Tuesday, January 31, 2012

నిర్ణయం.. ఏం చేస్తారు?

అడుగు ముందుకు వెయ్యాలా? అవసరం లేదా? ఇంకా ముందుకు చదవాలా? అవసరంలేదా? జీవితంలో అడుగడుగునా నిర్ణయాలు చేయవలసి ఉంటుంది. వాటిమీదనే బతుకుదారి, తీరు ఆధారపడి ఉంటాయి. ‘అప్పుడలా చేసి ఉండకపోతే’ అనిపించిన క్షణాలు అన్ని వయసులవారికీ ఎదురయి ఉంటాయి. కొన్ని నిర్ణయాలు మరీ ప్రభావవంతమయినవిగా ఉంటాయి. ఆ రకం నిర్ణయాలు జరగవలసిన సందర్భాలను గుర్తించగలిగితే, ముందు ముందు బతుకు మరింత బాగా సాగుతుంది.

ప్రతిరోజూ నిద్రనుంచి లేవగానే ఆ రోజున పట్టుకుని తిరగడానికి ఒక జెండా దొరుకుతుంది. అంటే, ఆ రోజుకు ఏదో ఒక పని ఉంటుంది. అది అత్యవసరంగా చేయవలసినది కావచ్చు, చాలా ముఖ్యమయినదీ కావచ్చు. లేదంటే సరదాగా కాలం గడపడమూ కావచ్చు. ఆ రోజున చేయవలసిన నిర్ణయాలను గురించి మనం ఆలోచించకపోతే, మరోరోజు గతంలోకి జారిపోతుంది. ఆ తరువాత, ఈ మరుగున పడిన నిర్ణయానికి సంబంధించిన అంశం, అర్జెంటయి, ఒకనాడు ముందుకు వచ్చి తరుముతుంది. భయపెడుతుంది. అప్పుడు నిర్ణయం సరిగా జరగదు.
ఒక పని, దాని నిర్వహణలో, మొదటినుంచి, సరయిన నిర్ణయాలు జరగవలసిన సందర్భాలను ముందే గుర్తించి, వాటి గురించి తగిన ఆలోచనకు వీలు కలిగించాలి. అంటే నిర్ణయాల గురించి సరైన నిర్ణయాలు ముందే జరగాలని అర్థం! ప్రతి నిర్ణయానికి తగిన సమయం ఉంటుంది. ఆ సమయం దాటితే ఆ విషయం సమస్యగా మారుతుంది. అప్పుడు అన్ని రకాలుగా కష్టం, నష్టమే ఎదురవుతాయి.



ప్రయాణంలో సాగుతుంటాము. తిండికి సమయం కాలేదు. కానీ తిండి దొరికే స్థలం వచ్చింది. అక్కడ, తినడం లేదా తిండి తెచ్చుకోవడం గురించి నిర్ణయం జరగాలి. ఆకలి కాలేదు. సమయం కాదని, తిండి గురించి ఆలోచన, నిర్ణయం జరగలేదనుకుందాం. ఆకలి, సమయం అయినప్పుడు తిండి దొరుకుతుందా? ఆ తర్వాత చాలాదూరం వరకు దొరకదేమో? సరే, వెంట తిండి ఉంది. అది చిన్ని చిన్న పొట్లాల్లో ప్యాక్ చేసి ఉంది. మన చేతికి కొన్ని పొట్లాలు వచ్చాయి. ఒక్కొక్క పొట్లం విప్పి తింటున్నాము. ఆ పొట్లం ఖాళీ అయినపుడు, మరొక పొట్లం విప్పాలా? అవసరం లేదా? అనేది ఒక నిర్ణయం. చిన్న పొట్లాలు కాకుండా పెద్ద సంచీ నిండా తిండి ఉంది. అక్కడ కూడా ఎంత తినడం, అనే నిర్ణయం జరగాలి. అందుకు ఆకలి ఒక ఆధారం కావచ్చు. మన తిండి తీరు గురించి ముందే చేసుకున్న నిర్ణయాలు కూడా అక్కడ ప్రభావం చూపవచ్చు. ఉన్న తిండి, అందరికీ చివరిదాకా సరిపోతుందా, అన్న మంచి మనసు ఆలోచన కూడా ఉండవచ్చు. చిన్న పొట్లాలు అందుకున్న వారయినా, మొత్తం తిండి ముందున్న వారయినా ఎక్కడో ఒక చోట నిర్ణయం చేసి ఆపవచ్చు. అదే నిర్ణయంలోని గొప్పదనం. కానీ ప్రయాణంలో ఉన్నామన్న ఆలోచన రాగానే, చాలామంది గతాన్ని, నిర్ణయాలను, తమ వ్యక్తిత్వాన్ని మరిచిపోతుంటారు. తిండి ఉన్నంత వరకు తింటూనే ఉంటారు.

పై వాక్యాలలోని తిండి, నిజానికి తిండి కాదు. అది జీవితం. జీవితం కొంతమందికి చిన్న చిన్న ప్యాకేజీలలో మాత్రమే అందుతుంది. తరువాతి ప్యాకెట్ అందుతుందన్న నమ్మకం కూడా కొన్ని సందర్భాలలో ఉండదు. కొంతమందికి బతుకంతా అవకాశాలే. రెండు చోట్లా సరైన నిర్ణయాలు జరగకుంటే బతుకు బండి పట్టాలు తప్పుతుంది. లేదంటే, వెళ్ళవలసిన చోటుకికాక మరెక్కడికో చేరుతుంది.


బతుకంటే ఒక సూపర్ బజార్. అక్కడ అన్నీ ఉంటాయి. అందులో మనకు ఏవి అవసరం? ఏవి ఉంటే బాగుంటుంది? వాటిని స్వంతం చేసుకునేందుకు మన ప్రయత్నం ఏమిటి? లాంటి ప్రశ్నలకు సరియైన సమయంలో చేసిన సరైన నిర్ణయాలు సాయం చేస్తాయి. అన్నీ అమరినవారికి, అన్నీ ఆకర్షణీయంగా, అవసరంగా కనబడుతుంటాయి. అక్కడ నిర్ణయాలు జరగవలసి ఉంటుంది. ఆ నిర్ణయాలు మరింత కష్టం! ఆశ్చర్యం కదూ? జేబులో డబ్బులున్నాయి. కానీ ఏ కౌంటర్ ముందు ఆగాలి? ఏ వస్తువు, దుస్తులు ఎంచుకోవాలి? ఏది కొనాలి? అన్న నిర్ణయాలు. అందుకే పెద్ద పెద్ద మాల్స్‌లో అందరూ సరదాగా చుట్టూ తిరిగి, ఖాళీ చేతులతో బయటికి వెళ్ళిపోతుంటారు.


నిర్ణయాలు చేయవలసిన సమయం ఉంటుంది. నిర్ణయాలు చేయడానికి సమయం పడుతుంది. శ్రమ, శక్తి, కొంత ఖర్చు కూడా అవసరమవుతాయి. నిత్యమంతా నిర్ణయాలే చేయవలసి ఉంటే అందుకొక వ్యవస్థ అవసరమవుతుంది. వ్యక్తి విషయంలో ఈ వ్యవస్థ మెదడులోనే ఉండాలి. ప్రతిరోజు ఉదయం, ఆనాడు చేయవలసిన నిర్ణయాల గురించి, రాత్రి పడుకునే ముందు, ఆనాడు జరిగిన నిర్ణయాల గురించి ప్రీవ్యూ, రివ్యూ చేసుకునే అలవాటుంటే, మనలోని నిర్ణయాల వ్యవస్థ సరిగా పనిచేస్తున్నదని అర్థం! క్రమంగా ఈ రకమయిన పరిశీలన జరుగుతుంటే, ఈ మధ్య చేసిన నిర్ణయాలలోని మంచి చెడులను బట్టి, వాటిని గూర్చి మళ్లీ నిర్ణయాలు చేసే వీలుంటుంది. వాటి దారిని సరైన వేపునకు మరలించే వీలు ఉంటుంది.


నిజంగా సమస్యలు వచ్చినపుడు, ఎంత క్రమంగా నిర్ణయాలు జరుగుతుంటే అంత మేలు. అనుభవం అంటే, నిర్ణయాలలోని మంచి చెడులను గుర్తించగలగడం. అనుభవం పెరిగితే, నిర్ణయాలకు ముందే మంచి చెడుల గురించి ఊహించే వీలు ఉంటుంది. అనుభవంతో నిర్ణయాలు చేస్తున్నామంటే, కనీసం నిర్ణయాలు చేస్తున్నామంటే, ఆ అంశం మన అదుపులో ఉందని అర్థం. అయినా ఫలితాలు సరిగా లేవంటే, ఆ నిర్ణయాలన్నింటినీ సమీక్షించి, వాటిని గురించి మరో పెద్ద నిర్ణయం చేయవలసి ఉంటుంది.


ఇంతకూ నిర్ణయాలను గురించి మీ నిర్ణయం ఏమిటి? ఆలోచించండి!

No comments:

Post a Comment