Wednesday, January 4, 2012

మన గురించి మనం - 4


మీరు కలలుకంటారా?
కలలు బాగుంటాయా, భయంకరంగా ఉంటాయా?

కలలు సాధారణంగా బాగుంటాయి గదూ? నిజం కానిదంతా, కాలేనిదంతా కలలో కనిపించినట్లు ఉంటుంది కదూ?
తెల్లవారుతుండగా కమ్మని కలలో కరుగుతుంటాము. ఎందుకో గానీ మధ్యలో మెలుకువ వస్తుంది. అందమయిన కల తెగిపోతుంది. ఎప్పుడయినా కల గురించి ఆలోచించి గుర్తు చేసుకోవాలనే ప్రయత్నం చేసారా తప్పక చేసే ఉంటారు. కల తెగుతుంది. తెల్లవారిందని తెలుస్తుంది. కలలోనుంచి నిజంలోకి మారాలన్న భావంతో బతుకు మళ్లీ పాత పద్ధతిలో మొదలవుతుంది. ప్రయత్నించినా కలలో సంగతి గుర్తు రాదు. కలలన్నీ గుర్తుకు వచ్చి ఉంటే ఇప్పటికి అందరికన్నా మంచి రచయిత అనిపించుకునే వాళ్లమేమో?
కల కరుగుకుంది, బతుకు మొదలవతుంది అనుకున్నాం గదా! నిజంగా బతుకు మొదలవుతుందా? లేక అది కూడా కలేనా?
నిజంగా బతుకంతా కలలాగ సాగుతుందన్న మాట గురించి అలోచించారా ఎప్పుడయినా?
మీరు చదువుతున్నామనుకుంటున్నారు. కల గంటున్నారేమో? గమనించండి ఈ క్షణం, గడిచిన క్షణం, రానున్న క్షణం అన్నీ కలలేనేమో?

ఇది నిద్ర మత్తు ప్రశ్న మాత్రం కాదు సుమా!
బతుకులో మనం నమ్ముతున్నవన్నీ నిజంగా ఉన్నాయా? జరుగుతున్నాయా? కలలాగే మనం వాటిని భావించుకుంటున్నామా?
అంతా కలేనేమో?

కల కాదనడానికి మనల్ని మనం గిల్లుకుని చూడాలంటారు. గిల్లుకున్నాము సరే. గిల్లుకోవడం కూడూ కలేనేమో? అది మరో కలలోకి మనలను కదిలిస్తుందేమో?

నాకు కథలు కథలే కలలుగా వస్తాయి. వాటన్నిటినీ గుర్తుంచుకుంటే బాగుంటుందన్న ఆలోచన వచ్చిన మాటా వాస్తవమే. అప్పుడు పడుకుని తీరికగా తెల్లవారిన తరువాత రాసుకుందామంటే అసలేమీ గుర్తుండదు. కనుక కల ముగిసిన వెంటనే నిద్ర లేవాలి. గుర్తున్నంత వరకు రాసుకోవాలి. అదీ ప్రయత్నం. రాసుకున్నాననే అనుకున్నాను. మరుసటి ఉదయం చూస్తే కాగితం మీద అక్షరం ముక్క లేదు. అంటే రాసుకోవడం కూడా కలేనన్న మాట.
ఏదో ఓడిపోయిన భావం కలిగింది. అందులో ఓటమి గెలుపులెక్కడివి అన్న ప్రశ్న కూడా కలిగింది.
ఇప్పుడు మాత్రం నేను మెలుకువగానే ఉన్నాను గదా! మెలుకువగా ఉన్నందుకే రాస్తున్నాను గదా!!
ఇది కలగాదు. నా ఆలోచన కలగాదు. నా రాత కలగాదు. నా ఇల్లూ, ఇల్లాలూ, పిల్లలూ కలగాదు. నా కలం, కాయితాలూ కలగాదు. అన్నీ కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. కలలోనూ అన్నీ కనిపిస్తాయి. వినిపిస్తాయి. తేడా ఎక్కడుంది మరి?
కలలో నా రాత కూడా అంత నిజంగానూ అనిపించింది. కాగితం మాత్రం ఖాళీగా ఉంది!
చూడండి. ఎంత గజిబిజి?

అలోచనలతో ఇదే కష్టం.
ప్రపంచమంతా ఉంది అనుకుంటే నిజం. లేదంటే అంతా అబద్ధం.
నా ఇల్లు లేదా? పిల్లలు ఎక్కడ? అంతా నిజమనుకుంటున్నానే! కాదా?
అక్కడే అసలు తెలివిని వాడుకోవాలి. బతుకును కలగా సాగనిస్తే అట్లాగే ఉంటుంది. నిజం చూడడం నేర్చుకుంటే మరో లాగ ఉంటుంది.
ఆలోచిస్తే గాని తేడా తెలుస్తుంది! కనుక ఆలోచించండి!!

No comments:

Post a Comment