అనుకోని, అసాధ్యమయిన సంఘటనలు వింత క్రమంలో ఎదురయితే అది హాస్యం. అందులో మనమూ ఒక భాగస్వాములమని ఊహించగలిగితే తప్ప నవ్వు అంత సులభంగా రాదు. అందుకు బోలెడంత జ్ఞాపకశక్తి, బుద్ధిశక్తి అవసరమవుతాయి.
అంటే ప్రాచీన మానవులకు హాస్యం చేతగాలేదని అంటున్నారా? కాదు. హాస్యంలో శరీర పరంగా జరిగే సన్నివేశాలు కూడా
భాగమవుతాయి. ఎవరో జారిపడతారు. మిగతావారు నవ్వుతారు. అందులో భాషకు, సంకేతాలకు స్థానం లేదు. ఈ రకం హాస్యం ‘నియాండర్‌తాల్’ వారికి కూడా బాగానే అర్థమయి ఉంటుందని పరిశోధకుల అభిప్రాయం.
‘నియాండర్‌తాల్’ మానవుల జీవనసరళి గురించి జరుగుతున్న పరిశోధనలో హాస్యం ఒక చిన్న భాగం మాత్రమే. అసలు అలనాటి మానవుల స్థితి ఎట్లుండేది? వాళ్లకు కూడా ప్రేమలు, అభిమానాలు తెలుసా? కొన్ని అనుభవాలకు వారిని కుంగదీసిన సందర్భాలు ఉండేనా? రెండు లక్షల సంవత్సరాల నాడు మొదలు, ఇటీవల 30 వేల సంవత్సరాల దాకా కొనసాగిన ఈ మానవులను గురించి పురామానవ పరిశోధకులు చాలానే అర్థం చేసుకున్నారు. వారిలో గల డిఎన్‌ఏ 99.84 శాతం మన డిఎన్‌ఏ లాగే ఉండేది అని గుర్తించగలిగారు. అయినా వారి, ప్రస్తుత మానవులయిన హోమో శాపియెన్స్ శాఖలు వేల సంవత్సరాలపాటు, వేరు వేరుగా పరిణామం చెందినట్లుకూడా గుర్తించారు. ‘నియాండర్‌తాల్’ మానవుల మెదడు మన మెదడుకన్నా పెద్దది, ఆకారంలోనూ వేరే రకమయిందని కూడా తెలుసు. వారి ఉనికి చోట్లు, తిండి, తీరుల గురించి కూడా చాలనే అర్థం చేసుకున్నారు. పిన్నా, పెద్దా తేడా లేకుండా, ఆ మానవులు అందరూ కష్టమయిన బతుకులు సాగించారు. బతుకంతా వేటలోనే గడిచేది. బల్లెంకన్నా గొప్ప ఆయుధం వారికి తెలియదు. వారు బహుశా వెయ్యి చదరపుకిలోమీటర్ల ప్రాంతానికి మించి ప్రయాణాలు చేసింది లేదు. వేట సమయంలో వారికి గాయాలయ్యేవి. ఆ గాయాలకు చికిత్స చేయడం
అప్పటివారికి తెలుసు. కానీ గాయాలు కాళ్లకు తగిలి, ఆ వ్యక్తులు నడవలేకపోతే వారిని మిగతావారు పట్టించుకోక వదిలేసినట్లు తెలుస్తుంది. వారికి తమవారిమీద జాలి, అభిమానం ఉండేవి. కానీ వారి నిర్ణయాలు మాత్రం చాలా ప్రాక్టికల్‌గా ఉండేవనడానికి ఆధారాలున్నాయి.
‘నియాండర్‌తాల్’ మానవులు పనిముట్లను తయారుచేసి వాడుకోవడంలో మంచి తెలివిని, గమనించి, అనుభవం మీద
నేర్చుకునే పద్ధతులను ప్రదర్శించినట్లు, అర్థమవుతుంది. ఆనాటి మానవుల సాంకేతిక ఆలోచనలకు, ప్రస్తుతం మన ఆలోచనలకు ఉన్న తేడాలలో కొత్త దారులు తొక్కగలగడం ముఖ్యమయినది. రాతి ముక్కలను కర్రలకు కట్టి బల్లెంగా వాడడం వారు నేర్చుకున్నది నిజమే అయినా, వేల సంవత్సరాల కాలంలో ‘నియాండర్‌తాల్’లు అంతకన్నా ఎక్కువగా ఏమీ సాధించిగలిగినట్లు కనిపించదు. కొత్త విషయాలను ఊహిచాలంటే, తులనాత్మక ఆలోచన చాలా బలంగా ఉండాలి. మంచి జ్ఞాపకశక్తి ఉండాలి. ఈ రెండు లక్షణాల అలనాటి మానవులకు అంతగా లేవని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
‘నియాండర్‌తాల్స్’ పదిమందికి మించని చిన్ని సమూహాలలో బతికేవారు. మంచి వేట జరిగిన తర్వాత ఈ రకం గుంపులు ఒక చోట చేరి, తిండిని పంచుకునే వారని కూడా తెలుసు. వందకిలోమీటర్ల దూరం నుంచి వీరు వస్తువులను తెచ్చుకున్నారు గానీ, వ్యాపారం లాంటి ఇచ్చిపుచ్చుకోవడాలను గురించిన దాఖలాలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. అప్పటివారికి పెళ్లిలాంటి వ్యవస్థ ఒకటి ఉండేదని గమనించారు. ఈ యువకులు తమతో కొన్ని వస్తువులను కొత్త
ప్రాంతాలకు తరలించి ఉంటారు. శవాలను రాళ్లలో, తక్కువ లోతుగల గుంతలలో దాచడం కూడా వారికి తెలుసు.
అలనాటి మానవుల సాంఘిక సంబంధాలమీద వారి సగటు వయసు పాత్ర ఎంతో ఉంది. అప్పటి మానవులు 35 సంవత్సరాలకు మించి బతికిందిలేదు. అంటే, వారి గుంపులో పెద్ద మనుషులు ఉండే ప్రసక్తి లేదు. కొత్తవారు ఎదురయితే ఏం చేయాలన్న ఆలోచన వారికి లేదు. ధైర్యం చేసి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే అవసరం, ఆలోచన వారికి లేదనవచ్చు. సమస్యలను వెదుకుతూ దూర ప్రాంతాలకు వెళ్ళి, బతుకును కష్టాలపాలు చేయడం, అన్న ఆలోచన అసలు
అప్పటివారికి వచ్చిందా, అన్నది మరో ప్రశ్న!
‘నియాండర్‌తాల్’ మానవులకు ఒక పదక్రమంగల భాష ఉండేదనడానికి గట్టి ఆధారాలు కనిపించాయి. ఆ రకం భాష సాయం
లేకుండా వారు వేటలాంటి విషయాలను సంప్రదాయంగా కొనసాగించటం వీలు అయి ఉండదు. అలనాటి వారి మెదడులో
మాటలకు సంబంధించిన బ్రోకాస్ ప్రాంతం బాగా అభివృద్ధి చెంది ఉంది. వారి డిఎన్‌ఏలో కూడా భాషకు ఆధారమయిన వివరాలు కనిపించాయి. కానీ, వారిభాష గురించి మాత్రం ఏ రకమయిన సూచనలు అందలేదు. అలనాటి వారిలో కూడా మనలో వున్నట్లే, రకరకాల మనస్తత్వాలు గలవారు ఉన్నట్లు తోస్తుంది. కానీ మొత్తంమీద మాత్రం వారు సింపుల్
మనుషులు. వారు కార్యశూరులు. స్థిమితం గలవారు. మంచి ధైర్యంతో పెద్ద జంతువులను కూడా వేటాడగలిగారు. అందులో
మనుషులు ఒకరికొకరు తోడుగా ఉండడం, సాయపడడం, అర్థం చేసుకోవడం లాంటి లక్షణాలను కనబరిచారు. గాయపడిన వారికి చికిత్స విషయంలో వారు ఈ లక్షణాలను మరింత బాగా ప్రదర్శించారు. అయినా, వారిలోనూ సందేహాలు ఎక్కువేనని పరిశోధకులంటారు. తోటివారిమీద ప్రేమాభిమానాలు ఉన్నప్పటికీ లాభం లేదని తోచిన సందర్భాల్లో మాత్రం వారిని వదిలేసి, మిగతా పనులను సాధించుకునే వారంటే ‘నియాండర్‌తాల్’ వారి తెలివిని గురించి అంచనా వేయవచ్చు.
మన పూర్వీకులు, ‘నియాండర్‌తాల్’లకు ఎదురుపడితే, ఒకరినొకరు గుర్తించి ఉంటారు. ఏదో రకంగా పలుకరించుకుని కూడా ఉంటారు. రెండు జాతుల మధ్య పెద్ద తేడాలు ఉన్నట్టు వారికి అర్థం అయి ఉంటుందికూడా. ‘నియాండర్‌తాల్’ వారు, ఆధునిక మానవుల కన్నా అనుభవం గలవారు. మంచి తెలివిగలవారు. అయితే వారికి కొత్త సంగతులను ఊహించి ప్రయోగాలు చేయడం మాత్రం చేతగాలేదు. వారు తమ సమూహాలలో తాము సమర్థంగా పనులు సాధించుకున్నారు. కానీ కొత్తవారితో పొత్తు మాత్రం కుదరలేదు. 30వేల సంవత్సరాలనాడు ఆధునిక మానవులకు, ‘నియాండర్‌తాల్’వారికి పోటీ ఏర్పడింది. అక్కడ మాత్రం ఆధునిక మానవులదే పైచేయి అయింది. *
Educative and informative
ReplyDelete