ఒకాయన అత్తగారింటికి పొయినడు.
అక్కడ వాండ్లు నెయ్యి, బెల్లమేసి సంకటి వండి పెట్టినరు.
రుచి బాగున్నది.
"ఇదేమిడిది" అని అడిగినడు.
"తమిదె సంకటి" అని వాండ్లు చెప్పినరు.
"తమిదె సంకటి, తమిదె సంకటి" అని మనుసులో అనుకుంటు తమ ఊరి తోవన వస్తున్నడు.
నడుమ ఒక కాలువ వచ్చింది.
దుంకేటప్పుడు ఊపు కొద్ది "అచ్చరబల్ల!" అన్నడు.
సంకటి సంగతి మరిచి "అచ్చరబల్ల, అచ్చరబల్ల" అనుకుంట ఇల్లుజేరినడు.
'అచ్చరబల్ల జేసి పెట్ట'మని పెండ్లామును అడిగినడు.
'అటువంటిది నాకు రాదు' అన్నదామె.
'మీ అమ్మవాండ్ల ఇంట్లో తిన్న నేను, నీవు కావాలంటని రాదంటున్నవు' అని కోపం కొద్ది పెండ్లామును బాగ కొట్టినడు.
ఆ పుణ్యాత్మురాలు 'నిజంగ నాకు తెలువదు' అని మాత్రము అన్నది.
ఇంకా బాగ కొట్టినడు అమెను.
పక్కింటి ముసలామె 'పిల్లను సంకటిలాగ కొట్టినవు గదనయా' అన్నది.
"ఆ! దాని కొరకే!" అని అప్పుడు యాదికొచ్చి అన్నడు.
ఈ కథ మా చిన్నప్పుడు చెప్పినరు.
అమ్మ సంకటి నెయ్యిపోసి వండి పెట్టేది.
మేము దాన్ని గురించి అచ్చరబల్ల అనే పేరుతోటి చెప్పుకునే అలవాటు.
ఇటువంటి కథలు ఎనుకవడి పొయినయి.
తెలిసిన వాండ్లు చెప్పకపోతే అందరు మరిచిపోతరు.
తెలిసిన వాండ్లు చెప్పకపోతే అందరు మరిచిపోతరు. -- very true
ReplyDelete