Tuesday, May 29, 2012

కుక్క - మానవుడు


మనిషి... ఆరడుగుల ఎ త్తున్న మరో మనిషిని నమ్మడు. అంగుళం తాళాన్ని మాత్రం నమ్ముతాడు. అంతకన్నా ఎక్కువగా తన కుక్కను నమ్ముతాడు. మనిషి జాతికి మరో జంతువు గురించి పట్టనప్పటినుంచి కుక్క తోడుగా ఉంది. పదిహేను వేల సంవత్సరాల క్రితం అంటే వ్యవసాయం కూడా అంతగా రాని నాటినుంచే కుక్కలు సాయంగా వచ్చాయి. అయినా, మానవ నాగరికతలో కుక్క పాత్ర గురించి తెలిసింది తక్కువ. అటు వేటలో, తరువాత పశుపోషణలో కుక్కలు ఎంతో సాయం చేశాయన్నది నిజం. కుక్కలను గురించి పరిశోధకులు చాలామంది పట్టించుకున్నారు. డార్విన్ కుక్కల నడవడిని పరిశీలించాడు. తన నాచురల్ సెలెక్షన్ సిద్ధాంతానికి వాటిని ఉదాహరణలుగా వాడుకున్నాడు. 20వ శతాబ్దంలో నోబెల్ గ్రహీత కాన్రాడ్ లోరెంజ్ కుక్కలగురించి విస్తృతంగా పరిశీలనలు సాగించారు. స్కాట్, ఫుల్లర్ అనే జన్యు శాస్తవ్రేత్తలు కుక్కల నడవడిని విశే్లషించారు. ఇటీవలికాలంలో మాత్రం కుక్కల గురించి పరిశోధనలు అంతగా జరగలేదనాలి. 21వ శతాబ్దం వచ్చిన తర్వాత మాత్రం వాటి మీదకు మరోసారి చూపు మరలింది. తోడేళ్లనుంచి కుక్కలుగా మార్పులో జరిగిన అంశాలు, వాటి తెలివి, భావావేశాల గురించి ఎంతో పరిశోధన జరిగింది, జరుగుతున్నది కూడా. కనుక కుక్కల గురించి ఎన్నో కొత్త అంశాలు తెలియవస్తున్నాయి.

పెంపుడు జంతువుగా...

నిజానికి మానవుడు కుక్కలను ప్రయత్నించి మచ్చిక చేయలేదు. వేట పద్ధతినుంచి జీవనవిధానం మారుతున్న రోజులలో కుక్కలు వాటంతటవే మనిషి పంచన చేరాయి. తోడేళ్లు క్రమంగా కుక్కలుగా మారాయని, డిఎన్‌ఏవిశే్లషణలో బయటపడింది. ఇప్పటి తోడేళ్లను గమనిస్తే, రాతియుగం మానవుడు వాటిని చేరదీసి మచ్చిక చేసిన వీలు కనిపించదు. అంటే, వెనుకటి కాలంలో తోడేళ్లు మరింత మెత్తని స్వభావం కలిగిండేవని అర్థం చెప్పవచ్చు. ఆ జాతి గతించింది. వాటి వారసులుగా కుక్కలు మిగిలి ఉన్నాయి. అప్పటి తోడేళ్ళు మనుషుల ప్రాంతాలలో తిండికోసం తిరిగాయి. వాటి పిల్లలను మనుషులు చేరదీశారు. అప్పటి మానవులకు జంతువుల కూనలను తెచ్చి పెంచుకోవడం అలవాటు! అట్లా మనుషుల మధ్యల పెరిగిన జంతువులను మచ్చిక చేసి పనులు నేర్పడం సులభం. ఆ దారిలో మనిషికి కుక్కలసాయం మొదలయింది. కాపలా, వేటలాంటి లక్షణాలుకూడా నేర్చిన తర్వాత వాటి సాయం పెరిగింది. అంటే కుక్కలను మచ్చిక చేయడం అనుకోకుండా జరిగిన పని! కానీ, దానివల్ల అటు తోడేళ్ళకు, ఇటు మనుషులకు మంచి జరిగింది. సహవాసం సాగింది.

మచ్చిక - క్రమం

ఉత్తర ఇజ్రాయెల్‌లో ఒక సమాధిలో ఒక వ్యక్తి కుక్కమీద చెయ్యి వేసి ఉండడం కనిపించింది. ఆ కుక్క పిల్లకు, అప్పటి తోడేలు పిల్లలకూ ఎంతో తేడా ఉంది. ముఖ్యంగా, దాని దంతాలు పూర్తిగా వేరుగా ఉన్నాయి. అంటే, ఆ కాలానికి తోడేళ్లు కొన్ని కుక్కలుగా మారినట్లు లెక్క. కుక్కపిల్లను మనిషితో బాటు ఖననం చేశారంటే పరస్పర సంబంధం, ప్రేమ అర్థమవుతాయి. 12 వేల సంవత్సరాల నాటి ఈ సమాధి కుక్కల చరిత్రలో ఒక గొప్పసూచనగా నిలిచింది. కానీ, అంతకుముందు ఎక్కడ, ఏ రకంగా కుక్కలు మచ్చికయిందీ చెప్పగల ఆధారాలు నేటివరకూ అందలేదు. గత ఏడాది సైబీరియాలో జరిపిన తవ్వకాలలో ఒక చోట కుక్క పుర్రె దొరికింది. అది 33 వేల సంవత్సరాలునాటిదని లెక్క తేలింది. పుర్రె నిర్మాణం కుక్క పుర్రెలాగున్నా, పళ్లు మాత్రం తోడేలు పద్ధతిలో ఉన్నాయి. గతంలో బెల్జియంలో దొరికిన ఒక పుర్రెకూడా 31 వేల ఏళ్ల నాటిదని ఈ మధ్యన నిర్ణయించారు. ఇది బహుశా, ఈనాటి కుక్కల పూర్వీకుల జాతికి చెందినవని అభిప్రాయం, అనుమానం వచ్చాయి. కానీ, ఈనాటి కుక్కలు ఈ క్రమంలోనివి కావని ఆధారాలు కూడా అందాయి. 24,000 నుంచి 13,000 సంవత్సరాలు మధ్యన, భూమి మీద మంచు యుగం వచ్చింది. అప్పుడు మానవులు దక్షిణ ప్రాంతాలకు తరలి వచ్చారు. మునపటి కుక్కలు వారితో రాలేదు. మచ్చిక కార్యక్రమం మరోసారి మొదలయింది.

మచ్చిక ఎక్కడ?

పురాతత్వ పరిశోధనలో అందిన ఆధారాల ప్రకారం, కుక్కల మచ్చిక మునుముందు పడమటి ఆసియా ప్రాంతంలో మొదలయింది. ఆ ప్రాంతాలను ఇప్పుడు మిడిల్-ఈస్ట్ (మధ్యప్రాచ్యం) అంటున్నారు. 2005లో కుక్కల డిఎన్‌ఏ నిర్మాణ క్రమాన్ని (జీనోమ్) పూర్తిగా గుర్తించారు. అంతకుముందు దొరికిన కుక్కలు, వాటి పూర్వీకులనుకున్న తోడేళ్ల జన్యు పదార్థాలను కూడా తరచి చూస్తే, పరిణామం, మచ్చికల గురించి మరెంతో తెలుస్తుంది. ఇలాంటి పరీక్షలు జరిగాయి. కుక్కలన్నింటిలోనూ మిడిల్ ఈస్ట్ పద్ధతి జన్యు నిర్మాణమే కనిపించింది. కనుక పురాతత్వ పరిశోధన వెల్లడించిన చరిత్ర సరయినదేనని గట్టిగా తెలిసింది. స్వీడన్ పరిశోధకులు పీటర్ సవొలైనెన్ మాత్రం కుక్కల పుట్టుక స్థానం ఆగ్నేయ ఆసియా అంటున్నాడు. జీవ జాతులు వేరు వేరు చోట్లకు చేరిన కొద్దీ వాటి జన్యువులలో వైవిధ్యం తగ్గి, మొదటి రూపం వస్తుంది. మాంగ్జే నది ప్రాంతపు కుక్కలలో మాత్రం ఆ లక్షణం కనిపించలేదు. యూరోపియన్ కుక్కలలో కూడా మధ్యప్రాచ్యం డిఎన్‌ఏ లక్షణాలు అంతగా కనిపించలేదట. కనుక పరిణామచరిత్రలో ఇంకా ప్రశ్నలు మిగిలాయి.
=================

అనుకోని నిజాలు

కుక్కల మధ్య బంధం
మచ్చికయిన తర్వాత కుక్కల కుటుంబం పద్ధతి పూర్తిగా మారిపోయింది. తోడేళ్లకు ప్రపంచమంటే కుటుంబం ఒకటే. తల్లి, తండ్రి, వాటి పిల్లలు కలిసి గుంపుగా తిరగడం వాటికి బాగా అలవాటు. పెరిగిన పిల్లలు కూడా తల్లిదండ్రులతోనే ఉండిపోతాయి. తమ తరువాత పుట్టిన పిల్లలను పెంచడంలో అవి సాయపడతాయి. తోడేళ్లనుంచి వచ్చిన కుక్కలకు మాత్రం ఈ కుటుంబం పద్ధతి ఏ మాత్రం చేతగాదు. కుక్కల మధ్యన ప్రేమ కలిగి ఉండడం లాంటివి కనిపించవు. అడవులలో పెరిగే కుక్కలు కూడా కుటుంబాలుగా ఉండవు. ఆడ తోడును ఎంచుకోవడంలో వాటికి ఒక పద్ధతి లేదు. ఇక పెంపుడు కుక్కలకు యజమాని, ఆ కుటుంబం మాత్రమే స్వంత కుటుంబంగా కనబడుతుంది. మిగతా కుక్కల సంగతి పట్టనే పట్టదు. నిజానికి కుక్కలకు.. కుక్క- మనిషి అనే తేడా తెలియదంటారు. మనిషితో కలిసి, మనిషినే జట్టు నాయకులుగా గుర్తించి బతుకుతాయవి!
ఎవరు ఎక్కువ?

కుక్కలలో పైచెయ్యి (డామినెన్స్) పద్ధతి లేదు. ఒక జంతువుల జత ఏదైనా విషయంలో పోటీపడితే అందులో ఎవరిది పైచేయి అన్నదే ఈ డామినెన్స్. కుక్కలలో నిజానికి మనిషితోబాటు ప్రైమేట్స్‌లో తప్ప, మరే జంతువులోనూ ఈ లక్షణం కనిపించదని పరిశోధకులు అంటారు. కుక్కలకు మనిషితోబాటు, మరే జంతువుతోనయినా పోటీ పడవలసి ఉంటే, అది అక్కడితోనే ముగుస్తుంది. రుచికరమయిన తిండి దొరకడం గానీ, ప్రేమతో నిమరడం గానీ జరిగితే కథ అంతటితో ముగుస్తుంది. పోటీపడుతున్న జంతువు గురించి కొంత తెలుసు గనుక, ఆ సంగతిని వాడుకుంటే, ఫలితం అందుతుందని మాత్రం తెలుసు. తమదే పైచెయ్యి కావాలన్న పట్టు మాత్రం లేదు.

దోషభావం లేదు
ఇంటికి వచ్చి చూచేసరికి కుక్క, ఏదో వస్తువును పాడుచేసిందనుకుందాము. కుక్కవేపు చూస్తే, దాని ముఖం, శరీరంలో దోషభావం కనిపిస్తే కనిపించవచ్చు. కానీ, అది తప్పు చేసినట్లు దానికి అర్థమయిందనడానికి సూచన మాత్రం కానే కాదు. ఈ విషయంగా పరిశోధనలు జరిగాయి. యజమానికి, కుక్క తప్పు చేసిందని, ఫిర్యాదు చేస్తే చాలు. దాని ముఖంలో ‘తప్పుభావం’ కనబడుతుందని గమనించారు. నిజానికి, కుక్క ఏ తప్పు చేయకున్నా, ఆ భావం కనబడుతుందట. యజమాని తనను శిక్షించబోతున్నారని అర్థమయితేచాలు, కుక్కలు బిక్కమొహం వేస్తాయన్నమాట. ఎందుకు శిక్షించబోతున్నారన్న సంగతి మాత్రం వాటికి తెలియదు!
==============

శక్తియుక్తులెన్నో..

* మనుషులకు సాయం చేయడంలో మరొక జంతువేదీ కుక్కలకు సాటిరాదు. చింపాంజీలకు కూడా మనుషుల శరీరం కదలిక సూచనలు అంత బాగా అర్థం కావు. వేలు చూసినా అర్థం చేసుకోవడం ఒక్క కుక్కలకే చేతనయింది. కుక్కలకు ‘నేర్చుకునే శక్తి- కోరికలు’ చాలా ఎక్కువ. మనుషుల నడవడిని అవి మరీ మరీ పరిశీలించి అర్థాలు తెలుసుకుంటాయి. కుక్కలకు మనుషుల ముఖ కవళికలు ఎంతో నచ్చుతాయి. కోపం, మెచ్చికోలు సులభంగా అర్థమవుతాయి. అసలు, ఆ ముఖం ఎటువేపు ఎందుకు చూచేదీ వాటికి అర్థమవుతుంది. కళ్ళు లేని వారికి కుక్కలు తోడుగా ఉంటున్నాయని తెలుసు. ఆ రకం కుక్కలను గురించి ఫ్లోరెన్స్ గానెట్ వంటి జంతు శాస్తజ్ఞ్రులు లోతుగా పరిశోధించారు. కళ్లు లేనివారు వారి ‘చూపును’ కూడా కుక్కలు చురుకుగా అర్థం చేసుకోగలుగుతాయని ఆమె అంటున్నారు.

* కుక్కలకు తమ పరిసరాలను గురించి అంతగా తెలియదని ఒక్కోసారి అనిపిస్తుంది. బ్రిటా ఓస్ట్‌హౌస్ అనే పరిశోధకురాలు ఈ అంశం గురించి పరిశోధిస్తున్నారు. ఆమె చేసిన ప్రయోగంలో రెండు హాండిల్స్ ఉంటాయి. వాటిలో ఒకదాని నుంచి కట్టిన దారం అటు చివరన మాంసం ముక్క ఉంటుంది. అయినా కుక్కలు ఆ దారం సంగతి పట్టించుకోకుండా, తిండికి దగ్గరగా ఉన్న హ్యాండిల్‌ను లాగాయి. కుక్కలకు కాలంలో వెనక, ముందుల గురించి కూడా అంతగా తెలియదని అర్థమయింది. గతం అనుభవాలను అవి గుర్తుంచుకోవు. రానున్న కాలానికి జాగ్రత్తలు వాటికి తోచవు. అందుకే ఒంటరిగా వదిలిన కుక్కలు మరీ సమస్యలకు గురవుతాయి. సమస్యలకు కారణమూ అవుతాయి. వదిలి వెళ్లిన యజమాని ఏదో ఒకనాటికి తిరిగివచ్చే సంగతి వాటికి తోచదు.

* కుక్కల ముక్కు, వాసన శక్తి ఎంతో ప్రత్యేకమన్న సంగతి తెలిసిందే. మనుషుల వాసన శక్తి కుక్కలతో పోలిస్తే, చాలా తక్కువ. మనుషులకు సూచనగా కూడా తెలియని వాసనలను కుక్కలు పసిగడతాయి. మనిషి రక్తంలో డయాబెటిస్ కారణంగా చక్కెరలు ప్రమాద స్థాయికి చేరుకుంటే కుక్కలు గుర్తించి హెచ్చరిక చేయగలుగుతున్నాయి. అవసరమైతే అర్థరాత్రి కూడా మనిషిని నిద్రలేపి, హెచ్చరించేలా కుక్కలకు శిక్షణ ఇవ్వగలిగారు. కుక్కలలో వాసనకు సంబంధించిన వోమెరో నేసల్ ఆర్గాన్ అనే రెండవ (అదనపు) వ్యవస్థ ఉంటుంది. పైవరుస కోరపళ్లమీద నుంచి ఒక డక్ట్ ఉండి ముక్కులోకి తెరచుకుంటుంది. ఈ దారి వెంట కూడా వాసనలు తెలుస్తుంటాయి. ఈ వ్యవస్థ గురించి మరింత పరిశోధన జరగవలసి ఉంది. మిగతా కుక్కల వాసన గుర్తించటం దీని పని అని పరిశోధకులు భావిస్తున్నారు.

No comments:

Post a Comment