Tuesday, January 31, 2012

నిర్ణయం.. ఏం చేస్తారు?

అడుగు ముందుకు వెయ్యాలా? అవసరం లేదా? ఇంకా ముందుకు చదవాలా? అవసరంలేదా? జీవితంలో అడుగడుగునా నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. వాటిమీదనే బతుకుదారి, తీరు ఆధారపడి ఉంటాయి. ‘అప్పుడలా చేసి ఉండకపోతే’ అనిపించిన క్షణాలు అన్ని వయసులవారికీ ఎదురయి ఉంటాయి. కొన్ని నిర్ణయాలు మరీ ప్రభావవంతమయినవిగా ఉంటాయి. ఆ రకం నిర్ణయాలు జరగవలసిన సందర్భాలను గుర్తించగలిగితే, ముందు ముందు బతుకు మరింత బాగా సాగుతుంది.

ప్రతిరోజూ నిద్రనుంచి లేవగానే ఆ రోజున పట్టుకుని తిరగడానికి ఒక జెండా దొరుకుతుంది. అంటే, ఆ రోజుకు ఏదో ఒక పని ఉంటుంది. అది అత్యవసరంగా చేయవలసినది కావచ్చు, చాలా ముఖ్యమయినదీ కావచ్చు. లేదంటే సరదాగా కాలం గడపడమూ కావచ్చు. ఆ రోజున చేయవలసిన నిర్ణయాలను గురించి మనం ఆలోచించకపోతే, మరోరోజు గతంలోకి జారిపోతుంది. ఆ తరువాత, ఈ మరుగున పడిన నిర్ణయానికి సంబంధించిన అంశం, అర్జెంటయి, ఒకనాడు ముందుకు వచ్చి తరుముతుంది. భయపెడుతుంది. అప్పుడు నిర్ణయం సరిగా జరగదు.
ఒక పని, దాని నిర్వహణలో, మొదటినుంచి, సరయిన నిర్ణయాలు జరగవలసిన సందర్భాలను ముందే గుర్తించి, వాటి గురించి తగిన ఆలోచనకు వీలు కలిగించాలి. అంటే నిర్ణయాల గురించి సరైన నిర్ణయాలు ముందే జరగాలని అర్థం! ప్రతి నిర్ణయానికి తగిన సమయం ఉంటుంది. ఆ సమయం దాటితే ఆ విషయం సమస్యగా మారుతుంది. అప్పుడు అన్ని రకాలుగా కష్టం, నష్టమే ఎదురవుతాయి.



ప్రయాణంలో సాగుతుంటాము. తిండికి సమయం కాలేదు. కానీ తిండి దొరికే స్థలం వచ్చింది. అక్కడ, తినడం లేదా తిండి తెచ్చుకోవడం గురించి నిర్ణయం జరగాలి. ఆకలి కాలేదు. సమయం కాదని, తిండి గురించి ఆలోచన, నిర్ణయం జరగలేదనుకుందాం. ఆకలి, సమయం అయినప్పుడు తిండి దొరుకుతుందా? ఆ తర్వాత చాలాదూరం వరకు దొరకదేమో? సరే, వెంట తిండి ఉంది. అది చిన్ని చిన్న పొట్లాల్లో ప్యాక్ చేసి ఉంది. మన చేతికి కొన్ని పొట్లాలు వచ్చాయి. ఒక్కొక్క పొట్లం విప్పి తింటున్నాము. ఆ పొట్లం ఖాళీ అయినపుడు, మరొక పొట్లం విప్పాలా? అవసరం లేదా? అనేది ఒక నిర్ణయం. చిన్న పొట్లాలు కాకుండా పెద్ద సంచీ నిండా తిండి ఉంది. అక్కడ కూడా ఎంత తినడం, అనే నిర్ణయం జరగాలి. అందుకు ఆకలి ఒక ఆధారం కావచ్చు. మన తిండి తీరు గురించి ముందే చేసుకున్న నిర్ణయాలు కూడా అక్కడ ప్రభావం చూపవచ్చు. ఉన్న తిండి, అందరికీ చివరిదాకా సరిపోతుందా, అన్న మంచి మనసు ఆలోచన కూడా ఉండవచ్చు. చిన్న పొట్లాలు అందుకున్న వారయినా, మొత్తం తిండి ముందున్న వారయినా ఎక్కడో ఒక చోట నిర్ణయం చేసి ఆపవచ్చు. అదే నిర్ణయంలోని గొప్పదనం. కానీ ప్రయాణంలో ఉన్నామన్న ఆలోచన రాగానే, చాలామంది గతాన్ని, నిర్ణయాలను, తమ వ్యక్తిత్వాన్ని మరిచిపోతుంటారు. తిండి ఉన్నంత వరకు తింటూనే ఉంటారు.

పై వాక్యాలలోని తిండి, నిజానికి తిండి కాదు. అది జీవితం. జీవితం కొంతమందికి చిన్న చిన్న ప్యాకేజీలలో మాత్రమే అందుతుంది. తరువాతి ప్యాకెట్ అందుతుందన్న నమ్మకం కూడా కొన్ని సందర్భాలలో ఉండదు. కొంతమందికి బతుకంతా అవకాశాలే. రెండు చోట్లా సరైన నిర్ణయాలు జరగకుంటే బతుకు బండి పట్టాలు తప్పుతుంది. లేదంటే, వెళ్ళవలసిన చోటుకికాక మరెక్కడికో చేరుతుంది.


బతుకంటే ఒక సూపర్ బజార్. అక్కడ అన్నీ ఉంటాయి. అందులో మనకు ఏవి అవసరం? ఏవి ఉంటే బాగుంటుంది? వాటిని స్వంతం చేసుకునేందుకు మన ప్రయత్నం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సరియైన సమయంలో చేసిన సరైన నిర్ణయాలు సాయం చేస్తాయి. అన్నీ అమరినవారికి, అన్నీ ఆకర్షణీయంగా, అవసరంగా కనబడుతుంటాయి. అక్కడ నిర్ణయాలు జరగవలసి ఉంటుంది. ఆ నిర్ణయాలు మరింత కష్టం! ఆశ్చర్యం కదూ? జేబులో డబ్బులున్నాయి. కానీ ఏ కౌంటర్ ముందు ఆగాలి? ఏ వస్తువు, దుస్తులు ఎంచుకోవాలి? ఏది కొనాలి? అన్న నిర్ణయాలు. అందుకే పెద్ద పెద్ద మాల్స్‌లో అందరూ సరదాగా చుట్టూ తిరిగి, ఖాళీ చేతులతో బయటికి వెళ్ళిపోతుంటారు.


నిర్ణయాలు చేయవలసిన సమయం ఉంటుంది. నిర్ణయాలు చేయడానికి సమయం పడుతుంది. శ్రమ, శక్తి, కొంత ఖర్చు కూడా అవసరమవుతాయి. నిత్యమంతా నిర్ణయాలే చేయవలసి ఉంటే అందుకొక వ్యవస్థ అవసరమవుతుంది. వ్యక్తి విషయంలో ఈ వ్యవస్థ మెదడులోనే ఉండాలి. ప్రతిరోజు ఉదయం, ఆనాడు చేయవలసిన నిర్ణయాల గురించి, రాత్రి పడుకునే ముందు, ఆనాడు జరిగిన నిర్ణయాల గురించి ప్రీవ్యూ, రివ్యూ చేసుకునే అలవాటుంటే, మనలోని నిర్ణయాల వ్యవస్థ సరిగా పనిచేస్తున్నదని అర్థం! క్రమంగా ఈ రకమయిన పరిశీలన జరుగుతుంటే, ఈ మధ్య చేసిన నిర్ణయాలలోని మంచి చెడులను బట్టి, వాటిని గూర్చి మళ్లీ నిర్ణయాలు చేసే వీలుంటుంది. వాటి దారిని సరైన వేపునకు మరలించే వీలు ఉంటుంది.


నిజంగా సమస్యలు వచ్చినపుడు, ఎంత క్రమంగా నిర్ణయాలు జరుగుతుంటే అంత మేలు. అనుభవం అంటే, నిర్ణయాలలోని మంచి చెడులను గుర్తించగలగడం. అనుభవం పెరిగితే, నిర్ణయాలకు ముందే మంచి చెడుల గురించి ఊహించే వీలు ఉంటుంది. అనుభవంతో నిర్ణయాలు చేస్తున్నామంటే, కనీసం నిర్ణయాలు చేస్తున్నామంటే, ఆ అంశం మన అదుపులో ఉందని అర్థం. అయినా ఫలితాలు సరిగా లేవంటే, ఆ నిర్ణయాలన్నింటినీ సమీక్షించి, వాటిని గురించి మరో పెద్ద నిర్ణయం చేయవలసి ఉంటుంది.


ఇంతకూ నిర్ణయాలను గురించి మీ నిర్ణయం ఏమిటి? ఆలోచించండి!

నియాండర్ తాల్ తెలివి


అనుకోని, అసాధ్యమయిన సంఘటనలు వింత క్రమంలో ఎదురయితే అది హాస్యం. అందులో మనమూ ఒక భాగస్వాములమని ఊహించగలిగితే తప్ప నవ్వు అంత సులభంగా రాదు. అందుకు బోలెడంత జ్ఞాపకశక్తి, బుద్ధిశక్తి అవసరమవుతాయి.

అంటే ప్రాచీన మానవులకు హాస్యం చేతగాలేదని అంటున్నారా? కాదు. హాస్యంలో శరీర పరంగా జరిగే సన్నివేశాలు కూడా
భాగమవుతాయి. ఎవరో జారిపడతారు. మిగతావారు నవ్వుతారు. అందులో భాషకు, సంకేతాలకు స్థానం లేదు. ఈ రకం హాస్యం ‘నియాండర్‌తాల్’ వారికి కూడా బాగానే అర్థమయి ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం.

‘నియాండర్‌తాల్’ మానవుల జీవనసరళి గురించి జరుగుతున్న పరిశోధనలో హాస్యం ఒక చిన్న భాగం మాత్రమే. అసలు అలనాటి మానవుల స్థితి ఎట్లుండేది? వాళ్లకు కూడా ప్రేమలు, అభిమానాలు తెలుసా? కొన్ని అనుభవాలకు వారిని కుంగదీసిన సందర్భాలు ఉండేనా? రెండు లక్షల సంవత్సరాల నాడు మొదలు, ఇటీవల 30 వేల సంవత్సరాల దాకా కొనసాగిన ఈ మానవులను గురించి పురామానవ పరిశోధకులు చాలానే అర్థం చేసుకున్నారు. వారిలో గల డిఎన్‌ఏ 99.84 శాతం మన డిఎన్‌ఏ లాగే ఉండేది అని గుర్తించగలిగారు. అయినా వారి, ప్రస్తుత మానవులయిన హోమో శాపియెన్స్ శాఖలు వేల సంవత్సరాలపాటు, వేరు వేరుగా పరిణామం చెందినట్లుకూడా గుర్తించారు. ‘నియాండర్‌తాల్’ మానవుల మెదడు మన మెదడుకన్నా పెద్దది, ఆకారంలోనూ వేరే రకమయిందని కూడా తెలుసు. వారి ఉనికి చోట్లు, తిండి, తీరుల గురించి కూడా చాలనే అర్థం చేసుకున్నారు. పిన్నా, పెద్దా తేడా లేకుండా, ఆ మానవులు అందరూ కష్టమయిన బతుకులు సాగించారు. బతుకంతా వేటలోనే గడిచేది. బల్లెంకన్నా గొప్ప ఆయుధం వారికి తెలియదు. వారు బహుశా వెయ్యి చదరపుకిలోమీటర్ల ప్రాంతానికి మించి ప్రయాణాలు చేసింది లేదు. వేట సమయంలో వారికి గాయాలయ్యేవి. ఆ గాయాలకు చికిత్స చేయడం
అప్పటివారికి తెలుసు. కానీ గాయాలు కాళ్లకు తగిలి, ఆ వ్యక్తులు నడవలేకపోతే వారిని మిగతావారు పట్టించుకోక వదిలేసినట్లు తెలుస్తుంది. వారికి తమవారిమీద జాలి, అభిమానం ఉండేవి. కానీ వారి నిర్ణయాలు మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఉండేవనడానికి ఆధారాలున్నాయి.

‘నియాండర్‌తాల్’ మానవులు పనిముట్లను తయారుచేసి వాడుకోవడంలో మంచి తెలివిని, గమనించి, అనుభవం మీద
నేర్చుకునే పద్ధతులను ప్రదర్శించినట్లు, అర్థమవుతుంది. ఆనాటి మానవుల సాంకేతిక ఆలోచనలకు, ప్రస్తుతం మన ఆలోచనలకు ఉన్న తేడాలలో కొత్త దారులు తొక్కగలగడం ముఖ్యమయినది. రాతి ముక్కలను కర్రలకు కట్టి బల్లెంగా వాడడం వారు నేర్చుకున్నది నిజమే అయినా, వేల సంవత్సరాల కాలంలో ‘నియాండర్‌తాల్’లు అంతకన్నా ఎక్కువగా ఏమీ సాధించిగలిగినట్లు కనిపించదు. కొత్త విషయాలను ఊహిచాలంటే, తులనాత్మక ఆలోచన చాలా బలంగా ఉండాలి. మంచి జ్ఞాపకశక్తి ఉండాలి. ఈ రెండు లక్షణాల అలనాటి మానవులకు అంతగా లేవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

‘నియాండర్‌తాల్స్’ పదిమందికి మించని చిన్ని సమూహాలలో బతికేవారు. మంచి వేట జరిగిన తర్వాత ఈ రకం గుంపులు ఒక చోట చేరి, తిండిని పంచుకునే వారని కూడా తెలుసు. వందకిలోమీటర్ల  దూరం నుంచి వీరు వస్తువులను తెచ్చుకున్నారు గానీ, వ్యాపారం లాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను గురించిన దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అప్పటివారికి పెళ్లిలాంటి వ్యవస్థ ఒకటి ఉండేదని గమనించారు. ఈ యువకులు తమతో కొన్ని వస్తువులను కొత్త
ప్రాంతాలకు తరలించి ఉంటారు. శవాలను రాళ్లలో, తక్కువ లోతుగల గుంతలలో దాచడం కూడా వారికి తెలుసు.
అలనాటి మానవుల సాంఘిక సంబంధాలమీద వారి సగటు వయసు పాత్ర ఎంతో ఉంది. అప్పటి మానవులు 35 సంవత్సరాలకు మించి బతికిందిలేదు. అంటే, వారి గుంపులో పెద్ద మనుషులు ఉండే ప్రసక్తి లేదు. కొత్తవారు ఎదురయితే ఏం చేయాలన్న ఆలోచన వారికి లేదు. ధైర్యం చేసి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవసరం, ఆలోచన వారికి లేదనవచ్చు. సమస్యలను వెదుకుతూ దూర ప్రాంతాలకు వెళ్ళి, బతుకును కష్టాలపాలు చేయడం, అన్న ఆలోచన అసలు
అప్పటివారికి వచ్చిందా, అన్నది మరో ప్రశ్న! 

‘నియాండర్‌తాల్’ మానవులకు ఒక పదక్రమంగల భాష ఉండేదనడానికి గట్టి ఆధారాలు కనిపించాయి. ఆ రకం భాష సాయం
లేకుండా వారు వేటలాంటి విషయాలను సంప్రదాయంగా కొనసాగించటం వీలు అయి ఉండదు. అలనాటి వారి మెదడులో
మాటలకు సంబంధించిన బ్రోకాస్ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఉంది. వారి డిఎన్‌ఏలో కూడా భాషకు ఆధారమయిన వివరాలు కనిపించాయి. కానీ, వారిభాష గురించి మాత్రం ఏ రకమయిన సూచనలు అందలేదు. అలనాటి వారిలో కూడా మనలో వున్నట్లే, రకరకాల మనస్తత్వాలు గలవారు ఉన్నట్లు తోస్తుంది. కానీ మొత్తంమీద మాత్రం వారు సింపుల్
మనుషులు. వారు కార్యశూరులు. స్థిమితం గలవారు. మంచి ధైర్యంతో పెద్ద జంతువులను కూడా వేటాడగలిగారు. అందులో
మనుషులు ఒకరికొకరు తోడుగా ఉండడం, సాయపడడం, అర్థం చేసుకోవడం లాంటి లక్షణాలను కనబరిచారు. గాయపడిన వారికి చికిత్స విషయంలో వారు ఈ లక్షణాలను మరింత బాగా ప్రదర్శించారు. అయినా, వారిలోనూ సందేహాలు ఎక్కువేనని పరిశోధకులంటారు. తోటివారిమీద ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ లాభం లేదని తోచిన సందర్భాల్లో మాత్రం వారిని వదిలేసి, మిగతా పనులను సాధించుకునే వారంటే ‘నియాండర్‌తాల్’ వారి తెలివిని గురించి అంచనా వేయవచ్చు.

మన పూర్వీకులు, ‘నియాండర్‌తాల్’లకు ఎదురుపడితే, ఒకరినొకరు గుర్తించి ఉంటారు. ఏదో రకంగా పలుకరించుకుని కూడా ఉంటారు. రెండు జాతుల మధ్య పెద్ద తేడాలు ఉన్నట్టు వారికి అర్థం అయి ఉంటుందికూడా. ‘నియాండర్‌తాల్’ వారు, ఆధునిక మానవుల కన్నా అనుభవం గలవారు. మంచి తెలివిగలవారు. అయితే వారికి కొత్త సంగతులను ఊహించి ప్రయోగాలు చేయడం మాత్రం చేతగాలేదు. వారు తమ సమూహాలలో తాము సమర్థంగా పనులు సాధించుకున్నారు. కానీ కొత్తవారితో పొత్తు మాత్రం కుదరలేదు. 30వేల సంవత్సరాలనాడు ఆధునిక మానవులకు, ‘నియాండర్‌తాల్’వారికి పోటీ ఏర్పడింది. అక్కడ మాత్రం ఆధునిక మానవులదే పైచేయి అయింది. *

Monday, January 30, 2012

మూడున్నర ఆంధ్రులు

ఇది ఒక పాత పత్రికలో కనిపించింది.

వార్తలలోనూ హాస్యం ఉండవచ్చునన్నమాట!

Sunday, January 29, 2012

కుక్కల కోసం వ్యాపారం


పొడి మంచులాంటి తెల్లని కాగితం అది. నేనెంత పరిశుభ్రంగా తయారు అయ్యాను? ఇక ఎప్పుడూ నేనింత పరిశుభ్రంగానూ ఉంటాను! మండి మరింత తెల్లని బూడిదనయినా చింత లేదు. కానీ, నలుపు నన్ను తాకకూడదు. మురికి నా దరిదాపులకు రాకూడదు అనుకున్నది ఆ కాగితం. కాగితం మాటలను సిరాబుడ్డి విన్నది. అది తనలో తాను నవ్వుకున్నది. కానీ, కాగితం దగ్గరకు వెళ్ళే ధైర్యం మాత్రం చెయ్యలేదు. రంగురంగుల పెన్నిళ్లు కూడా కాగితంమాట విన్నాయి. అవి కూడా దూరంగానే ఉండిపోయినయి.

పొడిమంచు లాంటి తెల్లని కాగితం శుభ్రంగా, శుచిగా, కలకాలం ఉండిపోయింది. 
స్వచ్ఛంగా, పవిత్రంగా!
కానీ ఖాళీగా!

-ఖలిల్ జిబ్రాన్ నుంచి
==============


కుక్కల కోసం!
ఈమధ్యన ఒక కార్టూన్ కనబడింది. ఫేస్‌బుక్ కంపెనీలో ఒక ఉద్యోగి కంప్యూటర్ ముందు సీరియస్‌గా పని చేసుకుంటూ ఉంటాడు. వెనకనుంచి ఆఫీసరు వచ్చి ‘నువ్వు ఫేస్‌బుక్‌లో టైం వేస్ట్ చేయకుండా, తెల్లవార్లూ పని చేస్తున్నావట. ఏమిటది?’ అంటాడు! అవును మరి! మన పనిమీద మనకు అంత గౌరవం ఉండాలి!

పెంపుడు కుక్కలకు పెట్టే తిండిని తయారుచేసే కంపెనీ ఒకటి ఉంది. దాని పేరు పెడిగ్రీ. ఆ కంపెనీవారు వ్యాపారం పెంచడానికి సాయం కోరుతూ ఒక అడ్వర్టయిజ్‌మెంట్ ఏజెన్సీవారిని పిలిపించారు. ‘ముందు కుక్కలను ప్రేమించటడం నేర్చుకోండి!’ అని ఆ కంపెనీ వారు పెడిగ్రీ వారికి సలహానిచ్చారు.

‘మా ప్రేమంతా కుక్కలమీదే!’ లాంటి ఒక స్లోగన్‌తో ఒక కాంపెయిన్ మొదలయింది. సూత్రం అనే పేరుతో కంపెనీకి ఒక మానిఫెస్టో తయారయింది.

‘మా బతుకే కుక్కల కొరకు/ కొందరు తిమింగలాల కొరకు బతకవచ్చు/ కొందరు చెట్ల కొరకు బతుకుతారు...

చిన్న కుక్కలూ, పెద్ద కుక్కలూ/ కాపలా క్కులూ, కమేడియన్ కుక్కలూ/ గొప్ప కుక్కలూ, మామూలు కుక్కలూ/ మా బతుకే కుక్కల కొరకు/
మేం నడుస్తాం, పరుగెడుతాం, ఎత్తులకు ఎక్కుతాం!/
తవ్వుతాం, గోకుతాం, వాసన చూస్తాం, అడిగింది తెచ్చి యిస్తాం/
కుక్కల పార్కులు, కుక్కల తలుపులు, కుక్కల గుడిసెలు/
కుక్కల పేరున అంతర్జాతీయంగా ఒక సెలవు దినం ప్రకటిస్తే / ఆ రోజున విశ్వమంతటా కుక్కలకు గుర్తింపు దొరుకుతుందంటే /మన కొరకు అవి చేస్తున్న సేవలో నాణ్యతను అర్థం చేసుకుంటామంటే/ ఆ రోజే మా రోజు/ అవును మా బతుకే కుక్కల కోసం!’

ఈ మానిఫెస్టోను కంపెనీ ఉద్యోగులందరూ పంచుకున్నారు. దాన్ని ప్రపంచం ముందు ఉంచారు. ‘మనం చేసే ప్రతిపనినీ కేవలం కుక్కలమీద ప్రేమ కారణంగానే చేద్దాం’ అన్నాడు పాల్ మైకేల్స్, ఉద్యోగులకు తానిచ్చిన సందేశంలో! చివరకు ఉద్యోగుల కుక్కలకు బీమా సౌకర్యం కూడా ప్రారంభించారు.

కుక్కలమీద ఏ కొంచెం ప్రేమగలవారయినా, ఈ సంగతులు చదివి తర్వాత పెడిగ్రీ కంపెనీ మీద కూడా ప్రేమను పెంచుకుంటారు. కంపెనీకి కావలసింది అదే మరి!

మనం చేసే పని ఏదయినా సరే, అంత ప్రేమగానూ చేస్తుంటే, ముందు మనకు బాగుంటుంది. తర్వాత మన వారికి, మిగతావారికీ బాగుంటుంది!

Saturday, January 28, 2012

దుమ్ము గురించి


దుమ్ము అంటే?


దుమ్ము అంటే అందరికీ తెలుసు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుంది. మన దేశంలో మరింత ఎక్కువగా ఉంటుంది. ఎంత వదిలిచుకుందామన్నా వదలదు. లైబ్రరీలోనయితే అది మరింత ఎక్కువగా ఉంటుంది. అసలు విషయం ఏమిటంటే, ఇప్పుడొక దుమ్ము లైబ్రరీ తయారయింది. అందులో పుస్తకాలు లేవు. దుమ్ము మాత్రమే ఉంది! అదీ 63 కణాలు మాత్రం!

నిజంగా ఇప్పటివరకు అసలు దుమ్మంటే ఏమిటని, లోతుగా పరిశీలించినవారు లేరు. అది మెత్తని పొడి కావచ్చు. మన శరీరం నుంచి ఊడిన కణాలు కావచ్చు. మరేదయినా కావచ్చు. అందులో ప్రతి కణానికి ప్రత్యేకత ఉందని ఈ కొత్త లైబ్రరీ దెబ్బతో అందరికీ అర్థం అవుతున్నది. ఈ దుమ్ము రేగి జియాలజిస్టులనుంచి ఆస్ట్రానమర్ల దాకా అందరినీ కుదుపుతున్నది. దుమ్ములో ఉన్నంత వెరైటీ మరెక్కడా కనబడదు. అందులో అన్నిటికన్నాపెద్ద కణం రెండు మిల్లీమీటర్లుంటే, చిన్నది 0.1 మైక్రో మీటర్లు ఉండవచ్చు. ఈ కణాలు కొన్ని అంతరిక్షం నుంచి కూడా వచ్చి ఉండవచ్చు. ఏటా రెండు లక్షల టన్నుల ధూళి అంతరిక్షం నుంచి వచ్చి భూమి మీద చేరుతూ ఉంటుంది మరి!

 భూమి మీదనే పుట్టే దుమ్ము నాలుగు బిలియన్ టన్నులు. ఇందులో నేల, అగ్ని, పర్వతాలు, ఎడారులు, పుప్పొడి, సముద్రం ఉప్పు మొదలయిన వాటినుంచి వచ్చే పదార్థాలన్నీ కలిసి ఉంటాయి. ఇందులో మనుషుల పాత్ర తక్కువంటే నిజమే. కానీ, మనం పుట్టించగల రకాలు మరొక చోటినుంచి రావు. కార్లు, పరిశ్రమలు, ఎరువులు మొదలయినవి మనం దుమ్ముకు చేర్చే ప్రత్యేక కణాలకు ఆధారాలు! ఇళ్ళలోనయితే దుమ్ములో చర్మం పొడి, వెంట్రుకలు, బట్టలనుంచి నూగు ఎక్కువగా ఉంటుంది. ఈ వివరాలనంతా పక్కనబెడితే, దుమ్మును దుమ్ముగా పరిశీలించడం వరకే మనకు తెలుసు. అందులోని ఒక్కొక్క కణాల్ని పట్టించుకోవడం ఇప్పటివరకు జరగలేదు. 2003లో మొదలుపెట్టి పరిశోధకులు ఈ ప్రయత్నానికి దిగారు. సరికొత్త పద్ధతులను వాడి వారు ప్రస్తుతం 63 రకాల దుమ్ము కణాలను విడదీసి లైబ్రరీగా భద్రపరిచారు. ఇందులో ముఖ్యంగా ఆర్గానిక్ అంటే జీవులకు సంబంధించిన కణాలున్నాయి. 63 కణాలలోని 40లో ఈ రకం పదార్థం ఉంది. ఆ తర్వాత క్వార్ట్జ్, కార్బొనేట్స్, జిప్సమ్ లాంటివి ఉన్నాయి.

మన ఇంట్లో ఉండే దుమ్ములో ప్రపంచం నాలుగు మూలలనుంచే గాక, అంతరిక్షం నుంచి వచ్చిన కణాలు కూడా ఉంటాయని ఈ సేకరణ సూచిస్తుంది. సరిగ్గా ఏ కణం ఎక్కడినుంచి వచ్చిందని నిర్ణయించడం మాత్రం ఇంచుమించు అసాధ్యం! ఈ విషయమై పరిశోధనలు జరుగుతున్నాయి. దుమ్ముతో రకరకాల ఆరోగ్య సమస్యలు పుడతాయి. శ్వాస సంబంధ వ్యాధులు అందులో మరీ ముఖ్యం. ఈ కొత్త పరిశోధన ముందుకు సాగితే, ఇళ్ళలో, కార్ఖానాల్లో, దవాఖానాల్లో దుమ్మును విశే్లషించి, వాటివల్ల రాగల సమస్యలను గుర్తించడం వీలవుతుంది. పుస్తకాల లైబ్రరీలు పోతున్నాయి గానీ, ఈ దుమ్ము లైబ్రరీలు వచ్చి మనకు సాయపడే రకంగా ఉన్నాయి!

Friday, January 27, 2012

జగమెరిగిన సత్యం

ఈప్రశ్నకు బదులేదీ? నా బాధకు అంతం ఏదీ?’ అంటూ పాతకాలం సినిమా హీరో శాలువా కప్పుకుని, ఎండిపోయిన చెట్లకింద పాటలు పాడేవాడు. అందరి మనసులలోనూ అట్లా పాడాలని ఉంటుంది గనుక, శాలువాతోసహా ఆ పాట, ఆ సినిమా హిట్టయిపోయేది. కానీ, ఇది పద్ధతి కాదని మనుషులకు తెలిసిపోయినట్లుంది. ఇవాళ సినిమాలో హీరో, చివరకు ప్రేమను కూడా బలవంతంగా పొందగలననుకుంటున్నాడు. ‘ఐ లవ్ యూ’ చెప్పకపోతే తంతానంటాడు. అక్కడా, యిక్కడా విషయం ఒక్కటే! మనకు ఏం కావాలో మనకు తెలియదు. కావలసినదాన్ని సాధించే మార్గం ఏమిటో మనకు తెలియదు.

‘ఎలాగున్నారు?’ అని అడిగితే ‘ఏదో నడుస్తున్నది!’ అని తప్ప ‘నిక్షేపంగా ఉన్నాను’ అనగలిగినవారు ఆనాడూ లేరు ఈనాడూ లేరు! బతుకులు నడుస్తున్నాయంతే. తేడా కూడా వచ్చింది. నిజంగా మనసులో కోరిక ఉంటే, బతుకు, దారి గురించి చెప్పే మనుషులు వచ్చారు. ‘ఈ ప్రశ్నకు బదులేదీ?’ అని మనుషుల మధ్యన నిలబడి అడిగి చూడండి. బహుశః అనుకున్నదానికి నాలుగురెట్లు ఎక్కువ మంది ఎదురువచ్చి ‘పద! బదులు చూపిస్తాను!’ అంటారు! లేకుంటే, మీరు ఈ అక్షరాలు ఎందుకు చదువుతున్నట్టు? అంతా కలిసి ప్రశ్నలకు తగిన సమాధానాలు వెదుక్కోవడానికి కాకపోతే, ఈ సోది ఎందుకు?


అవసరమయింది ఏదో ఒక దారి. కానీ, అన్ని దారులే అయితే అది మరో కష్టం! ప్రపంచమంతా గురువుదే. ప్రపంచమంతటా ప్రవచనాలే. మిగతా పుస్తకాల సంగతి ఎట్లున్నా పర్సనాలిటీ డెవలప్‌మెంట్, సెల్ఫ్ మేనేజ్‌మెంట్ లాంటి అంశాల గురించి మాత్రం కుప్పతెప్పలుగా పుస్తకాలు వస్తున్నాయి. నిజానికి వాటి దొంగ కాపీలు సిద్ధం చేసి తక్కువ ధరలకు అమ్ముతున్నారు. కలిగినవారు లక్షలుపోసి, కొందరు చెప్పే మంచి మాటలు వింటున్నారు. కొందరు పుస్తకాలు కొంటున్నారు. కొందరు తమ తోటి వారితో చర్చిస్తున్నారు. అందరికీ మనసులో ఒకే ప్రశ్న! ‘ఈ ప్రశ్నకు బదులేదీ?’ అని. శాలువా ఒకటి మాత్రం లేదు!


‘ఇంతకూ తమరి బాధ ఏమిటో?’ అని ఎవరైనా అడిగారా? ఒకవేళ అడిగితే జవాబేమిటి?’ మనకు ఏం కావాలి?


‘ఏ పని చేసినా, నేననుకున్నట్టు జరగాలి’. సాధారణంగా చాలామంది బాధ ఇదే. బతుకు, ఉద్యోగం, సంపాదన, ప్రేమ, అభిమానం లాంటి లిస్టులో ఏది ముట్టుకున్నా మనం అనుకున్నట్టు జరగాలి. ‘విజయం’ నా స్వంతం కావాలి! అందరిదీ ఒకటే బాధ. ఈ ప్రపంచంలో అందరూ విజయపథంలో నడవాలి. అంటే ముందు, ఆ దారి తెలిసి ఉండాలి. అక్కడ మనకు చోటు దొరకాలి. తీసుకుపోయే గుంపులో మనమూ ముందుకు సాగగలగాలి! ఇదేమీ అనుకున్నంత సులభం కాదని, పాఠాలు చెప్పేవారంతా చెపుతూనే ఉన్నారు!


ప్రశ్నకు బదులు ఉంది. అది నిజానికి మనలోనే ఉంది. నేను సంతోషంగా ఉన్నాను అంటున్న మనిషి, నిజంగా నూటికి నూరుపాళ్లు సంతోషంగా ఉన్నారా? అని ప్రశ్న. ఉన్న పరిస్థితిని అర్థం చేసుకుని, ‘నేను పడిన శ్రమకు, అందిన ఫలితం బాగానే ఉంది మరి’ అనుకుంటే, అంతా బాగుంటుంది. మరింత కష్టపడడానికి ఉత్సాహంగానూ ఉంటుంది.
పాఠాలు చెప్పేవారు పదిమంది ఉండవచ్చు. మార్గం వేరయినా, అందరూ ఒకే పద్ధతి గురించి చెపుతారు! ఆ సూచన అందుకోవడం మన పని. అందుకు తగిన రీతిలో మసలుకోవడం మన పని! అనుక్షణం, ప్రయత్నంలో మునిగి ఉండడం మన పని! ఈ తత్వం అర్థమయితే, మరుక్షణం నుంచి మన తీరు, మన మాట తీరు, మన బతుకు తీరు మారుతుంది. ఆనందం, అడిగి తెచ్చుకుంటే వచ్చేది కాదు. విజయం, వేరెవరో ఇస్తే దొరికేది కాదు! అవి మనసులోనుంచి మన కృషితో బయటకు రావాలి.
‘గుడ్డులోపల నుంచి -పగిలితే జీవం పుడుతుంది. బయట నుంచి పగలగొడితే జీవం చస్తుంది!’ ఆలోచన మారితే ఆచరణ మారుతుంది!
నేను మారగలను, మార్చబడగలను. మళ్ళీ మరో మనిషిగా కొనసాగగలను! ఇది కేవలం మానసిక పరిస్థితికి సంబంధించిన విషయం.
నా సమస్యలకు జవాబులు వెదకగలిగేది నేను మాత్రమే.
నా సమస్యలను నేను నిర్ణయించుకుని, వాటి వేపు సాగడం నాకు తెలుసు. అందుకు అనువుగా, నా ఆలోచనలను, కార్యక్రమాలను, ఇష్టాయిష్టాలను, నిర్ణయించే శక్తి నాకుంది.


గమ్యం నుంచి నా దృష్టి పక్కకు కదులుతుంటే, ఆ సంగతి నాకు అర్థమవుతుంది. నేను దానిని తిరిగి మార్చుకుంటాను. నా తీరుకు మీరెవరూ బాధ్యులు కారు. నా నిర్ణయాలు నేను తీసుకుంటాను. నా జయాపజయాలకు, నా బతుకుకు నూటికి నూరు శాతం నేనే బాధ్యత వహిస్తాను.


ఈ ప్రయత్నంలో నిరాశకు చోటులేదు. ప్రతి అడుగూ ముందుకే సాగుతుంది. అడుగడుగునా కొత్త ఆలోచనలు పుడతాయి. నా కొరకు ఆలోచించే వారంతా నా వెంట ఉన్నారు. అలాంటివారిని వెదికి, వారి చేయూతతో ముందుకు సాగుతాను!


అందుకు నేను చేయదగిన ప్రయత్నం చేస్తూనే ఉంటాను. అందిన విజయాన్ని గౌరవిస్తాను. కనిపించిన గొప్పదనాన్ని ఆదరిస్తాను.
నేను తలుచుకుంటే, నా బతుకును, నాకు నచ్చిన దారిలో నడిపించగలనన్న నమ్మకం నాకు కలిగింది!


విజయం రహస్యం కాదు! అది జగమెరిగిన సంగతి!

Thursday, January 26, 2012

ఇంధనం వాడకం - ఆహార ఉత్పత్తి


ఇంధనం వాడకం - ఆహార ఉత్పత్తి

తిండి సమస్య కాదు, కావలసినంత పండుతున్నది. ఆ పంటను నిలువ చేయడం, కాపాడడం, అందరికీ పంచడం నిజమయిన సమస్యఅంటున్నారు పెద్దలు. హరిత విప్లవం, శే్వత విప్లవం వంటి కార్యక్రమాల కారణంగా నిజంగానే పంటల దిగుబడి బాగా పెరిగింది. కానీ, అందుకోసం ఎక్కువ మొత్తాలలో రసాయనిక ఎరువులు, విద్యుత్తు, చమురు ఖర్చవుతున్నాయి. ఈ పరిస్థితి ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, ప్రపంచం అంతటా ఉంది. ఇంధనశక్తి, ఆహార ఉత్పత్తి అన్న రెండు ముఖ్యమైన అంశాల మధ్యగల సంబంధాలను మరోసారి జాగ్రత్తగా గమనించవలసిన సమయం వచ్చింది. పంటలు పెరుగుతున్నాయి. దిగుబడులు పెరుగుతున్నాయి. అంటే కార్టన్ ఇంధనాల వాడకం కూడా పెరుగుతున్నది. నత్రజని ఎరువుల వాడకం కూడా పెరుగుతున్నదని అర్థం. ఈ రెండూ కలిసి ప్రపంచం మరింత వేడెక్కడానికి దారి తీస్తున్నాయన్న సంగతి అందరికీ తెలిసిందే. వీటివల్ల కాలుష్యంతో పాటు మరిన్ని రకాల సమస్యలు కూడా పెరుగుతున్నాయి.

ఇంధనాల వాడకం చేతనయినంత తగ్గాలన్నది అందరికీ అర్థమయిన విషయం. కనుక అందరి చూపు వెంటనే రవాణా (వాహనాల) వేపు, ఇంధనం ఉత్పత్తి వేపు మరలుతుంది. అంతేగానీ, వ్యవసాయం వేపు దృష్టి అంతగా పోదు. విద్యుత్తు కొరత కారణంగా రైతు తల పట్టుకుని ఉంటున్న సమయంలో, ఆ రంగంలో ఇంధన శక్తి వాడకం గురించి తోచకపోవడం సహజమే. కాని, విద్యుత్తు సమస్యగా కనిపించని దేశాలలోనయినా ఈ పరిస్థితిని గురించి ఆలోచించాలని ప్రపంచ స్థాయి పరిశోధకుల ఆలోచన. అమెరికా వారు విద్యుత్తు, ఇంధనాలను వాడే విషయంలో అందరికన్నా ముందు ఉంటారు. అందులో సవరణలు జరగాలంటే మాత్రం, అందరికన్నా చివరలో ఉంటారు. ఆ దేశంలో వాడుతున్న ఇంధన శక్తిలో పదిశాతం కన్నా కొంచెం ఎక్కువ భాగాన్ని వ్యవసాయం, పశుపోషణలకు వ్యయమవుతున్నది. 

ఇందులో కేవలం ఉత్పత్తి మాత్రమేగాక, ప్రాసెసింగ్, పరిరక్షణ, రవాణా, పంపిణీ మొదలయినవి కూడా ఉన్నాయి. మన దేశంలోనయినా మరెక్కడయినా, ఆహార వ్యవస్థలో ఇవన్నీ ఉండవలసిన భాగాలే.
ఆహారం ఉత్పత్తి, పంపిణీ, వాడుకలను, ఇంధనం వాడుకునే తీరుతో కలిపి లెక్కలు వేస్తే ఒక కొత్తరకమయిన చిత్రం ముందుకు వస్తుంది. అందులో భాగంగా మరింత తెలివయిన విధానాలు, సాంకేతిక పద్ధతులు, తిండి అలవాట్లు కూడా తోడయితే, ఒకే ప్రయత్నంతో అటు ఆహారం ఉత్పత్తి, ఇటు ఇంధనం సమస్య రెంటికీ సమాధానాలు అందుతాయి. ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ప్రకృతి కూడా మెరుగవుతుంది.
వ్యవసాయంలో ఇంధనం వాడకం సరిగా జరగదని ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. అందుతున్న సౌరశక్తిలో రెండు శాతాన్ని మాత్రమే మొక్కలు, పంటలు వాడుకుంటాయి. అంటే మిగతా 98 శాతం శక్తిని నిలువ చేయలేకపోతున్నాయని అర్థం. పశుపోషణ మరింత అన్యాయమయిన పరిస్థితి. మనుషులు ఈ రెండు వనరులను వాడుకుని మానవశక్తిగా మార్చుకుంటారు. వద్దన్నా సరే, ఎండ ఉండనే ఉంటుంది గనుక, దాన్ని మనం సరిగా వాడుకోలేకపోతున్నామని ఎవరికీ తోచదు. కానీ పెరుగుతున్న ప్రపంచ జనాభాకు సరిపడా తిండి, పండించడానికి తగినంత సాగునేల లేదు. నీరు, ఎరువులు లేవు. వీటన్నిటినీ లెక్కలోకి తీసుకుని గమనిస్తే, వాడుతున్న ఇంధన శక్తికి తగినంత పంటఅందడం లేదన్న సంగతి అర్థమవుతుంది. పండిన పంటలో అంటే మొత్తం మొక్కలో గింజలను మాత్రమే మనం వాడుకుంటాం. అందులోనూ రకరకాల కారణాలవల్ల ఎంతో వ్యర్థమవుతుంది. మిగతా మొక్కం తా ఇంచుమించు వ్యర్థమవుతుంది.
పశువులకు బదులు ట్రాక్టర్లు, నీటి పంపులను వాడి, వ్యవసాయ ఉత్పత్తులను పెంచారు. ఎరువుల తీరు మారింది. పురుగు మందుల వాడకం పెరిగింది. వ్యవసాయంలో కూలీలుగా అవసరమయే మనుషుల సంఖ్య బాగా తగ్గిపోయింది. మన దేశంలో ఇంకా ఈ పరిస్థితి మరింత తీవ్రం కాలేదు.

కొన్ని పనులకు ఇంకా మనుషులనే వాడుకుంటున్నారు. ప్రపంచ వాతావరణం మారనుంది గనుక, పరిస్థితి రాను రాను మరింత మారుతుంది. పంటలు పండే చోటనే వాటిని వాడుకునే పరిస్థితి పోయి కొత్త పద్ధతులు వస్తున్నాయి. నేల అందుబాటులో ఉండేచోట వ్యవసాయం జరుగుతుంది. పశుపోషణ మన దేశంలోగానీ న్యూజిలాండ్ లాంటి చోట్ల గానీ సులభంగా వీలవుతుంది. పశువుల మేతను ప్రత్యేకంగా పండించనవసరం లేకుండానే అందే వీలు మన దగ్గర ఇంకా ఉంది. కనుక ఇక్కడ పెంచిన పశువుల మాంసాన్ని మరిన్ని ప్రాంతాలలో దేశాలలో వారికి అందించగలిగితే బాగుంటుంది.
పొలాలు ఉన్న చోట్ల నీరు లేదు. అందిన కొద్దిపాటి నీరు వ్యర్థమయిపోతున్నది. కనుక సాంకేతిక పద్ధతులను వాడి, పంట నేలలను చదును చేస్తే ఎరువులు, నీరు ఊరికే కొట్టుకుపోకుండా, మరింత ఫలసాయానికి దారితీస్తాయి. ట్రాక్టర్లలాంటి యంత్రాలలో శక్తిని రకరకాలుగా వాడే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తక్కువ నీటితో పండే పంటల గురించి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పశువుల ఆహారంగా ఆల్గెలను పెంచగలిగితే, అక్కడ జరుగుతున్న ఇంధన నష్టం తగ్గుతుందంటున్నారు. ఇంధనానికి వ్యవసాయానికి గల సంబంధంలో మరొక కొత్త కోణం ఒకటి ఈ మధ్యన మన ముందుకు వచ్చింది. నేలనుంచి తవ్వి తీసే ఇంధనాల బదులు, మొక్కల నుండి వాటిని తీయాలంటున్నారు. అంటే ఇకమీదట మొక్కజొన్న, సోయా, చక్కెర, పామ్‌ఆయిల్ లాంటిది, ఆహారంలో భాగంగా ఉండవు. అవి ఇంధనం తయారీకి ముడిసరుకులుగా గుర్తింపు పొందుతున్నాయి. వ్యవసాయ రంగంలో ఒక విచిత్రమైన పరిస్థితికి ఇది దారితీస్తుంది. అమెరికాలో అప్పుడే పంటలను ఇతనాల్ తయారీకి మరలిస్తున్నారు. ఒకవేపు ఎంతో బయోమాస్ (జీవపదార్థం) వ్యర్థమవుతుంటే, మరోవేపు మనుషుల ఆహారాన్ని ఇంధనం తయారీకొరకు వాడుతున్నారు. ఇది అర్థంలేని పని!
మొక్కజొన్నను ఇతనాల్ తయారీ కొరకు వాడడం వెంటనే ఆపాలి అంటారు ఈ ఇంధనం - ఆహారంరంగంలో పరిశోధనలు జరుపుతున్న నిపుణులు. ఆ విత్తనాలు మనుషులు, పశువులకు ఆహారంగా వాడుకయినప్పుడు, మరింత విలువ అందుతుంది. ఆ మొక్కలో తినడానికి పనికిరాని కాండం, ఆకులను ఇంధనం తయారీకి వాడుకున్నా అర్థ ఉంటుంది.

ధాన్యం నుంచి ఇతనాల్ తీయం సులభం. కాం, ఆకులలోని సెల్యులోజ్ నుంచి ఇంధనం తీయడం అంత సులభం కాదు. ఆ విధానం కొరకు వెచ్చించే పెట్టుబడులకన్నా, వచ్చిన ఫలితాలు ఇవ్వగల లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయని పరిశోధకుల అభిప్రాయం. అప్పుడు జీవ ఇంధనం తయారీకి ముడి సరుకు అప్రయత్నంగానే, కావలసినంత అందుతుంది.
వ్యవసాయం, పశుపోషణలనుండి వచ్చే వ్యర్థాలను, మరింత బాగా వాడుకునే ప్రయత్నం మొదలయింది. ముందు వీటినుంచి బయోగ్యాస్ తీయవచ్చు. దాన్ని వాడి విద్యుత్తును తయారుచేయవచ్చు. ఈ పద్ధతిలో నడుస్తున్న కొన్ని జెర్మన్ గ్రామాలు, జాతీయ విద్యుత్ గ్రిడ్ మీద ఆధారపడకుండా తమ అవసరాలను తీర్చుకుంటున్నాయి. వ్యర్థంగా పోతున్న కార్బన్‌డై ఆక్సయిడ్‌ను వాడి, ఆల్గేలను పండిస్తున్నారు. అవి మనుషులు పశువులకు ఆహారంగా అందుతాయి. మంచినీటి అవసరం లేకుండా, ఉప్పునీటిలో బాగా పెరిగే నారు రకాలను గుర్తించారు. ఈ రకం ఉత్పత్తులు మన ఆహారంలో భాగంగా అంగీకారం పొందడానికి కొంత కాలం పట్టవచ్చు. కానీ అది జరిగి తీరుతుంది.
తక్కువ నీరు, తక్కువ ఇంధనం వాడి ఎక్కువ పంటలను, ఫలసాయాన్ని సాధించడం ప్రస్తుతం పరిశోధకులకు పని కల్పిస్తున్న గమ్యం! హరిత, శే్వత విప్లవాలు తిండి భరోసానిచ్చాయి. అదేదారిలో మరింత ముందుకు సాగితే, సమస్యలు లేకుండా, అందరికీ తిండిని అందించే వీలు కూడా కలుగుతుంది. ఇదొక కొత్త హరిత విప్లవమవుతుంది. *

Tuesday, January 24, 2012

‘భమిడిపాటి’ రచనలు - సమీక్ష


నవ్వడం నేర్పించే ‘భమిడిపాటి’ రచనలు


భమిడిపాటి
కామేశ్వర రావు
రచనలు - 4
నాటకాలు
పేజీలు: 230
వెల: రూ. 110/-
ప్రతులకు: విశాలాంధ్ర
పబ్లిషింగ్ హౌస్, బ్యాంక్ స్ట్రీట్, హైదరాబాద్-1.

భమిడిపాటి కామేశ్వరరావుగారి పేరు చెపితేనే నవ్వేతరం ఒకటి ఉండేది. ఆ తరువాత ఆయన కుమారుడు రాధాకృష్ణ కూడా హాస్యరచనలతో పేరు సంపాదించుకున్నారు. విశాలాంధ్ర వారు కామేశ్వర రావుగారి రచనలను సేకరించి సంగ్రహాలుగా వేయటం ఎంతో సంతోషించదగ్గ విషయం. ఇంకా కొన్ని రచనలు మాకూ అందలేదు. మీ దగ్గర ఉంటే పంపించండి. అని అడగడం మరింత బాగుంది.


నాలుగవ సంపుటమయిన ఈ పుస్తకంలో నాలుగు స్టేజి నాటకాలున్నాయి. వాటిలో మూడు అనువాదాలు. చివరిది నేరుగా వారి రచన.
ప్రణయరంగం ఈడూ-జోడూ అన్న నాటకాలు ప్రసిద్ధ ఆంగ్లవక్త, రూపకకర్త, రిచర్డ్ బ్రిన్‌స్లీ షెరిడన్ నాటకాలకు తెలుగు రూపాలు. పాశ్చాత్య నాటక ప్రపంచంలో షెరిడన్, మోలియర్‌లకు ఉన్న పేరు చాలా గొప్పది. వాళ్ల రచనలను కామేశ్వర రావు గారు తెలుగు చేయడంలో ఆశ్చర్యం లేదు. అందులో ఆయన ఎంపిక చేసిన నాటకాలు మరీ ప్రత్యేకమయినవి.
షెరిడన్ సృష్టించిన ఒక పాత్ర, భాషాప్రయోగంలో ఒక సిద్ధాంతానికి ఆధారమయింది. ఆ నాటకం పేరు ‘రెవల్స్’. అందులో మిసెస్ మ్యాలప్రాల్ అని ఒకావిడ ఉంటుంది. ఆవిడ పదాలను బాగా వాడాలన్న కోరికతో అర్థంలేని పదప్రయోగాలు చేస్తుంది. ఆ పద్ధతికి ఆంగ్లంలో, ఆ పాత్ర పేరున ‘మ్యాలప్రాసిజం’ అని పేరు వచ్చింది. ఈ ప్రణయరంగంలో కూడా ఒక రాంబాణమ్మ గారిని రచయిత సృష్టించారు. ఆమె, అర్థంలేని పదప్రయోగాలతో నవ్వులు పండించారు.


షెరిడన్ 1816లో మరణించాడు. అంటే ఈ నాటకాలు అంతకన్నా ముందు కాలానివి. అలనాటి ఆంగ్ల సమాజంలో అమ్మాయిలను పెళ్ళిళ్ళను, అపార్థాలనూ వాడి హాస్యం పండించే పద్ధతి ఉండేది. ఈ సంప్రడంలో రెండవ నాటకం ‘ఈడూ - జోడూ’ కూడా షెరిడన్‌దే ఈ నాటకం సంగీత నాటకంగా నేటికీ ప్రపంచాన్ని ఊపేస్తున్న డ్యూయెన్నాకు తెలుగు రూపం.


సంకలనంలో మూడవ నాటకం, మరో ప్రసిద్ధ రచయిత ఆలివర్ గోల్డ్‌స్మిత్ రచనకు అనువాదం గోల్డ్‌స్మిత్ 18వ శతాబ్దం మధ్యకాలం నాటి రచయిత చివరి నాటకం, చెప్పలేం మాత్రం కామేశ్వర రావుగారి స్వంత రచన. కానీ అది మొదటి మూడు నాటకాల తీవ్ర ప్రభావం ప్రతిఫలించిన రచన.


నాటకాలు నాలుగింటిలోనూ, అమ్మాయిలు, అబ్బాయిలు, వాళ్ళ తండ్రులు, అత్తలు, మిత్రులు, పనివాళ్ళు, చిత్ర విచిత్ర మనస్తత్వాలతో మన ముందుకు వస్తారు. ప్రణయ రంగంలో నాయిక నవలలు చదివి, అలాగే నవల పద్ధతిలో పెళ్ళి చేసుకోవా లను కుంటుం ది. అక్కడ నాయకు డు మారు వేషంతో ఆమె మనసు కాజేసే ప్రయ త్నం చేస్తాడు. మరొక నాటకం లో అమ్మాయి తాను పనిమనిషినన్న నాటకమాడి నచ్చిన వాడిని మెప్పిస్తుంది. అంతటా ఒక అమ్మాయి కొరకు పోటీపడే మనుషులు ఎదురవుతారు. నిజం చెప్పాలంటే ఈ రకం హాస్యం తెలుగు పాఠకులకు, ప్రేక్షకులు, ఆనాడు, ఈనాడూ కొత్తే! పుస్తకంలో పాత్రలు రంగం మీదకు వచ్చి, వెళ్ళిపోయే సూచనలను, ఇంకా ఉంచడం అవసరమేమో! నాటకాలు, ఆసక్తిగలవారు ఓపికగా చదివితే, చేతయితే, నవ్వుకోవచ్చు! అవునుమరి. కాలక్రమంలో మనం నవ్వుకునే పద్ధతులు కూడా మారిపోయినాయి.


కామేశ్వర రావుగారి భాష, సంభాషణ, శైలి గురించి మాత్రం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కడక్కడ డయలాగులు మరీ ఇంగ్లీషుగా తోచవచ్చు. కానీ అనువాదంలో కూడా అంతటి తెలుగుదనాన్ని పలికించినందుకు రచయిత గుర్తుండి పోతాడు. ‘రహస్యం చెప్పావా?’ అన్న ప్రశ్నకు ‘అక్షరం తలకట్టు కూడా చెప్పలేదండీ’ అనిపించగలిగిన ‘ఈజ్!’ ఆశ్చర్య పరుస్తుంది. అలాంటి తెలుగు ఏమయింది? అన్న ప్రశ్న అందరికీ ఒక్క క్షణం ఎదురవుతుంది. ఆ తెలుగు కోసమయినా ఈ నాటకాలను చదవాలి. చేతనయితే ప్రదర్శించాలి.


పాత్రలకు పేరు పెట్టడంలో ఈ రచయిత పద్ధతి ఎవరికీ చేతగాలేదు. కుమార సేనం, జ్వాలారంగం, నభోమణి, మండోదరం, కరాళం, తంపటి లాంటి పేర్లు ఏ పుస్తకంలోనూ చూచి ఉండలేదు.


ఈ తరం పాఠకులకు భమిడిపాటి వారి పేరుతో కూడా పరిచయం లేకపోవచ్చు. కానీ వారి రచన ఒకటి చదివినా, మిగతావన్నీ చదవాలనిపిస్తుంది.!

-కె.బి. గోపాలం

Saturday, January 21, 2012

మన గురించి మనం - 5


కలలాంటి బతుకు! బతుకులాంటి కల!
ఏది నిజం? ఏది కల?
ఎక్కడుంది తేడా?
గిల్లుకుంటే లాభం లేదు.

నిద్ర నిజం. కల నిజం. కలలో సంగతి మాత్రం కల. అంటే అబద్ధం అని అర్థం.
బతుకు నిజం. ఇవాళ నిజం. అన్నం నిజం. పోనీ ఇడ్లీ నిజం.
తిండి, నిద్రకన్నా నిజమయిన సంగతులు ఉండవు కదూ!
వాటిని మనం ఎన్నడూ మరిచిపోము. అవి మరి బతుకుకు ఎంతో ముఖ్యం. అవే బతుకు, అనేంత ముఖ్యం. ఆలోచించండి. పని జరగనీ, జరగకపోనీ, సాపాటు జరగవలసిందే. వద్దన్నా నిద్ర ముంచుకు వస్తుంది. ఇంట్లో, వంట్లో సుఖంగా ఉండనీ ఉండకపోనీ సాపాటు జరగవలసిందే. ఆలోచించారా. అంతా మామూలుగా ఉంటే అన్నం తినవచ్చు. ఏ కొంచెం అనారోగ్యమయినా అన్నం పనికిరాదు. రొట్టె కావాలి. పండ్లు కావాలి. పాలు మాత్రం తాగవచ్చు. నాకు పాలు ఇష్టం ఉండవు. కనుక జ్వరం వస్తే రుచిగా ఏదన్నా తాగ వచ్చని ఎదురుచూపులు. పండ్ల రసం కావాలి. బాగుందా ఇష్టమయిన పండ్ల రసం కావాలంటే జ్వరం రావాలి.

శవం పక్కన ఉన్నా సరే, కాఫీ కావాలి.
ప్రాణం పోతున్నా సరే. పాలు కావాలి.
శవం పక్కన ఉండగా హాయిగాపడుకుని రావలసినవారెవరో వచ్చిన తరువాత తగిన ఏర్పాట్లు చేయడం కొత్తగాదు కదా. తగిన ఏర్పాట్లలో తిండి నిద్ర అన్నిటికన్నా ముందుంటాయి.
నిత్యమూ నిద్ర తప్పదు. నిత్యమూ తిండి తప్పదు. అవి మన బతుకులకు పునాదులని మనం గట్టిగా నమ్ముతున్నాం మరి.

తిండి నిద్రలలాగే నిత్యం ఆలోచన, సమీక్ష అవసరమని అనుకోగలమేమో గమనించండి.
ఏం చేశాము? ఏం చేయాలి? ఏమనుకుంటున్నాము? ఏం జరుగుతున్నది? తేడా ఎక్కడున్నది? నిత్యం కనీసం నాలుగు నిమిషాలు ఆలోచించే ఓపిక తీరిక ఉన్నాయా?
అవి మన బతుకులకు అవసరం గాదా? ఆలోచన లేకుండా బతకవచ్చా? బతికితే ఎంత కాలం?
తిండికి నిద్రకు ఎన్ని ప్రయాసలు పడి ఏర్పాట్లు చేసుకుంటున్నాము? బతుకంతా మంచి తిండి, సుఖంగా నిద్ర అందాలనిగదా మిగతా ప్రయత్నాలన్నీనూ? అదేపద్ధతో ఆలోచన అవగాహన కూడా అవసరమనుకుంటే ఎంత బాగుంటుంది!
బతుకు ప్రయాణంలో గమ్యం ముఖ్యమా తతంగం ముఖ్యమా ఆలోచించాలిగదా!
కల నిజమా నిజం కలలాగ ఉందా అర్థం చేసుకోవాలి గదా!
ఇదంతా ఆలోచన లేకుండా వీలవుతుందా?
ఈ ఆలోచన కలిగిన తరువాత, నమ్మండి, నిద్ర పట్టదు, తిండి సయించదు. వాటిప్రాముఖ్యం తెలుస్తుంది. తగ్గుతుంది, కనీసం. వాటిని వదలాలని ఎక్కడా లేదు. వాటినే పట్టుకుని వేలాడాలని కూడా లేదు. అదీ సంగతి.

ఈ ఆలోచన అలవాటుగా మారితే అవగాహనలు మారుతాయి.దానితో ఆశయాలు మారి, అప్పుడు మన ప్రవర్తనలూ మారుతాయి.
మార్పు జరగాలంటే ఆలోచన ప్రారంభం. అది లేనిదే బతుకు బండి నడక మారదు. ఎంత చదివినా ఎన్ని విన్నా చివరకు ఆలోచన జరగకుంటే అంతా దండగేకదా. మన అలోచన లేక అవగాహన ఎంత చదివినా మారదు కదా.

పిల్లలుగా ఉన్నప్పుడు ఆలోచన లేదు. యువవయసులో ఆలోచనల దారి వేరు. ఆ తరువాత బతుకు బండి చక్రాల కింద నలగడం తప్ప మరో ఆలోచనే రాదు. కనుక ఆలోచన అలవాటుగా మారాలి.

ఈ ప్రయాణం మరింత మంచి గమ్యానికి దారి తీయాలి. అసలు ప్రయాణమే బాగుండాలి. మొదలు, మధ్య బాగుంటే చివర సంగతి పట్టదు. గుర్తించగలిగారా ఈ విషయాన్ని
బతుకు తతంగం, అదే బతుకు బండి నడిచే తీరు, దారి, ముఖ్యంగా అవి బాగుండాలి.
ఇవాళకన్నా రేపు బాగుండాలి. నిన్నటికన్నాఇవాళ బాగుండాలి.
అనుకుంటే బాగుంటుందా?
నిత్యం చేసే పనులే చేస్తే, నిత్యం ఉండేట్టే ఇవాళా ఉంటుంది. అవునంటారా
మరి మార్పు రావాలంటే ఆలోచన కావాలి గదా!
ఆలోచించండి.

Friday, January 20, 2012

ఏకాదశి తాంబూలం - తాతాచార్ల కథ



వక బ్రాహ్మణుడు వక అగ్రహారములో ఏకాదశి నాడు తాంబూలం వేసుకుంటూ ఉండెను.
యింక వక బ్రాహ్మణుడు చూచి అయ్యో వోయి బ్రాహ్మణుడా తెలిసినవాడ వైయ్యుండిన్నిఏకాదశినాడు ప్రొద్దుననే
యిట్లా తాంబూలం వేసుకోవడం యుక్తమేనా అని అడుగగా వుల్లిగడ్డల కంపు పోవద్దా అని చెప్పెను.
అయ్యయ్యో ఉల్లిగడ్డలు కూడా తింటివా అని అడిగెను.
పుల్లని చద్ది అన్నములోకి వుల్లిగడ్డలు కొరుక్కోకపోతే సయిస్తున్నదా అని చెప్పెను.
అయ్యయ్యో నేటిదినం ఉపవాసం వుండగా చల్ది అన్నము కూడ తింటివా అని అడిగెను.
చల్ది అన్నము తినకపోతే మేహకారకం అణుగునా అని చెప్పెను.
ఆహా మేహకారకపు రోగము కూడానా అని చెప్పెను.


ఇందున గురించిన శ్లోకం


భిక్షో మాంస నిషేవణం కిముచితం
కింతేన మద్యం వినా
మద్యంయంచాపి తవ ప్రియం
ప్రియమహో వారాంగనాభిస్సహ
వారస్త్రీ రతయే కుతస్తవ ధనం
ద్యూతేన చౌర్యేణవా
చౌర్య ద్యూత పరిశ్రమోపి భవతాం
భ్రష్టస్య కావా గతిః


(ఓ సన్యాసీ మాంసం తినడం తగునా
మద్యపానమన్న తర్వాత మాంసం లేక రుచించదుగదా
మద్యం కూడా తమకు ఇష్టమా మహాశయా
ఇష్టమా యమ ఇష్టం. వారాంగనలంటే కూడానయ్యా
వేశ్యవాటికలకు వెళ్లడానికి మరి తమకు డబ్బో
జూదం లేకుంటే దొంగతనం.
తమకు చౌర్య ద్యూత ప్రావీణ్యం కూడానా స్వామీ
భ్రష్టుడయిన వాడికి మరి బ్రతుకుదెరువేదయ్యా)




షోలే సినిమాలో ధర్మేంద్ర గుర్తొచ్చి ఉండవలె.

Tuesday, January 17, 2012

ఒక జోకు - పాత పత్రిక నుంచి

జోకు తెలిసిందే
కానీ, ఇది 50 దశకంలో అచ్చయింది మరి!

నవ్వితే మంచిది.
నవ్వకుంటే ఇంకా మంచిది!!



Monday, January 16, 2012

ఆశారాజు - ఇప్పుడు

ఆశారాజు ఇప్పుడెట్ల ఉన్నడని కాదు
ఇది ఆతని కొత్త కవితా సంకలనం పేరు
నా దృష్టిలో రాజు దమ్మున్న కవి
చెప్పదలుచుకున్నది అంత బలంగా చెప్పడం చాలా మందికి చేతగావడం లేదు ఈ మధ్య
అందుకే రాజుకు నా సలాం

హార్మోనియం అని ఒక ఖండిక

అందులోనుంచి నాలుదు లైన్లు చదవండి
రాజు అంటే ఏమిటో అర్థమవుతుంది.




కవిత్వం కలలో ఉంటుంది
కత్తి వొరలో ఉంటుంది
అమ్ములపొదిలో ఉంటుంది
ఆత్మవిశ్వాసంలో ఉంటుంది
నమ్మకంలో ఉంటుంది
చెదరని ఆశయంలో ఉంటుంది
నిద్రపోని ఆయుధంలో ఉంటుంది
ఎక్కడని కనిపెడతావు
ఎట్లా అరికడతావు

కవిత్వం బతికించే ఊపిరి
ఊగేటి ఉరికంబం
ఉప్పొంగే జీవితం
ఎన్ని ఊళ్లని వెదుకుతావు
ఎన్నాళ్లు తిరుగుతావు
మరణం కవిత్వం
జననం కవిత్వం
కదనం కవిత్వం
కన్నీళ్లు కవిత్వం
నూకు తెలియదు
జైలు గోడలూ కవిత్వం
కవిత్వాన్ని ఆపుతావా
బ్యాక్ కవర్ మీద వేసిన కవిత పూర్తి రూపం నాకు అన్నింటికన్నా బాగనిపించింది.
అందులో రాజు (పహిల్వాన్ తమ్ముడు) అసలు రూపం కనబడుతుంది