జీతం బాగానే ఇస్తున్నారు. ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ మాత్రం లేదన్నారు. అందరికీ ఇవ్వగూడదని ఒక పాలసీ! అందుకని ఇవ్వలేదు! అని చెప్పారు కూడా. అయినా అతను అక్కడే సంతోషంగా పని చేస్తున్నాడు. అతనికి అక్కడ ఆనందంగా ఉందని మాత్రం కాదు. ఆనందం కొంత ఉంది. కొంత లేదు. ఉద్యోగం వదిలితే మరోచోట దొరుకుతుంది. ఎక్కువ జీతం వచ్చే వీలు కూడా ఉంది. కానీ, ఎక్కడో ఏదో మెలిక ఉంది. ఏది బాగుంది. మేనేజర్లు తప్ప మిగతా వారంతా బాగుంటారు. బహుశ పనిలో ఎక్కడో కొంత సంతృప్తి కూడా దొరుకుతున్నట్లుంది.
బోలెడు జీతాలు, బోనసులు ఇవ్వడం గొప్పకాదు. జీతాలు బాగా ఇస్తే ఎవరూ కెఫెటీరియాలో తిండి తినరు. బైక్ వేసుకుని మరెక్కడికో వెళ్లిపోతారు. అక్కడ కూడా మేనేజర్ (వెర్రి) గురించి మాట్లాడుకుంటారు. వాళ్లకు మరి జీతం కన్నా, కావలసింది మరేదో ఉందిమరి! చేసే పనికి అర్థం ఉండాలి. వాళ్ల శక్తి బయటపెట్టి చూపించడానికి తగిన అవకాశం ఉండాలి. అంతేగానీ, ఫలితం బాగున్నా, పద్ధతి తమది కాదని, అదేపని మళ్లీ చేయమంటే, వాళ్లకు ఒక అసంతృప్తి మిగులుతుంది. అప్పుడు జీతం గుర్తురాదు. మీరు మేనేజరయినా, కాకున్నా ఈ సంగతి అనుభవంలోకి వచ్చే ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ఉద్యోగాలలోనూ, ప్రైవేటు కంపెనీలలోనూ ఎవరికెంత జీతం ఇవ్వాలన్న విషయం మధ్య మేనేజర్ల చేతుల్లో ఉండదు. ఆ అధికారం ఉంటే బాగుండునన్న కోరిక మాత్రం మేనేజర్లకు బాగా బలంగా ఉంటుంది. జట్టులో వారిని ఉత్సాహపరిచి, పని మీద అభిమానం పెరిగేలా చేయవలసిన బాధ్యత మాత్రం పూర్తిగా మధ్య మేనేజర్లదే. తమ ఈ బాధ్యతను, బరువుగా భావించి, చాలా మంది మేనేజర్లు తప్పు పద్ధతులను అనుసరిస్తుంటారు. స్ట్ఫాను నలుపుకు తినడం గొప్ప అనుకుంటారు.
కంపెనీ ముఖ్యమయనది. అందులో మన టీంలో, నాయకులతోబాటు, మిగతా వారంతా కూడా మనకు అసలయిన కంపెనీ. ముందు ఈ కంపెనీ బాగుండాలి. అప్పుడు మొత్తం కంపెనీకి, బజార్లో మంచి పేరు వస్తుంది. ఎవరికీ ఈ ప్రపంచాన్ని మరమ్మతు చేసే కోరిక, ఓపికా ఉండవు. తన చుట్టున్న ప్రపంచం బాగుంటే, మొత్తం ప్రపంచం బాగానే ఉంటుంది. కనీసం, ఆ భావమయినా కలిగి పని చేయడానికి ఉత్సాహం ఉంటుంది. ఇది వాస్తవంగానూ, సూక్ష్మంగానూ అందరికీ మనసులో ఉండే కోరిక. ఉదయం పనిలోకి వచ్చాము. సాయంత్రం బయటపడే సమయానికి, ఎప్పుడు బయట పడతామా? అనే, ఉసూరుమనే భావం కాకుండా ఉంటే మేలు. కొంతయినా చేశామన్న సంతృప్తితో ఇంటికి వెళితే నిద్ర బాగా పడుతుంది. మేనేజర్లకు కూడా ఇదే కోరిక ఉంటుంది. కానీ బాధ్యత కారణంగా, వారి ప్రవర్తన కొంచెం మొరటుగా ఉండే వీలుంది. తమ సంగతి అర్థం చేసుకుని వారు మరింత స్నేహభావం చూపగలిగితే పరిస్థితి మారుతుంది. వారికి మనసులో స్నేహభావం చూపాలన్న ఆలోచన కలిగించే బాధ్యత జట్టులోని వారికందరికీ ఉంటుంది. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లవుతాయి మరి!
ప్రపంచాన్ని మరమ్మతు చేయటంలో, లేదా కనీసం మెరుగుపరచడంలో మన సంస్థకు కూడా భాగం ఉంటుంది. అందులో మన వంతు పాత్ర ఎంతన్నది జట్టులో అందరికీ అర్థం కావాలి. డబ్బులిచ్చి పని చేయిస్తున్నారంటే, మన ఉద్యోగం తప్పకుండా గొప్పదే అయి ఉంటుంది. (కిరాయి గూండాలు, బిర్యానీలు డబ్బులకు సమ్మెలలో పాల్గొనే వారి సంగతి మాత్రం వేరు) మంచిపనికి మాత్రమే విలువ ఉంటుంది. డబ్బులు చేతులు మారుతున్నాయంటే అక్కడ కొన్ని పరిస్థితులు ఉండక తప్పదు. ఎవరో ఒకరికి కష్టం, శ్రమ, బాధ తగ్గుతుంది. ఒకరికి నమ్మకం, ఆశ పెరుగుతాయి. చివరగా ఈ ప్రపంచం, పని కారణంగా, మరింత మెరుగవుతుంది. ఇలాంటి ఉద్దేశ్యం కొరకే అందరమూ తపన పడతాము.
మన ఉద్యోగంలో కూడా ఈ మూడింటిలో ఒకటయినా జరుగుతూ ఉంటుంది. ఆ కారణం కనిపించాలి. ఇక మేనేజర్లు, టీములు, యజమానులు, క్లయింట్లు అందరి మధ్యనా కనెక్షన్లు వాటంతటవే మెరుగవుతాయి. ఒకచోట ఒక భవనం కడుతున్నారు. ‘ఆఁ! ఏముందీ? పొట్టకూటికి ఇటుకలు పేరుస్తున్నాను, అన్నాడు ఒక మేస్ర్తి. కాలేజీ బిల్డింగట! కొంచెం కొత్తగా ఉంది, ప్లాను!’ అని రెండవ మేస్ర్తి అన్నాడు. ఇక మూడవ మేస్ర్తి మాత్రం, ఆ కాలేజీ ప్రత్యేకత గురించి అందులో చదవబోయే యువత గురించీ కలలు గన్నంత బాగా వివరించాడు. చేసే పని చిన్నదయినా అందులోని విలువను గుర్తించి చేస్తుంటే, ఇంక్రిమెంటు ఇవ్వలేదన్న సంగతి మళ్లీమళ్లీ ముందుకు రాదు. మేనేజర్లయినా ఇదే పద్ధతిలో పనినే పరమార్థంగా భావిస్తే, అందరికీ బాగుంటుంది. మనస్తాపం లేకుండా అందరూ ఆనందంగా పనిచేసుకుపోతారు.
ఉత్సాహంగా ఉండాలన్నా, ఉత్సాహం పెరగాలన్నా మనుషుల మనసుల్లో మార్పు రావాలి. జేబులు, పర్సులు బరువయినంత మాత్రాన ఉత్సాహం పెరగకపోవచ్చు. ప్రతి ఉద్యోగంలోనూ ఎవరి బాధలనో తగ్గించడానికి, నమ్మకాలను, ఆశయాలను పెంచడానికీ, ప్రపంచాన్ని మరింత అందంగా తీర్చిదిద్దడానికీ అవకాశాలుంటాయి. వాటిని గుర్తించి, ఆనందాన్ని అనుభవించాలంటే అన్ని స్థాయిలలోని వారూ కలిసి ప్రయత్నం చేయాలి. ముందు, సవ్యంగా మనసువిప్పి మాట్లాడే పరిస్థితి, అలవాటు ఉండాలి. మాటలతో, బంధాలు ఏర్పడతాయి. బలపడతాయి. పని, కస్టమర్లు, సమాజం, సహోద్యోగులు, స్వంత కుటుంబం అన్నింటికీ పరస్పరం బంధాలు ఉండాలి. రానున్న కాలం గురించి కలలుగంటే, అందులో ఈ దృశ్యాలే కనబడతాయి మరి!
ఉద్యోగం మాని వెళ్ళిపోతానన్న వ్యక్తికి, ‘మరింత జీతం’ ఆశ చూపితే ఉండకపోవచ్చు. వారికి కావలసింది మరేదో ఉంటుంది. అది, మరో చోటయినా దొరుకుతుందేమోనన్న ఆశ ఉంటుంది. ఆ బంధం, ఇక్కడే దొరకాలంటే, రెండు చేతులు కలవాలి. చప్పట్లు మోగాలి.
అసలు మాట
మనమన్న మాట గొప్ప ‘కోట్’ అవుతుందనీ, దాన్ని అందరూ చెప్పుకుంటారనీ అనుకోవడం అర్థం లేని మాట. అది నిజమయినా, అందుకు చాలా కాలం పడుతుంది.
-అజ్ఞాత జ్ఞాని
మనమన్న మాట గొప్ప ‘కోట్’ అవుతుందనీ, దాన్ని అందరూ చెప్పుకుంటారనీ అనుకోవడం అర్థం లేని మాట. అది నిజమయినా, అందుకు చాలా కాలం పడుతుంది.
-అజ్ఞాత జ్ఞాని
నాకు గొప్ప పేరుంది! అమ్మా, నాన్నా పెట్టిన పేరు!
No comments:
Post a Comment