Thursday, January 12, 2012

శూన్యంలో ఏముంది?


శూన్యంలో ఏముంది?

‘తెల్లోడు ఎర్రోడా (వెర్రివాడా?) ఏంటి, గొట్టాలెట్టి సూట్టానికి?’ అనిపించాడు గురజాడ తన కన్కాశుల్కంలో. ఆకాశం శూన్యం కాదని చెప్పడానికి, ఆ మాట వాడుకున్నారాయన! లెక్కల్లో శూన్యం, పూజ్యం లేదా సున్నా ఉంది. ఆ సున్నా ఒక్కటే ఉంటే ఏమీ లేదని అర్థం. 2012 సంవత్సరంలోని సున్నా లేకుంటే, లేక దానికి విలువ లేకుంటే, లెక్క తలకిందులవుతుంది కదా? ఇక్కడ సున్నా విలువ దాని స్థానాన్ని బట్టి తేలుతుంది.

ప్రకృతిలోనూ శూన్యం ఉందంటారు. ప్రకృతిలో శూన్యం ఏమిటి? అన్నారు గ్రీకు తత్వవేత్తలు రెండున్నర వేల సంవత్సరాల క్రితమే! రెండు వస్తువుల మధ్యన శూన్యం ఉంటుందా? ఉంటే రెండు వస్తువుల మధ్యన సంబంధానికి ఆధారం ఎలాగవుతుంది? ఖాళీకి ఆకారం, పరిధులు ఎలా ఉంటాయి? ఈ ప్రశ్నలు అడగనంతవరకు బాగానే ఉంటాయి గానీ, అడిగిన తర్వాత అవును గదా, అనిపించక మానదు. క్రీ.పూ. అయిదవ శతాబ్ది నాటి గ్రీకు తత్వవేత్త పార్మెనిడిస్, ఆ తర్వాత అతని దారిలోనే ఆలోచించిన అరిస్టాటిల్, శూన్యంలో కూడా కంటికి కనిపించని పదార్థమేదో ఉండాలి అన్నారు. లుసిప్పస్, డెమొక్రిటస్ లాంటి వారు, అప్పుడది శూన్యం ఎలాగయింది? అన్నారు. 17వ శతాబ్ది నాటికి ఆధునిక విజ్ఞానం మొదలయింటారు. అప్పుడు కూడా శూన్యం గురించిన అవగాహనలో పెద్ద మార్పులేమీ రాలేదు. న్యూటన్ కూడా, అరిస్టాటిల్ కూడా, శూన్యంలో, కనపడని, రాపిడి కలిగించని ‘మాథ్యమం’ ఏదో ఉందన్నాడు.

న్యూటన్ చలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. అందుకే రాపిడి గురించి ఆలోచింపగలిగాడు. భూమిలాంటి గ్రహం శూన్యంలో తిరుగుతుంటే, అక్కడ రాపిడి ఉంటే, లెక్క మరోరకంగా ఉంటుంది. సమకాలీన జెర్మన్ పరిశోధకుడు గాట్‌ఫ్రీడ్ లైబ్నిజ్ ఈ మాటను కొట్టిపడేశాడు. కదలిక, అది భూమి తన చుట్టు తాను తిరగడం లాంటి రొటేషన్ అయినా సరే, విశ్వంలోని మిగతా అంశాలతో సాపేక్షంగా చూచి మాత్రమే అర్థం చేసుకోవలసినది అన్నాడతను. 19వశతాబ్దపు జెర్మన్ ఇంజనియర్, తత్త్వవేత్త ఆర్న్‌స్ట్ మాక్, విశ్వంలోని ఇతర అంశాల ఆకర్షణతో మాత్రమే రాపిడి వంటి మెకానికల్ ప్రభావాలు ఉంటాయన్నాడు. ఐన్‌స్టైన్, ఈ సిద్ధాంతాన్ని అంగీకరించలేక, వదలలేక తికమకకు గురయ్యాడు.
19వ శతాబ్దం పరిశోధకులకు విశ్వం గురించి, అందులోని శూన్యం గురించి కొత్త సమస్యలు, అవగాహనలు ఎదురయ్యాయి. అయస్కాంతాలు, లేదా ఛార్జ్‌లు (ధన, రుణ ఆవేశాలు) ఎలా పనిచేస్తాయి. అవి ఒకదానిని మరొకటి ఆకర్షించడం, వికర్షించడానికి మాథ్యమం ఏమిటన్న సమస్య వీరిని ఆలోచింపజేసింది. మైకేల్ ఫారడే క్షేత్రాలు (ఫీల్డ్స్) అనే కొత్త ఆలోచనను ప్రతిపాదించాడు. అయస్కాంతం, విద్యుత్తుల విషయంలో ఈ క్షేత్రాల కారణంగా, బలాలు తెలుస్తాయని ఆతని ఆలోచన! మరి ఈ క్షేత్రాలంటే ఏమిటి? మరోసారి కంటికి కనబడని మాథ్యమం గురించి ఆలోచన సాగింది. ఈతర్ అనే మాట అప్పట్లో అందరినీ ఎంతో కుదిపిందని శాస్త్ర చరిత్ర చెపుతుంది!
ప్రేతాత్మలు కూడా ఈ ఈతర్‌లో ఉంటాయన్న వారున్నారు. తరువాత జేమ్స్ మాక్స్‌వెల్ విద్యుతు,్త అయస్కాంతాల మధ్యగల సంబంధాన్ని 1860ల్లో వర్ణించాడు. విద్యుదయస్కాంత తరంగాలు, రేడియోతరంగాలు, వెలుగు కూడా ఈతర్ ద్వారా ప్రవహిస్తాయని ఒక అవగాహన మొదలయింది.

ఆ వెంటనే తిరిగి కదలిక, సాపేక్షంగా, అంటే ఒకదానితో పోల్చి చూపినప్పుడుగానీ కదలిక తెలియదనడం లాంటి సిద్ధాంతాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. గ్రహాల కదలిక, వెలుగు వేగం గురించి చర్చ మొదలయింది. మరోసారి ఐన్‌స్టైన్ ప్రమేయం మొదలయింది. 1905లో సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించి ఆయన, కదలికను, శూన్యంతోగాక, మిగతా పదార్థాలకు దూరం, దిశలలో మార్పుగానే నిర్వచించాలి, అన్నాడు. ఆ లెక్కలతో ఈతర్ కొంచెం అనుమానాస్పదమయింది. శూన్యంలో ఏదో ఉండాలి, ఉంటుంది. కానీ, మనం పదార్థంగా అనుకుంటున్న లాంటిది మాత్రం కాదు అది అన్నారు అందరూ!
పది సంవత్సరాలు తరువాత అణువులోపలి సంగతులను చర్చించే క్వాంటమ్ మెకానిక్స్ వచ్చింది. న్యూటన్ వర్ణించిన ప్రపంచం, కదలికలు మొదలయినవి తెరమరుగయ్యాయి. అణువులోపలి ఎలెక్ట్రాను కదులుతూ ఉంటుంది గానీ, ఒక ప్రత్యేక క్షణాన అది ఎక్కడుండేదీ చెప్పడం వీలుగాదన్నారు. అదే నిజమయితే, క్షేత్రాలు, మిగతా వాటి విషయంలో కూడా ఈ మాట పనిచేయాలి! క్వాంటం అనిశ్చితత అనేమాట వచ్చింది.

ఒక పెట్టె ఉందనుకుందాం. అందులో ఏ రకమయిన విద్యుత్తు ఛార్జ్స్‌లూ లేవు. ఆ లోపలికి వెలుపలనుంచి మరే రకమయిన ఆవేశాలు వచ్చే వీలు కూడా లేదు. అంటే, అందులో శూన్యం మాత్రమే ఉంది అన్నమాట. అయినా సరే క్వాంటమ్ మెకానిక్స్ సిద్ధాంతం ప్రకారం మాత్రం, ఆ పెట్టెలో తరగని విద్యుత్తు క్షేత్రం ఉండి తీరుతుంది! దాని కదలిక అనిశ్చితంగా ఉంటుంది. మనకు చేతయిన పద్ధతిలో అందులోని విద్యుత్తును కొలిచే ప్రయత్నం చేస్తే అది అందదు. ఆ కొలత అణువుల స్థాయిలో ఉంటేనే కొలత తెలుస్తుంది.

విద్యుత్తు క్షేత్రంలోని బలం సున్నా లేదా శూన్యం అయినంత మాత్రాన, ఆ శక్తి అక్కడ లేదనడానికి లేదు, అంటారు పరిశోధకులు. ఇప్పుడు ఒక ప్రశ్న పుడుతుంది. ఒక పరిమాణం గల భారీ పెట్టెలో ఎంత శక్తి ఉంటుంది? తెలిసిన పద్ధతులతో లెక్కగడితే అర్థంలేని ఒక జవాబు కూడా దొరుకుతుంది. శక్తికి అంతం లేదు. శూన్యం అంటే ఖాళీ కాదు. అందులో అంతులేని శక్తి ఉంటుంది.

ఇంత చదివిన తరువాత, నాలాగే మీకూ ఈ సంగతి అర్థం కాలేదన్న భావమూ, ఖాళీ భావమూ మిగిలితే, ఆశ్చర్యం లేదు. ఒకానొక ప్రసిద్ధ వేద పండితుడు ఈమధ్యన నన్ను అడిగిన ప్రశ్నల కారణంగా ఈ విషయాలన్ని లెక్కించుకోవలసి వచ్చింది. ఈ ప్రపంచంలో చాలా సంగతులు అర్థం కావు. మనకు అర్థంకానంతమాత్రాన వాటి గురించి ఆలోచన ఆగిపోదు. మనమూ ఆలోచించాలి. మరింత తెలుసుకోవాలి. శూన్యంలోనుంచి ఏదో బయటకు వస్తుంది! *

1 comment:

  1. శూన్యం లో ఉన్నవి బయటకు తమ ఉనికి బహిర్గతం కాని పరిస్థితుల్లో ఉన్నాయేమో.. విచారణ జరిపేటపుడు అందరూ కాన్ఫిడెంట్ గా ఉంటే దొంగ దొరకడం ఎలగైతే కష్టమో.. అలాగన్న మాట.. కాక పోతే ఆ దొంగ ఎదో ఒక విషయం లో బయట పడక పోడు.. అప్పటి దాకా వేచి చూడడమే..

    ReplyDelete