Sunday, May 13, 2012

అవాంతరాలు

అనుకోకుండా గాడిద, ఒంటె దారిలో ఎదురుపడ్డాయి. గాడిద గౌరవంగా ఒంటెను పలుకరించింది. ఒంటె అంతే అభిమానంగా సమాధానమిచ్చింది. అప్పుడు గాడిద, ఒంటెను ఒక ప్రశ్న అడిగింది. ‘అవునన్నా! ఇద్దరమూ నాలుగు కాళ్లు గలిగి ఉన్నాము. నేనేమో మాటిమాటికి తట్టుకుని పడుతుంటాను. నీవెప్పుడూ అట్లా పడడం చూడలేదు. కాళ్లు పొడుగున్నందుకా? ఏమిటి సంగతి?’ అని.



‘కాదు తమ్ముడూ! నా కళ్లు ఎప్పుడూ పైకి చూస్తుంటాయి. అంటే, నాకు ముందుదారి చాలాదూరం వరకు శుభ్రంగా కనబడుతుంది. ఇక తప్పటడుగు ప్రశ్న ఉండదు. మరి నీ కళ్లు ఎప్పుడూ కిందకు చూస్తుంటాయి. నీకు కాళ్ల కింద నేల తప్ప ముందు దారి కనబడదు. కనుకనే నీవు పడిపోతుంటావు’ అన్నది ఒంటె.


గాడిదకు విషయం అర్థమయింది. ‘నువ్వు ముందు నడువు మరి! నేను వెంట వస్తాన’న్నది.

==========

అవాంతరాలు

అనుకున్నదేదీ అనుకున్న సమయానికి జరగడంలేదు. మరి ఎందుకలా జరిగింది?
బతుకు మన ప్లాన్ ప్రకారం జరగడంలేదు. ఏదో జరిగితే, దానికి రియాక్ట్ అవుతున్నాము, అంతే.
పనులు జరగడం గురించి, జరగకపోవడం గురించి మరెవరిమీదనో నిందలు వేస్తున్నాము తప్ప అవి జరగడానికి తగిన ఆలోచనలు, పథకాలు మనం వేయడంలేదు.
మనలో దాగివున్న పిల్లతనం మనలను నడిపిస్తున్నది. పండిన ఆలోచనలను ముందుకు రానివ్వడం లేదు.
తప్పు చేస్తామన్న భయంతో, అసలు ఏ పనీ చేయకుండా ఉండిపోతున్నాము. పిల్లతనంలో ఏం చేసినా ‘తప్పు’ అంటూ భయపెట్టారు. నవ్వారు. ఆట పట్టించారు. మనం అక్కడే నిలిచిపోయాము.
అందరికీ చేతనయిన పనులు మనకూ చేతనవుతాయని తెలుసు. కానీ చేసి చూడడానికి భయం అడ్డుపడుతుంది. పని చేసి పరీక్షించే ధైర్యం లేదు.
మన గురించి మనం నిర్ణయాలు చేయలేకపోతున్నాము. ఎవరో చెప్పినా వినడంలేదు.
మనం కావాలనుకున్న వాటివెంట పరుగెత్తుతున్నాము. మన ‘అవసరాలను’ గుర్తించడంలేదు.
అనవసరమైన పనులను పంచుకొంటున్నాము. సరదా కాలక్షేపం మనకొక పనిగా తోచినట్లుంది.
మనం గడిచిన రోజులు ఆదర్శంగా ముందుకు నడుస్తున్నాము. ఇప్పుడేమి చేయగలమన్న ఆలోచనకు దూరంగా ఉంటున్నాము.
మన తీరుకు, మనం తప్ప మిగతా వారందరూ, అన్ని పరిస్థితులూ కారణం అనుకుంటున్నాము.
భవిష్యత్తు గురించి కాక, ఇవాళటి కొరకు బతుకుతున్నాము. పని చేస్తున్నాము.
సమస్య వస్తే చూడక, తప్పించుకు తిరుగుతున్నాము.
ఇట్లా మన పరిస్థితికి ఎన్నో కారణాలుండవచ్చు. వీటిలో ఏ ఒకటి, కొన్ని నిజమయినా, మనం ఆలోంచాలి. పద్దతి మార్చుకోవాలి!
===========

అసలు మాట
అధికారమూ, హోదా గలవారికి చదవడానికి టైం ఉండదు. కానీ చదవని వారు అధికారం, హోదాలకు అర్హులు కారు.
-మైకేల్ ఫూట్


చదివితే మరింత మంది తెలివి, మన తెలివికి తోడవుతుంది.

1 comment:

  1. koncham confusion ga cheppinatlunnaru,
    mooduchoopu vundalana, baga chadavalana,
    i think, i am unable to understand.

    ReplyDelete