Friday, May 25, 2012

మన పనితనం

మనం ఒక ఉద్యోగం కొరకు అభ్యర్థన పంపాలంటే, మనకున్న ఆ కోరిక ఒకటి చెపితే చాలదు. మన గురించి, చదువు గురించి, ఇంతకుముందు చేసిన ఉద్యోగాల గురించి వివరాలు కూడా పంపాలి. ఈ సంగతులనంతా ఒక క్రమంలో రాసి పంపాలి. బయోడేటా, కరికులమ్ విటే, రెజూమె లాంటివి ఇందుకు పద్ధతులు. ఈ మధ్యన రెజుమె (ఈ మాటను సరిగా పలకడం చాలామందికిచేతకాదు. తెలుగులో దాన్ని రాసి చూపించడం అంతకన్నా వీలు కాదు) పద్ధతిని అందరూ ఆదరిస్తున్నారు. ఇంటర్‌నెట్లో చాలా సైట్లు మొదలు ట్రెయినింగ్ సంస్థల దాకా అందరూ మీ రెజుమె మేము బాగా రాసి యిస్తామంటారు. అంతేగాని, ‘బాగు’ లేక ‘మంచి’ అంటే ఏమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు. మన గురించి రాసే ఈ వివరాల పట్టిక ఎంత పొడుగుండాలి? దానికి సరయిన పద్ధతి అంటూ ఏదైనా ఉందా? వర్డ్ డాక్యుమెంట్ పంపాలా? లేక పీడిఫ్ పంపాలా? లాంటి ప్రశ్నలకు సూటిగా సమాధానం దొరకదు. ప్రింటు వేసి పంపే సందర్భంలో కూడా కాగితం సైజు, అక్షరం సైజు, ఎన్వలప్ సైజు లాంటివన్నీ అనుమానాలే.


అప్లికేషన్‌ను ఇతర దేశాలకు పంపాలంటే మరిన్ని చిక్కులు ఎదురవుతాయి. గ్రీసు దేశం వారికి మన వివరాలు ఎంత నిడివి ఉంటే అంత నచ్చుతాయట. నార్వేలో మాత్రం రెజుమె రెండు పేజీలు మించితే విసుక్కుంటారు. ఇటలీ, న్యూజీలాండ్ లాంటి దేశాలలో సీనియర్‌లయితే నిడివి అయిదు పేజీల దాకా ఉన్నా ఫర్వాలేదు. మన దేశంలో మరి ఏమిటి పరిస్థితి? ఎవరికయినా తెలుసా? దక్షిణాఫ్రికాలో అప్లికేషన్‌తో బాటు మన ఐడి నంబరు, ఏ దేశం వారులాంటి వివరాలు తప్పక ఇవ్వవలసి ఉంటుంది. జపానులో రెజుమె అంటే మన బయోడేటాలాగా పేరు, వయసు, స్ర్తి/పు వివరాలతోనే మొదలవుతుంది. యూరపులో కొన్నిచోట్ల అభ్యర్థులు తమ పేరు తప్ప మిగతా వివరాలు అన్నీ పంపడం కూడా ఉంది. మన దేశంలో కొన్ని రోజులకు ఆధార్‌నంబరు, అలాంటిదే మరో నంబరు అడుగుతారనవచ్చు. ఇంతకూ మనం ఏ రకమయిన వివరాలను ఏ పద్ధతిలో పంపాలన్నది ప్రశ్న!

అప్లికేషనుతో బాటు మన వివరాలు పంపవలసిన అవసరం ఏమిటి? అక్కడ ఒక వ్యక్తి కావాలి. ఆ పని చేయడానికి ఆ వ్యక్తికి కొన్ని సామర్థ్యాలు ఉండాలి. మనం ఆ పనికి పనికివస్తామని రుజువు చేయడానికి మనం, మన సామర్థ్యల వివరాలు పంపించాలి. ఏ దేశమేగినా, ఎందుకాలిడినా, ఈ పరిస్థితిమాత్రం మారదు. ఫెరారీ అనే కార్ల కంపెనీ వారు కొత్త మోడల్ కారు వచ్చినపుడు ఒకకొత్త కరపత్రం అచ్చువేయిస్తారు. వాళ్లు తమ కార్లను ప్రపంచమంతటా అమ్ముతారు. అన్ని దేశాలలోనూ పత్రంలోని భాష మారుతుంది గానీ, స్వరూపం మాత్రం ఒకేరకంగా ఉంటుందట. మన దరఖాస్తు, అర్జీ, అభ్యర్థన, అప్లికేషన్ విషయంలో కూడా ఇదే పద్ధతి పాటిస్తే తప్పులేదు. అందులో కథలు, కాకరకాయలు కాకుండా సూటిగా సమాచారం ఉండాలి.

రైల్వేవారు క్రీడాకారులకు ఉద్యగాలు యిస్తుంటారు. ఒక ఫుట్‌బాల్ ఆటగాడు తన అప్లికేషన్ పంపాడు. అందులో అతను ఇచ్చిన వివరాలు గమనించండి. వృత్తి: ఫుట్‌బాల్ ఆడడం, బాధ్యతలు: బంతిని తన్నడం, దాంతో పరుగెత్తడం, వీలయితే గోల్‌లోకి తన్నడం.. అలా సాగాయి వివరాలు. సాధారణంగా వృత్తి అంటే మనకు మరోలా తోస్తుంది. ఆకుపేషన్ అన్న ఇంగ్లీషు మాటకు ‘కులవృత్తి’ జవాబుగా తోచనవసరం లేదు. లెక్కలు రాయడం వృత్తి అయితే, అందులో భాగంగా ఏయే రకం పనులు చేశామన్నది చెప్పాలి. మదర్‌టంగ్ అన్న కాలంలో ఒకతను -అందరు అమ్మల నాలుకలలాగే అని రాశాడు! అప్లికేషనులో కనిపించవలసింది మన విలువ, సాధించిన పనులు మాత్రమే.

ఈమధ్యనే చేసిన ఉద్యోగంలో వెలగబెట్టిన నిర్వాకమంతా ఏకరువు పెడతారు కొందరు. అక్కడ ఇంతకూ మనం సాధించినదేమిటి, అంతకుముందు, అలాంటి శక్తి పాటవాలు ప్రదర్శించామా? లాంటి వివరాలు అవతలివారికి అందవు. నిజానికి చాలామంది ‘నేనేమి సాధించలేదు’ అంటారు. లేదా మామూలు సంగతుల గురించి గొప్పగా రాస్తారు. వాస్తవాలను రాయడం అంత కష్టం మాత్రం కాదు. మామూలు పనిలో కూడా మనం ప్రత్యేకంగా ఏమైనా చేయగలిగామా? అని ఆలోచించగలిగితే చాలు.
సేల్స్‌లో పనిచేసి ఉంటే, సూచించిన టార్గెట్‌లను అందుకున్నామా? అధిగమించామా? ఆ కంపెనీలో ముఖ్యులయిన క్లయింట్ల అకౌంట్లు మీ చేతిలో ఉండేవా? మంచిపని చేసినందుకు కంపెనీవారు గానీ, మరెవరైనాగానీ, మీకు అవార్డులు, అభినందనలు అందించారా? లాంటి వివరాలు మన విలువను పెంచుతాయి.

ఎంత పెద్ద బడ్జెట్‌లను మనం నిర్వహించాము లాంటి వివరాలు మరింత బలం అందిస్తాయి. లక్షలు, కోట్లలో ఉండే లావాదేవీలు మన చేతిమీద నడిచినట్లయితే గొప్ప. చివరకు అలాంటి ప్రాజెక్టులో ఏ మూలనయినా బాధ్యత గల పొజిషన్‌ను నిర్వహించి ఉంటే, మన విలువ బయట పడుతుంది. వేల మంది పనిచేసే ఒక ఆఫీసు కాంప్లెక్స్‌లో పరిశుభ్రతను ‘నేనే నిర్వహించాన’ని గౌరవంగా, గర్వంగా చెప్పవచ్చు. పాత కంపెనీలో మన తాహతుకుమించిన బాధ్యతలు మనమేదయినా నిర్వహించామా? అనుభవంలేని వారు కూడా వెతికితే, చదువుకునే సమయంలో చేపట్టిన బాధ్యతలు, సంధించిన లక్ష్యాలు ఉండే ఉంటాయి. రాత, మాట అవసరమయే ఉద్యోగాలు చాలా ఉంటాయి. ప్రజలతో సంపర్కం ఉండే బ్యాంకు ఉద్యోగాల లాంటివి కొన్ని ఉంటాయి. అక్కడ మన తీరు, మన మాట తీరులకు ప్రాముఖ్యం ఉంటుంది. రచనలు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడంలాంటి వాటికి అక్కడ ప్రాముఖ్యం! అసలు కస్టమర్లను సంతృప్తిపరచడం, వారి చేత అవుననిపించుకోవడం గొప్ప సామర్థ్యం! అలాంటి అనుభవాలు మనకు ఉన్నాయా?

అసలు బాధ్యతలతో బాటు అదనపు బాధ్యతలు నిర్వహించిన వారికి గౌరవం ఎక్కువ. ఇలాంటి వివరాలన్ని రెజుమెలో ఉండాలి. దానితోబాటు, అంతే గౌరవంగా రాసిన కవరింగ్ లెటర్ ఉండాలి. ఆ ఉత్తరాన్ని చూడగానే, చదవగానే మన తీరు బయట పడుతుంది. కాగితాలను మడిచి చిన్న కవర్లో పెట్టడంలోనూ, సరైన సైజు ఎన్వలప్‌లో, లేదా మరీ పెద్ద కవర్‌లో పెట్టంలోనూ తేడా ఉంది! వారి సమస్యకు ‘మనం సమాధానం’ అన్న భావం కలిగించగలిగితే గ్రేట్! కదూ!రెండవ అవకాశం

అనగనగా ఒక రైతు. ఆయన పొలం అడవికి పక్కనే ఉంది. కష్టపడి పనిచేస్తాడుగానీ, ఏదో ఒకనాడు అదృష్టం వచ్చి తన ముందు కుప్పగా పడుతుందని అతనికి ఒక నమ్మకం. అతను మామూలుగానే తోటలో తన పని తాను చేసుకుంటున్నాడు. అంతలో బాగా బలిసిన కుందేలు ఒకటి వేగంగా పరిగెత్తుతూ వచ్చింది. మరీ వేగంగా వచ్చిందేమో, అక్కడ ఒక చెట్టుకు తగిలింది. చటుక్కున దాని మెడ విరిగింది. కుందేలు పాపం చచ్చిపడింది.
రైతుకు మాత్రం అది అదృష్టంలాగా కనిపించింది!
అతను వెళ్లి కుందేలును ఎత్తి తెచ్చుకున్నాడు. ‘ఇట్లా నిత్యం ఒక కుందేలు దొరికితే ఇంకేం కావాలి? ఈ కష్టం, ఈపని ఏవీ అవసరమే ఉండవు అనుకున్నాడు.
మరునాటినుంచి అతను పార, పలుగు పక్కన బెట్టి ఆ చెట్టు దగ్గరే మరో కుందేలు కోసం ఎదురు చూడసాగాడు. రోజులు గడుస్తున్నాయి, కుందేలు మాత్రం మరొకటి రాలేదు.
రైతు ఆశ మాత్రం చావలేదు. అందరూ అతడిని గేలి చేయసాగారు.

(అదృష్టాలు, అవకాశాలు అనుకోకుండా వస్తాయి. వాటి గురించి ఎదురుచూచి లాభం లేదు. వస్తే ఆనందించాలి గానీ అవకాశాల కొరకు ఆశించకూడదు. కష్టపడడంలో ఉన్న సుఖం మరోచోట లేదు. చేయదల్చుకున్న మంచి పనయినా మొదటి అవకాశంలోనే చేయాలి. మరోసారి చూద్దాం అనుకుంటే, ఆ మరోసారి రానే రాదు!)

====================
అసలు మాట!
మనమేమయినా అయిపోవచ్చు. అందుకే ఇక్కడ అన్యాయమన్నది అసంభవం. పుట్టుక ప్రమాదవశాత్తు జరుగుతుందేమో? చావులో మాత్రం ప్రమాదం లేదు. మనం ఎలాగున్నామో, అలాగే ఉండిపోవాలని ప్రపంచంలో ఏ శక్తీ ఒత్తిడి చేయదు
-జాన్ బెర్జర్

మిగతా జీవులకు అంతగా లేని వెసులుబాటు మనుషులయిన మనకు ఉంది. మనం తార్కికంగా ఆలోచించగలుగుతాము. కార్యకారణాలను గుర్తించగలుగుతాము. సహేతుకంగా, తెలివిగా మనకు కావలసినవాటిని ఎంపిక చేసుకోగలుగుతాము. నిర్ణయించి కొత్త దిశలో కదలగలుగుతాము.

కోపం ప్రదర్శించడం కుదరలేదనుకుందాం. మన భావాన్ని మరో రకంగా పదుగురికీ తెలియజేసే మార్గం వెతకగలుగుతాము. మనవారి పొత్తు పొసగకపోతే, ప్రయత్నించి సమస్యకు సమాధానం వెతకగలుగుతాము.
ఏ విషయంలోనైనా ఒకటి కంటే ఎక్కువ మార్గాలుంటాయి. చాలామంది పని ఒత్తిడి పేరున ఈ సంగతి గుర్తిచలేకపోతారు. అప్పుడు అక్కడ ఇరుక్కుపోయిన భావం కలుగుతుంది. మార్గాలు ఉన్నా కనిపించవు. అంతా గందరగోళమవుతుంది.
నిలకడగా ఆలోచించడం మంచిది!

No comments:

Post a Comment