Sunday, January 15, 2012

సైన్స్ విశేషాలు



విశేషాలు!

ఈ పేరును ఇంగ్లీషులో రాస్తే, అందులో వర్షం ఉండదు. ప్రేమ అంతకన్నా ఉండదు! ఇవి దుప్పి జాతి జంతువులు. వీటినే కరీబూ అని కూడా అంటారు. జీవశాస్త్రంలో వీటిపేరు రాంజిఫర్ టరెండస్. ఇవి భూగోళంలోని ఉత్తర ప్రాంతాలలోని చెట్లుగల అడవులు, టండ్రా గడ్డి మైదానాలు, ఆర్క్‌టిక్ దీవులలో ఉంటాయి. ఇవి అంగులేట్స్ (గిట్టలు చీలి ఉండే) జంతు రకాలు. వీటిలో నాలుగు రకాలున్నాయి. ఆర్క్‌టిక్ దీవిరకం, అడవిరకం, కొండరకం, గడ్డి మైదానాలలో వలసలుపోయే రకం. ఇవన్నీ వేరు వేరు జీవన విధానాలు గలవని సులభంగానే అర్థమవుతుంది.
సంఖ్య ప్రకారం వలస రకం అన్నింటికన్నా ఎక్కువగా ఉంటాయి. ఇవి 22 గుంపులు ఉన్నాయని గమనించారు. ఇందులో రష్యాలోని తైమీర్ పెనిన్సులా గుంపులో ఏడు లక్షల కరీబూలు ఉన్నాయి. ఇవి నిజానికి 2000 సంవత్సరంలో పది లక్షలు ఉండేవి. కానీ తరిగిపోయాయి. క్యుబెక్‌లోని లీఫ్ నది ప్రాంలోని మరో గుంపులో 12 లక్షల జంతువులుండేవి. వాటి ప్రస్తుత సంఖ్య లెక్కింపు ప్రస్తుతం జరుగుతున్నది. ఈ రెండు గుంపుల మధ్య ఒక రకమయిన పోటీ ఉంది. అది కేవలం మనుగడ కొరకు మాత్రమే. మిగతా గుంపులలో రెండు లక్షల కంటే ఎక్కువ జంతువులు వుండవు.
ప్రతి 40-50 సంవత్సరాలలో రెయిన్ డియెర్‌ల సంఖ్య పెరుగుతూ తరుగుతూ కనబడుతుందట. వలస గుంపులు 22లోనూ ఎక్కువ జంతువులు ఒకేసారి ఉంటే మొత్తం సంఖ్య 50 లక్షలకు చేరుతుంది. అన్నీ కలిసి అథమపక్షం, 10లక్షలయినా ఉంటాయి. అంటే అన్ని గుంపులూ తరిగిపోయినప్పుడన్నమాట
.
==============
డేమ్ మిరియం రాత్స్ చైల్డ్ (1908-2005):
ఆవిడ ప్రత్యేకంగా ఏదీ చదువుకోలేదు. కానీ బ్యాంకింగ్ రంగంలో అందెవేసిన రాత్స్‌చైల్డ్ కుటుంబంలో పుట్టింది. ఆమె ఎండమాలజీ (కీటకాల పరిశీలన), పారాసైటాలజీ, బాటనీ, ఆర్నితాలజీ (పక్షుల పరిశీలన), పర్యావరణ శాస్త్రం, శరీర ధర్మశాస్త్రం, పురాతన వస్తువులను సంరక్షించే రంగం, చివరకు క్రిప్టోగ్రఫీ (రహస్య కోడ్‌లను విడదీసే విద్య) ఇన్నింటిలో నిపుణురాలుగా పేరు పొందింది. ఇవన్నీ గురువు లేకుండా, ఆమె స్వంతంగా నేర్చుకున్న విద్యలంటే ఆశ్చర్యం!

మిరియం మొత్తం పదకొండు పుస్తకాలు రాసింది. వివిధ వైజ్ఞానిక పత్రికలలో 300కు పైగా పరిశోధన పత్రాలను ప్రచురించింది. అందులో చివరి పత్రం వచ్చినపుడు ఆమె వయసు 95 ఏళ్లు. మిణ్ణల్లులను గురించి ఆమె చేసిన పరిశోధనలు ప్రపంచ పరిశోధకులను అందరినీ ఆకర్షించాయి.
మానసికరోగులు, జీవకారుణ్య సంఘాల విషయంలో మిరియం సేవలు కొనియాడదగినవి

No comments:

Post a Comment