జిడ్డు కృష్ణమూర్తి
-అబ్బూరి ఛాయాదేవి
సి.పి.బ్రౌన్
అకాడమి,నాగార్జునహిల్స్,
పంజగుట్ట,
హైదరాబాద్- 82
పేజీలు: 150;
వెల: రూ.95/-
అర్థమయిన వాళ్లకూ, అర్థంకాని వాళ్లకు ఒక ప్రశ్నగా మిగిలి గుర్తుండిపోయే జిడ్డు కృష్ణమూర్తి పేరులోనే తప్ప మరెందులోనూ జిడ్డుతనం లేదు. తెలుగువాళ్లంతా ఆయనను ‘మనవాడు’ అంటారు. ఆయన నిజంగా భారతీయుడా? అని అనుమానం వచ్చినవారున్నారు. అందరికీ ఆ అనుమానం ఉంది, అన్నా తప్పుగాదు. ఆయన ప్రపంచ పౌరుడు. ‘నేను గాలిలాంటి మనిషిని!’ అనగలిగిన మనిషిని పట్టుకుని ఒక పద్ధతికి, ప్రాంతానికి కట్టివేయడం అమాయకత్వం. జేకే గురించి తెలుగులో పుస్తకాలు తక్కువ. వందలకొద్దీ ఉన్న ఆయన పుస్తకాల అనువాదాలు కూడా తక్కువే. ఆయన గురించి తెలుసుకోవాలంటే, మేరీ లుటెన్స్, ప్రపుల్ జయకర్‌లు రాసిన పుస్తకాలు చదవాలి!
అబ్బూరి ఛాయాదేవిగారు రాసిన ఈ పుస్తకం అట్టమీద జీవనమార్గం- జీవితం, బోధనలు అని ఉపశీర్షిక ఇచ్చారు.
అరవయి సంవత్సరాలపాటు ప్రపంచమంతా తిరిగి, నిత్యం తన భావాలను పంచిన ఒక తాత్వికుని గురించి, ఒక చిన్న పుస్తకంలో చెప్పడం వీలుకాని పని! ప్రయత్నం చేయడంలో తప్పులేదు. మంచి పుస్తకమే వచ్చింది. కానీ ఈ పుస్తకంలో కృష్ణమూర్తికన్నా ఆయన ఆలోచనలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రపంచానే్న ‘మార్పు’వేపు మరల్చిన ఒక ప్రఖ్యాత తాత్వికుని ఆలోచనలను, ఒకసారి కథలాగ చదివితే లాభం ఉండదు. ప్రతి నాలుగు వాక్యాల తరువాత, ఒక ప్రశ్న అడగాలనిపిస్తుంది.
ఆయన వెంట తిరిగినవారు, ఆయననుంచి మెప్పు ఆశించారు. అది దొరకనందుకు వారంతా దూరంపోయారు, అంటారు రచయిత్రి ఒకచోట. కృష్ణమూర్తిని మత బోధకుడు అన్నారు కొందరు. ఆయన ఒక మతానికి, సంస్థకు, దేశానికి కట్టుబడినవాడు కాదు. ఆయన మాటలు గురువు బోధనలుగా ఉండవు. ఆయనలో ఒక మిత్రుని చూడగలిగినవారు ఎక్కువ సంతృప్తిపొందారు.
జె.కె. గురించి తెలియని తెలుగు పాఠకులకు ఈ పుస్తకం ఒక మిత్రునిగా వచ్చింది. ‘కొంత’తెలిసిన వారికి కూడా ఈ పుస్తకంలో మంచి మెటీరియల్ ఉంది. పుస్తకంలో వేసిన బొమ్మల కింద, వివరాలు వేస్తే మరింత బాగుండేది. ఇంగ్లీషు పుస్తకాల మీద ఆధారపడినందుకేమో కొన్ని వాక్యాలు, ఇంగ్లీషు సింటాక్స్‌లో వచ్చాయి. విషయం గురించిన ఆసక్తిలేనివారిని కూడా చదివించగల రచనా పద్ధతి, ఇంత చిన్న పుస్తకంలో వీలవుతుందా? ప్రతి విషయంమీద కొంచెం వివరణ ఉంటే ఎంత బాగుండును, అనిపించింది. సీరియస్‌గా చదవవలసిన పుస్తకాలలో ఇదొకటి!
అబ్బూరి ఛాయాదేవి గారు ఈ మధ్య యు.జి. కృష్ణమూర్తి జీవితం గురించి ఒక పుస్తకం రాసింది. దానిని కూడా పరిచయం చేయండి. ఆపుస్తకాన్ని సి.పి.బ్రౌన్ అకాడమి వారు ప్రచూరించారు. తెలుగు జాతి రత్నాల కేటగిరిలో
ReplyDeleteమీ వద్ద ug బుక్ ఉందా సర్
Deleteఈ బుక్స్ ఎక్కడ లభిస్తాయి
ReplyDelete