మరమ్మతు చేయటంలో, లేదా కనీసం మెరుగుపరచడంలో మన సంస్థకు కూడా భాగం ఉంటుంది. అందులో మన వంతు పాత్ర ఎంతన్నది జట్టులో అందరికీ అర్థం కావాలి. డబ్బులిచ్చి పని చేయిస్తున్నారంటే, మన ఉద్యోగం తప్పకుండా గొప్పదే అయి ఉంటుంది. (కిరాయి గూండాలు, బిర్యానీలు డబ్బులకు సమ్మెలలో పాల్గొనే వారి సంగతి మాత్రం వేరు) మంచిపనికి మాత్రమే విలువ ఉంటుంది. డబ్బులు చేతులు మారుతున్నాయంటే అక్కడ కొన్ని పరిస్థితులు ఉండక తప్పదు. ఎవరో ఒకరికి కష్టం, శ్రమ, బాధ తగ్గుతుంది. ఒకరికి నమ్మకం, ఆశ పెరుగుతాయి. చివరగా ఈ ప్రపంచం, పని కారణంగా, మరింత మెరుగవుతుంది. ఇలాంటి ఉద్దేశ్యం కొరకే అందరమూ తపన పడతాము.

మన ఉద్యోగంలో కూడా ఈ మూడింటిలో ఒకటయినా జరుగుతూ ఉంటుంది. ఆ కారణం కనిపించాలి. ఇక మేనేజర్లు, టీములు, యజమానులు, క్లయింట్లు అందరి మధ్యనా కనెక్షన్లు వాటంతటవే మెరుగవుతాయి. ఒకచోట ఒక భవనం కడుతున్నారు. ‘ఆఁ! ఏముందీ? పొట్టకూటికి ఇటుకలు పేరుస్తున్నాను, అన్నాడు ఒక మేస్ర్తి. కాలేజీ బిల్డింగట! కొంచెం కొత్తగా ఉంది, ప్లాను!’ అని రెండవ మేస్ర్తి అన్నాడు. ఇక మూడవ మేస్ర్తి మాత్రం, ఆ కాలేజీ ప్రత్యేకత గురించి అందులో చదవబోయే యువత గురించీ కలలు గన్నంత బాగా వివరించాడు. చేసే పని చిన్నదయినా అందులోని విలువను గుర్తించి చేస్తుంటే, ఇంక్రిమెంటు ఇవ్వలేదన్న సంగతి మళ్లీమళ్లీ ముందుకు రాదు. మేనేజర్లయినా ఇదే పద్ధతిలో పనినే పరమార్థంగా భావిస్తే, అందరికీ బాగుంటుంది. మనస్తాపం లేకుండా అందరూ ఆనందంగా పనిచేసుకుపోతారు.

ఉత్సాహంగా ఉండాలన్నా, ఉత్సాహం పెరగాలన్నా మనుషుల మనసుల్లో మార్పు రావాలి. జేబులు, పర్సులు బరువయినంత మాత్రాన ఉత్సాహం పెరగకపోవచ్చు. ప్రతి ఉద్యోగంలోనూ ఎవరి బాధలనో తగ్గించడానికి, నమ్మకాలను, ఆశయాలను పెంచడానికీ, ప్రపంచాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికీ అవకాశాలుంటాయి. వాటిని గుర్తించి, ఆనందాన్ని అనుభవించాలంటే అన్ని స్థాయిలలోని వారూ కలిసి ప్రయత్నం చేయాలి. ముందు, సవ్యంగా మనసువిప్పి మాట్లాడే పరిస్థితి, అలవాటు ఉండాలి. మాటలతో, బంధాలు ఏర్పడతాయి. బలపడతాయి. పని, కస్టమర్లు, సమాజం, సహోద్యోగులు, స్వంత కుటుంబం అన్నింటికీ పరస్పరం బంధాలు ఉండాలి. రానున్న కాలం గురించి కలలుగంటే, అందులో ఈ దృశ్యాలే కనబడతాయి మరి!
ఉద్యోగం మాని వెళ్ళిపోతానన్న వ్యక్తికి, ‘మరింత జీతం’ ఆశ చూపితే ఉండకపోవచ్చు. వారికి కావలసింది మరేదో ఉంటుంది. అది, మరో చోటయినా దొరుకుతుందేమోనన్న ఆశ ఉంటుంది. ఆ బంధం, ఇక్కడే దొరకాలంటే, రెండు చేతులు కలవాలి. చప్పట్లు మోగాలి.

అసలు మాట
మనమన్న మాట గొప్ప ‘కోట్’ అవుతుందనీ, దాన్ని అందరూ చెప్పుకుంటారనీ అనుకోవడం అర్థం లేని మాట. అది నిజమయినా, అందుకు చాలా కాలం పడుతుంది.
-అజ్ఞాత జ్ఞాని
నాకు గొప్ప పేరుంది! అమ్మా, నాన్నా పెట్టిన పేరు!

Sunday, May 13, 2012

అవాంతరాలు

అనుకోకుండా గాడిద, ఒంటె దారిలో ఎదురుపడ్డాయి. గాడిద గౌరవంగా ఒంటెను పలుకరించింది. ఒంటె అంతే అభిమానంగా సమాధానమిచ్చింది. అప్పుడు గాడిద, ఒంటెను ఒక ప్రశ్న అడిగింది. ‘అవునన్నా! ఇద్దరమూ నాలుగు కాళ్లు గలిగి ఉన్నాము. నేనేమో మాటిమాటికి తట్టుకుని పడుతుంటాను. నీవెప్పుడూ అట్లా పడడం చూడలేదు. కాళ్లు పొడుగున్నందుకా? ఏమిటి సంగతి?’ అని.



‘కాదు తమ్ముడూ! నా కళ్లు ఎప్పుడూ పైకి చూస్తుంటాయి. అంటే, నాకు ముందుదారి చాలాదూరం వరకు శుభ్రంగా కనబడుతుంది. ఇక తప్పటడుగు ప్రశ్న ఉండదు. మరి నీ కళ్లు ఎప్పుడూ కిందకు చూస్తుంటాయి. నీకు కాళ్ల కింద నేల తప్ప ముందు దారి కనబడదు. కనుకనే నీవు పడిపోతుంటావు’ అన్నది ఒంటె.


గాడిదకు విషయం అర్థమయింది. ‘నువ్వు ముందు నడువు మరి! నేను వెంట వస్తాన’న్నది.

==========

అవాంతరాలు

అనుకున్నదేదీ అనుకున్న సమయానికి జరగడంలేదు. మరి ఎందుకలా జరిగింది?
బతుకు మన ప్లాన్ ప్రకారం జరగడంలేదు. ఏదో జరిగితే, దానికి రియాక్ట్ అవుతున్నాము, అంతే.
పనులు జరగడం గురించి, జరగకపోవడం గురించి మరెవరిమీదనో నిందలు వేస్తున్నాము తప్ప అవి జరగడానికి తగిన ఆలోచనలు, పథకాలు మనం వేయడంలేదు.
మనలో దాగివున్న పిల్లతనం మనలను నడిపిస్తున్నది. పండిన ఆలోచనలను ముందుకు రానివ్వడం లేదు.
తప్పు చేస్తామన్న భయంతో, అసలు ఏ పనీ చేయకుండా ఉండిపోతున్నాము. పిల్లతనంలో ఏం చేసినా ‘తప్పు’ అంటూ భయపెట్టారు. నవ్వారు. ఆట పట్టించారు. మనం అక్కడే నిలిచిపోయాము.
అందరికీ చేతనయిన పనులు మనకూ చేతనవుతాయని తెలుసు. కానీ చేసి చూడడానికి భయం అడ్డుపడుతుంది. పని చేసి పరీక్షించే ధైర్యం లేదు.
మన గురించి మనం నిర్ణయాలు చేయలేకపోతున్నాము. ఎవరో చెప్పినా వినడంలేదు.
మనం కావాలనుకున్న వాటివెంట పరుగెత్తుతున్నాము. మన ‘అవసరాలను’ గుర్తించడంలేదు.
అనవసరమైన పనులను పంచుకొంటున్నాము. సరదా కాలక్షేపం మనకొక పనిగా తోచినట్లుంది.
మనం గడిచిన రోజులు ఆదర్శంగా ముందుకు నడుస్తున్నాము. ఇప్పుడేమి చేయగలమన్న ఆలోచనకు దూరంగా ఉంటున్నాము.
మన తీరుకు, మనం తప్ప మిగతా వారందరూ, అన్ని పరిస్థితులూ కారణం అనుకుంటున్నాము.
భవిష్యత్తు గురించి కాక, ఇవాళటి కొరకు బతుకుతున్నాము. పని చేస్తున్నాము.
సమస్య వస్తే చూడక, తప్పించుకు తిరుగుతున్నాము.
ఇట్లా మన పరిస్థితికి ఎన్నో కారణాలుండవచ్చు. వీటిలో ఏ ఒకటి, కొన్ని నిజమయినా, మనం ఆలోంచాలి. పద్దతి మార్చుకోవాలి!
===========

అసలు మాట
అధికారమూ, హోదా గలవారికి చదవడానికి టైం ఉండదు. కానీ చదవని వారు అధికారం, హోదాలకు అర్హులు కారు.
-మైకేల్ ఫూట్


చదివితే మరింత మంది తెలివి, మన తెలివికి తోడవుతుంది.

Saturday, May 12, 2012

పొలోనియం


మేరీ క్యూరీ 1898లో పొలోనియం అనే మూలకాన్ని కనుగొన్నందుకు వందేళ్ళ క్రితం ఆమెకు నోబేల్ బహుమతినిచ్చారు. ఆమె స్వంత దేశం పోలాండ్. ఆ దేశం పేరునే మూలకానికి పెట్టిందామె. కానీ, అప్పటికి పోలాండ్ స్వతంత్ర దేశం కాదు. భూమి పైపొరల్లో ఈ మూలకం చాలా తక్కువగా దొరుకుతుంది. ఈ మూలకం గురించి ఆసక్తికరమైన సంగతులు కొన్ని...

* 1944
కు ముందు పొలోనియంను ప్రత్యేకంగా శుద్ధిచేసి తయారుచేసింది లేదు. మన్‌హటన్ ప్రాజెక్ట్‌తో పరిస్థితి మారింది. పొలోనియం గురించి ఆల్ఫా పార్టికల్స్ వెదజల్లబడుతుంటాయి. బెరీలియం అనే మరో మూలకం ఈ కణాలను పీల్చుకుని న్యూట్రాన్స్‌ను వదులుతుంది. మొట్టమొదటి అణుబాంబును పేల్చడానికి ఈ రెండు రసాయనాలను వాడుకున్నారు. చివరి క్షణం వరకు రెంటినీ విడివిడిగా ఉంచారు. వాటిని కలిసిన మరుక్షణం పేలాయి!

*మన చుట్టూ ఉండే గాలిలో పొలోనియం- 210 ఉంటుంది. రేడాన్-222 అనే వాయువు నుంచి కణాలు తొలగినందుకు ఇది పుడుతుంది. భాస్వరం పుడుతున్నపుడుకూడా పొలోనియం పుడుతుంది. మొక్కలు తమ వేళ్ల ద్వారా పొలోనియంను పీల్చుకోగలుగుతాయి. లేక అది నేరుగా పెద్ద వెడల్పయిన ఆకుల ద్వారా కూడా మొక్కలలోకి చేరగలుగుతుంది. లైకెన్స్‌జాతి మొక్కలు పొలోనియంను నేరుగా గాలినుంచి పీల్చుకుంటాయి. రెయిన్‌డియర్లు, లైకెన్స్‌ను తింటాయి. రెయిన్‌డియర్‌లను తినే మనుషుల శరీరంలో పొలోనియం ఎక్కువగా ఉంటుంది.

*సిగరెట్లు మిగతా పొగాకు పదార్థాలలో రేడియో ఆక్టివ్ పొలోనియం చాలా తక్కువ మోతాదుల్లో ఉంటుంది. 1959లోనే పొగాకు కంపెనీలవారికి ఈ సంగతి తెలుసని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వారి అభిప్రాయం. ఈ పొలోనియం కారణంగా పొగ తాగే వెయ్యిమందిలో 138 మంది మరణిస్తున్నారు. గడచిన 25 సంవత్సరాలుగా ఈ చావులు సాగుతూనే ఉన్నాయి.

*పొలోనియం నుంచి వచ్చే ఆల్ఫా కణాలు చర్మం పైపొరలోకి దూసుకుపోజాలవు. కనుక బయటనుంచి దీనివల్ల ప్రమాదంలేదు. పొలోనియంను మింగితే, అందులో సగం నుంచి 90 శాతందాకా మలంలో బయటకు పోతుంది. మిగతాది మూత్రపిండాలు, లివర్, స్ప్లీన్‌లలో చేరుకుంటుంది. రేడియో ఆక్టివ్ రసాయనం గనుక దాని మోతాదు 50 రోజుల్లో సగమయిపోతుంది. ఊపిరితిత్తులలోనికి పొలోనియం చేరితే ప్రభావం అక్కడ మాత్రమే కనబడుతుంది. పొగతాగేవారిలో పొలోనియం రెండింతలు ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

*పొలోనియం కారణంగా చనిపోయిన మొదటి వ్యక్తి బహుశ మేరీ క్యూరీ కుమార్తె జోలియట్ క్యూరీ. 1946లో జోలియట్ పరిశోధనశాలలో ఉండగా పొలోనియం క్యాప్యూల్ ఒకటి పేలింది. 10 సంవత్సరాల తర్వాత క్యాన్సర్ కారణంగా జోలియట్ మరణించింది. అందుకు కారణం పొలోనియం కాలుష్యమేనని అంటారు.

*పొలోనియంను వాడి గూఢచారులను చంపిన సంఘటన ఇంగ్లండ్‌లో జరిగింది.

Friday, May 11, 2012

ఇవాళ ఏం చేయాలి?

పక్క పక్క ఇళ్ళలో ఉండే గృహిణులు ‘పని తెమిలిందా?’ అంటూ ఒకరినొకరు పలకరించుకుంటారు. వాళ్లకు నిజానికి ఒక పట్టాన పని తెమలదు. ఒకటి ముగియకముందే మరొకటి కనబడుతుంది. ఒకే సమయంలో రెండు మూడు పనులను చేస్తూ, చక్కని ప్లాన్ ప్రకారం వారు ముందుకు సాగుతుంటారు. ‘దాని కోసం ప్రత్యేకంగా చోటు కల్పిస్తే తప్ప ఏ పనీ జరగదు’ అంటాడు జిమ్ మెక్‌కే! అంటే, ప్రతి పని కొరకు ప్రత్యేకంగా, మనమే కొంత సమయాన్ని కేటాయించాలని అర్థం. కొంతమంది స్నానానికి అరగంటకన్నా ఎక్కువ సమయం తీసుకుంటారు. మరికొంతమంది అయిదు నిమిషాల్లో బయటపడతారు. వీరిలో ఎవరిది సరైన పద్ధతి, అంటే, జనాబు కష్టం. ముందుగా, ఒక పని జరగాలన్న నిర్ణయం జరగాలి. ఆ తర్వాత, ఆ పనికి తగినంత సమయాన్ని కేటాయించాలి. అన్ని పనులకూ, తగినంత సమయం కేటాయిస్తే, కొంతమందికి, దినంలో ఇరవై నాలుగు గంటలు సరిపోవు. అప్పుడు పనుల ప్రాముఖ్యతను గుర్తించవలసిన అవసరం ఉంటుంది. పనులను త్వరగా పూర్తిచేయవచ్చు. ఒకేసారి, వీలయితే రెండు పనులను చేయవచ్చు. ఫరవాలేదనిపిస్తే, ఒకటి రెండు పనులను వాయిదా వేయవచ్చు. ఇదంతా కాక, సమయం ఎక్కువగానూ, పని తక్కువగానూ ఉండే పరిస్థితి కూడా ఉంటుంది. అప్పుడు, రేపటి పని ఇవాళ చేయవచ్చు. కొంత విశ్రాంతి తీసుకోవచ్చు.

ఏ పనయినా జరగాలంటే, ముందు ఆ పని ఉందని మనం గుర్తించాలి. దానికి కాలం కేటాయించాలి. ఉదయం నిద్ర లేవగానే, ఆ రోజు చేయవలసిన పనులన్నింటినీ గుర్తు చేసుకోవడం ఒక మంచి అలవాటు. చేయవలసిన పనులకు కాలం కేటాయించి వాటిని కాగితం మీద రాసుకుని కనబడే విధంగా ముందు అమర్చుకోవడం ఇంకా మంచి అలవాటు. నిన్న వాయిదా వేసిన పనిని నిన్ననే మరిచిపోతే, దాన్ని వాయిదా అనలేము. రేపటికి షెడ్యూల్ చేసిన పనిని, ఇవాళ చేయవలసిన అవసరం, చేసే అవకాశం వస్తే, చేయడం మంచిది. అసలు ఏ పనినయినా వాయిదా వేయడంకన్నా ముందే చేయడం వీలవుతుందేమో గమనించడం గొప్ప అలవాటు. ఇట్లా చేయవచ్చునని చాలామందికి తోచదు!

షెడ్యూలింగ్:
ఒక పని చేయాలని అనుకోవడం బాగానే ఉంటుంది. మనసులో అనుకున్న పనిని వెంటనే మొదలుపెడితే సమస్య ఉండదు. ఒకదాని తరువాత మరొకటిగా చేయవలసిన పనులు వరుసగా ఉంటాయి. వాటిలో ఏది ముందు, ఏది తర్వాత అన్న నిర్ణయం జరగాలి. వాటిని రాసుకుని ముందుంచుకుంటే, సులభంగా గుర్తుంటాయి. ముగిసిన పనులను గుర్తులతో మార్క్ చేస్తూ ముందుకు సాగవచ్చు. ఒక పని ఉన్నా పనే. వంద పనులున్నా పనే. కానీ, వాటి క్రమం ముఖ్యం! లేకుంటే అన్ని పనులూ ఒకేసారి తేనెటీగలలాగ మెదడులో రొద చేస్తాయి. దినంలో పనితోబాటు పనికాని పనులు కూడా కొన్ని ఉంటాయి. తిండి తినాలి, పడుకోవాలి, మరికొన్ని అలాంటి పనులకు కూడా సమయం కేటాయించక తప్పదు. అన్నీ క్రమంగా జరుగుతున్నాయనుకుంటే, అర్థాంతరంగా కొన్ని అవాంతరాలు వచ్చి పడతాయి. అప్పుడు షెడ్యూల్‌ను గమనిస్తే, పని ముందుకు సాగవలసిన క్రమం గురించి సూచనలు అందుతాయి.

షెడ్యూల్ ఒక నాటికే కాదు:
సంవత్సరం, నెల, వారం వారీగా కూడా పనులకు పట్టిక తయారు చేయవచ్చు. చేయడం అవసరం కూడా. పండుగలు, పుట్టిన రోజులు, మరిన్ని అలాంటి సందర్భాలు గుర్తుంచుకుంటే, పని షెడ్యూల్ సక్రమంగా జరుగుతుంది. వేసుకున్న షెడ్యూల్‌ను తరచూ చూడటం ఎంతో అవసరం. పనుల ప్రయారిటీ, అంటే ప్రాముఖ్యం మారుతుంది. కనుక వాటి సమయం సందర్భం మార్చవలసిన అవసరం కనబడుతుంది. కొన్ని పనులు ‘ఇక అనవసరం’ అని కూడా అనిపించవచ్చు. వారం షెడ్యూల్‌ను ప్రతి నిత్యం ఒకటికి రెండుసార్లు గమనించినట్లయితే, చేయవలసిన పనులకు తగిన హంగులు, ఏర్పాట్లు ముందే కుదుర్చుకోవచ్చు. ఇక నిత్యం షెడ్యూల్‌ను గంటకు ఒకసారయినా చూడాలి. ‘నాకు అంత పని లేదుగదా!’ అని ఎవరికైనా అనిపిస్తే, వారంత అదృష్టవంతులు మరొకరు లేరనవచ్చు. లేదా వారు ప్రవాహంలో కొట్టుకుపోతున్నారనయినా అర్థం! మనసును పనులు లేదా పని మీద ఫోకస్ చేస్తే, క్రమం సాగుతుంది. గజిబిజి ఉండదు.

తగినంత సమయం:
ఒక పనిని ఎంతసేపయినా చేయవచ్చు. సమయాన్ని బట్టి పని కూడా విస్తరిస్తుందని ఒక మాట ఉంది. దాన్ని పార్కిన్‌సన్ లా అంటారు. కొంతమంది చిన్న పనిని, స్నానంలాగా, మరీ ఎక్కువ సేపు చేస్తారు. మరికొంతమంది పనిని సులభంగా, త్వరగా చేయగలమని తప్పుగా అంచనా వేస్తారు. తగినంత, అన్న సమయానికి మరో నాలుగు నిమిషాలు కలపడమే మంచి పద్ధతి. అనవసరంగా మరీ ఎక్కువ సమయం కేటాయిస్తే అది కాలయాపనవుతుంది. అట్లాకాక, అనుకున్నదానికి మరికొంచెం సమయం కలిపితే మంచిది. పని ముగిస్తే, అనుకున్న సమయానికి ముందే ముగించిన తృప్తి కూడా మిగులుతుంది. ఒక సమయానికి అవుతుందన్న పని కొన్నినిమిషాలు ఆలస్యమయినా అసంతృప్తి. రేపు అనుకున్న పనిని ఇవాళ అందించగలిగితే, అదొక తృప్తి! కేటాయింపులు వాస్తవికంగా ఉంటే ఇది వీలవుతుంది.

మనసు -శరీరం:
కొంతమంది ఉదయం పూట హుషారుగా పని చేయగలరు. మరి కొంతమందికి మరో సమయం అనుకూలంగా ఉంటుంది. ఎవరికివారు తమ శరీరం, మనసు తత్వాన్ని గుర్తించుకోవాలి. ఎక్కువ జాగ్రత్త, శ్రద్ధ, సృజన, ఆలోచన అవసరమయిన పని మనం ‘పీక్’లో ఉండే సమయానికి షెడ్యూల్ చేసుకుంటే బాగా వస్తుంది. మధ్యాహ్నం ఒక కునుకు తర్వాత బాగా పని చేయగలను, అనుకుంటే, ముఖ్యమయిన పనులు అప్పుడే చేయడం మేలు.

వేసుకున్న షెడ్యూల్ అదే క్రమంలో జరగదన్న సంగతి గుర్తుంచుకోవాలి. నిజానికి దినం గడిచిన తర్వాత, అనుకున్నదేమిటి, జరిగిందేమిటని పరిశీలిస్తే, మరుసటి రోజు పథకం మరొక రకంగా వేయవచ్చు! త్వరలోనే పథకానికి, పనికీ, పనులకూ ఒక పద్ధతి ఏర్పడుతుంది.

చదువుతున్నారు గదా! తరువాత ఏం చేయాలనుకున్నారు?

Wednesday, May 9, 2012

సైన్సు.. ఆలోచనలు

ఆలోచనలున్నాయని తెలుసు. వాటిని మన పద్ధతిలో నడిపించవచ్చునని మాత్రం తెలియదు. సైన్సు ఉందని తెలుసు. దాన్ని గురించి ఆలోచించడం మాత్రం తెలియదు. అసలు ఆలోచనలన్నీ సైన్సు పద్ధతిలో నడవవచ్చునని మనకు అసలే తెలియదు. నిత్యం బతుకుదారిలో ప్రతి పనికీ కారణాలు, పద్ధతులు మనకు తెలియకుండానే వెదుకుతాం. ఆ తీరు వేరు, సైన్సు తీరు వేరు అనుకుంటాం. అందుకు కారణం మనం సైన్సు ఉందనీ, దానికి ఒక పద్ధతి ఉందని పట్టించుకోకుండానే బతకడం. సైంటిస్టుల బుర్రనిండా వారికి కావలసిన విషయాలకు సంబంధించిన ఆలోచనలు తిరుగుతుంటాయి. వాళ్లకు ప్రపంచమంతా సైన్సుగానే కనబడుతుంది. కానీ, ఆ ఆలోచనలు నడిచే దారికీ, మామూలు ఆలోచనల దారికీ తేడా లేదని ఎంతమందికి అర్థమయింది?

ప్రపంచంలో జరుగుతున్న చాలా సంగతులు మనకు వెంటనే అర్థం కావు. కొన్ని మరీ ఆశ్చర్యం కలిగించే రకంగా కూడా ఉంటాయి. అంతా మ్యాజిక్‌లాగ ఉంటుంది. మెజీషియన్స్ కొన్ని ట్రిక్కులు ఎలా చేశారో చెపుతారుకూడా. చెప్పనివాటి వెనుకనున్న రహస్యం అర్థం చేసుకోవాలని మనం ఎప్పుడయినా ప్రయత్నించవచ్చు. ప్రయత్నించిన వారందరూ సైన్సుపద్ధతి ఆలోచనలు కలిగినవారే. ఇంటి తలుపు తెరిస్తే కిటికీ దఢాలున మూసుకుటుంది. అంత వేగంగానూ తిరిగి తెరుచుకుంటుంది. కిటికీ రెక్కకు అడ్డుపెట్టలేదని అర్థమవుతుందిగానీ అది తెరుచుకోవడం, మూసుకోవడం ఎందుకు జరిగాయన్న ప్రశ్న తోచకపోవచ్చు. తోచినా పోనీలే?! అనిపించవచ్చు. కొంతమందికి మాత్రం తలుపును నాలుగుసార్లు తెరిచి, మూసి, కిటికీని పరిశీలించే ఆలోచన పుడుతుంది. చివరకు గదిలో గాలి ఒత్తిడి సంగతి కూడా తోచవచ్చు. ఆలోచిస్తే, చాలా సంగతుల వెనకనున్న రహస్యం బట్టబయలవుతుంది! ఈ సంగతులు ముందు.. అంత గొప్పవిగా తోచకపోవచ్చు. కానీ, ఈ ప్రపంచంలో జరిగే మామూలు విషయాల వెనుక కూడా ఆసక్తికరమైన సైన్సు ఉంటుంది. వాటిని గురించి తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. అవి అర్థం కానివీ, కష్టమయినవీ మాత్రం కావు. సైంటిస్టులుకూడా తమ పరిశోధన పేరున ఈ పద్ధతులనే వాడుతుంటారు. అది మనిషి ప్రవర్తన గానీ, ప్రకృతిలోని అంశాలుగానీ, అర్థం కాదనిపించే ఆస్ట్రానమీ సంగతులు గానీ, అన్నింటిలోనూ ఒకటే పద్ధతి ఉంటుంది. నమ్మండి!

మనకు తెలిసీ తెలియక, మనమంతా సైన్సు పద్ధతిలో ఆలోచిస్తుంటాం. పనులు కూడా చేస్తుంటాం. మనం అట్లా చేస్తున్నామన్న ఆలోచన మాత్రం రాదు. అంతే తేడా!

గమనించిన అంశం గురించి ప్రశ్నిస్తాం
ఈ రోజు గుడ్డలు ఎందుకు త్వరగా ఆరలేదు? ఇవాళ చెమట ఎందుకు ఎక్కువగా పడుతున్నది? మొదలు నిత్యం తెలియకుండానే ఎన్నో ప్రశ్నలు అడుగుతాం. చీమలకు వాటి చోటు ఎట్లా తెలుస్తుంది? దోమలకు మనం ఎట్లా దొరుకుతాం? ఇంకొంచెం ముందుకు వెళితే... అవి సైన్సు ప్రశ్నలవుతాయి. నాకు కోపం ఎందుకు వచ్చింది? ఆకలి ఎందుకు కాలేదు? 


అన్నా సైన్సు ప్రశ్నలే! నమ్మండి!
ప్రశ్న అడిగి ఊరుకుంటే జవాబు చెప్పేవారు ఎదురుగా ఉండకపోవచ్చు. కనుక మనమే ముందుకు సాగడానికి ప్రయత్నించాలి!

పరిశోధన సాగించండి
మీరు ఒక విషయాన్ని గమనించారు. దాన్ని గురించి ఆలోచించి ప్రశ్న అడిగారు. మరి ఆ అంశం గురించి ఇప్పటివరకు తెలిసిన అంశాలను ఒకసారి గుర్తుచేసుకోవాలి. ప్రతిదినం వేసినట్లుగానే గుడ్డలుతికి ఆరవేశాం. ఎప్పటికీ వేసే చోటునే ఆరవేశాం కూడా. కానీ, అవి ఎక్కువయ్యి ఒకదానిమీద మరొకటి వేయవలసి వచ్చిందా? గాలి కదలకుండా మరేదయినా అడ్డుగా వచ్చిందా? లేక వాతావరణం తేమగా ఉందా? గుడ్డలు ఆరకపోవడానికి ఒక కారణం ఉండి తీరుతుంది. గుడ్డలు సరిగా పిండడం చేతకాలేదేమో?

అనుమానాలు రావాలి
అనుమానాలతో రకరకాల పరిస్థితుల గురించి మనకు ఆలోచనలు పుడతాయి.

స్వంత ఆలోచనలు కాస్త పక్కకు..
మనకు సాధారణంగా అలవాటుకొద్దీ, సమస్యకున్న ఒకరూపం మాత్రమే కనబడుతుంది. కొన్నిసంగతులను చూడలేకపోతాం. గుడ్డలు నిత్యం ఏ సమయానికి ఆరుతున్నాయని సంవత్సరమంతా గమనించి, వాతావరణంలో తేమ, వేడి గురించి కూడా తెలుసుకుని సంబంధాలను లెక్కవేస్తే, అది శాస్త్ర పరిశోధన అవుతుందని మనకు తోచదు. మరి చలికాలంలో కూడా బట్టలు త్వరగా ఆరతాయా?

మరింత సమాచారం, సాక్ష్యాలు వెదకాలి
వాతావరణంలో తేమ ఎప్పుడు ఎంత ఎక్కువ ఉంటుంది? చీమలకు, దోమలకు వాసనలు బాగా తెలుస్తాయని మనకు తెలుసా? ఇంటి తలుపు మూసి ఉన్నప్పుడు కిటికీ తెరిచి ఉన్నా గాలి అందులోనుంచి లోపలికి రాదు. తలుపు తెరవగానే అది తోసుకువస్తుంది. కిటికీ మూసుకుంటుంది. బలంగా తగిలినందుకు తిరిగి తెరుచుకుంటుంది.

అన్ని సంగతులనూ అర్థం చేసుకుని..
సాక్ష్యం, సమాచారాలను బట్టి మన ఆలోచనలు, నమ్మకాలు మారాలి. ఈ ప్రపంచంలో అందరికీ ఒకేలా చెమట పట్టదు. తేమ పెరిగినా నాకు చెమట లేదుగనుక, తేమలేదు అనగలమా? ఈ విషయం గురించి ప్రపంచమంతటా ఉండే అనుభవాలుంటాయి. మన చుట్టుపక్కల చూచినా ఎన్నో వివరాలు తెలుస్తాయి.

ఇది కాదు.. అనే పద్ధతి
ఒక విషయానికి వంద కారణాలు కనబడతాయి. ఆలోచించి వాటిని.. ఇది కాదు, ఇది కాదు.. అంటూ సంఖ్య తగ్గిస్తూ పోవాలి. అనుభవం పాఠాలు చెపుతుంది. అందులో నుంచి మార్గాలు కనబడతాయి.

అయితే, సైన్సంతా ఇంతేనా అనేసి వెళ్లిపోకండి! కొన్ని ప్రశ్నలకు బుర్ర చించుకున్నా జవాబు తోచదు. అందుకు అవసరమైన సమాచారం, లెక్కలు బోలెడుంటాయి. ఆలోచన సాగితే, వేరే విషయాలు వంద తెలుస్తాయి కానీ, మొదటి ప్రశ్నకు జవాబు అందదు. నిజంగా ఇలా జరిగిందంటే, మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీరు శాస్ర్తియ పద్ధతిలో పడిపోయినట్లు లెక్క మరి! ముందుకు సాగితే ఆశ్చర్యాలకు, అద్భుతాలకు కూడా జవాబులు దొరుకుతాయి. శతాబ్దాల నుంచి మీలాగే ప్రశ్నలు అడిగి, ఎందరో సేకరించిన సమాచారం, మీ కొరకు ఎదురుచూస్తున్నది. తెలుసుకుంటే, బతుకు మరింత అర్థవంతంగా, ఆసక్తికరంగా మారుతుంది. చుట్టూ చూడండి. పరిశీలించండి. ప్రశ్నలడగండి. సైన్సును స్వంతం చేసుకోండి!

Tuesday, May 8, 2012

జిడ్డు కృష్ణమూర్తి -


జిడ్డు కృష్ణమూర్తి
-అబ్బూరి ఛాయాదేవి
సి.పి.బ్రౌన్
అకాడమి,నాగార్జునహిల్స్,
పంజగుట్ట,
హైదరాబాద్- 82
పేజీలు: 150;
వెల: రూ.95/-

అర్థమయిన వాళ్లకూ, అర్థంకాని వాళ్లకు ఒక ప్రశ్నగా మిగిలి గుర్తుండిపోయే జిడ్డు కృష్ణమూర్తి పేరులోనే తప్ప మరెందులోనూ జిడ్డుతనం లేదు. తెలుగువాళ్లంతా ఆయనను ‘మనవాడు’ అంటారు. ఆయన నిజంగా భారతీయుడా? అని అనుమానం వచ్చినవారున్నారు. అందరికీ ఆ అనుమానం ఉంది, అన్నా తప్పుగాదు. ఆయన ప్రపంచ పౌరుడు. ‘నేను గాలిలాంటి మనిషిని!’ అనగలిగిన మనిషిని పట్టుకుని ఒక పద్ధతికి, ప్రాంతానికి కట్టివేయడం అమాయకత్వం. జేకే గురించి తెలుగులో పుస్తకాలు తక్కువ. వందలకొద్దీ ఉన్న ఆయన పుస్తకాల అనువాదాలు కూడా తక్కువే. ఆయన గురించి తెలుసుకోవాలంటే, మేరీ లుటెన్స్, ప్రపుల్ జయకర్‌లు రాసిన పుస్తకాలు చదవాలి!


అబ్బూరి ఛాయాదేవిగారు రాసిన ఈ పుస్తకం అట్టమీద జీవనమార్గం- జీవితం, బోధనలు అని ఉపశీర్షిక ఇచ్చారు.
అరవయి సంవత్సరాలపాటు ప్రపంచమంతా తిరిగి, నిత్యం తన భావాలను పంచిన ఒక తాత్వికుని గురించి, ఒక చిన్న పుస్తకంలో చెప్పడం వీలుకాని పని! ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మంచి పుస్తకమే వచ్చింది. కానీ ఈ పుస్తకంలో కృష్ణమూర్తికన్నా ఆయన ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచానే్న ‘మార్పు’వేపు మరల్చిన ఒక ప్రఖ్యాత తాత్వికుని ఆలోచనలను, ఒకసారి కథలాగ చదివితే లాభం ఉండదు. ప్రతి నాలుగు వాక్యాల తరువాత, ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది.


ఆయన వెంట తిరిగినవారు, ఆయననుంచి మెప్పు ఆశించారు. అది దొరకనందుకు వారంతా దూరంపోయారు, అంటారు రచయిత్రి ఒకచోట. కృష్ణమూర్తిని మత బోధకుడు అన్నారు కొందరు. ఆయన ఒక మతానికి, సంస్థకు, దేశానికి కట్టుబడినవాడు కాదు. ఆయన మాటలు గురువు బోధనలుగా ఉండవు. ఆయనలో ఒక మిత్రుని చూడగలిగినవారు ఎక్కువ సంతృప్తిపొందారు.


జె.కె. గురించి తెలియని తెలుగు పాఠకులకు ఈ పుస్తకం ఒక మిత్రునిగా వచ్చింది. ‘కొంత’తెలిసిన వారికి కూడా ఈ పుస్తకంలో మంచి మెటీరియల్ ఉంది. పుస్తకంలో వేసిన బొమ్మల కింద, వివరాలు వేస్తే మరింత బాగుండేది. ఇంగ్లీషు పుస్తకాల మీద ఆధారపడినందుకేమో కొన్ని వాక్యాలు, ఇంగ్లీషు సింటాక్స్‌లో వచ్చాయి. విషయం గురించిన ఆసక్తిలేనివారిని కూడా చదివించగల రచనా పద్ధతి, ఇంత చిన్న పుస్తకంలో వీలవుతుందా? ప్రతి విషయంమీద కొంచెం వివరణ ఉంటే ఎంత బాగుండును, అనిపించింది. సీరియస్‌గా చదవవలసిన పుస్తకాలలో ఇదొకటి!

Sunday, May 6, 2012

అచ్చరబల్ల - హాస్యకథ


ఒకాయన అత్తగారింటికి పొయినడు.
అక్కడ వాండ్లు నెయ్యి, బెల్లమేసి సంకటి వండి పెట్టినరు.
రుచి బాగున్నది.
"ఇదేమిడిది" అని అడిగినడు.
"తమిదె సంకటి" అని వాండ్లు చెప్పినరు.
"తమిదె సంకటి, తమిదె సంకటి" అని మనుసులో అనుకుంటు తమ ఊరి తోవన వస్తున్నడు.
నడుమ ఒక కాలువ వచ్చింది.


దుంకేటప్పుడు ఊపు కొద్ది "అచ్చరబల్ల!" అన్నడు.
సంకటి సంగతి మరిచి "అచ్చరబల్ల, అచ్చరబల్ల" అనుకుంట ఇల్లుజేరినడు.
'అచ్చరబల్ల జేసి పెట్ట'మని పెండ్లామును అడిగినడు.
'అటువంటిది నాకు రాదు' అన్నదామె.
'మీ అమ్మవాండ్ల ఇంట్లో తిన్న నేను, నీవు కావాలంటని రాదంటున్నవు' అని కోపం కొద్ది పెండ్లామును బాగ కొట్టినడు.
ఆ పుణ్యాత్మురాలు 'నిజంగ నాకు తెలువదు' అని మాత్రము అన్నది.
ఇంకా బాగ కొట్టినడు అమెను.
పక్కింటి ముసలామె 'పిల్లను సంకటిలాగ కొట్టినవు గదనయా' అన్నది.
"ఆ! దాని కొరకే!" అని అప్పుడు యాదికొచ్చి అన్నడు.

ఈ కథ మా చిన్నప్పుడు చెప్పినరు.
అమ్మ సంకటి నెయ్యిపోసి వండి పెట్టేది.
మేము దాన్ని గురించి అచ్చరబల్ల అనే పేరుతోటి చెప్పుకునే అలవాటు.

ఇటువంటి కథలు ఎనుకవడి పొయినయి.
తెలిసిన వాండ్లు చెప్పకపోతే అందరు మరిచిపోతరు.

Wednesday, May 2, 2012

చీమ మనుషులు

ఈ ఫ్రపంచంలో ఉండే జీవరాశులన్నింటినీ తెచ్చి ఒక చోట కుప్ప పోస్తే, అందులో పావు వంతు మనుషులు ఉంటారు. ఆశ్చర్యంగా మరోపావు వంతు చీమలుంటాయి. చీమలంత విజయవంతంగా బతికే జీవి మరొకటి లేదంటారు ప్రకృతి పరిశీలకులు. ఈ ప్రపంచంలో ఒక్క అంటార్కిటికాలో తప్ప మిగతా అన్ని చోట్లా చీమలున్నాయి. మనకు అప్పుడప్పుడు చీమలతో చికాకు కలుగుతుంది. కానీ, చీమలు లేని ప్రపంచం కూడా చిత్రంగా ఉంటుందేమో! ఎడ్వర్డ్ విల్సన్ అనే హార్వర్డ్ పరిశోధకుడు చీమల తీరు గురించి చాలా పరిశోధించాడు. వాటి విజయం వెనక దాగే లక్షణాల గురించి చెపుతూ విల్సన్ మనుషుల గురించి కూడా వ్యాఖ్యానించాడు. గతంలో పులిట్జర్ బహుమతి కూడా గెలిచిన ఈ పరిశోధకుడు ‘ద సోషల్ కాంక్వెస్ట్ ఆఫ్ ద ఎర్త్’ (భూమి మీద సాంఘిక విజయం) అనే శీర్షికతో తన 27వ పుస్తకాన్ని ఈ మధ్యనే వెలువరించాడు. చీమలయినా, మనుషులయినా కలిసి బతకడమనే పద్ధతి కారణంగానే ఇంత విజయం సాధించినట్లు విల్సన్ ఆ పుస్తకంలో వివరించాడు.

చీమలు తమ స్థావరాలను కాపాడుకునేందుకు, కలసికట్టుగా, ప్రాణాలకయినా తెగించి పోరాడతాయి. స్థావరం ఎంత పెద్దది, విస్తారమయినదీ అయితే వాటి రక్షణ వ్యవస్థ కూడా అంతే గట్టిగానూ ఉంటుందని పరిశోధనలో తెలిసింది. ఆఫ్రికా, ఆసియాలలోని భూమధ్య రేఖా ప్రాంతం అడవులలో వీవర్స్ (నేతగాళ్లు) అనే రకం చీమలుంటాయి. అవి తామున్న చోట చుట్టూ పట్టుతో ఆకులను కుట్టి గూళ్లు తయారుచేసుకుంటాయి. మరో ప్రాణి వచ్చిందంటే వాసనతోనే పసిగట్టి, ఫార్మిన్ ఆసిడ్‌ను వాటిమీదకు ఆయుధంగా చిమ్ముతాయి. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో సాలమన్ దీవులలో సైనికులు శత్రు సైనికులకన్నా ఈ చీమలకు ఎక్కువ భయపడేవాడని విల్సన్ రాశాడు. ఈ రకంగా చీమలలో సంఘీభావం, రక్షణ పద్ధతి ఎంతో గట్టిదని చెపుతూ, మానవులది కూడా ఇదే తీరంటాడు ఈ పరిశోధక రచయిత.



 చీమలది చిన్న ప్రపంచం. మిగతా పురుగులు వాటికి శత్రువులు. మనుషులది పెద్ద ప్రపంచం. దానిమీద పూర్తిగా అధికారం సంపాదించి నియంత్రించేదాకా మానవులు రాగలిగారు. అటు చీమలకు, ఇటు మనుషులకు తమ ప్రపంచాలమీద ఇంతగా అధికారం రావటానికి సహకార గుణం, సంఘీభావం, స్వార్థాన్ని కొంతవరకైనా పక్కన పెట్టడం, నేను అన్న భావానికి దూరంగా అందరితో కలిసి అవకాశాలను అందిపుచ్చుకోవడం, మనమంతా ఒక్కటే అన్న భావం లాంటి లక్షణాలు స్తంభాలుగా నిలిచాయని విల్సన్ వర్ణించాడు.

ఈ ప్రపంచంలో గుంపులుగా బతికే జంతువులు చాలా ఉన్నాయి. వాటిలోనూ మంచి ‘గుంపు’ భావన ఉంది. కానీ, అంతకుమించిన సంఘీభావం మరొకటి ఉంది. అది కలిగిన గుంపులో తరతరాల జీవులు కలిసి ఉంటాయి. పనులను పంచుకుంటాయి. ఆత్మత్యాగానికి వెనకాడవు. గుంపు అవసరాల ముందు స్వంత అవసరాలు తక్కువగా కనిపిస్తాయి. ఈ రకం అతి సామాజికత అంత సులభం కాదు. మామూలుగా గమనిస్తే మనుషులకు కూడా ఎవరి యావ వారిదేనన్నట్టు ఉంటుంది. అయినా కలిసి బతకడం కారణంగా ఎన్నో లాభాలు కనబడుతున్నాయి. జీవపరిణామక్రమంలో ఈ అతి సామాజికత అన్నది చాలా ముఖ్యమయిన లక్షణం అంటాడు విల్సన్. నీటిలో నుంచి ప్రాణులు భూమి మీదకు రావటం, రెక్కల సాయంతో ఎగరడం, పువ్వులు, వాటివల్లజాతి కొనసాగటం లాంటి లక్షణాలతోబాటు ఈ సహజీవనాన్నికూడా లెక్కించవలసిన అవసరముందని ఆయన అభిప్రాయం. ‘జీవులెన్ని ఉన్నా, ఈ సామాజికత గలవి వాటి మధ్యలో సూపర్ జీవులయ్యాయి’ అంటాడాయన. ఈ సూపర్ జీవులలోని సంక్లిష్టత మిగతా రకాలకు వీలుకాలేదు. తమది అంటూ ఒక స్థావరం, ఎంత తిరిగినా తిరిగి అక్కడికే చేరాలన్న బలమయిన ఆకర్షణ ఈ సామాజికతకు కేంద్ర బిందువు. ఈ కేంద్ర బిందువునే తమ గూడుగా మలుచుకుని జీవులు దాన్ని అన్నిరకాలా రక్షించుకునే ప్రయత్నం చేశాయి. మానవుడు కూడా అదే మార్గాన నడిచాడు. ఒక పుట్ట, లేదా తేనె తెట్టె, అలాగే ఒక పల్లె, ఒక గుహ! అక్కడికి చెందనివారు ఎవరైనా వచ్చారంటే తరిమి కొట్టవలసిందే!


కోతి జాతులలో ఈ లక్షణం మొదలయింది మానవులతో మాత్రమే. సామాజికతను మానవులు మరింత ఎత్తులకు చేర్చారు. మిగతా కోతి రకాలకు ఇళ్లు, గూళ్లు లేవు. నియాండర్‌తాల్ మానవులు కూడా ఇల్లుకట్టుకునే ప్రయత్నం అంతగా చేయలేదు. ఇల్లు కట్టుకుని, ఊళ్లుగా వెలసిన ఆధునిక మానవుల ముందు.. అందుకే వారు నిలువలేకపోయారు. చీమల ముందు మిగతా పురుగులలాగే తల వంచి తప్పుకున్నారు. అయినా, మనిషి- చీమలు మిగతా సామాజిక జీవుల మాదిరి నడవలేదంటాడు విల్సన్.


మనిషి శరీరం తీరు, తెలివి, భావాలు, ఈ మార్గాన్ని మరో పక్కలు మలిపాయి. మనిషి భూమికి పరిమితమయ్యాడు. అవసరం కొద్దీ నిప్పును తయారుచేసి వాడుకున్నాడు. పాత పనిముట్లనుంచి కొత్తదానికి మళ్లాడు. భూమి మీద జంతువులు చాలామటుకు చిన్న శరీరం గలవి. మనిషి శరీరం వాటికంటే పెద్దది. అన్నిటికీ మించి మనిషి చేతులను గొప్పగా వాడుకున్నాడు. ఏ గిట్టలు, గోళ్లు చేయలేని పరిశీలన చేతుల కారణంగా వీలయింది. వేళ్లు ముడుచుకునే రకంగా ఉన్నాయి. బొటనవేలు వాటికి ఎదురుగా రాగలుగుతుంది. దేన్నయినాపట్టి, ఎత్తి, కంటిముందుకు తెచ్చి పరిశీలించడం వీలయింది. చేతులతో మరెన్నో చిత్ర విచిత్రమయిన పనులు వీలయ్యాయి.


మనిషిలో నాటి నుంచి నేటివరకు ఒక అవసరం కోసం అందరూ కలిసి పనిచేసే లక్షణం ఉంది. అయినా చిన్న కారణంతో యుద్ధాలు చేసే లక్షణం కూడా ఉంది. ఇక్కడ నిర్ణయం రకరకాల స్థాయల్లో జరుగుతుంది. మనవారికోసం ప్రాణాలకు తెగించడమూ ఉంది. చిన్న భావన పేరుతో ప్రాణం తీయడం కూడా ఉంది. సామాజికత గురించి, అడుగడుగునా గుర్తుచేయవలసిన అవసరం ఉంటున్నది. మనుషుల సామాజికతలో అన్నిటికన్నా మంచి లక్షణంతో పాటే, అధమ లక్షణం కూడా కనబడుతున్నది. మరి ఇది చీమలోని సామాజికతతో సమమయిన లక్షణం కానే కాదు. అందుకు కారణం ‘మన భావజాలం పాత రాతియుగం నాటిది, సాంకేతిక శక్తి మాత్రమే ఈ నాటిది కావడం’ అంటాడు విల్సన్. మనిషికి శత్రువు.. ఈ రకంగా మనిషే! ఇక్కడ సామాజికతకు అర్థం మారుతుంది!


మనం చీమలం కాము. చీమ మనుషులమైనా కాగలుగుతామా..?